Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 2


    అతని ఆలోచన బాగానేవుందని ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరాం. మళ్ళీ ఎనిమిది గంటలకల్లా అందరం చంద్రకాంత్ ఇంటి దగ్గర ఎసెంబుల్ అయ్యాం.
    చివరకు ఎనిమిదిన్నరకు ఓ ఆటో కనిపించింది.
    అందరం పరుగుతో వెళ్ళి రోడ్డుకడ్డంగా చేతులు పట్టుకుని నిలబడ్డాం. మా చేతులమధ్య నుంచి దూరిపోవడానికి ప్రయత్నించి వెనుక కూడా ఇంకో రెండు వరుసల్లో మా కాలనీ వాళ్ళు అడ్డంగా నిలబడటం వల్ల గత్యంతరంలేక ఆపేశాడతను.
    అందరం కలసి అతనిని బ్రతిమిలాడాము. రూల్స్ ప్రకారం అతనెలాగూ ఆటో నడపడన్న విషయం మాకు తెలుసునని, కేవలం జంట నగరాల పౌరులమీద జాలితో, త్యాగ నిరతితో ఆటో నడుపుతున్నాడన్న సంగతి మేము అర్థంచేసుకున్నామని చెప్పాము. ఎలాగయితేనేం, మీటర్ మీద పదిరూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వడానికి మేమంతా అంగీకరించడంతో అందరం ఆనందంగా ఆటోని జాగ్రత్తగా కాపాడుతూ (వెనక్కి తిరిగి పారిపోకుండా) కాలనీలోకి తీసుకొచ్చాము.
    చంద్రకాంత్ భార్యను ఆడాళ్ళు అందరూ కలసి ఆటోలోకి చేర్చారు. మా మిసెస్ ఆమెను జాగ్రత్తగా పట్టుకుని కూర్చున్నాక ఆటో బయల్దేరింది.
    మేమంతా వెనుక మా కాలనీ వాళ్ళ మోపెడ్స్ మీదా, స్కూటర్లమీదా బయల్దేరాం. సరిగ్గా చాదర్ ఘాట్ బ్రిడ్జి దగ్గరకొచ్చేసరికి పోలీస్ విజిల్స్ మార్మోగిపోయినయ్. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ మా ఆటోనీ, స్కూటర్లనూ మిగతా ట్రాఫిక్ తోపాటు ఆపేశారు.
    అన్నివేపులా ట్రాఫిక్ ఆగిపోయింది.
    "ఇదేమిటి? ఎటోకటు వెళ్ళనీయాలి కదా! అన్ని సైడ్సూ ట్రాఫిక్ అలా ఆపేశారేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్ నన్ను.
    శాయిరామ్ గొంతు వినడంతోనే ఓ ఇన్ స్పెక్టర్ గట్టిగా కేకలు వేస్తూ మా మీదకు దూసుకొచ్చాడు.
    "ఏయ్? తుమ్ లోగోంకో ఆకల్ నై హైక్యా? ఖామోషీసే ఖడేహోజావ్" అన్నాడు శాయిరామ్ ని కొట్టేట్లు చూస్తూ.
    "అరే! ఎందుకాపారు అనడిగితే అంత కోపమెందుకండీ?" మొండిగా అడిగాడు శాయిరామ్. ఇన్ స్పెక్టర్ ఇంకా మండిపడిపోయాడు.
    "సైలెన్స్!" అంటూ ఫాక్టరీ సైరన్ లా అరచాడు.
    దాంతో అందరూ నిశ్శబ్దమయిపోయాం.
    ఈలోగా మా వెనుక ఎవరో ఆటోవాడు హారన్ కొట్టడంతో పిచ్చి కోపంతో అటువేపు పరుగెత్తాడతను.
    "సాలే- కోనైరే హారన్ మారేసు? షరమ్ నైహై తేరేకో? సబ్ లోగ్ ఖామోషీసే ఖడేహోజావ్!" అంటూ మరింత క్రూరంగా అరిచాడు.
    అందరం సైలెంటయిపోయాం. సెంటర్ లో వైర్ లెస్ సెట్ పట్టుకుని నిలబడ్డ మరో పోలీస్ అధికారి టైమ్ చూసుకున్నాడు.
    "ఆ టైమయింది! విజిల్ వేయండి" అంటూ అరిచాడతను నాలుగు వేపుల్నుంచీ పోలీస్ విజిల్స్ మార్మోగిపోయినయ్ మళ్ళీ.
    అంతా ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తున్నారు.
    "అమ్మా-అబ్బా-" అంటోంది ఆటోలో నొప్పులు పడుతోన్న చంద్రకాంత్ భార్య.
    ఆమె గొంతు వినడంతోనే "ఖామోష్" అంటూ భీకరంగా అరిచాడు. మా ముందు నిలబడ్డ కానిస్టేబుల్. ఇన్ స్పెక్టర్ మండిపడుతూ మా ఆటో దగ్గరకొచ్చాడు.
    "ఏయ్ ఎవళ్ళిక్కడ దిల్లగీ చేస్తున్రు" తీవ్రంగా అడిగాడు.
    "ఆమెకు నొప్పులొస్తున్నాయండీ! అందుకని అరుస్తోంది."
    "నొప్పులొస్తే దిస్ప్రెన్ టాబ్ లెట్స్ వేసుకోమనవయ్యా! అరిస్తే ఎలా?" మరో కానిస్టేబుల్ మా దగ్గరకొచ్చాడు.
    "ఆ నొప్పులు కాదండీ! ఆమెకు నెలలు నిండాయ్. డెలివరీకి హాస్పిటల్ కి తీసుకెళుతున్నాం. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మా ఆటోని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం" చెప్పాడు రంగారెడ్డి.
    ఆమాట వినడంతోనే ఇన్ స్పెక్టర్ కోపంగా రంగారెడ్డి దగ్గరకొచ్చాడు.
    "మీకేం దమాకున్నదా? రెండు నిమిషాలు మౌనంగా నిలబడనికి లొల్లిపెడతారేమయ్యా! అయినాగాని ఆమెకిదే టైమ్ దొరికిందా నొప్పులు తెచ్చుకోడానికి?"
    "కానీ ఇప్పటికి మమ్మల్ని నిలబెట్టి అయిదు నిమిషాలయింది కద్సార్" అడిగాడు శాయిరామ్.
    "ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడకండ్రి తొమ్మిదిగంటలకెల్లి తొమ్మిదీ రెండు నిమిషాల వరకూ ఖామోషీతోటుండాలె!"
    "ఎందుకు సార్! ఇటువేపు సి.ఎం.గానీ, గవర్నర్ గానీ వెళుతున్నారా?" అడిగాడు ఇంకో స్కూటర్ వాలా.
    "నిన్ననే పేపర్ల ఇచ్చినం! ఇయాళ మార్టీర్స్ డే అని సదవలే నువ్వు? తొమ్మిది గంటలకెళ్ళి తొమ్మిదీ రెండు నిమిషాల వరకూ పూరాశహార్ రుకాయిస్తదని టి.వి.లో కూడా జెప్పిన్రు. ఇనలే?" మరింత కోపంతో అన్నాడతను.
    "మార్టీర్స్ డే అంటే ఏమది?" కుతూహలంగా అడిగాడు యాదగిరి.
    ఇన్ స్పెక్టర్ కొంచెం కన్ ప్యూజయ్యాడు.
    "ఏయ్ నీయవ్వ- మార్టీర్స్ డే అంటే ఎరుకలేదువయ్యా? కైసేకైసే లోగ్ హైభయ్ యేశహర్ మే" అనేసి అక్కడనుంచి జారుకున్నాడు.
    సరిగ్గా తొమ్మిదిగంటలకు మళ్ళీ విజిల్స్ మార్మోగిపోయినయ్.
    అందరం రెండునిమిషాలు ఎప్పుడవుతుందా అని వాచీలు చూసుకోసాగాము. మా వెనుక పెరిగిపోతున్న వాహనాల హారన్స్, కేకలు, అరుపులు ఇంకా పెరుగుతూనే వున్నాయ్.
    ఆటోలో చంద్రకాంత్ భార్య వేసే కేకలు ఎక్కువయి పోతూనే వున్నాయ్. సరిగ్గా తొమ్మిదీ రెండుకీ ట్రాఫిక్ కదిలేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అప్పటికే అన్నివేపులా ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
    ఆ జామ్ నుంచి మేమూ, మా ఆటో బయటపడేసరికి పదయిపోయింది. అప్పటికే చంద్రకాంత్ భార్యకు నొప్పులెక్కువయిపోయి గట్టిగా ఏడ్చేస్తోంది.
    "ఆటో త్వరగా పోనీ" అరిచాడు శాయిరామ్.
    ఆటో డ్రైవర్ వేగం పెంచాడుగానీ మళ్ళీ గట్టిగా పోలీసులు విజిల్స్ వేస్తూ ఎక్కడి వాహనాలక్కడ ఆపేస్తూ కనిపించారు.
    లాఠీతో మావేపు దూసుకొచ్చి మా ఆటోనూ, స్కూటర్లనూ, మోపెడ్ ని రోడ్డుపక్కకు నెట్టేశాడు ఓ కానిస్టేబుల్.
    "మళ్ళీ ఏమిటిప్పుడు?" కోపంగా అడిగాడు రంగారెడ్డి ఆ కానిస్టేబుల్ ని.
    "గవర్నర్ ఓల్డ్ సిటీలో 'పౌరుల ఇక్కట్లు' అనే సదస్సు ప్రారంభోత్సవానికెళుతున్నారు. ఆ కార్లు వెళ్ళేవరకూ ట్రాఫిక్ ఆగాలి."
    "కాని ఇవతల మా ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతోందయ్యా!" ఆదుర్దాగా అన్నాడు చంద్రకాంత్.
    "కుదరదండీ! గవర్నర్ వెళ్ళేవరకూ ఎవరు కదలడానికి వీల్లేదని మా అసిస్టెంట్ కమీషనర్ గారు గట్టిగా చెప్పారు."
    "అంటే డెలివరీ కేసుల్ని కూడా ఆపేయమన్నారా?"
    "డెలివరీ ఏమిటి సార్? హార్ట్ ఎటాక్ కేసులయినా సరే! గవర్నర్ వస్తున్నారంటే నిలబడిపోవాల్సిందే!"
    "ఈ లోపల ఆ పేషంట్ హార్ట్ ఎటాక్ ఎగిరిపోతే?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS