Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 3

 

    "అవును! రెండేళ్ళయింది మనం మనూర్లో విడిపోయి."
    తులసి డార్క్ డెవిల్ వంక చిరాగ్గా చూస్తోంది. అతని ప్యాంటు అంతా మట్టి మరకలతో నిండి వుంది. అంతకుముందు కొద్ది నిమిషాల క్రితమే అతను నడి రోడ్డు మీద పడి లేచి వుండవచ్చని ఇట్టే అర్ధమయిపోయింది.
    "ఈ బొమ్మ ఎవరు? హూ ఈజ్ దిస్ డాల్?" అడిగాడు డార్క్ డెవిల్.
    "లైఫ్ పార్టనర్......"
    "టేరిఫిక్ ఫిగర్......లైఫ్ పార్టనర్ గానే కాదు. ఇంకే పార్టనర్ గా నయినా సరే! టేరిఫిక్ పార్టనర్ గా రాణిస్తుంది."
    తులసికి కోపం ముంచుకొచ్చేస్తోంది.
    "ఆఫ్ కోర్స్.......ఆఫ్ కోర్స్! ముఖ్యంగా......" అంటూ ఏదో చెప్పబోయాడు సురేష్. కానీ తులసి అతని కాలి మీద గట్టిగా తోక్కేసరికి........
    "దట్సాల్......దట్సాల్" అన్నాడు.
    "నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావ్?" అడిగాడు డార్క్ డెవిల్.
    "రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్."
    "నువ్వెక్కడ?"
    "నేనూ అక్కడే రోడ్స్ అండ్ బిల్డింగ్స్."
    ఇద్దరూ నవ్వేశారు. అడ్రస్ లు రాసుకున్నారు. తరచుగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
    "నా బస్ వచ్చింది , నేను వెళుతున్నాను" అంది తులసి.
    "ఓ.కె! ఓ.కే! సీయు టుమారో" అన్నాడు సురేష్. ఆమె బస్ ఎక్కింది.
    డార్క్ డెవిల్ వెళ్ళిపోయాక తను దిల్ షుక్ నగర్ చేరుకున్నాడు సురేష్. గంగాభవాని ఇల్లు కనుక్కోవటం చాలా తేలికగా జరిగిపోయింది.
    ఆమె శ్రీనివాస్ ఏజన్సీస్ వాళ్ళు రాసిచ్చిన ఉత్తరం చదువుతుంటే తను ఆమెని చదవసాగాడు సురేష్. ఫిగర్ బాగుంది కానీ కళ్ళు........ఏం కళ్ళని? చేజింగ్. ఆవి డేగ కళ్ళు 38-28-36.
    వయసు రఫ్ గా అయితే 40.
    సౌష్టవాన్ని బట్టి చూస్తే 36.
    "ఇల్లు చూస్తావా?" అడిగిందామె.
    "మీరు చూడనిస్తే......"
    ఆమె సురేష్ వైపు ఓసారి ఆశ్చర్యంగా చూసి లోపలకు నడిచి వెనుక వైపు నుంచి వచ్చి ప్రక్కనే వున్న వాటా తలుపు తెరిచింది.
    సురేష్ ఆ గదీ కిచెన్ చుశాడు.
    అద్భుతంగా లేకపోయినా బావుందనిపించింది.
    "నాకు నచ్చింది" అన్నాడు బయటికొస్తూ.
    ఆమె వెంటనే ఇంటర్యు ప్రారంభించింది.
    "మీరెక్కడ జాబ్ చేస్తారు?"
    "ఎక్కడ దొరికితే అక్కడ" అనబోయి సర్దుకుని "రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ మెంట్" అన్నాడు.
    "నిరుద్యోగి" అంటే ఆమె బిగుసుకుపోయే అవకాశం వుంది.
    "అందులో మీ డేజిగ్నేషన్ ఏమిటి?"
    "సర్వేయర్! అన్నీ సర్వ్ చేస్తుంటాను. అంతా అవుట్ డోర్ వర్కే."
    "ఉద్యోగం పర్మనెంటేనా?"
    "అలాగే కనబడుతోంది . అదే వచ్చిన ఇబ్బంది."
    "అందులో ఇబ్బందేముంది?" ఆశ్చర్యంగా అందామె.
    "మీరెంతమంది?" అడిగింది.
    సురేష్ జాగ్రత్తగా అలోచించి సమాధానాలు చెప్పాలనుకున్నాడు.
    ఇంటర్ వ్యూలో ఇది చాలా కాంప్లికేటేడ్ పార్ట్.
    "ఇద్దరూ - ఓన్లీ టూ."
    "ఎవరెవరూ?"
    చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి దీనికి.
    "నేనూ ఆమె."
    ఇంకా ఆమెనలా వదిలేస్తే తను దొరికిపోయే అవకాశం వుంది.
    "మిమ్మల్ని ఇంతకుముందెన్నడో చూసినట్లు అనిపిస్తోంది. మీరు కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఉద్యోగం చేసేవారా?"
    "నేనెప్పుడూ ఉద్యోగం చేయలేదు" అందామె. ఓ అడుగు వెనక్కు వేసి డేగ కళ్ళు పావురాయి కళలుగా మారిపోయాయ్.
    "పోనీ మీ వారు......."
    "అయన పోయి నాలుగేళ్ళయింది."
    "లక్కీ ఫెలో."
    ఆమె అర్ధం కానట్లు చూసింది.
    "అంటే.....అదే యాక్సిడెంట్ అయ్యాక మనిషి బ్రతికి వుండటం కంటే......"
    "అయన పోయింది హార్ట్ ఎటాక్ వల్ల."
    "తప్పదు!"
    మళ్ళీ అయోమయంగా చూసిందామె.
    "ఏదోకరోజు అందరం........" అంటూ నవ్వాడు.
    "అవును! ఈ రోజుల్లో మరీ ఎప్పుడేమావుతుందో."
    "కరెక్ట్.......కరెక్ట్."
    "భార్య వర్కింగా?" మళ్ళీ డేగ కళ్ళు.
    "అవును!"
    "ఓ....అలాగా!" గొంతులో అసంతృప్తి స్పష్టంగా తెలిసి పోతోంది.
    "వర్కింగ్ ఉమెన్ కివ్వడం అంతగా......."
    సురేష్ కి అర్ధమయిపోయింది , ఆ ఇల్లు దొరికినట్లే దొరికి చేయి జారిపోతోంది. అంతకుముందు వారం రోజుల్నుంచి హైదరాబాద్ అంతా ఇళ్ళ కోసం తిరుగుతున్నారు తనూ, తులసీ కానీ ఒక్క ఇల్లు కూడా నచ్చలేదు , దొరకలేదు.
    ఇంకొక్క మూడు రోజులు గడువు మాత్రం మిగిలి వుంది. తులసి ప్రస్తుతం వుంటున్న ఇల్లు ఖాళీ చేయటానికి. ఆ తరువాత ఆమె రూమ్మేట్ దీప అందులోనే తన భర్తతో సంసారం ప్రారంభిస్తుంది. అంచేత ఈ ఇల్లు డెడ్ లైన్.......
    "కానీ అదీ టెంపరరీ జాభ్. ఇంకో నెల రోజుల్లో క్లోజ్."
    "ఓ- అలాగా" గొంతు ఇప్పుడు కొంత నయం.
    "అదీ గాక ఈలోగానే అ ఉద్యోగం రిజైన్ చేస్తోంది లెండి."
    "ఓ ఎందుకని?"
    "అదే......అదే ప్రేగ్నంట్ - ప్రెగ్నెన్సీ - అహ్హహ్హహ్హహ్హహ్హా."
    ఆమె కూడా నవ్వేసింది.
    'అలా అయితే సరే."
    సురేష్ కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
    ధాంక్ గాడ్ -
    "ఇంతకూ మీ ఆఫీస్ ఎక్కడన్నారు?"
    "ఎక్కడంటే..........ఎక్కడంటే.అదే మెయిన్ ఆఫీస్........రేపు సాయంత్రం వచ్చి ఇంట్లో దిగుతాము."
    "మరి అడ్వాన్స్?"
    "అడ్వాన్స్.....అడ్వాన్స్..ఆ! బ్యాంక్ నుంచి డ్రా చేయాలి. రేపు సాయంత్రం......."
    "అలా కుదరదండీ. పొద్దున్నే అడ్వాన్స్ యిచ్చి వెళితే-"
    "సరే! ఓ.కె. పొద్దున్నే తెచ్చిస్తాను."
    సురేష్ బయటికొచ్చాడు. ఆమె కూడా గేటు వరకూ వచ్చింది.
    ఆఖరి బాణం వదలాలి. ఆమె మళ్ళీ మాట్లాడకూడదు.
    "ఈ చీర మీకు చాలా అందంగా అమరింది."
    ఆమె ముఖం ఎర్రబడింది. కానీ కొంచెం అనుమానం కనిపించింది కళ్ళల్లో.
    "ఎక్కడ కొన్నారో చెప్తే మా మిసెస్ కి కూడా-"
    మళ్ళీ ప్రసన్నత - పావురాయి చూపు-
    "రాణి శారీ హౌస్ లో."
    "రాణి శారీ హౌస్- వండర్ పుల్ శారీస్ - వస్తానండీ."
    "రేపు ఉదయం......."
    "షూర్ ..........షూర్."
    వచ్చేశాడతను.
    మర్నాడు వుదయమే తులసి వుండే ఇంటికి చేరుకున్నాడు. దీప చీర ఇస్త్రీ చేసుకొంటోంది.
    "సంసారం పెట్టాక యింక ఈ బాధ తప్పిపోతుంది మీకు కదూ?" నవ్వుతూ అడిగాడు.
    దీప చురచుర చూసింది. ఇప్పుడే కాదు! మొదటి నుంచి అంతే!
    "తులసీ" అంటూ తులసిని పిలిచింది.
    తులసి వస్తూనే అతణ్ణి చూసి ఆశ్చర్యపోయింది.
    "రా! కూర్చో"
    "సంగతేమిటంటే ఇల్లు చూశాను - అంతా బాగానే వుంది. ఇప్పుడే అడ్వాన్స్ కట్టాలి."
    "నేనూ ఒకటి చూశాను నిన్న రాత్రి - అదీ బాగానే వుంది' అయినా నువ్వు ఒకే చేశావు కాబట్టి- ఇదిగో డబ్బు కట్టేసేయ్" తన బ్యాగ్ లోంచి రెండు వందలు తీసి యిచ్చింది.
    "చాలా సిగ్గుగా వుంది- నీ దగ్గర డబ్బు తీసుకోవటం.'
    "పిచ్చి మాటలు మాట్లాడకు" కోపంగా అందామె.
    "సాయంత్రం ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం!"
    "సరే."
    దీప లోపలి గదిలో కెళ్ళడం చూసి తులసి దగ్గరకు జరిగాడతను.
    "ఒక ముద్దు......"
    "షటప్! ముందు వెళ్ళిక్కడి నుంచి - దీప ఎదురుగ్గా."
    "దీపా , ఆమె బాయ్ ఫ్రెండ్ ఓసారి నీ ఎదురుగ్గానే......"
    "అది వేరు- ఇది ఆమె ఇల్లు"
    సురేష్ తిన్నగా గంగాభవాని ఇంటికి చేరుకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS