Previous Page Next Page 
దశావతారాలు పేజి 2


    మండిపడిపోయాడు కాశీపతి...
    "యూ రాస్కెల్ ? గెటవుట్ ! ఫస్ట్ గెటవుట్ !" అని పిచ్చిగా అరుస్తూ వెళ్ళిపోయాడు...
    ఉసూరు మనిపోయింది సావిత్రికి... తను నిజంగా అతణ్ణి మంచి చేసుకోవాలనే వచ్చింది. మంచితనంతో మాట్లాడాలనే ప్రయత్నించింది. కానీ, అతని ధోరణి చూసి తను అల్లరిగా మాట్లాడకుండా ఉండలేక పోతోంది....
    పాత స్నేహితురాలు వనజ వచ్చింది. సావిత్రి కాశీపతిని పరిచయం చేసింది. వనజను చూడగానే కాశీపతి మొఖం వెలవెల పోయింది. ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు...
    "మీ వారు నాకింతకుముందే తెలుసు!" అంది వనజ.
    "ఎలా తెలుసు ?"
    "మిస్. వీణ ఇంట్లో చూసాను..."
    "మిస్. వీణ ..."
    "కొంపదీసి ఈర్ష్యపడుతున్నావా. ఆవిడ వయసు యాభై ఏళ్ళు - సైకియాట్రిస్ట్..."
    "లేడీ సైకియాట్రిస్ట్ లు కూడా ఉన్నారా ?"
    "నూతిలో కప్పలా ప్రతిదాన్నీ అలా విడ్డూరంగా తీసుకుంటావేం? నీకు పరిచయమున్నంతలో అలాంటివాళ్ళు ఉండకపోవచ్చు - కానీ అలా ఉండటం అసంభవమేమీ కాదుగా !"
    కొంచెంసేపు కూచుని వనజ వెళ్ళిపోయింది ...
    కాశీపతి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళివస్తున్నాడు. ఎందుకని? ఒక్కసారి ఆవిడ్ని కలుసుకుంటే అతని మనస్తత్వం తనకు కొంత అర్ధమవుతుందేమో!
    "నేను కాశీపతిగారి భార్యను!" అని తనను తాను పరిచయం చేసుకున్న సావిత్రిని నిర్ఘాంతపోయి చూసింది మిస్. వీణ...
    "ఏమన్నారు ?" అంది నమ్మలేనట్లు ... తను అన్నదాంట్లో అంత విడ్డూరమేమిటో సావిత్రికి అర్ధంకాలేదు...
    "కాశీపతి భార్యను." అంది ఏదో ఉందని భయపడుతూ...
    మిస్. వీణ క్షణంలో అతి మామూలుగా అయిపోయి "కూర్చోండి" అంది...
    "వృత్తిరీత్యా మీరు మీ పేషెంటు రహస్యాలు చెప్పకూడదని తెలుసు. కానీ, నేను ఆయన భార్యను. ఆయన మనస్తత్వం నాకు విచిత్రంగానే ఉంది.... ఆయన గురించి మీరు నాకు వివరంగా చెపితే, ముందు ముందు ఆయనతో జీవితంలో సర్దుకోవటానికి నాకు ఉపయోగిస్తుంది..."
    "మీరు ప్రశ్నలడగండి, నేను సమాధానాలు చెపుతాను."  
    "ఆయనలాంటి కవి ఆంధ్రదేశంలోనే లేడని అన్నారట! నిజమేనా?"
    "నిజమే !"
    "నిజమా? ఆయన కవిత్వం వ్రాస్తారా"
    "కవిత్వంలేదు. పైత్యం... అసాధారణమైన సృజనాత్మక ప్రతిభతో రోజుకొక కధ కల్పించి చెప్తోంటే, "ఇంతటి కల్పనాశక్తి మహాకవులకు కూడా ఉండదు. మీలాంటి కవి ఆంధ్రదేశంలో ఎక్కడా ఉండరు అన్నాను..."
    "కధలల్లే వాళ్ళు రచయితలు కదూ ! కవులెలా అవుతారు?"
    "ఏమో! ఏదో నోటి కొచ్చిందన్నాను అతను ఎంతటి రచయితో, అంతటి కవి. ఏమంటే మాత్రం తప్పేముందీ?"
    నవ్వేసింది సావిత్రి_
    "ఆయన అంత రసవత్తరంగా కవ్వించి చెప్పే కధలెలాంటివి?"
    "ప్రేమకధలు !"
    "ఎందుకు చెప్తున్నారు, అలా"
    "నిజ జీవితంలో తాము పొందలేనివి పొందుతున్నట్లుగా అలా కల్పించి చెప్పుకొని ఆనందిస్తాను. ఇది ఒక రకమైన మానసిక బలహీనత. కొందరిలో శ్రుతిమించి ఉంటుంది..."
    "నిజ జీవితంలో ఆయనకు ప్రేమలేదని ఎందుకనుకుంటున్నారు? ఆయన ఎవరినైన ప్రేమించి భంగపడ్డారా!"
    ఆ ప్రశ్నకు మిస్. వీణ వెంటనే సమాధానం చెప్పలేదు...
    "చెప్పండి - నేను గొడవలు పెట్టుకొని ఆయనతో విడిపోవాలని రాలేదు. ఎలాగైనా ఆయనను అర్ధం చేసుకుని ఆ మనస్తత్వంతో సర్దుకుని సంసారం చెయ్యాలనే ఆశతోనే వచ్చాను ..."
    "అదికాదు. కాశీపతి, ఫిజిషియన్ కాంతారావుగారి దగ్గర కూడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ని కూడా ఒకసారి కలుసుకోండి!"
    సావిత్రికేదో అనుమానం తోచింది. కాళ్ళు చేతులు చల్లబడినట్లయ్యాయి.
    "ఇంతగా చెప్తున్నారంటే, ఆయన ఎందుకు వైద్యం చేయించుకుంటున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి!"
    "ఆఫ్ కోర్సు! ఒక వ్యక్తిని మానసికంగా బాగుచేయాలంటే అతని శారీరక బలహీనతలు కూడా మేము తెలుసుకోవాలి!"                                              

"చెప్పండి, ఆయన జబ్బేమిటో ..."
    "జబ్బులేదు కానీ ..."
    సందేహిస్తూ కొన్ని క్షణాలాగిపోయింది మిస్. వీణ. పెదిమలు బిగబట్టి జాలిగా చూసింది సావిత్రి. ఆ ముఖం చూడలేని మిస్. వీణ చెప్పేసింది...
    "డాక్టర్ కాంతారావుగారు కాశీపతి సంసారానికి అర్హుడు కాడని అభిప్రాయపడుతున్నారు !"
    తల తిరిగింది సావిత్రికి! నేను కాశీపతి భార్యనని చెప్పగానే మిస్. వీణ ప్రకటించిన ఆశ్చర్యం అర్ధమయింది. అక్కణ్నించి లేచి వచ్చేసింది.
    తన సామానులన్నీ సర్దుకుని ప్రయాణమవుతోన్న సావిత్రిని చూసి మండిపోయాడు కాశీపతి ...
    "నన్ను బెదిరుస్తున్నావనుకోకు! నువ్వు పోయినంత మాత్రాన నాకేం నష్టంలేదు. నిన్ను మించిన రంభలాంటి దాన్ని పెళ్ళి చేసుకుంటాను..."
    చివ్వున తలెత్తి నిప్పులు కురిపిస్తూ చూసింది సావిత్రి.
    తన ఎదురుగా నిలబడ్డ ఆ వ్యక్తిని చూస్తూంటే మొదట భరింపరాని అసహ్యం కలిగింది.
    ఆ తరువాత అంతులేని చికాకు కలిగింది.
    ఆ చూపులకు బెదిరిపోయి చవటగా చూసాడు కాశీపతి. అప్పుడు సావిత్రిలో జాలే మిగిలింది.
    పాపం ఈ వ్యక్తి మానవ జీవిత మాధుర్యం నుండి వంచితుడయ్యాడు. తన దురదృష్టాన్ని ఎదుర్కోగలిగే ఆత్మస్థయిర్యం లేకపోగా, ఆత్మవంచనతో మనసును మరింత వికృతం చేసుకున్నాడు.
    "నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒకటే! నీ గుట్టు నాకు తెలిసిపోయింది." అనేస్తే కాశీపతి నిలువునా ఖూనీ అయిపోతాడు.     
    ఆ మాట అనలేదు సావిత్రి. అనలేకపోయింది. కాశీపతి మాటలతో తన నెంత బాధపెట్టినా, అతడి మనసులో ఉన్న క్షోభతో పోలిస్తే, అతని మాటలవల్ల తనకు కలుగుతున్న బాధ ఏ పాటిది?"
    అందుకే కాశీపతిని చూసి జాలిగా నవ్వింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS