Next Page 
మొగలి బాకు పేజి 1

                                                         మొగలి బాకు
   
                                            --సూర్యదేవర రామ్ మోహన్ రావు
   
                           

   

  

    ఇక్కడ పెళ్ళిళ్ళు, పెళ్ళి ముహూర్తాలూ సరసమైన రేట్లకు చెడగొట్టబడును. పచ్చని కాపురాల్లో అరగంటలో కావలసినన్ని నిప్పులు పోసి, చిచ్చురేపుట మా ప్రత్యేకత. ఒకేసారి మూడు కాపురాల్ని కూలగొట్టే కాంట్రాక్ట్ ఇచ్చే పక్షంలో నాలుగో కాపురాన్ని ఫ్రీగా కూలదోయబడును. అలాగే ప్రేమ జంటల్ని విడదీయడంలో కూడా మాకు మేమే సాటి. ఈ విషయంలో మా దగ్గర శిక్షణ పొందగోరు యువతీ యువకులకు, క్వాలిఫైడ్ వితంతు భర్తల ఆద్వర్యంలో శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మా దగ్గర శిక్షణ పొందిన అభ్యర్ధులు మన రాష్ట్రంలోను, మనదేశంలోనే కాకుండా, అమెరికా తదితర దేశాల్లో కూడా, వీలైనన్ని కాపురాల్ని చెడగొట్టి, మా సంస్థపేరు ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టివున్నారు. ఈ సందర్భంగా మా సంస్థ గర్వంగా చెప్పుకొనే ఒక ఘనకార్యం గురించి చెప్పక తప్పదు, ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియని అతి అసహ్యం.
   
    బ్రిటన్ యువరాజు చార్లెస్, యువరాణి డయానాల పచ్చని కాపురాన్ని అంచెల వారీగా కూలదోసి, వారు మళ్ళీ ఒకరు ముఖం ఒకరు చూసుకోకుండా చేసిన ప్రతిభ మా సభ్యులదేనని సవినయంగా మనవి చేస్తున్నాం.
   
    అలాగే హాలీవుడ్ లో భార్యా భర్తలు విడిపోవడంలో__ఒకర్నొకరు టీవీలు, ఫ్రిడ్జ్ ల్తో కొట్టుకుని, నడిరోడ్డు మీదకు రావడం వెనక పొలిటీషియన్స్ లో__భార్యా, భర్తలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుని ఎలక్షన్లలో పోటీలకు నిలబడడం వెనక మా గూఢచారి సభ్యుల హస్తం ఉందని నొక్కి, వక్కాణిస్తున్నాం.
   
    ఈ సందర్భంగా మా సంస్థ నినాదాన్ని కూడా, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
   
    "కలిసి వుంటే కలదు దుఃఖం__ విడిపోవడంలోనే వుంది సుఖం."
   
    బాధ్యతలు, బంధాలతో నిత్యం బాధపడడం కంటే, విడిగా స్వేచ్చగా హాయిగా బతకండి. ఆవారా బతుకులోనే, హాయి వుందనే నిజం గుర్తించండి. ఆకేలీగా బతకండి. ఆనందాన్ని పొందండి.
   
    రండి.....ప్రజలారా రండి....వ్యక్తి స్వేచ్చను కాపాడండి.
   
    ఈ ఉద్యమం ప్రతి ఒక్కడిదీ....అని గమనించండి.
   
    అన్యోన్యంగా వున్న ప్రతి ఒక్కర్నీ విడదీసేయండి......కార్చిచ్చు రేపండి......కల్లోలం సృస్టించండి.
   
    అందుకే, తగువులమారి ఆదిగురువు నారదుడ్ని, ఆదర్శంగా తీసుకోండి.
   
    నారదా జిందాబాద్.
   
    జై.....నారదా, జై....జై....నారదా.
   
    నారదుడూ జిందాబాద్, నారదుడూ వర్ధిల్లాలి......హై.....హై.....నారదా.....అహ .....హ...
   
    నారదా....ఓహో.....హో.....నారదా.....నారదా....నారదా....
   
                                             *    *    *    *
   

    దబ్ మని పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఎవరిచేతిలోని పళ్ళెమో, భళ్ళున కింద పడింది. ఆ శభ్దానికి చాపమీద బోర్లా పడుకున్న నారాయణరావుకి, ఎవరో దభాలుమని కొట్టినట్టుగా మెలుకువ వచ్చింది.
   
    అందరూ కుడి పక్కకో, ఎడమపక్కకో తిరిగి పడుకుంటే, నారాయణరావుకి ఎట్టి పరిస్థితుల్లోనూ, బోర్లాపడుకోవడం అలవాటు.....బోర్లాపడుకుంటేనే తప్ప, అతని మెదడులోకి ఆలోచనలు రావని అతగాడి నమ్మకం.
   
    పాతకాలపు రచయిత్రుల నవలల్లో మాదిరిగా భళ్ళుమని, తెల్లవారిందన్న మాట. మెదడులోకి ఆ ఆలోచన రాగానే పక్కకు వత్తిగిల్లాడు.
   
    ఎదురుగా గోడ మీద చిరునవ్వుతో పెద్ద సైజు నారదుడి ఫోటో!
   
    సదరు, నారదుడి వేపు సీరియస్ గా చూసి, అదిగురూ నారదా.....నిన్నే నమ్ముకున్నాను. నా ఉద్యమానికి నువ్వే పితామహుడివి, మాతామహుడివి కూడా అని మనసులో అనుకుని-
   
    తన కొచ్చిన కలని, కలలోని తన ఉపన్యాసాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ కలంతా మొత్తం జ్ఞాపకం రావడంలేదు ఒక్క స్లోగన్ మాత్రమే గుర్తుకొచ్చింది.
   
    "కలిసి ఉంటే కలదు దుఃఖం.
   
    విడిపోవడంలోనే వుంది సుఖం" ఆహా! ఏమి స్లోగన్, నెత్తిమీద కొట్టుకుని తన బ్రెయిన్ లోని తెలివి తేటలకు తనే ఆశ్చర్యపోయాడు నారాయణరావు.
   
    గబగబా లేచి గోడకున్న పాకెట్ బుక్ సైజంత వున్న అద్దంలో తలను చూసుకున్నాడు.
   
    అద్దంలో ఎప్పుడూ తలే కనబడుతుంది తప్ప, బ్రెయిన్ ఎందుకు కనబడదబ్బా అని నారాయణరావు చాలా కాలంగా వర్రీ అవుతున్నాడు.
   
    ఏదో రోజు తనకు తెలీకుండా, బ్రెయిన్ అద్దంలో కనబడుతుందని ఆశతో, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తలని అద్దంలో చూసుకుంటుంటాడు నారాయణరావు.
   
    అందరూ అద్దంలో ముఖాన్ని చూసుకుంటుంటారు. పిచ్చి వెధవలు.....అసలు బ్రెయిన్ లో ముఖం, ఒక భాగమని వీళ్ళకు తెలీదని.....ఆ విషయాన్ని కనిపెట్టిన తన తెలివితేటలకు తానే ఆశ్చర్యం పడిపోతూ విచిత్రమయిన శబ్దం వచ్చేటట్టు నవ్వుకుంటాడు నారాయణ రావు.
   
    ప్రస్తుతం నారాయణరావు సీరియస్ గా ఆలోచిస్తూ, బాత్ రూమ్ లోకి నడిచి అక్కడున్న పేస్ట్ ని, బ్రష్ ని అందుకుని, బ్రష్ మీద పేస్టుని పూసుకుని వచ్చి, బురదగుంటలా అయిపోయిన గార్డెన్ లో నిలబడ్డాడు.
   
    అదే సమయంలో పక్కింటి ఆంటీ ఆ కామన్ బాత్ రూమ్ లోకి బకెట్ తో వేడినీళ్ళను పట్టుకుని వెళ్ళడం, ఆ వెనక ఆన్తీగారి భర్తడు అంటే అంకుల్ వెనకగా ఒకచేత్తో అద్దాన్ని పట్టుకుని రెండో చేతిలో రేజర్ ని పట్టుకుని గెడ్డాం గీసుకుంటూనే పరిగెత్తడం చూస్తే నారాయణ రావుకి మళ్ళీ నవ్వొచ్చింది.
   
    నవ్వాడు__
   
    సరిగ్గా అదే సమయంలో బాత్ రూమ్ లోంచి కెవ్వుమని కేక వినబడింది.
   
    "తెగిందా......అందుకే చెప్పాను....గెడ్డం గీసుకునేటపుడు అంత తొందర పనికి రాదని....." ఆంటీ, గట్టిగా విసుక్కుంటూ గబగబా బయటికొచ్చింది.
   
    సరిగ్గా అదే సమయంలో నారాయణరావు బ్రష్ ని నోట్లో పెట్టుకున్నాడు.
   
    వెంటనే కెవ్వుమని అరిచాడు__ఆ అరుపుకి ఆంటీ, ఒక్కసారి ఉలిక్కిపడింది.
   
    "ఏందబ్బాయ్.... అలా అరుస్తావ్.....దెయ్యపు పిల్లాడిలా....." కసురుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది.
   
    "అది కాదండీ....." ఏదో చెప్పబోతూ నోట్లోంచి బ్రష్ తీసిచూసుకుని మళ్ళీ కెవ్వుమని అరవబోయి, ఊరుకున్నాడు నారాయణ రావు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS