Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 3


    "ఆయన రాక్షసుడయిపోయాడు. నిన్ను కలవటానికి కూడా వీలులేదన్నాడు. నీతో మాట్లాడినట్లు గాని, నిన్ను కలిసినట్లు గాని తెలిస్తే నీ ప్రాణాలు తీయిస్తానన్నాడు. అసలు నిన్ను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నాడు"
    ఆసక్తిగా వింటున్నాడు సాగర్.
    "లాభం లేదు సాగర్.... అంతే కాదు. నాపైన నిఘా కూడా ఏర్పాటు చేశాడు. అసలందుకే ఆలస్యం జరిగింది. ఆ కాపలా కుక్కల్ని తప్పించుకుని వచ్చేసరికి"
    దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శృతి.
    మరొక సిగరెట్ వెలిగించుకున్నాడు సాగర్. రెండుసార్లు గట్టిగా పొగ పీల్చాడు. ఆ తరువాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అన్నాడు.
    "సరే.... రేపు ఆఖరి ప్రయత్నంగా నేనే ఆయన దగ్గరకొచ్చి మాట్లాడతాను"
    "లాభం లేదన్నానా?"
    "ఒకసారి ప్రయత్నం చేస్తే తప్పేమిటి?"
    నవ్వింది శృతి.
    "నీకాయన తెలిసింది కేవలం సంవత్సరం నుండే. నాకాయన పదిహేను సంవత్సరాల నుంచీ తెలుసు. నువ్వు కంటపడితే చాలు కోపంతో మండిపడే స్థితిలో వున్నాడు ప్రస్తుతం. అంతే కాదు_ నువ్వీ విషయం ఎత్తితే మరో ఆలోచన లేకుండా నిన్ను కాల్చిపారేస్తాడు"
    "నాన్సెన్స్.... ఇదేమన్నా సినిమానా? ఇష్టం లేకపోతే పొమ్మంటాడు గాని ప్రాణాలు తీసేంత స్థితికి వెళతాడా?"
    "నీకు ఆయన సంగతి తెలియదన్నానా?" చిరాకుగా అంది ఆమె.
    "పోనీ.... మనము పారిపోయి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటే?"
    చిన్నపిల్లవాడు అమాయకంగా అడిగిన ప్రశ్నకి తల్లి నవ్వినట్లు నవ్వింది శృతి.
    "ఆయనకి ప్రపంచంలో ప్రాణప్రదమైనవి రెండే రెండు. ఒకటి డబ్బు, రెండోది గౌరవం. మనం అలాంటి పని చేస్తే నెలరోజులకంటే ఎక్కువ బ్రతకలేము"
    చాలాసేపు మౌనంగా వుండిపోయాడు సాగర్. ఒక్కసారిగా ఏదో తెలియని భయం, బెంగ కలిగినయ్. తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క ఆనందం నేలమట్టం కాబోతున్నట్లనిపించసాగింది. కసిగా సిగరెట్ పీకని యాష్ ట్రేలో నలిపేశాడు.
    తలెత్తి దీనంగా ఆమె వేపు చూశాడు.
    "శృతీ! నా జీవితంలో నేను ప్రేమించింది ఇద్దర్నే. మా అమ్మనీ, నిన్నూ. నను వంటరివాడ్ని చెయ్యకు.... ప్లీజ్.... నాకు నువ్వు కావాలి"
    శృతి చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.
    "అలా బేలగా మారిపోతే ఎలా? ధైర్యంగా ఆలోచించాలి. పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని సరయిన నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే నీ శక్తి బయటపడగలిగేది. ఓ పెద్ద యూనిట్ కి మానేజర్ వి.... ఆ మాత్రం తెలీదా నీకు?"
    "నన్ను.... నన్నిప్పుడేం చెయ్యమంటావు శృతీ....?" బేలగా అడిగాడు.
    "అది కూడా నేనే చెప్పాలా?"
    మళ్ళీ కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు ఇద్దరూ. చుట్టూ చూశాడు.
    ఇందాకటి వ్యక్తి బిల్ పే చేస్తున్నాడు. ఎందుకో అతను అంతవరకూ తననే చూస్తూ వుండి, తను చూడగానే తల తిప్పుకొన్నట్లు అనిపించింది.
    నిజంగా అలా జరిగిందా? లేక అది తన భ్రమా? తల ఒకసారి విదిలించి తిరిగి ప్రస్తుత సమస్య పైకి కేంద్రీకరించాడు మస్తిష్కాన్ని. ఏం చేయాలి తనిప్పుడు.... ఏం చెయ్యాలి....
    "నాకన్నా నీకే పరిస్థితులు పూర్తిగా తెలుసు శృతీ. అందుకని నువ్వే చెప్పు.... ఏం చేద్దాం.... ఏం చేద్దాం శృతీ మనం?" అన్నాడు.
    శృతి కళ్ళు మూసుకుంది. దాదాపు ఐదు నిమిషాలు అలాగే వుంది ఆమె.
    స్టీవర్ట్ బిల్ తెచ్చాడు. పే చేసి పంపేసాడు సాగర్. నెమ్మదిగా జ్యూక్ బాక్స్ లో సన్నగా ఇంగ్లీష్ పాట ఏదో మొదలయ్యింది. క్రమక్రమంగా రద్దీ ఎక్కువకాసాగింది రెస్టారెంట్ లో. ఇక వెళ్ళిపోవడం మంచిది.
    కళ్ళు తెరిచింది శృతి.
    ఆమె కళ్ళలో చిన్న మెరుపు గమనించాడు సాగర్. ఏదో దృఢ నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నాయవి.  
    "మనకి రెండే మార్గాలు. మనం కలుసుకొన్నా, పెళ్ళి చేసుకొన్నా, నీ ప్రాణాలు పోక మానవు. అందుకని మనం ఒకరినొకరం పూర్తిగా మరిచిపోయి నీ ఉద్యోగం నువ్వూ, నా దారి నేనూ చూసుకోవడం ఒకటి_ లేదా...."
    అర్థోక్తిలో ఆగిపోయిన ఆమె వాక్యంలో ఏదో అపశృతి విన్పించింది అతని చెవులకి.
    "ఊఁ... లేదా?" సన్నగా వణుకుతున్న కంఠంతో రెట్టించాడు.
    "మరేం లేదు. నువ్వు ఆవేశపడవద్దు. నేను చెప్పింది ఇంటికెళ్ళి సావకాశంగా ఆలోచించు. బాగుందనిపిస్తేనే చెయ్యొచ్చు. బాగా ఆలోచించు_ తొందరపడవద్దు, ఇది కోట్ల రూపాయలకీ, రెండు మనసులకీ సంబంధించిన సమస్య. అంత చిన్నదేమీ కాదు...."
    ఆగింది శృతి.
    తనేం చెప్పడానికి ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కావలసినంత డబ్బు సర్దుకొని ఇద్దరూ కలిసి వీళ్ళెవరికీ అందనంత దూరానికి వెళ్ళిపోదామని చెబుతుందా? అతని గుండె కాస్త వేగంగా కొట్టుకోనారంభించింది.
    గొంతు బాగా తగ్గించి, చాలా తాపీగా, గంభీరంగా చెప్పింది శృతి.
    "ఆయన మనల్ని చంపేలోగా మనమే ఆయన్ని చంపేద్దాం!"
    సాగర్ నిశ్చేష్టుడయ్యాడు.


                                     2


    హైదరాబాదులో మాసత్ టాంక్ ప్రాంతం నుండి బంజారాహిల్స్ వెళ్ళేదారి చాలా అందంగా వుండే ప్రదేశాలలో ఒకటి, విశాలమైన రోడ్డు. దాదాపు నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ రోడ్డుమీద దాదాపు రెండు వందల గజాలు వెళ్ళాక, ఎడమ వైపుకి తిరిగి నేరుగా ఓ పది నిమిషాలు ప్రయాణం చేస్తే కనిపిస్తుంది. "అక్షయ ఫైనాన్స్ లిమిటెడ్."
    "అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్" లో ఇదో విభాగం. అధునాతనంగా కట్టబడి, చూడముచ్చటగా, ఓ ఆఫీసు కన్నా రాజభవనమేమో అనిపించే రీతిలో ఉంటుందది. 'అక్షయ్ గ్రూప్ లో' ముఖ్యంగా ఈ విభాగానికి వచ్చే క్లయింట్స్ ఎక్కువ. డబ్బిచ్చే విభాగం కాబట్టి. దాదాపు నలభైమంది పనిచేస్తుంటారు అందులో. చూసేవారికి చాలా ముచ్చటగా అనిపించినా పరిశీలించే వారికి తెలుస్తుంది అక్కడ పనిచేసేవారికీ, యంత్రాలకీ తేడా చాలా తక్కువని, వాళ్ళెవరూ మనుషుల్లా ప్రవర్తించరు. ఎప్పుడూ హడావుడిగా, యాంత్రికంగా పని చేసుకుపోతూ ఉంటారు. ఆఫీసు టైమింగ్స్ ప్రొద్దున్న తొమ్మిదిన్నర నుండీ అయిదున్నర వరకే అయినా ప్రొద్దున్న తొమ్మిది గంటలకీ, రాత్రి ఏడున్నరకీ కూడా ఆ ఆఫీసు అంతే హడావుడిగా ఉంటుంది. ఇలా ఉండటానికి కారణం కేవలం అది ప్రైవేట్ కంపెనీ కావడం మాత్రమేనని చెప్పలేం. అసలు కారణం పనిచేసేది నలభైమందే అయినా ఉండే పని అరవైమందికి సరిపడా. అయినా వాళ్ళందరి చేతా అంతగా పని చేయించగలగడం మేనేజ్ మెంట్ గొప్పతనాలలో ఒకటిగా చెప్పక తప్పదు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా వాహనాల కొనుగోలుకి ఋణాలు ఇచ్చిన "అక్షయ" గృహ నిర్మాణానికి కూడా రుణాలివ్వడం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS