Previous Page Next Page 
ప్రతీకారం పేజి 2


    ఆమె ముఖం చూసిన జగన్నాధం ఉలిక్కిపడ్డాడు. మరుక్షణంలో శిలలా స్థంభించి నిల్చున్నాడు.
    ఆ యువతీ కూడా ఓ క్షణం నివ్వెరపోయి చూస్తూ నిల్చుంది. వెనుక నుంచి అరుపు వినిపించింది. తక్షణం కర్తవ్యం గుర్తు చేసుకున్న దానిలా గాబరాపడుతూ "జగన్నాథం! నా భర్తను రక్షించు!" అన్నది.
    జగన్నాథం చైతన్య రహితంగా, ఆ శిలల మధ్య ఓ శిలలా నిలబడి వున్నాడు. ఆమె మాటలు అతని చెవుల్లో పడలేదు.
    "జగన్నాథం! వాళ్ళు నా భర్తను చంపేస్తున్నారు" గొంతు పెగల్చుకొని వీలయినంతం గట్టిగా అరిచింది.
    జగన్నాథం ఉలకలేదు, పలకలేదు. అలాగే ఆమె ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. వెనకనుంచి ఆర్తనాదం వినిపించింది.
    "జగన్నాథం ఏమిటలా చూస్తావు? నేను రాధను? నా భర్తను వాళ్ళు చంపేస్తున్నారు. రక్షించు!" అంటూ రాధాదేవి జగన్నాథం కాళ్ళు పట్టుకుంది.
    జగన్నాథంలో గడ్డకట్టిన చైతన్యం ఆమె స్పర్శతో కరగ సాగింది. జగన్నాథం కదిలాడు. తన కాళ్ళకు చుట్టివున్న ఆమె చేతుల్ని చూశాడు. విష సర్పాలను చూసినట్టు ఉలిక్కిపడి కాళ్ళు విదిలించి దూరంగా నిల్చున్నాడు.
    "జగన్నాథం! నేను రాధను! గుర్తుపట్టలేదా? నా భర్తను రక్షించు" ఏడుస్తూ దీనంగా అర్ధించింది.
    జగన్నాథం పెదవులు కదిలాయి. కోటి సర్పాల బుసలు విన్పించాయి. కళ్ళలో కసి సుడులు తిరిగింది.
    "నేను..."
    "నువ్వు...రాధవు..." అన్నాడు వ్యంగ్యంగా జగన్నాథం.
    "ప్లీజ్! జగన్నాథం! నా భర్తను రక్షించు!"
    "హుఁ! నీ భర్త...రక్షించాలి..." కసిగా అన్నాడు.
    "జగన్నాథం! నీకు పుణ్యం వుంటుంది. నా మాంగల్యం కాపాడు. నా పసుపు, కుంకుమ నిలబెట్టు. వాళ్ళు నా భర్తను చంపేస్తున్నారు" రెండు చేతులతో జగన్నాధాన్ని పట్టుకొని ఊపుతూ ప్రాధేయపడింది.
    "మాంగల్యం...పసుపు కుంకుమ...అవును పాపం! భారత స్త్రీవికదూ? బాధ మొగుడు చస్తాడని కాదు, పసుపు కుంకుమ దూరమవుతుందని" వికటంగా నవ్వాడు. ఆ నవ్వులో కాటు వేయడానికి సిద్ధంగా వున్న కాలనాగు బుస కొట్టింది.
    రాధాదేవి భయంగా తలెత్తి చూసింది.
    జగన్నాథం కళ్ళలో కసి... పెదవులలో ప్రతీకార జ్వాల...రాధాదేవి నిలువెల్లా కంపించిపోయింది.
    "జగన్నాథం! కావాలంటే... నీ కసి తీరాలంటే నన్ను చంపు...నా భర్తను రక్షించు..." రాధాదేవి ఓపిక లేనిదానిలా జగన్నాథం కాళ్ళముందు మోకరిల్లింది.
    జగన్నాథం రెండడుగులు వెనక్కి వేశాడు. కౄరంగా అట్టహాసం చేశాడు. కొండల్లో అతని అట్టహాసం భయంకరంగా ప్రతిధ్వనించింది. చెట్లమీద పిట్టలు ఎగిరి పోతున్నాయి.
    రాధ తల పైకెత్తి రెండు చేతులూ జోడించింది. దీనాతిదీనంగా చూస్తూ. ఆమె గొంతు పెగాలటం లేదు. మాటలు ఉండలు చుట్టుకు పోతున్నాయి కంఠంలో.
    "నీ భర్తను నేను బ్రతికించాలా?" పెద్దగా పిచ్చిగా నవ్వాడు. రాధాదేవి బేలగా చూసింది.
    "నువ్వు నన్ను పదేళ్ళ క్రిందటే చంపేశావ్. చచ్చిన వాడు ఎక్కడైనా బ్రతికున్నవాడ్ని రక్షించగలడా?" మళ్ళీ నవ్వాడు.
    రాధాదేవికి జగన్నాథం కళ్ళలో నాగుపాము విషం మిలమిల లాడుతూ కన్పించింది.
    తన కాళ్ళను బలంగా విదిలించి, గిర్రున వెనక్కి తిరిగాడు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాడు.
    రాధాదేవి చివ్వున లేచి "జగన్నాథం..." అంటూ అతని వెనకే రెండడుగులు వేసింది.
    వెనకనుంచి హృదయ విదారమైన ఆర్తనాదం-ఎవరో బలవంతంగా శరీరాన్ని ప్రాణాలను లాగేస్తున్నప్పుడు, ఆ ప్రాణం శరీరాన్ని వదల్లేక వదిలిపోతూ పెట్టే గావుకేక... కొండరాయిలా వచ్చి రాధాదేవి తలమీద పడింది. రాధాదేవి కెవ్వుమని అరిచి, గిర్రున వెనక్కి తిరిగి పరిగెత్తింది.
    జగన్నాథం వెనక్కు తిరిగి చూడలేదు. క్షణంలో సగంసేపు నిలబడి, మళ్ళీ గబగబా ముందుకు సాగిపోయాడు.
    మానవుడిలో అనాదిగా ఒదిగివున్న పైశాచిక ప్రవృత్తి నగ్నంగా నర్తిస్తూ రాధాదేవికి కన్పించింది. రక్తపు మడుగులో పడివున్న భర్త శరీరంమీద విరుచుకుపడిపోయింది.

                                                2

    జగన్నాథం జీపు నడుపుతున్నాడు. ఆ స్పీడూ అతని తీరూ చూస్తూ, మూర్తి, శర్మా ప్రాణాలను ఉగ్గబట్టుకొని కూర్చున్నారు.
    "జగన్నాథం నీ ఆరోగ్యం బాగున్నట్టులేదు! నేను డ్రైవ్ చెయ్యనా?" బెదురు బెదురుగానే అడిగాడు మూర్తి.
    జగన్నాథం ఆ మాట విన్నాడో లేదో కాని జీపు మాత్రం ఒక్కసారి జర్క్ ఇచ్చి, స్పీడ్ అందుకుంది.
    శర్మ భయం భయంగా మూర్తి ముఖంలోకి చూశాడు. శర్మ ఒళ్ళు అప్పటికే చెమట్లు పట్టింది. ఏదో అనబోతున్న శర్మ "మాట్లాడవద్దు" అన్నట్టు సైగచేశాడు మూర్తి.
    "డెబ్బయ్ కిలోమీటర్ల స్పీడులో జీపు మెలికలు తిరుగుతూ ఘాట్ రోడ్డు దిగుతూంది. మలుపు తిరుగుతున్నప్పుడు జీపు గిరగిరా తిరుగుతూ లోయలలోకి పోతున్నట్టే అనిపించసాగింది. వంకర్లు తిరుగుతూ జీపుకింద సర్రున వెనక్కి జారిపోతున్న నల్లరాతి రోడ్డు, పుట్టలోకి జరజరా పాకిపోతున్న నల్లత్రాచులా వుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS