Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 2

"కళ్ళముందు కటిక చీకటి వుండవచ్చును. కాని అదే శాశ్వతంగా ఉండదు. చీకటి తర్వాత వెలుగు రేఖలు తప్పక వస్తాయి. రాత్రి గడిచాక ఉదయం వుంటుందనే విషయాన్ని మర్చిపోకు" అతను మందలిస్తూ అన్నాడు.
"నా జీవితానికీ వెలుగు లేదు, అంతా చీకటే!" ముక్కు చీదేసిందామె.
"ఎలా చెప్పగలవు? ఎవరూ భవిష్యత్తును గురించి ముందుగానే ఖచ్చితమైన అంచనా వెయ్యలేరు. భవిష్యత్తే లేదనుకొనే మీలాంటివారి కోసం ఎంతో అందమయిన జీవితం ఎదురుచూస్తూ వుండవచ్చు! భవిష్యత్తు ఊహించనంతటి గొప్పగా, థ్రిల్ గా ఉండవచ్చును" అన్నాడు అతను ఆమె ముఖంలోకి చూస్తూ.
కొంచెం ఆగి "నీ సమస్య ఏమిటో నాకెందుకు చెప్పకూడదూ? మనిద్దరం కలిసి ఆ సమస్యను పరిష్కరించవచ్చు గదా!" అన్నాడు.
ఆమె తలెత్తి అతని ముఖంలోకి చూసింది.
అతని నల్లని కనుపాపల్ని, తిన్నగా ఉన్న కనుబొమ్మలనూ, అందంగా వున్న పెదవుల్నీ, సూది గడ్డాన్నీ చూస్తుంటే అతన్ని అంతకుముందే చూసినట్టు లీలగా అన్పించి-
"నిన్ను ఎక్కడో చూశాను" అంది సాలోచనగా.
"ఎక్కడ?" ఖంగుతిన్నట్టు అన్నాడు.
"సౌత్ యామ్ ప్టన్" అని ఆలోచనలో పడిందామె.
ఓడ బయలుదేరటానికి సిద్ధంగా వుంది. సామానులు ఎక్కిస్తున్నారు. వెళ్ళిపోతున్నవారికి కొందరి చిరునవ్వుల్తోనూ, మరికొందరు కన్నీటితోనూ వీడ్కోలు చెబుతున్నారు. ఆ ప్రదేశం అంతా కూడా జనంతో కిటకిటలాడుతోంది. ఆ జనంలో బిక్షగాళ్ళ నుంచి తూర్పుకు వెళుతున్న సైనికుల వరకూ ఉన్నాం. అప్పుడే తను అతన్ని చూసింది.
అతడు భారతీయుడిగా కన్పించాడు. అతను తాపీగా నిల్చుని వున్నాడు. ఇతరులలో కన్పించని ఆత్మవిశ్వాసం ఏదో అతనిలో తనకు ప్రత్యేకంగా కన్పించింది. ఓడ బయలుదేరుతుండగా...
అతను చివరివాడుగా క్రింది డెక్ లోకి ఎక్కాడు. అతను ఓడ మిస్ అవుతాడేమోనని తను భావించింది. కాని తనకు కావాల్సిన దానిని సాధించగల సమర్థత అతనిలో తనకు కన్పించింది.
ఆమె మళ్ళీ అతనికేసి చూసింది ఆలోచనల నుంచి బయటపడి.
అతని కనుబొమ్మలు ముడిపడి వున్నాయి. భారతీయుడిలా కన్పిస్తున్న అతను అంత మంచి ఇంగ్లీషు మాట్లాడటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను మాట్లాడే ఇంగ్లీషు కూడా భారతీయత ఉట్టిపడుతున్నదనిపించిందామెకు.
ఆమె ఆలోచనలు పసికట్టినట్టుగా చిరునవ్వు నవ్వి అన్నాడు "మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం."
"ఏమిటది?"
"నువ్వు ఈ రాత్రికి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం నేను మర్చిపోతాను. అలాగే నువ్వు నన్ను సౌత్ యామ్ ప్టన్ లో చూసినట్టు మర్చిపోవాలి!"
"ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
"నువ్వు ఆత్మహత్యకు పూనుకోవడం మీ వాళ్ళకు తెలియకూడదని నువ్వు కోరుకుంటున్నావు కదూ? వాళ్ళకు తెలిస్తే ఏమవుతుంది!"
"నో!నో! మా బాబాయికి తెలియకూడదు. తెలిస్తే మండిపడ్తాడు. ఇంకా..." అంటూ మధ్యలోనే ఆగిపోయిన ఆమె ముఖంలో భయం స్పష్టంగా కన్పించింది.
అతను ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. బుగ్గ ఎర్రగా కంది ఉండటం కన్పించింది.
"నిన్నెవరు కొట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు!
యాత్రికంగా ఆమె చెయ్యి కందిన చెంపను కప్పివేసింది. చూపులు కిందకు వాలాయి.
ఒక్క నిమిషం ఆమె మౌనంగా ఉండిపోయింది.
"నా పరిస్థితి అర్థం చేసుకోలేవా? మా బాబాయి అంటే నాకు భయం. రాత్రి బెత్తంతో కొట్టాడు" అన్నది అమాయకంగా.
ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది.
"అసలు ఏం జరిగిందో చెప్పు, నీ పేరేమిటి?" కొంచెం ముందుకు వంగి అనునయిస్తూ అడిగాడు.
ఆమె సమాధానం ఇవ్వలేదు.
నువ్వు చెప్పకపోతే నేనే తెలుసుకోవాల్సి వస్తుంది.
"నో!నో! ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఆ సంగతి మా బాబాయ్ హారేకి తెలిస్తే..."
"హారే ఆరాన్ మీ బాబాయా?" మధ్యలోనే అందుకొని ఆశ్చర్యంగా అడిగాడు.
"మా బాబాయి మీకు తెలుసా? ప్లీజ్! ఈ విషయం ఆయనకు చెప్పకండి."
"నిన్ను అతను కొడతాడా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"బాబాయికి ముక్కు మీదే కోపం ఉంటుంది. బహుశా ఇండియాలో...చాలా కాలం ఉండటం వల్ల... ఆయన లివర్ దెబ్బతిన్నదనుకొంటాను...ఏమైనా...నన్ను ఆయన- మొదటినుంచీ అసహ్యించుకుంటూనే వున్నాడు."
"అసహ్యించుకొంటాడా? ఎందుకు?"
"మా అమ్మా నాన్నా చనిపోయారు. అతనికి ఒక గుదిబండగా తయారయ్యాను."
"మీ బాబాయ్ తప్ప నీ బాధ్యత తీసుకునేవాళ్ళు నీకెవరూ లేరా?"
"నాన్నకు దూరపు బంధువులు వుండి వుండొచ్చు. కాని ఇప్పుడు బాబాయికి నా సహాయం అవసరమయింది. అందుకే తన దగ్గర పెట్టుకున్నాడనుకొంటాను."
"ఏమిటా అవసరం?"
ఆయన రాస్తున్న పుస్తకం ఫెయిర్ కాపీ చేస్తున్నాను. అందుకే ఆయనకు నామీద తరచుగా కోపం వస్తోంది.
"అదేమిటి? ఫెయిర్ కాపీ చేస్తుంటే కోపం ఎందుకు?"
అతని కంఠంలో తన ప్రశ్నకు సమాధానం ఇచ్చి తీరాలన్న ఆజ్ఞ ధ్వనించింది.
అతని రాత గజిబిజిగా ఉంటుంది. పైగా హిందీ, ఉర్దూ మాటలు మధ్యమధ్యలో ఉంటాయి. అందుకే మధ్య మధ్య ఫెయిర్ లో తప్పులొస్తుంటాయి. ఆ తప్పులు చూడగానే బాబాయికి కోపం వస్తుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS