Next Page 
త్రినేత్రుడు-2 పేజి 1


                      త్రినేత్రుడు-2

                                              __ సూర్యదేవర రామ్ మోహనరావు   

 




    ఆ రోజంతా మూడీగానే వుండిపోయింది ప్రియాంక.

    ఆమెకంతా కలగా వుంది.

    అద్భుతానికి నిర్వచనం త్రినాధ్...

    ఆత్మవిశ్వాసానికి ప్రతీక త్రినాధ్...

    రేగ్ టూ రిచెస్ కి ఓ ఉదాహరణ త్రినాధ్...

    నిరసిస్తూనే, నిర్లక్ష్యం చేస్తూనే ప్రియాంక త్రినాధ్ గురించి ఆమెకు తెలియకుండానే ఎక్కువ ఆలోచిస్తోంది.

    ఆమె ఆలోచనలు అలా కొంతసేపు సుడులు తిరిగాక చివరగా మేడమ్ మాలిని గుర్తుకొచ్చి అక్కడే స్తంభించిపోయాయి.

    ఒక పాపర్ ముద్దెట్టుకున్నాడు... సిగ్గులేదూ అన్నంత యిదిగా ఆనాడు తనను రెచ్చగొట్టిన మేడమ్ ఈనాడు తిమ్మడు వెనుకచేరి త్రినాధ్ ని చేసింది.

    త్రినాధ్ వేగానికి, చురుకుదనానికి ముమ్మాటికీ ఆమె కారణభూతురాలు అంటే అటువేపు నుంచి అతన్ని తనమీదకు రెచ్చగొట్టిందా...?!!!


                   *    *    *    *


     సరీగ్గా రాత్రి ఎనిమిది గంటలకు ప్రియాంక గదిలో ఫోన్ మ్రోగింది.

    ఆమె పరధ్యానంగా వుండి వెంటనే ఫోన్ ఎత్తలేదు.

    మరికొంతసేపు ఫోన్ అదేపనిగా మ్రోగడంతో చిరాగ్గా ఫోన్ ఎత్తి "హలో..." అంది.

    "నిజానికి నీకు నేనంటే ఇష్టమే... కాకపోతే పైకి కోపం... తొలి పెట్టుబడి ఇప్పించావ్. బోణీ కూడా చేశావ్. నీ చేయి నాకు బాగా కలిసి వస్తుందని రుజువైపోయింది. థాంక్యూ డియర్...."

    ఫోన్ లో త్రినాధ్ మాటలు విన్న ప్రియాంక ఫైరైపోయింది. ఏదో ఒకటి కసిగా అనాలనుకుంది త్రినాధ్ ని.

    "నీ ఆనందం ఎంతసేపుంటుందిలే..." అంది వెటకారంగా.

    "అదేం పాపం!"

    "ఏం లేదు పాపం... ఎం.డీ. ఎంక్వైరీ పూర్తయితే అప్పుడు అంటాను నిజంగా పాపం త్రినాధ్ అని..."

    "థ్యాంక్యూ."

    "ఎందుకు...!!" ఆమె ఆశ్చర్యపోయింది.

    "నన్ను... అంటే తిమ్మడ్ని త్రినాధ్ గా గురించినందుకు..."

    ఆమె కసిగా పళ్ళు కొరికింది.

    "ఎం.డీ.కి లంచం పంపించింది నేనే..."

    ఆమె పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది.

    "అదిరిపడకు. నేను కొన్నాళ్ళాగితే నువ్వు, మీ నాన్న అదే పని చేసేవారు. ఆ పని నేనే చేసి ఎంక్వైరీ పెట్టించుకుని నా నిజాయితీని నిర్ద్వంద్వంగా నిరూపించుకుని క్షేమంగా బయటపడ్డాను..."

    "నువ్వే పంపించావా...!!"

    "ఎస్..."

    "రేపది రుజువైతే...?" ఆమె కసిగా అంది.   

    "రుజువైంది. రుజువైంది కనుకే ఎం.డీ. ఫంక్షన్ కి వచ్చారు..."

    "ఎవరని రుజువైంది?" ఆమె విస్మయంగా అడిగింది.

    "నువ్వని."

    "వ్వాట్?" ఆమె ఫోన్ లో పెద్దగా కేకేస్తున్నట్లుగా అంది.

    "అవును. ఆ డైమండ్ కొన్నది మిస్.వి.ప్రియాంక, డాటరాఫ్ శ్రీ వి. సుదర్శన్ రావు పేరు మీదే..."

    త్రినాధ్ ఫోన్ డిస్కనెక్ట్ చేయబోతూ "పిలవగానే ఫంక్షన్ కి వచ్చినందుకు కృతజ్ఞతలు. రేపు పేపర్స్ అన్నీ తెప్పించి చూడు. నీ అద్భుతమైన సౌందర్యం బయటి ప్రపంచానికి తొలిసారి వెల్లడి అవుతుంది. నీ అందానికి అచ్చెరువందే అర్భకులు నిన్ను పెళ్ళి చేసుకునేందుకు ముందుకు వస్తే నాలుగేళ్ళవరకు పెళ్ళి చేసుకోనని పందెం కాశావని చెప్పి నీ పౌరుషాన్ని, నిజాయితీని నిరూపించుకుంటావని ఆశిస్తున్నాను...." అన్నాడు.

    మరుక్షణం ప్రియాంక విసిరినా విసురుకు ఫోన్ వెళ్ళి గోడకు కొట్టుకుని ముక్కలయింది.


                   *    *    *    *


    సుదర్శన్ రావు సైడ్ నుంచి ప్రస్తుతానికి తన ల్యూబ్ ఆయిల్ మార్కెటింగ్ కి ఎలాంటి అవాంతరం రాదు.

    అయితే ఈ చిన్న వ్యాపారానికి తన కాలాన్ని మొత్తం వెచ్చించడం తన అభివృద్ధికి ప్రతిబంధకమవుతుంది. కనుక వేరే వ్యాపారాలపైకి తన దృష్టిని మరలించాలి.

    ఒక వస్తువు ఉత్పత్తిని రైలు అనుకుంటే, పట్టాలు మార్కెటింగ్ లాంటివి.

    రైలుని పట్టాలపైకి ఎక్కించేవరకే కష్టం. ఎక్కిన తరువాత ఆ రైలుకి ఏ ఇంజన్ తగిలించినా అది ప్రయాణిస్తుంది. కాని అది బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోవాలంటే నమ్మకస్థులైనవాళ్ళు, నిజాయితీపరులు, బాగా శ్రమించేవాళ్ళు తన దగ్గర వుండాలి.

    ప్రస్తుతం తనకు నమ్మకస్తులైనవాళ్ళు - ఇంజనీర్, బోస్, హిందూ, గుప్తా.

    ఒక్కొక్కరిని ఒక్కోవేపుకి మరలించాలి. త్రినాధ్ తన భవిష్యత్ పథకాల గురించి చురుకుగా ఆలోచిస్తున్నాడు.

    అంతలో హిందూ ఆనందం కలగలసిన ఆయాసంతో త్రినాధ్ గదిలోకి దూసుకు వచ్చింది. ఆమె చేతుల్లో ఆ రోజు దినపత్రికలు దొంతరలా వున్నాయి.

    త్రినాధ్ కి విషయం అర్ధమయిపోయింది. నిజానికి క్రితం రోజు జరిగిన ఫంక్షన్ గురించి పత్రికల్లో ఏం వచ్చిందనేది తెలుసుకోవాలని తనకు ఆరాటంగానే వుంది. కాని బాస్ పొజిషన్ లో వున్నవాళ్ళు అంత తేలిగ్గా ఏ విషయంలోనూ బయటపడిపోకూడదు. అలా జరిగితే బాస్ గురించి అతని పరోక్షంగా సిబ్బంది చెప్పుకోవడానికి ఏం వుండదు.     

    పైగా గంభీరంగా కూర్చున్న బాస్ కళ్లల్లోకి చూసి ఇతను అన్నీ ముందే ఊహించగల సమర్ధుడు. అందుకే ఎలామతి హడావుడి లేకుండా బ్యాలన్స్ డ్ గా వున్నాడు. ఒకటి జరుగుతుందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకం ఈయనకు వుండి వుంటుంది. ఇలాంటి ఆలోచనలు సిబ్బందికి వచ్చి తద్వారా బాస్ స్థానంలో వున్న వారి ఇమేజ్ పెరుగుతుంది.

    దానితో బాస్ అంటే భయంతోపాటు భక్తి పెరిగిపోతుంది. వాటి వెనుకే గౌరవం చోటుచేసుకుంటుంది. కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ ఆలోచించిన త్రినాధ్ పత్రికలలో రాక ఏం చేస్తుంది అన్న భరోసాను వ్యక్తపరుస్తూ "ఏం రాశారు?" అన్నాడు కేజువల్ గా.

    అతను ఆశించినట్లుగానే హిందూలో ఓ క్షణం ఆశ్చర్యం చోటు చేసుకుంది.

    'పత్రికలలో ఏం రాశారు, ఏం రాశారని ఆతృతగా ఎదురు చూస్తుంటాడని తను ఎంతగానో ఊహించుకుంటూ వస్తే ఇతనేమిటి... మామూలుగా వున్నాడు?' అని అనుకుంది మనస్సులోనే.

    త్రినాధ్ ముందు పేపర్స్ పెడుతూ- "చాలా బాగా వ్రాశారు. ఇంత పెద్ద కవరేజ్ మన ఫంక్షన్ కిస్తారని నేనూహించలేదు" అంది ఉద్వేగంతో.

    త్రినాధ్ ఒక్కొక్క పేపర్ నీ తీసి చూస్తున్నాడు. 

    "ఐదు పైసల ఆస్తీ, అవసరమైన చదువు లేకుండానే పారిశ్రామిక ప్రపంచంలో అపూర్వ సంచలనం సృష్టించబోతున్న యువ పారిశ్రామికవేత్త..."

    పై హెడ్డింగ్ తో మొదలయింది ఓ పత్రికలో వార్త. "చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిరుదీపాన్ని వెలిగించడం వివేకుల లక్షణం..." అని మరో పత్రిక పెట్టిన హెడ్డింగ్.

    "నిరుద్యోగ యువతకు స్ఫూర్తి.
    నిరాశా, నిస్పృహలకు విముక్తి."

    "ప్రభుత్వాల్ని తిట్టినా నిరుద్యోగి ఉద్యోగి కానప్పుడు తనకై తానే సద్యోగి కావడం పరిష్కారం."

    "యువ పారిశ్రామికవేత్తలకు రాస్త్ర ప్రభుత్వం చేయూత."

    "The inner urge in a man is instrumental to climd to reasonal haight in life."

    "Illiteracy need not be constred as a major obstacle to the futherence of industrial entrepreneur-ship."

    "Princes becoming paupers and pauper becoming princes is no fiction..."

    "Nothing succeeds like success. But one should have the guts to aim high."

    "What is more important is success in life rather than success in examination."

    ఎన్నో ఆంగ్ల దినపత్రికలు పై హెడ్డింగ్స్ తో వార్తను హైలైట్ చేశాయి.

    ఒక్కో పేపర్ ఒక్కో రకం ఫోటో ప్రచురించింది. తనను ముఖ్యమంత్రి అభినందిస్తున్న ఫోటో...

    ముఖ్యమంత్రి ప్రియాంకకు టిన్ అమ్ముతున్న ఫోటో...

    ఇవన్నీ చూసుకుని త్రినాధ్ ఎంత ఆనందిస్తున్నాడో లోలోన అని హిందూ ఆలోచిస్తోంది.

    సుదర్శన్ రావు తనను భవిష్యత్ లో దెబ్బకొట్టవచ్చునని శంకించి, తన వ్యాపారాన్ని పటిష్టం చేసుకునే ఉద్దేశంతోనే ఆ ఫంక్షన్ ని ఏర్పాటు చేశాడు త్రినాధ్. కానీ ఇప్పుడు ఆ పేపర్స్ చూస్తుంటే అతనికి సరికొత్త ఆలోచన పుట్టుకొచ్చింది.

    రాష్ట్ర వాణిజ్య రంగంలో ఈ వార్తలతో తనకు కొంత ఇమేజ్ ఏర్పడవచ్చు- తన గురించి నలుగురూ చెప్పుకోవచ్చు. ఈనాటితో తను ఓ పబ్లిక్ బిజినెస్ ఫిగర్. ఎక్కువ శ్రమ లేకుండానే ఇతర వ్యాపారాల్లోకి దూసుకుపోవడం, ఇతర వ్యాపారస్థులతో సన్నిహిత వ్యాపార సంబంధాలు పెట్టుకోవడం లాంటివి ఈనాటి నుంచి సులభం కావచ్చు. డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వుండి ఏ వ్యాపారం చేయాలో తెలియని ధనవంతుల ఆలోచనల్లో తను ఈనాటినుంచే చోటు చేసుకోవచ్చు- ఇలా ఆలోచిస్తున్నాడు త్రినాధ్.

    జీవనది పుట్టికే అసాధ్యం. పుట్టాక నిరంతర ప్రవాహం సుసాధ్యం.

    త్రినాధ్ ఆలోచనలు జీవనదిలా ఎత్తుపల్లాల్ని అధిగమిస్తూ, అమిత వేగంతో ప్రయాణిస్తూ మహాసముద్రంలాంటి లక్ష్యంతో ఐక్యం కావడానికి అర్రులు జాస్తున్నాయ్.


                    *    *    *    *


    సుదర్శన్ రావు అరచిన అరుపుకు ఇల్లంతా గజగజలాడిపోయింది.

    భార్య, యోగేష్, నౌకర్లంతా మధ్య హాల్లోకి పరుగెత్తుకు వచ్చి బిక్కుబిక్కుమంటూ చూడసాగారు. ఆయన చేతిలో దినపత్రికొకటి వుండలా అయిపోయి వుంది.

    "బేబీ ఎక్కడ?" కోపంగా భార్యవేపు చూస్తూ అడిగాడు.

    ప్రియాంక అంతలో మెట్లు దిగుతూ పరిస్థితి అంతా క్షణాల్లో అర్ధం చేసుకుని "శత్రువుతోనే బోణీ చేయించుకోగల సమర్ధుడు త్రినాధ్. మీకేనాడో చెప్పాను- పందెం పరుగులో మనం పొగరుతో, నిర్లక్ష్యంతో కుందేలులా కునికిపాట్లు పడుతుంటే అతను తాబేలులా లక్ష్యశుద్ధితో వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఏం చేయను...? సి.ఎం., రవాణా మంత్రిలాంటి పెద్దల ముందు ఇరకాటంలో పెడితే...? అప్పుడు కాదంటే ప్రతి ఒక్కరు నావేపు అసహ్యంగా చూడరా? సభా మర్యాద పాటించక తప్పలేదు" అంది నిర్భయంగా, ఒకింత నిరసనగా.

    "అది సరే... ఆ పాపర్ ఫంక్షన్ కి ఎందుకు వెళ్ళాలి? ఆగిపోతే ఈ పరువు తక్కువ పని జరిగుండేది కాదుగా?" ఆయనకీ బాధగానే వుంది తను సగుడాకు క్రింద తీసిపారేసిన త్రినాధ్ మూలంగా తన గారాల కూతుర్ని మందలించాల్సి వచ్చినందుకు.

    "అదే పిరికితనం డాడీ. వీధి రౌడీల్లా ప్రతి క్షణం బయటపడి పోరాడుతుంటే మన స్టేటస్ కి తగ్గట్టుగా వుంటుందా? ఫ్రెండ్లీగానే వుంటూ, నవ్వుకుంటూనే మనల్ని కొద్దిరోజుల్లోనే చాలా చావుదెబ్బలు కొట్టాడంటే- శత్రుబలం అనూహ్యంగా పెరుగుతోందన్నది అర్ధమయిపోవటం లేదూ...? శత్రుబలాన్ని అంచనా వేయాలంటే రాయబారిలా వెళ్ళక తప్పదు."

    తన కూతురెంతగా ఎదిగిపోయిందని సుదర్శన్ రావు, ఆయన భార్య ఆశ్చర్యపోతుంటే, అగ్నిపర్వతంలా పేలిపోయే సుదర్శన్ రావు ముందు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్న ఆమెను చూసి నౌకర్లు దిగ్ర్భాంతి చెందారు.

    "శత్రుబలాన్ని అంచనా వేశావా?" సీరియస్ గా అడిగాడు సుదర్శన్ రావు ఓ ప్రక్క నౌకర్లను వెళ్ళిపొమ్మని సంజ్ఞ చేస్తూ.

    "బలాన్ని అంచనా వేయలేకపోయినా, ఆ బలానికి కారణం అయిన వాళ్ళని కనుక్కున్నాను."

    "ఎవరు...?"

    "మా మేడమ్"

    "ఎవర...ది?" నిర్లక్ష్యంగా అడిగాడు సుదర్శన్ రావు.

    "మర్యాద... మర్యాద డాడీ."

    తల్లి ప్రియాంకవైపు మతిపోయినట్లు చూసింది.

    "కొన్ని నెలల్లోనే తిమ్మడ్ని త్రినాధ్ గా మార్చగలిగిందంటే ఆమె సామాన్యురాలు కాదు..." అంది నిష్కర్షగా.

    "సరి... సరి... ఇంతకీ ఎవరామె?" తెలుసుకున్న మరుక్షణం నల్లిని నలిపినట్లు నలిపేయాలనే నిర్ణయానికి వచ్చాడు సుదర్శన్ రావు.

    "మాలిని... మాలినీదేవి" ప్రియాంక చెప్పడం పూర్తికాకముందే "వ్వాట్?" అరిచినంత పనిచేశాడు అతనికి తెలియకుండానే.

    ప్రచండ కీలాగ్ని ఒక్కసారి వచ్చి మొహాన్ని కాల్చివేసినట్లయింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS