Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 4


    "నో... ఏమైనా సరే నేనిక్కడ ఇంకొక్క క్షణం కూడా వుండను. హలో డాడీ! నేను సీతను మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళండి డాడీ. ఈ చీట్ తో నేను సంసారం చేయలేను."
    "ఆజా బేటీ! మై లేకే జావుంగా" అరిచాడో స్టూడెంట్ బయట నుంచి.
    అంతా ఘొల్లుమన్నారు.
    "వ్వాట్! మీరు మా డాడీ కాదా? సారీ! రాంగ్ నెంబర్" కోపంగా ఫోన్ పెట్టేసిందామె.
    "సీతా.... ప్లీజ్! డోంట్ మేక్ ఏ సీన్ హియర్. పద.... ఇంటికి వెళ్దాం."
    "ప్లీజ్ సీతా! ప్లీజ్ సీతా! ప్లీజ్ సీతా" అంటూ స్టూడెంట్స్ కోరస్ గా అరవసాగారు.
    సీతకు వాళ్ళమీద వళ్ళు మండిపోయింది.
    "రాస్కెల్స్!" అనేసి బయటకు నడిచి ఆటోలో కూర్చుని "అమీర్ పేట' అంది. ఆటో స్టార్టయి వెళ్తూంటే గోపాల్రావ్ పరుగెత్తి తనూ ఎక్కేశాడు.
    ఆ రాత్రి ఇద్దరూ అన్నం తినలేదు.
    "ణాకాకలి లేదు. నువ్వు తిను" అంది మొండిగా.
    "నేనూ తినను" అన్నాడు గోపాల్రావ్.
    "పాత ప్రియురాలు కనిపించిన ఆనందంతో ఇంక ఆకలేం వుంటుంది?"
    "సీతా! నన్నపార్థం చేసుకుంటున్నావు."
    "షటప్! అర్థం చేసుకుంటున్నాను."
    "ఇలాంటి పొరబాట్లు ఒక ముందు జరగవని ఇందాకేగా ప్రామిస్ చేశాను?"
    "చేశాక మళ్ళీ ఇప్పుడీ పొరబాటు జరిగింది కదా?"
    "ఇది ఇంతకుముందు జీవితం తాలూకూ పొరబాటే! కొత్తది కాదు."
    సీతకు అందులో లాజిక్ కనిపించింది.
    "అయినా సరే" అంది కొంచెం కూల్ అవుతూ.
    గోపాల్రావ్ కి ఆమె టోన్ తెలిసిపోయింది. ఆమెలో కోపం తగ్గిపోయింది.
    "సీతా! నీలాంటి అందమయిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాక ఇంక వేరే అమ్మాయిని కన్నెత్తి ఎందుకు చూస్తాను? వేరీజ్ ది నెస్సెసిటీ?" సిన్సియర్ గా మాట్లాడుతున్నట్లు నటించాడు.
    "ఆర్ యూ సిన్సియర్?" అనుమానంగా అడిగింది సీత.
    "అఫ్ కోర్స్! అయామ్ సీరియస్ లీ సిన్సియర్."
    "ఆర్ యూ రియల్లీ సీరియస్?"
    "అఫ్ కోర్స్.... అయామ్ రియల్లీ అండ్ సిన్సియర్లీ సీరియస్" ఓవర్ సిన్సియర్ గా అన్నాడు.
    సీత పూర్తిగా నార్మల్ కొచ్చేసింది.
    "నేను నిజంగా అంత అందంగా వుంటానా?" సిగ్గుపడుతూ అడిగింది.
    "నీకు తెలీదుగానీ... మా ఫ్రెండ్సంతా నన్ను చూసి తెగ జెలసీతో ఏడ్చి ఛస్తున్నారు."
    "ఒకవేళ నాకంటే అందమయిన అమ్మాయి కనబడితే మీరు తప్పకుండా నా సంగతి మర్చిపోయి ఆ పిల్ల వెంటబడతారు."
    "అఫ్ కోర్స్! అహహహ_నో_నో_నో నువ్వు తప్ప ఇంకెవరూ అందంగా కనబడరు నాకు."
    "ఇందాక కూల్ డ్రింక్ షాప్ దగ్గర అలా గొడవ చేసినందుకు అయామ్ సారీ!"
    "నో సీతా! ఇందులో నీ తప్పేం లేదు. మనం సోషల్ గా ఆడపిల్లలతో మూవ్ అయితే ఎలాంటి గొడవలు చుట్టుకుంటాయో ఇప్పుడర్థమయింది నాకు. ఆ పిల్లకీ, మనకీ మధ్యలో ఏమీ లేకపోయినా...."
    "గతంలో జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తులో ఇంకే అమ్మాయితోనూ ఎఫైర్ వుండదని ప్రామిస్ చేయండి."
    గోపాల్రావ్ సీత చేతిలో చేయి వేశాడు.
    "ప్రామిస్ సీతా!"
    "నేను చిన్నప్పటి నుంచీ కాలా పొజెసివ్. మా మమ్మీగానీ, మా డాడీగానీ కేవలం నా ఒక్కదానినే ప్రేమించాలనీ, నా ఒక్కర్తెతోనే ప్రేమింపబడాలనీ కోరుకునేదానిని. మా డాడీని...."
    "ఇంకెవ్వరు డాడీ అన్నా, మీ డాడీ ఇంకే పాపను ముద్దాడినా నీకు అమితమయిన ఆవేశం, జెలసీ, కోపం అన్నీ వచ్చేస్తాయి. అలాగే నీ భర్తకూడా కేవలం నిన్నే ప్రేమించాలనీ, నీ ప్రేమను మాత్రమే నీ భర్త అందుకోవాలనీ నీ కోరిక. అంతేనా?" నవ్వుతూ అడిగాడు.
    సీత నవ్వేసింది.
    అతని కౌగిట్లోకి వాలిపోయింది చిరుకోపంతో.
    "నన్ను ఆటలు పట్టిస్తున్నావ్ కదూ?"
    "అంత ధైర్యమా? ఎప్పుడు మీ డాడీకి ఫోన్ కొడతావోనని గుండెలు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నాను."
    వంటవాడు బయట హాల్లో నుంచి వాళ్ళ బెడ్ రూమ్ కి ఫోన్ చేశాడు.
    "ఇదిగో! మర్యాదగా వచ్చి భోజనం చేస్తారా లేక నన్ను తినేసి పడుకోమన్నారా? ఏ సంగతీ అయిదు నిమిషాల్లో చెప్పండి. అడ్డమైన వాళ్ళకోసం రాత్రి పన్నెండింటివరకూ భోజనం చేయకుండా ఎదురుచూడటం నా వల్లకాదు" అనేసి ఫోను పెట్టేశాడు.
    సీత కోపంతో అదిరిపడింది.
    "చూశారా_ ఆ భజన్ గాడు ఎలా రఫ్ గా మాట్లాడుతున్నాడో?"
    "ఏమిటంటాడు?"
    "అడ్డమైన వాళ్ళ కోసం తను వెయిట్ చేయడంట. అన్నం తినాలనుకుంటే అయిదు నిమిషాల్లో వచ్చి తినాలంట."
    గోపాల్రావ్ నవ్వేశాడు.
    "వాడేమన్నా మనం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా అనుభవించటం మంచిది సీతా! పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాం దొరుకుతుంది. మొగుడు పోతే ఇంకో మొగుడు దొరుకుతాడు. తల్లీ, తండ్రీ పోతే మరో తల్లిదండ్రులు దొరుకుతారుగానీ, వంటవాడు పోతే మాత్రం ఇంకోడు దొరకడు డియర్. నీకా వంట సరిగ్గా రాదు. ఈ పరిస్థితిలో వాడు ఆడించినట్టల్లా ఆడటం తప్ప గత్యంతరం లేదు."
    ఆ రాత్రంతా ఇద్దరికీ ఆనందంగా గడచిపోయింది.

                                  *    *    *    *

    జీప్ వచ్చి ఆ టైన్ లోని ఓ క్రాస్ రోడ్స్ పక్కన ఆగింది. అందులో నుంచి పోలీస్ ఇన్స్ పెక్టర్ రాంబాబు దిగాడు. అతనిని చూడగానే ఆ క్రాస్ రోడ్స్ లో ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బషీర్ మాంచి కడక్ సెల్యూట్ ఒకటి కొట్టాడు. కడక్ సెల్యూట్ కొట్టటం ద్వారా పోలీస్ బాస్ ని మెస్మరైజ్ చేయవచ్చని అతను "బాస్ కో మారో గోలీ" అనే ఉర్దూ పుస్తకంలో చదివాడు. ఆ ట్రాఫిక్ జంక్షన్ లో కొన్ని వేలమంది పబ్లిక్ చూస్తూండగా బషీర్ తనకలాంటి కడక్ సెల్యూట్ ఇవ్వటం ఇన్స్ పెక్టర్ రాంబాబుకి అమితమయిన ఆనందం కలిగించింది.
    "జీప్ లో కూర్చోండి సార్! టిఫిన్ పంపిస్తాను" అన్నాడు బషీర్ దూరంగా నిలబడ్డ ఆటో వాడికి సైగ చేస్తూ.
    "లారీ వాళ్ళు ఎవరయినా దొరికారా?" అడిగాడు రాంబాబు రోడ్డు పక్కన ఆగి వున్న లారీల వేపు చూస్తూ.
    "మొత్తం పది లారీలు దొరికినయ్ సార్! ఇసుక లారీలోళ్ళు నలుగురు ఎనిమిది దాటాక సిటీలోకి వెళ్ళాలన్నారు. తలో పాతికా తీసుకుని వదిలేశాను. మిగతా లారీలు తలో పదీ యిచ్చారు."
    "ఎలాగయినా సాయంత్రానికి రెండువేలు పోగుజెయ్యాలి. ఇవాళ మంగళవారం గుర్తుంది కదా!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS