Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 2


    తలకు చుట్టుకున్న తుండుగుడ్డ తీసి విదిలించి ముఖం తుడుచుకుని మళ్ళీ తలకు చుట్టుకుని ఓజలు ఎత్తుతున్న వైపు కదిలాడు రమణయ్య. అంతలో అతని దృష్టి తన పొలంవైపు ఉరుకులు పరుగులు మీద వస్తూన్న ఆడ మనిషివైపు మళ్ళింది. క్షణకాలం గుర్తు తెలిసీ తెలియనట్టుగా ఉండిపోయి 'ఎవరా' అని ముందుకు వేసిన అడుగు అలాగే ఉంచి, నిలబడిపోయాడు రమణయ్య.
    మరో అయిదు నిమిషాల్లో కళ్ళంలోకి వచ్చేసింది రంగి. రంగి రమణయ్య ఇంట్లో ఆ పనీ ఈపనీ చేస్తూ రమణయ్య భార్యకి చేదోడు వాదోడుగా ఉంటుంది. రంగి భర్త శీనయ్య చెరుకు, అరటి, పసుపు తోటలకు కావలి ఉంటున్నాడు.
    "అయ్యా! అయ్యా! మన ఇంట్లో రత్నం వెలిసిందండీ" అంది రంగి ఆయాసంగా.
    ఆ మాటలతో చాలా మట్టుకు అర్ధమైనా రంగి నోట పూర్తిగా విని సంతృప్తి చెందాలని వస్తూన్న చిరునవ్వుని ఆపాలని ప్రయత్నం చేయకుండా "కొంచెం ఆగి నిదానంగా, వివరంగా చెప్పవే!" అన్నాడు రమణయ్య.
    ఆ మధ్యకాలంలో ఆయాసాన్ని అణచుకున్న రంగి - "రాధమ్మకు కొడుకు పుట్టినాడు బాబూ" అంది ఆనందంగా.
    రమణయ్య ముఖం మతాబులాగా వెలిగిపోయింది.
    "ఎప్పుడే" అని అడిగాడు కుతూహలంగా.
    "ఎప్పుడో ఎక్కడబాబూ! కొడుకుపుట్టాడు. నీళ్ళుపోసి, బొడ్డు కోసి, పొత్తిళ్ళలో పండబెట్టి వస్తున్నాను" అంది రంగి.
    రమణయ్య ఆనందానికి అవధుల్లేకపోయాయి. పక్కనున్న చేట తీసుకుని నిలువెత్తున పెరిగిన ధాన్యరాశిలో ముంచి "ఇంద" అని రంగి పైటకొంగులో మూడుచాటలవడ్లు పోశాడు. పొల్తి చుట్టకుండా, ధాన్యం సాంతం తయారుకాకుండా రాశిలోంచి అలా దానం చేయటానికి రమణయ్య మనస్సు క్షణకాలం సందేహించినా వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం ఆ సందేహాన్ని అణచివేసింది.
    రంగి కళ్ళలో కృతజ్ఞత ప్రతిఫలించింది.
    "ఒరేయ్ ప్రసాదూ, శీనయ్యా, రంగయ్యా! అంతా ఇలా రండర్రా. మన గోపీకి కొడుకు పుట్టాడు. ఈ పొలానికి హక్కుదారు జన్మించాడు. నేను ఇంటికి వెడుతున్నాను. మళ్ళీ గంటకో రెండు గంటలకో వస్తాను. అంతా జాగ్రత్తగా చూసుకోండి" అని కదిలాడు రమణయ్య.
    రంగి చకచకా ముందుకు నడుస్తూంది.
    ఆనందంతో, పట్టరాని సంతోషంతో నడుస్తున్నాడు రమణయ్య.
    అతనికి గోపీ వెళ్ళి, ఆ ప్రయత్నాలు, అప్పటి సంఘటనలు అన్నీ ఒక్కటొకటీ గుర్తుకు రాసాగినాయి.


                                              2


    ఆ ఊళ్లో భూషయ్యది గొప్ప సంసారం. నాలుగు మట్టి మిద్దెలు, ఓ మేడ, మేడచుట్టూ విశాలమైన బయలు స్థలం, ఊరి నానుకుని తోటలూ దొడ్లూ, ఏ దిశ చూసినా చదుర్లు చదుర్లుగా పొలమూ ఉన్నాయి ఆయనకి.
    ఎప్పుడూ ఇంటినిండా తిరిగే బంధువులూ, పని మనుషులతో, ఆ యిల్లు కల కల లాడుతూ ఉంటుంది. అంతా జమిందారీ పాయలో గొప్పగా ఉంటుంది. కాని, భూషయ్యది అదో తరహా వ్యక్తిత్వం.
    నలుగురితో కలవటం, ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అంతఃపురంలో మహారాజులా ఉంటాడాయన. ఎవరైనా వచ్చి పిలిస్తే పనిమనిషో, ఇంట్లో మనిషో వెళ్ళి చెపితే మేడ దిగివచ్చి వసారాలో కూర్చుని మాట్లాడి పంపిస్తాడు.
    ఆ ఊరి వ్యక్తుల్లో వసారా దాటి లోపలకు వెళ్ళినవాడు లేడు. మాయామహల్ రహస్యంలాగా ఆ విషయం గురించి చెప్పుకుంటూ ఉంటారంతా.
    భూషయ్యకి గర్వం అనీ, ధనమదాంధత అనీ పిరికితనం అనీ అనుకుంటారు కొందరు. కాదు! భోగలాలసుడు భూషయ్య. అతనికెప్పుడూ మదిరా మానినీ ఉండాలనీ గిట్టనివాళ్ళు అంటారు. అయితే అది మాత్రం అబద్ధమే.
    భూషయ్య ఒకరకమైన యోగి అని చెప్పవచ్చు. ఎప్పుడూ ధ్యానమో, జపమో అన్నట్టుగా ఉంటాడు.
    వేకువున లేవగానే కాలకృత్యాలు నిర్వర్తించుకుని యోగాసనాలు వేస్తాడు. తీరికగా విశ్రాంతి తీసుకొని స్నానం చేసి గంటా గంటన్నరసేపు ధ్యానంలో జపమో తపమో చేసుకుంటాడు. తర్వాత తన గదిలో కూర్చుని ఫిడేల్ వాయించుకుంటాడు. అది సాధనో, ఆత్మానంద సంధాయకమో ఆయనకే తెలియాలి.
    సంగీత సేవ తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో భోజనం చేస్తాడు. ఆ సమయంలో భోజనాల హాలులో వచ్చిన బంధువులతో మాటలాడతాడు. కులాసాగా కబుర్లు చెపుతాడు. వింటాడు! నవ్వుతాడు. నవ్విస్తాడు.... అంతే మళ్ళీ తన గది చేరతాడు.
    ఆ గది ఒక చిన్న లైబ్రరీలా ఉంటుంది. గదిలో ఓ గోడనిండా అల్మెరాలు పెట్టించాడు ఆయన. అందులో తెలుగు, సంస్కృతం విభాగాలుగా పుస్తకాలు అమర్చాడు. మళ్ళీ అందులో ప్రబంధ సాహిత్యమూ, నాటక సాహిత్యమూ నవలా సాహిత్యమూ, ఆధునిక కవిత్వమూ విడివిడిగా ఏర్పరిచి అమర్చుకున్నాడు. సంస్కృతంలో నాటకాలూ, కావ్యాలూ విడివిడిగా అమర్చుకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS