Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 2


    "పెళ్ళి కాలేదు అని ఎందుకంటావ్? పెళ్ళి చేసుకోలేదు అను. ఆ అమ్మాయికి నచ్చినవాడు కన్పించలేదు. చేసుకోలేదు. హాయిగా వుద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూంది. తన కాళ్ళమీద తను నిలబడింది. ఇక పరమయ్యకూతురూ, అలాంటి ఆడపిల్లల సంగతంటావా....అదివేరు. వాళ్ళు కేవలం అలంకార ప్రాయంగా కాలేజీల్లో చేరి చదివారు. చదువుతున్నారు. వాళ్ళకి ఓ వ్యక్తిత్వమంటూ వుంటేగా? ప్రత్యేకమైన అభిప్రాయాలు అంటూ అసలేవుండవు. తల్లి దండ్రులు చదివిస్తున్నారు, చదువుతున్నారు. వెనకటి రోజుల్లో ఆడపిల్లలకు సంగీతం నేర్పించేవారు. పెళ్ళి చూపుల్లో మా అమ్మాయికి సంగీతం నేర్పించామని చెప్పుకోవటానికి తల్లి దండ్రులకు గర్వంగా వుండేది. అలాగే చదువులు కూడా. పెళ్ళి సంగీతం లాగే పెళ్ళి చదువులు. ఆడపిల్లలు మారాలి. వాళ్ళలో ఆత్మ విశ్వాసం రావాలి. పెళ్ళి అనేది ఆడదానికి ఎంత అవసరమో, మగవాడికీ అంతే అవసరం."

 

    "ఏమోనయ్యా! నీ ధోరణి నాకు అర్ధంకాదు. వస్తాను, అంటూ ఎడ్లను అదిలించి అరక తోలుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటప్పయ్య.

 

    ధర్మయ్య ఓ క్షణం వెంకటప్పయ్య వెళ్ళినవైపు చూస్తూ వుండిపోయాడు.  


                                            2


    మోకాళ్ళ పైకి ముతక ఖాదీ పంచకట్టి, ఖాదీ అంగవస్త్రం, భుజాన వేసుకొని, హడావిడిగా వీధి గుమ్మంలో అడుగు పెట్టాడు ధర్మయ్య.

 

    "ఇదుగో! నిన్నే!!" కేక పెట్టాడు.

 

    "ఆఁ! వస్తున్నా!" అంటూ తడిచెయ్యి కొంగుకు తుడుచుకుంటూ బయటికి వచ్చింది సరస్వతమ్మ.

 

    "పురోహితుడు ఇంకా రాలేదా?" అంటూ వసారాలో వాల్చివున్న నులక మంచంమీద లంక పుగాకు చుట్టచుట్టుకుంటూ కూర్చునివున్న జానకిరామయ్యను చూశాడు ధర్మయ్య.

 

    ధర్మయ్య ముఖం వికసించింది.

 

    "జానకిరామయ్యా! నువ్వా? ఎంతసేపయింది వచ్చి?" భుజానవున్న అంగవస్త్రం తీసి మంచం పట్టెమీదవేసి, జానకిరామయ్య పక్కగా కూర్చున్నాడు ధర్మయ్య.

 

    "ఏమిటి ధర్మయ్యా! పురోహితుడంటున్నావ్?" చుట్ట కొస కొరికి ఊస్తూ అన్నాడు జానకిరామయ్య.

 

    "పేరిశాస్త్రిని రమ్మన్నాలే. ఇంకా రాలేదేమో అని...."

 

    "అయ్యా ఎంతమాట! తమరు కబురు పంపించడం నేను రాకపోవడమా? సంకల్ప మాత్రంగానే వచ్చాను. నాకు నూరేళ్ళు ఆయుష్షు" పంచాంగం చంకన పెట్టుకొని, అప్పుడే ప్రవేశించిన పేరిశాస్త్రి తనను తానే మెచ్చుకుంటూ అన్నాడు_ధర్మయ్య మాటల్ని మధ్యలోనే అందుకొని.

 

    "రండి! రండి! శాస్త్రిగారూ! మాటలోనే వచ్చారు. కూర్చోండి." అన్నాడు ధర్మయ్య పాతకాలపు చెక్క కుర్చీ చూపిస్తూ, వుత్సాహంగా.

 

    పేరిశాస్త్రి కుర్చీ నిండుగా కూర్చున్నాడు. బొడ్లో నుంచి వెండి పొడుంకాయ తీసి, ఇంత ముక్కుపొడుం అరచేతిలో వేసుకున్నాడు. అరచేతిని ముక్కుదగ్గర పెట్టుకొని ఒక్కసారిగా ఎగపీల్చి, ముక్కును భుజాల నిండుగా కప్పుకొన్న శాలువ కొసకు తుడుచుకున్నాడు. నశ్యం ఘాటుకు పేరిశాస్త్రి కళ్ళు ఓ క్షణకాలంపాటు మత్తుగా సగం సగం మూసుకున్నాయ్.

 

    "సెల విప్పించండి!" అన్నాడు అరమోడ్పు కళ్ళను ధర్మయ్య కేసి తిప్పి.

 

    "మంచిరోజు చూసి చెప్పవయ్యా శాస్త్రీ!" అన్నాడు ధర్మయ్య.

 

    శాస్త్రి ఉత్సాహంగా పంచాంగంలో తల దూర్చాడు.

 

    జానకిరామయ్య ఆశ్చర్యంగా ధర్మయ్య ముఖంలోకి చూశాడు. ధర్మయ్య ముసిముసిగా నవ్వాడు.

 

    సందర్భం అర్ధంకాని సరస్వతమ్మ భర్త ముఖంలోకీ, జానకిరామయ్య ముఖంలోకీ మార్చి మార్చి చూస్తూ నిలబడిపోయింది.

 

    "ఈనెల చివర్లో మూఢం వెళ్ళిపోతుంది. వచ్చే నెలలో అన్నీ మంచి లగ్నాలే వున్నాయ్. మొదటి పక్షంలో దశమి శుక్రవారం పదకొండు గంటలకు ముహూర్తం భేషుగ్గావుంది_" అంటూ ధర్మయ్య ముఖంలోకి ఉత్సాహంగా చూశాడు పేరిశాస్త్రి.

 

    వివాహ సమయంలో అందుకోబోయే సంభవానలు కళ్ళలో కదులుతుంటే, పేరిశాస్త్రి కళ్ళు వెలిగిపోయాయి.

 

    "ఇంతకీ వరుడిది ఏ ఊరు? ఏం చదివాడు? ఎంత కట్నం ఇస్తున్నారేమిటి?" పేరిశాస్త్రి కుతూహలంగా ప్రశ్నించాడు.

 

    సరస్వతమ్మ ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూసింది.

 

    "భలేవాడివయ్యా! అమ్మాయికి వివాహం నిశ్చయం అయితే ఇంతవరకూ నా దగ్గర దాచావా?' నిష్టూరంగా అన్నాడు జానకిరామయ్య.

 

    ధర్మయ్య తల వంచుకొని ఆలోచనలో పడ్డాడు. ఏం సమాధానం ఇవ్వాలో వెంటనే తోచక కొంచెం కంగారు పడ్డాడు.

 

    సరస్వతమ్మా, జానకిరామయ్యా, ధర్మయ్య ముఖంలోకి కుతూహలంగా చూడసాగారు.

 

    "ధర్మయ్య గారి చేతికి ఎముకలేదు. ఐదురోజుల పెళ్ళి బ్రహ్మాండంగా జరిపిస్తారు" అన్నాడు పేరిశాస్త్రి ధర్మయ్యను ఉబకేసే ధోరణిలో.

 

    "ముహూర్తం వివాహానికి కాదయ్యా. అమ్మాయిని కాలేజీలో చేర్పించాలి. మంచిరోజు చూసి చెబుతారని మీకు కబురు పంపించాను" అన్నాడు ధర్మయ్య తలవంచుకొనే.

 

    పేరిశాస్త్రి ఉత్సాహం అంతా నీరుకారిపోయింది. ముఖంలో అసంతృప్తి కొట్టవచ్చినట్టు కన్పించింది. పంచాంగం చుట్టి చంకలో పెట్టుకొని లేచి నిలబడ్డాడు పేరిశాస్త్రి.

 

    "అట్లా చెప్పారు కారేం? మంచిరోజులకేం? అన్నీ మంచి రోజులే. రేపు మంచిరోజే. నాలుగు తర్వాత వర్జం లేదు" అన్నాడు.

 

    ఈ మాత్రం దానికి, నీ ఇంటికి పనికట్టుకొని, పరిగెత్తుకొని రావాలా అన్నట్టుంది పేరిశాస్త్రి ధోరణి.

 

    జానకిరామయ్య గుప్పుగుప్పున చుట్టపొగ వదిలి సుడులు తిరుగుతున్న పొగను చూస్తున్నాడు సాలోచనగా.

 

    సరస్వతమ్మ గిర్రున తిరిగి లోపలకు వెళ్ళిపోయింది.

 

    "అప్పుడే లేచారేం? కూర్చోండి శాస్త్రిగారూ!" అన్నాడు ధర్మయ్య.

 

    "నాకు అవతల అర్జంటుపని వుంది. షావుకారు రామయ్యగారు కబురు పంపించారు. వారి రెండో అమ్మాయి వివాహానికి ముహూర్తం పెట్టాలి" అన్నాడు పేరిశాస్త్రి కూర్చోకుండానే.

 

    "ఇదిగో! నిన్నే!" లోపలకుచూస్తూ భార్యను కేకవేశాడు ధర్మయ్య.

 

    "చూడు ఆ పొట్లకాయా, వంకాయలూ, టమాటాలూ తెచ్చి శాస్త్రిగారికి ఇవ్వు" అన్నాడు బయటికి వచ్చిన భార్యతో.

 

    "ఇప్పుడవన్నీ ఎందుకండీ!" అంటూ కూర్చున్నాడు పేరిశాస్త్రి.

 

    "మన దిబ్బమీద కాసినవి. లేతగా బాగున్నాయి. చూడు! ఆ పట్టాలో చేబ్రోలు పుగాకు వుంది. నాలుగు కాడలు, మంచివిచూసి తీసుకురా. శాస్త్రిగారు నశ్యం చేయించుకుంటారు" అన్నాడు ధర్మయ్య లోపలకు వెళుతున్న భార్యతో.

 

    "ధర్మయ్యగారిది మహా దొడ్డగుణం!" జానకిరామయ్య ముఖంలోకి చూస్తూ పేరిశాస్త్రి అన్నాడు.

 

    జానకిరామయ్య ముఖం చిట్లించు కున్నాడు. ధర్మయ్య చిరునవ్వు నవ్వాడు.

 

    సరస్వతమ్మ ఇచ్చిన కూరగాయాలూ, పొగాకు కాడలూ తీసుకొని సంతృప్తిగా బయలుదేరిన పేరిశాస్త్రికి నీళ్ళ బిందెతో లోపలకు వస్తున్న సునంద ఎదురైంది.

 

    "సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు" సునందను దీవించాడు.

 

    సునంద నవ్వుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది.

 

    "అమ్మాయి అపరసరస్వతి అంటే నమ్మండి! సౌశీల్యం, చదువూ ఒకదానికి ఒకటి వన్నె తెస్తుంది" ధర్మయ్య ముఖంలోకి చూస్తూ సునందను ప్రశంసించాడు పేరిశాస్త్రి.

 

    "అంతా మీ ఆశీర్వాదబలం" అన్నాడు ధర్మయ్య.

 

    "వస్తానండీ" మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు పేరిశాస్త్రి.

 

    "ఇదుగో అన్నయ్యా! మజ్జిగ తీసుకో!" సరస్వతమ్మ జానకిరామయ్యకు మజ్జిగ గ్లాసు అందించింది.

 

    గ్లాసు మజ్జిగ ఒక్క గుక్కలో తాగేసి గ్లాసు మంచంమీద పెట్టి, పై పంచతో మూతి తుడుచుకున్నాడు.

 

    "ఏం జానకిరామయ్యా! పొలం బేరం ఫైసలయిందా? పరమయ్య ఏమన్నాడు?" ధర్మయ్య అడిగాడు చుట్టుముట్టించుకొంటూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS