Previous Page Next Page 
మంచివాడు పేజి 4

"వీడు మామూలు దొంగ కాదు. గజదొంగ. తెలివైన దొంగ. తన దగ్గిర మూడు వేలున్నట్టు నన్ను నమ్మించటానికి ప్రయత్నిస్తున్నాడు! ఒరేయ్! రాస్కెల్, నువ్వు తాగినా తెలివిగానే వున్నావురా! నాకూ వున్నదిరా తెలివి. పైగా తాగలేదు కూడా!" కసిగా అనుకున్నాడు రామం.
బేరర్ బిల్లు తెచ్చాడు. గోపాలం పర్సు తీసి వంద రూపాయల నోటు ఇచ్చాడు.
మొత్తం మీద ఒక వంద రూపాయల నోటు వున్నట్టుంది. అది ఎవరి జేబులోనుంచి కొట్టేశాడో!
బేరర్ కు ఐదురూపాయలు ఇచ్చి గోపాలం లేచి నిల్చున్నాడు. తూలి కుర్చీ పట్టుకున్నాడు.
"రామంగారూ! ఈ పర్సు మీ దగ్గిర వుంచండి. ఇందులో చాలా డబ్బు వుంది. నేను మత్తులో వున్నాను. వళ్ళు తెలియకుండా నిద్రపోతే ఎవరైనా తీసేస్తారు" అంటూ పర్సు అందించాడు.
రామం పర్సు అందుకున్నాడు. పర్సు లావుగానే వుంది.
ఓ క్షణం రామానికి అతని మాటల్లో నిజాయితీ వున్నట్టు అనిపించింది.
అంతా దొంగ వేషం! తను ఆ పర్సు ఎక్కడ పెడతాడో చూడాలనే ప్రయత్నం తన జేబుల రహస్యం తెలుసుకోవడానికే ఈ ఎత్తు వేశాడు. తను మాత్రం తక్కువ తిన్నాడా ఏం? దీన్ని కోటు జేబులోనే పెట్టుకుంటాడు. తనకు వేరే జేబులే లేనట్టు ప్రవర్తిస్తాడు. అయినా వాడి బొంద ఇందులో ఏముంటుంది గనుక? ఏవో పిచ్చి కాగితాలూ బిల్లులూ వుండి వుంటాయి.
"ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు ఒంగోలులో దిగిపోయే ముందు నన్ను లేపి ఇచ్చేయండి." అన్నాడు గోపాలం.
రామం పర్సు కోటుజేబులో పెట్టుకున్నాడు.
"జాగ్రత్త కోటు జేబులో పెట్టుకున్నారు. షర్ట్ జేబు లేదా?" గోపాలం అడిగాడు.
"చిక్కావురా బిడ్డా! నేను ముందే అనుకున్నాను. నువ్వు నా జేబుల రహస్యం తెలుసుకోవడానికే ఈ పర్సు నాకిచ్చావని" అనుకుంటూ "నా షర్టుకు జేబులేదండీ!" అన్నాడు. ఆ విషయం చెప్పే అవకాశం వచ్చినందుకు రామానికి సంతృప్తిగా వుంది. నిశ్చింతగా వుంది.
గోపాలం తడబడుతూనే ప్లాట్ ఫారం చేరాడు. రామం భుజంమీద చెయ్యివేసి రైలు పెట్టెలోకి ఎక్కాడు.
బండి బయలుదేరింది. సీట్లు చాలా వరకు ఖాళీగానే వున్నాయ్. గోపాలం ఇద్దరు మనుషులు కూర్చోగల స్థలంలో ముడుచుకుని పడుకున్నాడు.
రామానికి పర్సులో ఎంతవుందో చూడాలనే కుతూహలం కలిగింది. బాత్ రూంలోకి వెళ్ళి నోట్లు లెక్కపెట్టేడు. రామం ఆశ్చర్యానికి అంతులేదు. మూడువేలు వున్నాయ్. హోటల్లో మార్చిన వందరూపాల్లో మిగిలిన కొన్ని వంద రూపాయల నోట్లు కూడా వున్నాయ్.
రామం తిరిగి సీటు దగ్గిరకు వచ్చాడు. గోపాలం మంచి నిద్రలో వున్నాడు. నిద్ర నటిస్తున్నాడేమోననే అనుమానంతో ముఖంలోకి పరీక్షగా చూశాడు.
ఆ ముఖం ఎంత అమాయకంగా కన్పించింది.
చిన్నపిల్లవాడిలా ఇంత నిశ్చింతగా నిద్రపోతున్న ఇతను దొంగా! కాదు. కాదు... తనే అనవసరంగా భయపడ్డాడు. అతన్ని అనుమానించాడు.
అయినా రామం తెల్లవార్లూ కూర్చునే వున్నాడు. తెల తెల వారుతుండగా ఒంగోలు స్టేషన్ వచ్చింది.
రామం లేచి నిల్చున్నాడు. బ్యాగ్ తీసుకున్నాడు. క్షణం హాయిగా నిద్రపోతున్న గోపాలం ముఖంలోకి చూసి దిగిపోయాడు.
"ఆగు!" ఫ్లాట్ ఫారంమీద నడుస్తున్న రామం ఉలిక్కిపడి ఆగాడు.
తనను కాదు. అరే అతను పర్సు తన దగ్గిరే వుండిపోయిందే? తను మర్చేపోయాడు. బండి ఆగివుంది. వెళ్లి ఇచ్చేస్తే? తను బండి ఎక్కగానే అది కదిల్తే? పోనీం తర్వాత పంపించవచ్చులే. స్టేషన్ బయటకి నడిచాడు. బండి బయలుదేరింది. చూస్తూ నిల్చున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS