Previous Page Next Page 
మంచివాడు పేజి 3

"అయింది. ఒక పిల్లవాడు కూడా?"భార్యాబిడ్డల రూపాలు కళ్ళకు కన్పించగా ఉత్సాహంగా అన్నాడు రామం.
"ఉద్యోగం చేస్తున్నారా?"
"లేదు. బి.ఏ. పాసయ్యాను. వ్యవసాయం చూసుకుంటున్నాను."
"ఒంగోలు పనిమీద వెళ్తున్నారా?"
"సంతలో ముర్రా బర్రెల్ని కొనడానికి వెళ్తున్నాను" అని చెప్పబోయి మానేశాడు. "పనేం లేదు. మామయ్యకు సుస్తీగా వుంటే చూట్టానికి వెళ్తున్నాను" అన్నాడు.
"మీకు పెళ్ళయిందా?" రామం మొదటిసారిగా ప్రశ్నించాడు గోపాలాన్ని.
అయింది. ఒక లక్షాధికారి కూతుర్ని లేపుకొచ్చి రిజిష్టర్ మారేజ్ చేసుకున్నాను."
రామం గోపాలం ముఖంలోకి నిరసనగా చూశాడు. ఎంతకైనా తెగించినవాడే! అనుకున్నాడు.
"నేను బ్యాంక్ లో పని చేస్తున్నాను."
"కొయ్ రా నాయనా కొయ్" అడక్కుండానే బ్యాంకులో ఉద్యోగం అని చెప్తున్నాడు. తను ఇలాంటి వేలు ఎన్నో రోజుకు చూస్తాననీ, డబ్బంటే తనకు లక్ష్యం లేదనీ నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు చిట్టి నాయన! నాకు బొత్తిగా బుర్రలేదను కుంటున్నాడు!
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
రామం తృళ్ళిపడ్డాడు. చేతిలో వున్న కప్పులో తీ వొలికింది. చెయ్యి చురుక్కుమంది.
"చెమట్లు కారి పోతున్నా ఆ కోటు విప్పరేం? మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా వుంది." గోపాలం అన్నాడు.
"వుంటుంది! వుంటుంది! ఎందుకుండదూ బాధగా? నీకు కావలసింది నేను వేసిన కోటు విప్పడమేగా? నేను ఆ మాత్రం గ్రహించలేదు అనుకోకు." అనుకున్నాడు. పైకి సమాధానం ఇవ్వలేదు.
"మీకు డ్రింకు తీసుకునే అలవాటుందా?"
"అమ్మ బిడ్డా! తాగించాలని చూస్తున్నావా?"
తాగాలని వున్నా "లేదు నాకు అలవాటు లేదు" అబద్ధం ఆడేశాడు రామం.
"మీరు చాలా బుద్ధిమంతుడిలా వున్నారు ?"
"నాకు చెడు అలవాట్లేమీ లేవు" గర్వంగా అన్నాడు రామం"
"నాకు అన్ని చెడు అలవాట్లూ వున్నాయ్. తాగుతాను, అందుబాటులో వున్న ఆడవాళ్ళని వదిలి పెట్టను. నా భార్య పరాయి మగవాడితో తిరుగుతానంటే చస్తే ఒప్పుకోను. మీలా మంచి అలవాట్లతో మనిషి ఎలా జీవిస్తాడో నాకు తెలియదు. గతాన్ని తల్చుకుంటూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బతకలేను. వర్తమానంలో జీవిస్తాను. ప్రతిక్షణం జీవిస్తాను" విస్కీ గ్లాసు ఖాళీ చేశాడు.
రెండో గ్లాసు కూడా పూర్తి కావస్తోంది. కబుర్లు చెపుతూ, మధ్య మధ్య కూనిరాగం తీస్తూ త్రాగుతున్నాడు.
ఏమిటి? అంత తాగేస్తున్నాడు? అంత డబ్బు అతని దగ్గర వుందా?
గోపాలం ముఖంలోకి చూశాడు. కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయ్. ముఖం ఎర్రబడింది.
"ఇదీ ఒకందుకు మంచిదే? మరో గ్లాసు కొట్టేడంటే గుర్రం ఎక్కేస్తాడు. ఇక వాడి బొంద. వాడు నన్నేం చేస్తాడు?" ఆలోచనలో పడ్డాడు రామం.
"నా... నా... భార్య... చాలా ... మంచిది. నా కోసం కులం ... ధనం అన్నీ వదిలేసుకుంది. నేనేం చేసినా సహిస్తుంది..."
"అబ్బాయిగారి పని సగం అయిపొయింది. మరో గ్లాసు తాగుతారా? డబ్బుకు వెనుకాడకండి. నా దగ్గర వుంది ఇస్తాను" అన్నాడు రామం ఉత్సాహంగా.
గోపాలం రామం ముఖంలోకి చూశాడు.
"డబ్బు నా దగ్గర కూడా వుంది. మూడువేలకు పైనే ఉంది. ఇంత మొత్తం దగ్గిర పెట్టుకొని ఇవాళ తాగకూడదనే అనుకున్నాను. కాని ఉండలేకపోయాను. ఇందులో వున్న హాయి మీకు అర్థంకాదు. మీలాంటి వాళ్ళను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. తాగడం వల్ల కొన్ని నష్టాలు లేకపోలేదు. అప్పుడప్పుడు వాచీ, పెన్, డబ్బూ పోతూ వుంటాయ్." అన్నాడు గోపాలం మూతలు పడిపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS