Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 3


    "ఈ మాత్రానికే?" నవ్వాపుకుంటూ అడిగాడు మాధవరావు.
    "ఇవాళ రాత్రంతా మీదగ్గరే కూర్చుని మీరు చెప్పే కబుర్లన్నీ వింటాను . సరేనా?" గదిలో నుంచి బయటకు పారిపోవడానికి సంసిద్దురాలవుతూ అందామె.
    మాధవరావు ఇంక చేయగలిగిందేమీ లేకపోయింది.
    ఆ రాత్రి కూడా ఆమె గదిలో కొచ్చేసరికి పదకొండయిపోయింది. అప్పటికే మాధవరావుకి మాగన్నుగా నిద్రపట్టేసింది కూడా.
    ఆమె చెయ్యి నుదుటి మీద పడగానే టక్కున మెలకువ వచ్చింది అతనికి.
    'ఇప్పటిగ్గాని పొద్దుగూక లేదన్నమాట మీకు!" వ్యంగ్యంగా అన్నాడతను.
    "మీకు తేలిందేముందీ? మా అమ్మా నాన్నలకయితే చెప్పొచ్చు గాని, చాదస్తం అతిగా వున్నవాళ్ళు ఎక్కువయి పోయారు మా బంధువుల్లో ........" నెమ్మదిగా అందామె. తను లేవకుండానే ఆమెను కూడా తన మీదకు లాక్కొన్నాడతను. పూర్తిగా అతని మీదకు ఒదిగి పోయింది సీత.
    "ఇప్పుడు చెప్పండి . మీరు చెప్పదలచుకొన్నవన్నీ.....రహస్యంగా మాట్లాడుతున్నట్లు అందామె, గొంతు మాత్రం తగ్గించి.
    "నువ్వు గట్టిగా మాట్లాడినా ఎగతాళి పట్టిస్తారా మీ వాళ్ళు?"
    సీత నవ్వాపుకొంది. "మీకు తెలీదు. మన మాటలన్నీ పొంచి ఎవరయినా వింటుంటారని నాకు అనుమానం......."
    "మరేం పరవాలేదు విననీ! వాళ్ళకే విసుగుపుట్టి పోతారు......." చిరాగ్గా అన్నాడు మాధవరావు. గట్టిగా మాట్లాడ్డానికి కూడా ఇలా అడ్డంకులు రావడం అతనికి కోపం కలిగించింది.
    "ఎల్లుండి మీ ఊరు వెళ్ళాలట కదా మనం?" ఆడిగింది సీత.
    'అవును౧ మా మావయ్య వాళ్ళింట్లో కొన్ని రోజులు గడపాలి కదా...."
    "మరి....మనం.....హైదరాబాద్ వెళ్ళేదెప్పుడు?" సంశయంగా అడిగిందామె.
    "ఏం? త్వరగా వెళ్ళి పోవాలని ఉందా?" నవ్వుతూ అడిగాడు మాధవరావు.
    "ఛీ! అది కాదండి!........' సిగ్గుపడిపొయిందామె.
    "శలవు సరిగ్గా పదిరోజులుందింకా. పదిరోజుల తరువాత ఏకాఎకిని హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఇల్లు కూడా సిద్దంగా ఉంది. వచ్చేముందే ఒక చిన్న ఇల్లు వెతికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. ఇల్లు మరీ చిన్నదనుకో! ఒక గది, వంటిల్లు అంతే. ప్రస్తుతానికి మనకది చాలు కదా! దానికే బోలెడు అద్దె......."
    సీత ఆనందంగా వింటుందతను చెప్పే విషయాలు. అతన్తో హైదరాబాద్ లో సంసారం చేయబోతుంది. అన్న ఊహే చాలా మధురంగా ఉందామెకు. అంతకుముందు ఒకేసారి హైదరాబాద్ చూపిందామె. బందరు హైస్కూల్లో నైన్తూ చదువుతున్నప్పుడు , క్లాసు పిల్లలందరూ కలిసి టూర్ వెళ్ళారక్కడికి. ఎంతో అందంగా కనిపించిందా నగరం ఆమెకి. ఆరోజు నుంచీ హైదారాబాద్ నగరంలో ఉండే చూడ్డానికి మాధవరావు వచ్చినప్పుడు , అతను హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకొని సంబరపడిపోయింది. అతనికి తను వచ్చేట్లు చేయమని దేవతలకు మొక్కుకుంది. ఏ దేవతలు కరుణించారో గాని ఆమె కోరిక నెరవేరింది.
    "నాకున్న బాద్యతల గురించే నీతో మాట్లాడాలనుకొన్నాను సీతా! మా అమ్మా నాన్నా నా చిన్నప్పుడే పోయారనీ, మా మావయ్యా, అత్తయ్యే ఆరోజు నుంచి నాకు తల్లిదండ్రులయి నన్ను పెంచి పెద్ద చేశారనీ నీకు తెలిసే వుంటుంది. నాకు ఈ చదువూ సంధ్యా చెప్పడంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న మావయ్య ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారి పోయింది. ఇంటి చుట్టూ బండెడు అప్పులు, వీటికి తోడు పెరుగుతున్న పిల్లలు. వరుసగా మూడేళ్ళు వ్యవసాయంలో నష్టపోయాడు. ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోడం నాకిష్టం లేకపోయింది. వివాహం చేసుకొంటే మామయ్యకు ఆర్ధికంగా ఎక్కువ తోడ్పాటు ఇవ్వలేనేమోనని నా భయం. కానీ నిన్ను చూశాక నా అభిప్రాయం మార్చేసుకొన్నాను."
    "ఎందుకనో?" చిలిపిగా అడిగింది సీత.
    "నువ్వు నాకు ఎంతగానో వచ్చావ్ సీతా! ఇంతటి అందగత్తెను నేను ఇప్పుడు కాదంటే మరొకరి సోత్తయి పోతుందేమోనన్న భయం. అదిగాక నాకెందుకో అనిపించింది మామయ్య కుటుంబానికి నేను చేయగల సహాయంలో నీవు తప్పక తోడ్పడగలపని! నీ అందం లాగానే నీ మనసు కూడా ఎంతో గొప్పదని నా ఊహ! నేనేమీ తప్పు గా అనికోలేదు కదూ?"
    "మీరెలా చెప్తే అలా! మీకే నాటికీ కాదని చెప్పను....నెమ్మదిగా అంది సీత.
    "ఊహు! అలా మొగుడు చెప్పిన ఏ మాటా కాదనకుండా పడి వుండటం కూడా నా కిష్టం లేదు. నీకు నచ్చని విషయాలు నచ్చలేదని చెప్పెయ్యాలి. అప్పుడు మనిద్దరం చర్చించుకొని, ఎవరు సరయిన మార్గాన ఉన్నారో , వారిని సమర్ధించాలి. ఎప్పుడూ భర్త చెప్పినట్లే భార్య నడుచుకోవాలని నేననుకోను . కొన్ని విషయాల్లో భార్య భర్త కంటే తెలివిగా ఆలోచించవచ్చు. అలాంటప్పుడు ఆమెని అనుసరించడం అతని న్యాయం. సీత నవ్వేసింది.
    "ఏమో! నేనీ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. మా అమ్మా నాన్న ఎలా చెప్తే అలా నడుచుకోనేది. మా అక్క అంతే! ఆమెకు బావ చెప్పిందే వేదవాక్యం. మగాళ్ళు లేకపోతే వాళ్ళ జీవితాలే ముగిసిపోతాయేమో అనిపించేది నాకు. వాళ్ళ ప్రభావం వల్లే నాక్కాబోయే భర్త ఎలా శాసిస్తే అలా నడుచుకోవాలని ఏనాడో నిశ్చయించుకొన్నాను."
    "మీ ఇల్లే కాదు. నూటికి తొంభై కొంపలింతే! ఈ గొడవ వొదిలెయ్ గానీ ఇంక మీ ఇంటి విషయాలు చెప్పు.....!" అడిగాడతను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS