Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 2

    పురోహితుడు నామాలయ్య దంపతుల చేతిలో పువ్వులు పెట్టి, దుర్గని ఆవాహన చేసి, "సంకల్పం చెప్పుకోండి" అన్నాడు. నామాలయ్య మనసు బరువెక్కింది. అతడి కోరిక ఒక్కటే. నలుగురాడపిల్లల తర్వాత పుట్టిన తన ఒక్కగానొక్క మొగబిడ్డ మామూలుగా లేచి తిరగాలని! తిరుపతి వెంకన్నకి నిలువు దోపిడీ మొక్కుకున్నాక పుట్టాడు. ఆ మొగబిడ్డ అందుకే శ్రీనివాసు అని పేరు పెట్టుకుని, అతి గారాబంగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. వాడికి మూడేళ్లు నిండాయి. చాలా చురుగ్గా ఉండేవాడు. ఒక కర్ర పుచ్చుకుని తండ్రి వెంటే తిరుగుతూ పాలేళ్ళని ఆదమాయించేవాడు. ముద్దు మాటలతో, ఆ రోజు కట్టెద్దు కేమయిందో, గట్టిగా రంకె వేస్తూ కట్టు తెంచుకుని ముందుకురికింది. కింద నిలబడ్డ శ్రీనివాసుని చటుక్కున భుజానికెత్తుకున్నాడు నామాలయ్య. కానీ ఎద్దుని తప్పుకునే కంగారులో బేలన్స్ తప్పి కిందపడ్డాడు. అయితే అప్పటికే ఒక పాలేరు నామాలయ్య చేతిలో పిల్లాడిని అందుకున్నాడు. మరొక పాలేరు ఎద్దుని గుంజకి కట్టేశాడు. శ్రీనివాసుకి దెబ్బలేం తగల్లేదు. కానీ భయంతో బిగుసుకుపోయాడు. మాట లేదు, ఏడుపు లేదు. ఏదైనా పోస్తే తాగుతాడు లేకపోతే లేదు. కళ్లు తెరుస్తాడు కానీ, ఆ చూపులు దేవినీ ఎవరినీ గుర్తించవు. మలమూత్రాలు మంచంలోనే. నామాలయ్య దంపతుల గుండె చెరువయింది. దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఆసక్తి పోయింది కానీ, నామాలయ్యకి దైవభక్తి చాలా ఎక్కువ. దుర్గాదేవి దయవల్లే తన బిడ్డ బాగుపడాలని, మరింత శ్రద్ధగా పూజలు చేయిస్తున్నాడు. పూజ జరుగుతున్నంతసేపూ దుర్గ పాదాల దగ్గిరే పక్కవేసి శ్రీనివాసుని పడుకోబెట్టేవారు. ఆ రోజు, అలాగే పడుకోబెట్టారు. శ్రీనివాసు అలా అయిపోయి, అది అయిదో రోజు.
    ఇళకి శ్రీనివాస్ పసితనం నుంచీ తెలుసు. అతడి తెలివి లేకుండా పడివుంటే చూడలేక, చెమ్మగిల్లిన కళ్ళతో అతడి తల నిమిరి, తన చేత్తో అతడి గొంతులో కొన్ని మంచినీళ్ళు పోసి, ఆ తర్వాతే పూజలో కూచుంది.
    ప్రమధపురికి నామాలయ్య ఇంచుమించు "పెద్ద" లాంటివాడు. అంచేత అతని ఇంట్లో పూజకి గ్రామంలో మూడొంతులు మంది వచ్చారు. ఆడవాళ్ళు, మొగవాళ్ళు అందరూ ఉన్నారు. కూలి జనం కూడా వచ్చారు. ప్రసాదం కోసం పూజ గది బయట వరండాలో కూచున్నారు. పూజంతా అయ్యాక అరిటాకులో ప్రసాదం బయట పెడితే, అందరికీ పంచుతాడు.
    దుర్గని తూర్పువైపుగా ప్రతిష్ఠించారు. దేవి పీఠానికి ఎదురుగా వాకిలి ఉంది. అంచేత కూలిజనం బయటినుంచి దుర్గని దర్శించుకుని నమస్కారం చేసుకోవచ్చు.
    పురోహితుడు, దుర్గపరంగా ఆవాహనమంత్రాలు చదివాక, ఇళపైన అక్షింతలు జల్లాడు. ఇళ శరీరం గగుర్పొడిచింది. కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఆ అమ్మాయి మనసు నిండా మహిషానురమర్ధని దుర్గా మాత తేజోరూపమే! తనచుట్టూ ఏం జరుగుతుందోననే ఆలోచనే రాదు ఆ పిల్లకి. అందుకే ఆ పిల్ల అంటే ఊరందరికీ ముచ్చట. పురోహితుడిగా కూడా ప్రత్యేకమైన వాత్సల్య! యోగనాధశాస్త్రి ధ్యానంలో తన్మయత్వంలో ఉన్న కూతుర్ని చూసుకుని లోలోపల గర్వంతో పొంగిపోతుంటాడు. గుళ్ళో అయినా, నామాలయ్య ఇంట్లో అయినా, ప్రధాన పురోహితుడు ఆయనే!
    "త్రిపురఘ్నీ, త్రిమాతాచత్ర్యంబకా, త్రిగుణాన్వితా, తృష్ణాచ్చేదకరీ, తృప్తా తీక్షా తీక్ష స్వరూపిణీ!"  
    వేదస్వరాల ఉనికితో మంత్రాలు చదువుతున్నారు పండితులు! ఆ మంత్రాలన్నీ ఇళ మనసులో మార్మోగుతున్నాయి. అవన్నీ తనలో ఒక భాగమైన భావన. సరిగ్గా ఆ సమయానికి నామాలయ్య ఇంటి ఆవరణలోకి వచ్చాడు చైతన్యదేవ్. అతడు ఇళకోసం యోగనాధశాస్త్రి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇళలేదని తెలిసింది. నామాలయ్య ఇంట్లో ఉందని తెలిసింది. అక్కడికి పరుగుతో వచ్చాడు. బయటినుంచే "ఇళా!" అని అరిచాడు. ఉలికిపడినట్లయింది ఇళ. అంతలో సర్దుకుని యథా ప్రకారం కళ్ళు మూసుకుంది. బయటి వరండాలో కూచున్న పాలేళ్ళలో ఒకడు, "ఆగు చిచ్చులయ్యా అట్టా అరవబోకు. అమ్మాయిగారు లోనపూజలో ఉన్నారు!" అన్నాడు. పాలేళ్ళకి, కూలి జనానికి, చైతన్యదేవ్ పేరు నోరు తిరక్క "చిచ్చులయ్యా!" అంటారు. ఊళ్ళో జనం అతడి అల్లరికి "చిచ్చూ?" అంటారు. ఇంటా బయటా అతడు "చిచ్చూ?" అయిపోయాడు.
    "డూట్!" అని తన నడ్డుగించిన పాలేరుని వెనక్కి తోసేసి లోపలికి వచ్చేశాడు చిచ్చు. "డూట్" అనేది అతడి ఊతపదం. అతడు అనుకున్నది చెయ్యక మానడు. మధ్యలో ఏ ఆటంకం వచ్చినా, ఏదీ లెక్క చెయ్యకుండా "డూట్!" అని విదిలించేస్తాడు. లోపలికి వచ్చి చుట్టూ చూశాడు. మొగవాళ్ళ మధ్య కూచున్న తండ్రిని చూసి గతుక్కుమన్నాడు. అక్కడ తండ్రి ఉంటాడని ఊహించలేదు. ఆ విషయం తెలిస్తే వచ్చేవాడు కాదు. వచ్చాక, అంత తేలిగ్గా వెనక్కి వెళ్ళలేడు. చిచ్చు గౌరవించేదీ, భయపడేదీ, తండ్రి కొక్కడికే! ఆయన ప్రమధపురిలో స్కూల్ మాస్టర్! చదివింది బి.ఏ. మాతమే అయినా, స్వయంకృషితో చాల విజ్ఞానం సంపాదించాడు వాళ్ళ చిన్న పెంకుటింట్లో ట్రంకు పెట్టెలనిండా, గూళ్ళనిండా ఎటు చూసినా పుస్తకాలే!
    ఆ పుస్తకాలన్నీ తీసి బయట పరేస్తానని ఆయన భార్య ఎప్పటికప్పుడు పోట్లాడుతుంది. ఆయన ఏమీ మాట్లాడదు. ఎంత పోట్లాడినా, భార్య తన కిష్టంలేని పని, తనకి కష్టం కలిగించే పనీ చెయ్యదని ఆయనకి తెలుసు! చాలా చిన్నతనం నుంచి క్లాసు పాఠాలతో పాటు జనరల్ బుక్స్ చదివే అలవాటు చిచ్చుకి తండ్రినుంచే వచ్చింది. పక్కనే ఉన్న శ్రీశైలం టౌన్ లో టెన్త్ చదువుతున్నాడు చిచ్చు అతని తండ్రికి, దేవుళ్ళన్నా, పూజలన్నా అంత ఇష్టం లేదు. అందుకే తండ్రి అక్కడ ఉండడనుకున్నాడు. దేవుడంటే భక్తి ఉన్నా లేకపోయినా, నామాలయ్య అంటే భయం తప్పదని తెలుసుకోగలిగినంత వయసు కాదు.
    అతడి చూపులు ఇళ మీద పడ్డాయి. ఎత్తుపీట మీద ఆ అమ్మాయి అలా కళ్ళు మూసుకు కూచోటం అతనికి నచ్చలేదు. చుట్టూ జనాన్ని చూశాడు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా జనంలోంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.
    "ఈ చీర ఎంతక్కొన్నారూ!"
    "అమ్మాయిని పురుటికి తీసుకొస్తున్నారా!"
    "రామయ్యగారి అబ్బాయి రెండో పెళ్ళి చేసుకుంటున్నాడుట?"
    "కామేశ్వరమ్మగారి అమ్మాయి పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం కాదని ఎవడో కులం తక్కువ వాణ్ని చేసుకుంటానంటోందిట! పట్నం చదువుల కెగబడితే, బుద్ధులిలాగే తగలడతాయి.
    ఆడవాళ్ళలోంచి ఈ మాటలు.
    "ఈసారి నిమ్మ పంట బాగా దిగనట్లుంది."
    "ఈ ఏడాది కూడా వానలు లేవు. మెరక పంట మీద ఆశ వదులుకోవలసిందే! చెరువులో నీళ్ళు ఎండుకు పోతున్నాయి. వ్యవసాయం వదిలేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే నయం!"
    ఇలాంటి మాటలు మొగవాళ్ళ మధ్యనుంచీ_
    కళ్ళు మూసుకుని చలనం లేకుండా ఉన్నది ప్రాణం ఉన్న ఇళాదేవి, బంగారు బొమ్మ దుర్గాదేవి, మాత్రమే ఎలాగైనా ఇళాదేవి కళ్ళు తెరిపించాలనిపించింది చిచ్చుకి. పూజ జరుగుతున్న హాలులో మొగవాళ్ళంతా ఒక వైపుకీ, ఆడవాళ్ళంతా ఒక వైపుకీ కూచున్నారు. మధ్యలో ఒక చిన్న పాప తప్పటడుగులతో నడుస్తోంది. అటూ ఇటూ చూసి, ఆ పాపకి గట్టిగా తొడపాశం పెట్టాడు చిచ్చు. కెవ్వుమంది పాప. గబుక్కున కళ్ళు మూసుకుంది. అప్పటికే చిచ్చు తండ్రివచ్చి అతడి చెవి పట్టుకుని "బయటికి నడు వెధవా! ఎవడు రమ్మన్నాడు నిన్నిక్కడికి!" అని వరండా బయటకి ఈడ్చుకుపోయాడు. నామాలయ్య కోపంతో ఎర్రగా చూశాడు. పాప తల్లికోపంతో సణుగుతూ చిచ్చుని తిట్టుకుంది. చిచ్చుని బయటవదిలి "ఇంటికి పో! మళ్ళీ లోపలికొస్తే ఊరుకోను" అనేసి తను లోపలికి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS