Previous Page Next Page 
మాయ జలతారు పేజి 2


    "పోతలే మీరు పోరి"
    విడిపోయారు ముగ్గురూ
    పోచయ్య రోడ్డు దిగాడు దీపాలు లేని బాట ఈ పక్కల మురికి కాలువ ఆ పక్కన మున్సిపాలిటీ లారీలు గుమ్మరించిన చెత్తగుట్టలు, మధ్య నుంచి నడిచి పోతున్నాడు కూనిరాగాలు తీస్తూ.
    ఒక గుడిసె ముందుకు వచ్చి తడక నెట్టాడు లక్ష్మిని పిలిచాడు అనేక సార్లు పిలిచాడు కోపం వచ్చింది గట్టిగా నెట్టాడు తడకను తడక తీసుకొని ఒక బుర్ర మీసాలవాడు వచ్చాడు "మంది గుడిసెల కాడికొచ్చి మొరుగుతున్నవేమిర? పోతవా, నశదింప మంటవా?" అని ఉరిమాడు.
    "అన్న! దండం పెడ్తనే మాఫ్ చెయ్యి జరా నీలుపడ్డయా? నీ కాల్మొక్త తిట్టకు ఇగా పోతాన్న" అని వెళ్ళిపోయాడు పోచయ్య.
    "ఇగ్గోగిదె నా గుడిసె బాగచూస్త గాయిన కాబట్కె ఊరుకున్నడు ఇంకోడైతే చమ్డల్తీస్తడు" తడక్కు చూచాడు జాగ్రత్తగా సినీమాస్టారు బొమ్మ ఉంది తన ఇల్లని స్థిరపర్చుకొని లక్ష్మిని పిలిచాడు పలకలేదు.
    "నీ కాల్మొక్తనే తడక తీయవే తియ్యవ్ లే కోపమొస్తాంది ఒక్క లాతుకొడ్తే తడక ఇరుగుతది ఆఁ ఏమంటే తడక ఇరిగి పోతదని చూస్తాన్న తీయ్ తియ్యవులే" అని తన్నాడు తడక చిరిగింది డబ్బా ధడల్ మని క్రిందపడింది లక్ష్మి అదిరిపడి లేచి నుంచుంది.
    "దయ్యం పట్టినట్టు నిద్రపోతున్నావేమే ఛినాల్! పెట్టు, బువ్వ పెట్టు"
    "నూకలు తెచ్చినావా?"
    "నూకలు తేకుంటే బువ్వ పెట్టవులే నీ తల్లి " అని నెట్టాడు.
    లక్ష్మి కింద పడిపోయింది, కేక పెట్టింది.
    "చిల్లాయిస్తవులే" అని కర్ర తీసుకొని ఉరికాడు పోచయ్య.
    లక్ష్మి కేకవిని పరిగెత్తుకొని వచ్చిన బాలయ్య కర్ర చేతులోంచి లాహిపారేసి పోచయ్యను బయటికి లాక్కొచ్చాడు ఈలోగా మరో ఇద్దరు ముగ్గురు అక్కడికి చేరారు.
    "ఊరంగ తాగిండే, వీని నశ దింపాల్నంటే నీలు పొయ్యాలె నీలు తేరికుండల్తోని" అన్నాడు బాలయ్య.
    ఇద్దరు ముగ్గురు కుండల నిండా నీళ్ళు తెచ్చారు, పోచయ్యను బలవంతంగా కూర్చోపెట్టారు కుండలతో నీళ్ళుపోయడం మొదలుపెట్టారు.
    "మంటలు, మంటలు బాలయన్నా! సెయి మండిపోతుంది నీ కాల్మొక్త నిప్పులు పోయ్యకు అయ్యో వద్దనలే! గులాపోన్నయిత"
    "నోరు మూస్తవా? లాతుల్తింటవా?" అన్నాడు ఒకడు.
    నోరు మూసుకొని కూర్చున్నాడు పోచయ్య పది కుండల నీళ్ళు పోసిం తరువాత దిగింది మైకం.
    "దిగినాదిర?" అడిగాడు బాలయ్య.
    "దిగిందన్న నీ కాల్మొక్త ఊగెప్పుడు పోనే అటు నాతోడు, నీతోడు లచ్చితోడే"
    "నూకల్తేస్తనని పోయి తాగొస్తవుబే మల్ల తాగొచ్చినట్టు కనపడ్డావో పానాలుతీస్తా ఏమనుకున్నావో ఫో ఇంట్లకు ఫో" అని నెట్టి, "అనికేమే తినొచ్చుంటాడుబాగ జర బువ్వ తెచ్చి పెట్టరా దుండే పోరి ఉపాసమెట్ల పండుతుది?" అన్నాడు బాలయ్య.
    "పోరిని ఉపాసాలతో చంపేట్టున్నాడు ఉండె లచ్చి, బువ్వతెచ్చి పెట్త" అని వెళ్ళి మైసమ్మ పళ్ళెంతో అన్నం తెచ్చి ఇచ్చింది.
    "ఎందుకత్త మీకు, తక్లీపు ఇట్ల కండ్లు మూసుకుంటే అట్ల తెల్లారె"
    "గదేంది బిడ్డ? గట్లంటవు? నువ్వు మా పోర్లకు బువ్వలు పెట్తలేవా? ఆడిపిస్తలేవా? చదివిస్తలేవా? గూడెంలా ఎవ్వరికిం తొచ్చినా ఉరుకుతవుకద బువ్వ తెస్తె వద్దనొద్దుబిడ్డ రా" అని ఇంట్లోకి తీసుకెళ్ళింది, మైసమ్మ.
    బాలయ్యా వాళ్ళంతా వెళ్ళిపోయారు.
    "తినుబిడ్డ తిను" అని లక్ష్మిని కూర్చోపెట్టి పళ్ళెం ముందు పెట్టింది మైసమ్మ.
    "ఆడ పెట్టిపో అత్త, తింటలే"
    "సరే, అట్లనే పోతలే ఉపాసం పండకుబిడ్డ ఒక ముద్ద తిని పండు" అని హెచ్చరించి వెళ్ళిపోయింది, మైసమ్మ.
    అంతా వెళ్ళిపోయారు పోచయ్య చతికిల పడ్డాడు అతని నిషా దిగిపోయింది తాను దుడ్డుకర్రతో లక్ష్మిని కొట్టబోవటం, నూకల కోసం ఇచ్చిన పైకం పెట్టి త్రాగడం గుర్తుకు రావడంతో తానేదో పెద్ద నేరం చేశాననుకున్నాడు దుఃఖం పొంగి పొర్లింది మౌనంగా ఏడుస్తూ కూర్చున్నాడు గాలికి రెపరెపలాడే దీపంముందు లక్ష్మి కూర్చుంది కొంతసేపు అలా కూర్చొని లేచింది పోచయ్య దగ్గరకు వచ్చింది "లే, బుక్కెడు బువ్వ తిందం" బొంగురుపోయిన గొంతుతో అన్నది.
    పోచయ్య ఏడ్చేశాడు "లచ్చీ! నువ్వు దేవతనే! నేను సైతానును! నిన్ను కొట్టేతంద్కు లేచినయే గీ చేతులు నాకేమొ బువ్వ పెట్తనంటూ వచ్చినావు! లచ్చీ! పాపం చేసిన్నే పాపం కనికరమెందుకే నామీద నాకు బువ్వ పెట్టకు  ఇచ్చిన పైకంతో తాగొస్తే ఇంక బువ్వ పెట్తావు? పండ్త ఈ పోశ్చిగాన్ని మాడనియ్యె"
    భరించలేకపోయింది లక్ష్మి పోచయ్యమీద పడి ఏడ్చేసింది "గలానకు నువ్వేమన్న కొట్టినవా? కొట్టొచ్చినవు నల్గురు చూస్తే ఏమనుకుంటరు? లే, గుడిసెలకు పా నువ్వేం చేసినవే గా తాగుడు చేసింది నువ్వు తినంది నేను తింటానే లే ఒక్క బుక్క తిను పా -" అంటూ బ్రతిమిలాడి లోనికి తీసుకెళ్ళింది.
    "లచ్చీ! నీ మీ దొట్టు మల్ల తాగనే నిన్ను కొట్టబోయిన కాదు నా లచ్చీ! మాఫ్ చేసినవా? మాఫ్ చేసిన్నను"
    లచ్చి చిరునవ్వు నవ్వింది చెక్కిలి సొట్టబోయింది.
    ఆ నవ్వులో కరిగిపోయాడు పోచయ్య.
    దీపం గాలికి ఆరిపోయింది.
    అంధకారం అలుముకుంది ఎక్కడా వెలుగన్న మాటలేదు కుక్కలు దూరంగా ఏడుస్తున్నాయి కీచురాళ్ళ ధ్వని వినిపిస్తూంది సమయం ఎంత అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? ఇక్కడి చుక్కల భాష మనకు తెలీదు.
    
                                         *    *    *
    
    నగరానికి తలమానికం లాంటి హోటల్ నయాగరా గడియారం సంగీతం తరవాత ఒక గంట కొట్టింది నయాగరా నియోన్ లైట్ల వెలుగులో వెలిగిపోతూంది సుళ్ళు తిరుగుతూ కొండ నెక్కి వచ్చిన కారు పోర్టికోలో ఆగింది కారులోంచి దిగిన సూరి ముంజేతి గడియారం చూసుకున్నాడు 11-30 అయింది టాక్సీకి డబ్బిచ్చి హోటల్లోకి దూరాడు లోన డ్యాన్సు జరుగుతూంది మ్యూజిక్ మ్రోగుతూంది కొందరు తాగి తూలుతున్నారు కొందరు తాగి మాటల్లో పడిపోయారు అయినా, అంతా ఫ్రెంచి యువతి నృత్యం చూస్తూనే ఉన్నారు సూరి వీటిని వేటినీ పట్టించుకోలేదు మేనేజరు గదిలోకి వెళ్ళాడు "హల్లో రమోరియా!" అని విష్ చేశాడు.
    "హల్లో సూరీ! చాలా కాలానికి వచ్చావ్" అని కరస్పర్శ చేసి కూర్చోమన్నాడు రమోరియా.
    "కాకుంటే మన కేముందోయ్ ఇక్కడ? మునగడానికి వస్తామా? సరేగాని, డెయిజీ వచ్చిందా?"
    "ఏఁ! డెయిజీనే పట్టావూ! గట్టివానివే!"
    "గట్టివాణ్ణి కాకుంటే నయాగరా హోటల్లో బాయ్ నుండి సినీ డైరెక్టరుదాకా ఎలా ఎదుగుతానోయ్? కాల్చు సిగరెట్టు నిజంగా రాలేదా బిచ్?"
    సూర్యం జీవితం నయాగరా హోటల్ బాయ్  గా మొదలైంది అతనిలోని మాటల చాకచక్యం, మనిషిని ఆకట్టుకునే తెలివి నయాగరాలో రెస్టోరెంట్ సెక్షనుకు మేనేజరును చేశాయి ఆ తరువాత ప్రమోషనుతో అతనిని సిరి వరించింది సంధానకర్తగా డబ్బే కాక, పెద్ద పలుకుబడీ సంపాదించాడు సినీ రంగం భాగ్యనగరానికి అవతరించడంతో ఇతడు సినీరంగాన్ని వరించేశాడు వచ్చే సినీ పెద్దలంతా నయాగరాకె వస్తారు దాంతో అతడు సినీ మనిషై పోయాడు  తనను డైరెక్టరునని చెప్పుకోవడం, ఏదో చిత్రం పేర బోర్డు తగిలించి, అమాయకుల్ను, అమాయికులను సినిమా పేర పిండడం అతని ప్రస్తుత వృత్తి ఆ పనితోనే వచ్చాడక్కడికి ప్రస్తుతం.
    "అబద్దం చెపుతానా? అందులోనూ నీతో" ఎంత వరకొచ్చింది, సినిమా వ్యవహారం?"
    "మూడు పిక్చర్లు పెట్టాను ఒకదానికి డబ్బు లేకుండా కధ రాయించాను రెండోదానికి డబ్బులేకుండా స్టార్స్ ను ఏర్పాటు చేశాను ఇప్పుడు మూడోదాని వ్యవసాయం నీకూ ఒక వేషం ఇస్తాలేవోయ్ రాదా ఏం బిచ్? వస్తానని ప్రామిస్ కూడా చేసింది పైగా రాజారావును రమ్మన్నాను"
    "చూసిరానా వెళ్ళి?"
    "వద్దులే గాని, ఎన్నో నెంబరు గది కాళీగా ఉంది? చూడూ! వారం రోజుల్నుంచి నా కింద ఉన్నట్లు రాసెయ్యి ఫిఫ్టీ, ఫిఫ్టీ సరేనా?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS