Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 2


    వెంటనే ఫోన్ తీసుకుని ఇంటికి రింగ్ చేశాడతను.
    నౌఖరు ఫోన్ అందుకున్నాడు.
    "అరేయ్! అమ్మగారిని పిలు"
    "ఏ అమ్మగారిని సార్! నెంబర్ వన్నా, నెంబర్ టూనా?"
    ఈశ్వరరావుకి కోపంతో పిచ్చెక్కిపోయింది.
    "నిన్ను బాంబులేసి చంపుతాన్రా ఇడియట్! నెంబర్ వన్ అమ్మ ఎక్కడుందిరా ఇంకా"
    "చిరాగలీ లేన్ చల్ మోహనరంగా అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్ నెంబర్ థర్టీన్ లో వుంటున్నానని మొన్న నాకు అబిడ్స్ లో కనిపించినప్పుడు చెప్పారండీ! ఆవిడ పేరిప్పుడు సావిత్రీ సింగ్ అటండి!"
    "నోర్మూసుకోరా రాస్కెల్! దాని సంగతి నీకెందుకురా అసలు? ఎప్పుడో కొంతకాలం మనతో వుంది. అంతమాత్రాన లైఫ్ లాంగ్ దానిపేరే భజన చేస్తావా?"
    "పొరబాటయిపోయింది సార్! ఇప్పుడే రెండో అమ్మగారిని పిలుస్తానండీ"
    ఈశ్వరరావుకి వాడు చెప్పిన అడ్రస్ మరింత ఎలర్జీ కలిగించింది.
    అసలు దాని విషయమే మర్చిపోతున్న టైమ్ లో వీడు మొత్తం కెలికి మనసుని మున్సిపాలిటీ వ్యాన్ చేసేశాడు.
    అతని కళ్ళముందు సావిత్రి విరగబడి నవ్వటం కనిపించింది.
    ఆ రోజు ఇంతకు తెగించింది? తను రాజేశ్వరిని సెకండ్ సెటప్ పెట్టాడన్న విషయం తెలిసి ఎంత చెలరేగిపోయింది? ఎంత భయంకరంగా ప్రవర్తించింది.
    ఎప్పుడూ లేనిది ఆ రోజు మందు కొట్టేసింది. సిగరెట్ తాగేసింది. బట్టలూడ దీసేసింది. నౌఖర్లందర్నీ బయటకు గెంటేసింది.
    తను ఇంట్లోకి అడుగుపెడుతూనే ఆమెను చూసి షాక్ తిన్నాడు.
    "ఎందుకా బోడి షాక్ లు తిన్న ఎక్స్ ప్రెషన్? ఇలా రా?" అంది మంచం మీద కూర్చుని తడబడుతున్న మాటలతో.
    "సావిత్రీ ఏమిటిది?" కోపంగా అడిగాడు తను.
    "ఏమిటేమిట్రా? లైఫ్! నీకివాళ లైఫ్ గురించి లెక్చర్ ఇవ్వదల్చుకున్నాను రా ఇటు" తూలిపోతూ అంది.
    "సావిత్రీ! నువ్వు తాగావా?" రెండో షాక్ కూడా తగిలేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు.
    "ఏమిటా వెధవ ప్రశ్న? నీ మెదడు చూడు ఏ స్టాండర్డ్ లో ఉందో. 'సావిత్రీ నువ్వు తాగావా?' అంట. ఏమిట్రా ఆ కొశ్చెన్ ఫార్మేషను? నువ్వు అమెరికాలో రెండేళ్ళు అఘోరించినా నీ పరిజ్ఞానం ఇంత దారుణంగా అఘోరించిందంటే ఇంక మిగతావాళ్ళెలా ఏడుస్తారో నాకు తెల్సిపోతోంది 'సావిత్రీ నువ్వు తాగావా' అంట. నేను తాగకపోతే తాగుడు నన్ను తాగుతుందేమిట్రా? నీయమ్మ" అంటూ మళ్ళీ విరగబడి నవ్వసాగింది.
    తను నిశ్చేష్టుడయి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. తెల్లారుజామున లేచి మడికట్టుకుని పూజలు పునస్కారాలు చేసుకుని, వంట వాళ్ళతో వంటలు చేయించి తనక్కావలసినవన్నీ సమకూర్చి తనను దేవుడిలా చూసిన సావిత్రేనా యివాళ ఇలా చేస్తోంది?
    నమ్మకం కలగటం లేదు. సావిత్రి డబుల్ యాక్షన్ చేస్తున్నట్లుంది.
    "అలా గుడ్ల గూబలా చూస్తావేంటి ఇలా దగ్గరకు రా. వస్తావా లేకపోతే నన్నే రమ్మంటావా"
    "నేనే వస్తున్నా...." కంగారుగా ఆమెకు సమీపంగా నడిచి నిలబడ్డాడు.
    "గుడ్ బోయ్! ఇలా వినాలి మాట. చేతులు కట్టుకో."
    "సావిత్రి..."
    "షటప్! మధ్యలో డైలాగులొద్దు. చేతులు కట్టుకో. వన్-టూ-త్రీ" పక్కనే వున్న విస్కీ బాటిల్ తీసి అమాంతం తన మీదకు విసిరింది.
    తను చటుక్కున పక్కకు వంగబట్టిగానీ లేకపోతే తల స్మాష్ అయిపోయేదే. భయంగా చేతులు కట్టేసుకున్నాడు. లేకపోతే ఇంకేం విసురుతుందోనన్న భయం.
    "వెరీగుడ్! ఇప్పుడు నీకు లైఫ్ గురించి లెక్చరిస్తాను. విను" అంటూ మంచం ఎక్కి నిలబడింది. అంతవరకూ ఆమె నడుముని పట్టుకుని వున్న ఆ ఒక్క చుట్టు చీర కూడా కింద పడిపోయింది.
    "సావిత్రీ...."
    "షటప్! లెక్చరిస్తున్నప్పుడు మధ్యలో గండుపిల్లి గొంతు వేసుకుని 'జావిట్రీ' అంటూ అరవకూడదు. ఇది లాస్ట్ వార్నింగ్. ఓ.కే.?"
    "ఓ.కే....ఓ.కే...."
    "ఇప్పుడు నీకు లైఫ్ గురించి లెక్చరివ్వదల్చుకున్నాను. దేన్ని గురించి?"
    "లైఫ్ గురించి"
    "వెరీ గుడ్! చాలా అటెంటివ్ గానే వున్నావు. లైఫ్ అంటే ఏమిటీ?"
    "లైఫ్ అంటే జీవితం."
    "షటప్! నేనడిగింది లైఫ్ కి తెలుగు పదం కాదు. జీవితానికి అర్థం ఏమిటి అడుగుతున్నాను"
    "జీవితం అంటే పుటక, బ్రతకటం, చావటం."
    "చూశావా నువ్వెంత దిక్కుమాలిన స్థితిలో వున్నావో. జీవితం అంటే జీవంతో వుండటం. జీవం అంటే ఏమిటో తెలుసా? అంత తెలిసేడుస్తే నువ్విలా ఎందుకుంటావు గానీ, జీవం అంటే ప్రతిక్షణం జీవకళ ఉట్టిపడేలా జీవించడం. జీవకళ అంటే జీవితాన్ని ఒక కళగా తీసుకోవటం. కళ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే కూడా చెప్పాలా?"
    తను ఏదో మాట్లాడబోయాడు గానీ గొంతు పెగల్లేదు.
    "సంస్కృతి అంటే నీకు ఏమాత్రం తెలిసుండదు. అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తుంది. లేదా ఈ జన్మలో మనిషిలా బ్రతకటం నేర్చుకుంటే వస్తుంది. కానీ నీలాగా గొడ్డులా బ్రతికితే ఎక్కడినుంచి వస్తుంది? రాదు. కనుక నీకు చెప్పినా తెలీదు. అయినా అవసరమైనంత వరకూ చెబుతాను. నువ్వు మనిషివి కనుక మనిషిలా ఉండాలంటే కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. అవి లేనప్పుడు నీకూ, జంతువుకీ తేడా వుండదు. నువ్వు ప్రస్తుతం జంతు లక్షణాలతో సంచరిస్తున్నావు కాబట్టి నీకు ఇవ్వాళ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నాను. నేనడిగే ప్రశ్నలకు సూటిగా, నికరంగా సమాధానాలు చెప్పు. సరేనా?"
    "సరే"
    "మనిషికి పెళ్ళెందుకు?"
    "సెక్స్ కోసం"
    "చూశావా! ఆఖరికి నీ బుద్ధి పొనిచ్చుకున్నావు కాదు. పెళ్ళి కేవలం సెక్స్ కోసం కాదు. పెళ్ళి ఒక ధ్యేయం కోసం. బాధ్యత కోసం. మానవజాతి మనుగడ కోసం. మనిషిని సంఘజీవిగా మార్చటం కోసం. సరే. అది అలా వదిలెయ్. ఆడదానిలో నీకేం కావాలి?"
    "కంపానియన్ షిప్"
    "చూశావా! అబద్ధాలు మొదలెట్టావ్ అబద్ధాల కోర్! దగా కోర్!"
    "నిజమే చెప్తున్నాను"
    "నువ్వు చెప్పింది నిజమేగానీ అది నీ మనసులో నుంచి వచ్చింది కాదు. ఏ పుస్తకంలో చదివింది చెప్పావు"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS