Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 2


    జయసుధని అడిగితే చెప్పిందోసారి.
    "పెళ్ళికేం తొందరలే! కలసి కాపురం చేయటం తప్ప మిగతా అన్నిటికి భార్యా భర్తల్లాగానే ఉంటున్నాంగా?"
    ప్రతిరోజూ జయసుధ కోసం అక్కడే వెయిట్ చేస్తుంటాడతను. ఇద్దరూ స్కూటర్ మీద వెళ్ళిపోతారు... రాత్రి తొమ్మిది గంటల వరకూ విహారం చేశాక ఆమెను హాస్టల్ దగ్గర వదిలేస్తాడు.
    బస్ స్టాప్ దగ్గర నిలబడింది సావిత్రి.
    రోజూ ఆ టైమ్ కి ఆ బస్ స్టాప్ దగ్గర నిలబడే వాళ్ళల్లో తనూ ఒకర్తి. మందం అద్దాల ముసలాయనా, కూలింగ్ గ్లాస్ తోనే పుట్టిన యువకుడూ, వయసు మళ్ళినతనాన్ని కప్పిపుచ్చేందుకు తంటాలు పడే స్త్రీ... ఇద్దరు హిప్పీలూ, విపరీతమయిన శరీరపు కొలతలున్న నల్లని అమ్మాయీ, కంటిన్యూస్ గా తమిళం మాట్లాడుకునే నిలువు జుట్టూ! అడ్డజుట్టూ! వారపత్రికల్లో పరమ చెత్త నవలలు రాసే రచయితా__వాడి చెప్పే సోది వినే మరో నికృష్టపు పక్షీ, వీళ్ళందరూ తనకు బస్ స్టాప్ మేట్స్! అందులో ప్రతి ఒక్కరికి తెలుసు...సంవత్సరాలనుంచీ! అయినా ఒకరినొకరు పలుకరించుకోరు! ఎవరిదారి వాళ్ళదే.
    చాలా విచిత్రంగా ఉంటుందా విషయం తనకు.
    బహుశా పల్లెటూరికి పట్నానికి తేడా యిదేనేమో_
    బస్ వచ్చి ఆగింది__
    మామూలుగానే కిక్కిరిసిపోయి ఉంది.
    చెత్తతో నిండిపోయిన కార్పొరేషన్ లారీలా__ఆ ఇరుకులోకే దూరి అతికష్టంమీద నిలబడిందామె.
    ఫుట్ బోర్డ్ మీద ఫుట్ బోర్డ్ వెధవలు...ఆడాళ్ళను వీలయినప్పుడల్లా అంటుకోడానికి ప్రయత్నిస్తూ...
    బస్ కదిలింది.
    రోడ్డుమీద ప్రవాహంలా వెళుతున్న మిగతా వాహనాల్ని చీల్చుకుంటూ పోతోంది. అడుగడుగునా బ్రేకులేసుకుంటూ, స్టీరింగ్ తిప్పుతూ, గేర్లు మారుస్తూ...కోఠీ చేరుకుంది బస్.
    అంటే సగం ప్రయాణం పూర్తయిందన్న మాట... అక్కడినుంచి మరో బస్ ఎక్కాలి. నిజంగా ప్రపంచంలో ఇంత దిక్కుమాలిన నగరం ఇంకోటుండదేమో! ఎక్కడికెళ్ళాలన్నా రెండు మూడు బస్ లు మారాలి. ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రం పాటించని జనం, పోలీసులు, పెద్దఎత్తున సాగే రౌడీయిజం...
    మెట్లెక్కి బస్ స్టాఫ్ దగ్గరే వున్న హోటల్లోకి చేరుకుందామె.
    రోజూ ఆ సమయానికి ఆ హోటల్లో కాఫీ తాగడం కూడా తనకు తెలీకుండానే అలవాటయిపోయింది.
    సిటీలైఫ్ లో తెలీకుండానే చాలా అలవాట్లవుతుంటాయ్ అందరికీ.
    అలవాటు ప్రకారం చివరకు నడిచి కార్నర్ సీట్లో కూర్చుందామె. అక్కడ స్థలం చాలక ఒక్కటే సీటు ఏర్పాటుచేశారు హోటల్ వాళ్ళు.
    ఎందుకో తెలియదు. ఆ సీటంటే అమితమయిన ఇష్టం ఏర్పడిపోయింది.
    మొదటిరోజు ఆ సీట్లో కూర్చున్నప్పుడు తనకేమీ అనిపించలేదు. ఆ సీటుని తను అంతగా లైక్ చేసిందన్న విషయం అసలే తెలీదు.
    రెండోసారి అప్రయత్నంగా ఆ సీట్ దగ్గరకు నడుస్తున్నప్పుడు తెలిసింది. ఆరోజునుంచీ అలవాటుగా మారిపోయింది. ఎంచేతో తెలీదుగానీ అది ఎప్పుడూ ఖాళీగానే వుంటుంది. బహుశా వంటరిగా హోటల్ కొచ్చేవారు ఉండరేమో!
    కిటికీనుంచి క్రింద రోడ్డువైపు చూసిందామె.
    జనసమ్మర్ధం మరింత ఎక్కువయిపోయిందిప్పుడు...
    అతి కష్టం మీద ఒకరికొకరు తప్పించుకుంటూ నడుస్తున్నారు. స్త్రీ పురుషులూ_యువతీయువకులూ, పిల్లలు...
    ముఖ్యంగా ఆఫీస్ నుంచి ఇళ్ళకు వెళ్ళే జనం.
    వాళ్ళల్లో కూడా కొంతమందిని తను గుర్తుపడుతుంది, రోజూ చూసే ముఖాలవటం వల్ల... తెల్లగా, పాలరాతి బొమ్మలా, అద్భుతమయిన అందంతో మెరిసిపోయే అమ్మాయి, గాలిలో తేలిపోతున్నట్లు విడ్డూరంగా నడిచే రెండు జడల యువతీ, ప్రపంచంలో వున్నది తామిద్దరమే అనుకుంటున్నట్లు కబుర్ల మత్తులో తేలిపోతూ నడిచే జంటా_
    బేరర్ కాఫీ తీసుకొచ్చి ఆమె ముందుంచాడు... అతనికి తెలుసు. తన ఆర్డరివ్వనక్కరలేదు.
    తను రోజూ వచ్చి అక్కడే కూర్చోవటం, కాఫీ తాగటం...
    హోటల్ కి ఓ యువతీ యువకుల జంట వచ్చి తన ఎదురుగా వున్న సీట్లో కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం, ఎగ్జయిట్ మెంట్, బెరుకు...
    ఆమె కూర్చుంది ముందు. అతను ఓ క్షణం సంశయించి ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. ఆమె అతనికి తగలకుండా ఖాళీ ఉండేట్లు మరింత పక్కకు జరిగింది.
    బేరర్ వచ్చి నిలబడ్డాడు వాళ్ళ దగ్గర.
    "ఏం తీసుకుంటారు మీరు? అడిగాడతను.
    "మీ ఇష్టం...ఏదొకటి" అందామె.
    "మీరే చెప్పండి..."
    బేరర్ కి విసుగు పుట్టుకొచ్చింది. ఇలాంటి కేసులూ తప్పవు__ఈ విసుగూ తప్పదు_దానిని భరించకా తప్పదు.
    అతను వెళ్ళిపోయాడు.
    "మనం డిసైడ్ చేసుకునేలోగా అతను వెళ్ళిపోయాడు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS