Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 2


    "అఫ్ కోర్స్! కానీ ఎప్పటికైనా ఆస్తికి వారసుడివి నువ్వే కదా?"
    "ఈ లోపల మావయ్య ఆస్తంతా దానాలు చేయకపోతే..."
    "అఫ్ కోర్స్! ఇంతకూ ఈ సుష్మాసహానీని ఎక్కడ చూశావ్?"
    "టివి.సీరియల్లో...! మొన్న 'ఆగని మమతలు' అనే సీరియల్ తాలూకు ఒక భాగం గత్యంతరం లేక చూడాల్సి వచ్చింది. ఐ మీన్...మొన్న సాయంత్రం ఇంటికి వస్తుంటే దారిలో డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదినుంచే ప్రవహిస్తోంది. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఆ డర్టీ వాటర్ చూడటం ఇష్టంలేక ఆ పక్కనే టి.వి.లు అమ్మే షాపులో కనిపించిన ఆ సీరియల్ నేను అయిదు నిమిషాలు చూడాల్సి వచ్చింది. అయిదు నిమిషాలు భరించాక జనమంతా తెగించి ఆ డ్రయినేజ్ వాటర్ లోనుంచే వెళ్ళిపోయారనుకో. అందులో హీరోయిన్ గా వేసిందా అమ్మాయ్. నిజంగా చెబుతున్నాను అంత అందమైన అమ్మాయి తెలుగు టి.వి. సీరియల్లో వేసిందంటే నాకు చాలా జాలి వేసింది. వెంటనే టి.వి. స్టేషన్ కెళ్ళి ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించుకొచ్చేశాను."
    "వెరీగుడ్! ఎక్కడుంటుంది?"
    "హిమాయత్ నగర్ లో."
    "అయితే ఇక ఆలస్యం ఎందుకు బ్రదర్! కమాన్ హరీఅప్...ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. డూ యూ నో రాజేష్? నీకు లాగానే ఆలస్యం చేసి దెబ్బ తిన్నాడు"
    "అంటే? ఏం జరిగింది?"
    "వాళ్ళాఫీస్ లోనే పని చేసే సీతారాజన్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను లంచ్ కి ఆహ్వానించి పెళ్ళి సంగతి మాట్లాడాలని ప్లాన్. కానీ వాళ్ళాఫీసరు లీవ్ ఇవ్వలేదు. తీరా లీవ్ దొరికేసరికి సీతరాజన్ కి పెళ్ళయిపోయింది."
    "మైగాడ్! ఎవరితో?"
    "వాళ్ళాఫీసర్ తో..."
    "టూమచ్...."
    "అందుకే త్వరగా వెళ్ళు. ఈ రోజుల్లో కోటీశ్వరులూ, బిజినెస్ మాగ్నెట్ లూ, పెద్ద డాక్టర్లూ అందరూ సినిమా తారలనూ, టి.వీ. తారలనూ పెళ్ళి చేసేసుకుంటున్నారు."
    "అలాగా! అయితే వస్తారా..." అని నాలుగడుగులు వేసి మళ్ళా వెనక్కి తిరిగివచ్చాడు, "ఇంతకూ ఈ విషయం ఆ అమ్మాయితో ఎలా మాట్లాడమంటావ్?"
    "మీ అభిమానినని చెప్పు. నువ్విచ్చే విందు స్వీకరించకపోతే ఆమె నటించిన టి.వీ. సీరియల్ చివరికంతా చూడ్డం ద్వారా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించు. ఠక్కున ఒప్పుకుంటుంది."
    "ఓ.కే గురూ! ఇప్పుడే వెళుతున్నాను" అతను ఆనందంగా వెళ్ళాడు.
    భవానీశంకర్ కూడా తాగటం పూర్తిచేసి మామూలుగానే హోటల్ ఓనర్ తో హైద్రాబాద్ నగరం పాతికేళ్ళ క్రితం ఎంత అద్భుతంగా వుండేదో ఉర్దూలో పొగిడి, బిల్ తరువాత ఇస్తానని చెప్పి బయటికొచ్చేశాడు.
    అబిడ్స్ రోడ్డు అప్పుడే మళ్ళీ పూర్తి ట్రాఫిక్ తో నిండిపోయింది.
    టైమ్ చూశాడు భవానీశంకర్. పదకొండవుతోంది. తను ఎటెండవ్వాల్సిన ఇంటర్వ్యూ పదకొండున్నరకుంది.
    చకచకా నాంపల్లి రోడ్డులో వున్న బసేరా అనే భవనంలో మొదటి అంతస్తు చేరుకున్నాడు. అప్పటికే ఆ హాలంతా ఇంటర్వ్యూ కొచ్చిన యువతీయువకులతో నిండిపోయింది.
    "మనోరంజన్ మూవీ మేకర్స్, జనరంజని పబ్లిషింగ్ హౌస్" అన్న బోర్డులు అందంగా కనబడుతున్నాయి. ఆ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్స్, ఆఫీస్ మేనేజర్స్ పోస్ట్ ల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
    అరగంట తర్వాత భవానీశంకర్ పేరు పిలిచాడు క్లర్కు.
    'టై' సర్దుకుని చిరునవ్వుతో లోపలకు నడిచాడతను. ఎదురుగ్గా ఆ సంస్థ అధినేత మార్కండేయులు, జనరల్ మేనేజర్ జగన్నాథం కూర్చుని వున్నారు. వారి పక్కన అత్యంత ఆకర్షణీయంగా అలంకరించుకున్న ఓ యువతీ. ఆమె ముఖంలో ఆ ఇంటర్వ్యూలు కలిగిస్తోన్న బోర్ స్పష్టంగా కనబడుతోంది.
    "గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ గుడ్ మార్నింగ్ మిస్" అన్నాడు అతను.
    "గుడ్ మార్నింగ్ జెంటిల్ మెన్, టేక్ యువర్ సీట్" అన్నాడు మార్కండేయులు అతనివంక పరీక్షగా చూస్తూ.
    భవానీశంకర్ కుర్చీలో కూర్చున్నాడు.
    "ఇక్కడికెలా వచ్చారు మీరు?" అడిగాడు జనరల్ మేనేజర్ జగన్నాథం.
    ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళను కన్ ఫ్యూజ్ చేసి, ముప్పతిప్పలు పెట్టి, అందరినీఅన్ ఫిట్' అనిపించాలని అతని కోరిక. అలా జరిగితే అప్పుడింక గత్యంతరం లేక తన బంధువుల కుర్రాళ్ళనే అపాయింట్ చేసేయవచ్చని అతని ప్లాన్. ఇంచుమించుగా పాతికమందిని ఇక్కడికెలా వచ్చారు అన్న ప్రశ్న వేశాడతను. అందరూ బస్ లో అనో, ఆటోలో అనో,స్కూటర్ మీద అనో సమాధానాలు చెప్పారు. వాళ్ళను పరమ తెలివితక్కువ సన్యాసులు చూసినట్లు చూసి "మీ సమాధానం తప్పు జెంటిల్మెన్! లిఫ్టులో వచ్చారు మీరు, యూ కెన్ గో నౌ" అనేసి బయటకు పంపించేశాడు.
    భవానీశంకర్ కి ఆ ప్రశ్న అమితమైన ఆనందం కలిగించింది. "మా పక్కింట్లో పనిచేసే వంటవాడు చెప్పాడీ సంగతి. ప్రశ్న చాలా పాతది సార్! నైన్ టీన్ సిక్టీస్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వాడేవారు. మీరు వీలయినంత త్వరలో నైన్ టీన్ నైన్ టీలోకి రాకపోతే మీ సంస్థకు అతి త్వరలోనే బూజు పట్టడం ఖాయం సార్! బైదిబై నేను లోపలికి వచ్చేటప్పుడు చూశాను జనరల్ మేనేజర్ రూమ్ బయట చాలా బూజు వుంది. వెంటనే అది క్లీన్ చేయించండి! ఐ డోంట్ లైక్ సచ్ ఆఫీసెస్ జెంటిల్మెన్! బైదిబై మీరడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలనే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా మీరు?"
    మార్కండేయులు ముఖంలో కోపం స్పష్టంగా కనబడుతోంది. ఆ యువతి ముఖంలో ఆసక్తి చోటు చేసుకుందప్పుడు.
    "అతను చెప్పేది నిజమేనా మిస్టర్ జగన్నాథం?" అడిగాడు మార్కండేయులు.
    "ఐ విల్ చెకప్ సర్!"
    భవానీశంకర్ చప్పున కల్పించుకున్నాడు.
    "అంటే బూజు వుందన్న విషయం కూడా ఇతనికి తెలీలేదంటే నిజంగా ఇది మోస్ట్ డిప్లోరబుల్ అండ్ డిప్రెసింగ్ సిట్యుయేషన్ మైడియర్ సర్! పైగా ప్రత్యక్షంగా కొద్ది నిముషాల క్రితమే బూజుని సొంత కళ్ళతో చూసిన మోస్ట్ ఇంటెలిజెంట్ యంగ్ మాన్ ఆఫ్ ఇండియా ఎదురుగా కూర్చుని వున్నప్పుడు బూజు చెక్ చేస్తాననడం ఆఫీస్ కే కాక మనసుకి పట్టిన బూజుని కూడా బయట పెడుతోంది."
    జగన్నాథం కోపంగా భవానీశంకర్ వైపు చూశాడు.
    "ఎస్! యూ ఆర్ కరెక్ట్!" అన్నాడు మార్కండేయులు భవానీశంకర్ వైపు అనురాగంతో చూస్తూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS