Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 2


    లలిత ముఖంచూసి హడలిపోయింది లలిత తల్లి జానకి. ఆవిడకు లలితంటే ఎంతో ప్రేమ.
    తనకంటే చిన్నదయినా కూతురంటే గౌరవం.
    లలిత తండ్రి వెంకట్రావు గుమస్తా. బీదరికం భరించటం కష్టమే. కానీ కేవలం బీదరికం కారణంగానే బ్రతుకులు నాశనం కావు. వీధి దీపాలకింద చదువుకుని వృద్ధిలోకి వచ్చినవారున్నారు. మేడలూ, మిద్దెలూ కూలదోసుకుని వీధుల్లో పడినవాళ్ళున్నారు.
    వెంకట్రావు స్వార్థపరుడు, పెళ్ళి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. కానీ, వాళ్ళను పైకి తీసుకురావలసిన బాధ్యత తనకుందని ఏనాడూ ఆలోచించలేదు. అన్ని వేళలా తనకి సదుపాయాలు జరగాలి. ఇంట్లోవాళ్ళు తిన్నా తినకపోయినా, తనకు కూరలు కావాలి! పెరుగు కావాలి! వీటన్నిటి కంటే భయంకరమైనది స్త్రీ వ్యసనం. ఉచ్ఛనీచాలు లేక రెండుకీ మూడుకీ లభ్యమయ్యే స్త్రీల దగ్గర సుఖాన్ని వెతుక్కుంటాడు. జానకి గొప్పింటి పిల్ల గాకపోయినా సంస్కారం గల కుటుంబంలోంచి వచ్చింది. కొద్దిగా చదువుకున్నది కావటం వల్ల పిల్లల్ని దగ్గిర పెట్టుకుని చదివించేది. మొదటినుండి ఆ సంసారం జానకికి ఎదురీతే అయింది. ఆ కుటుంబం వీధిన పడకుండా ఒక దారిన పడటానికి జానకి ఎన్ని పాట్లు పడిందో ఆ భగవంతుడికే తెలియాలి. దొడ్లో కూరగాయలు పెంచింది. అవి కూరలమ్మేవాళ్ళకు అమ్మింది. లేసులల్లి తెలిసినవాళ్ళను పట్టుకుని గొప్ప ఇళ్ళలో అమ్మించింది. ఇలా చేతనయినంత వరకు సంపాదించడానికి ప్రయత్నించేది. లలిత మెట్రిక్ పాసయ్యాక జానకి కాస్త ఊపిరి తీసుకోగలిగింది. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన లలిత తల్లికి అండగా నిలిచింది. తన ఖర్చులకి డబ్బులు చాలవని లలితని చదివించలేనన్నాడు తండ్రి. లలిత కాలేజి మానింది. కాని చదువు మానలేదు. ప్రైవేటుగా చదివి బి.ఏ. పాసయింది. యు.డి.సి. గా జాయినయింది. తమ్ముడు మోహన్ ని తనే కాలేజిలో చేర్పించి చదివించింది. భయపెట్టి బుద్ధులు చెప్పటమే కాక ప్రేమతో అడిగినది కాదనకుండా ఇచ్చే అక్కంటే మోహన్ కి కూడ భయభక్తులున్నాయి.
    తనను ఎదిరించి మాటాడే లలితంటే వెంకట్రావుకి మంట. లలిత ముందు తన క్షుద్రత్వం బయట పడుతుందేమోనని అతనేనాడూ భయపడలేదు. లలిత తనే సంకోచంతో ముడుచుకుపోయేది.
    కుటుంబం కోసం స్థయిర్యంతో నిలబడి ఇంత సాధించిన లలిత ముఖంలో ఏనాడూ చిరునవ్వు మాయమవలేదు. అలాంటి లలిత ముఖం అంతగా వడిలిపోయి కనిపించేసరికి తల్లడిల్లి పోయింది జానకి.
    "ఏం జరిగింది లలితా!" అంది ఆరాటంగా.
    లలిత నవ్వడానికి ప్రయత్నించింది.
    "ఏం జరగలేదే!"
    జానకి మాట్లాడలేదు. కళ్ళప్పగించి నిలబడింది.
    ఆ ముఖం చూస్తే అర్థమయింది లలితకి. తన ముఖంలో తన మనసు ఎంతగా ప్రతిఫలిస్తోందో.
    తన మనసు ఎందుకిలా అయిపోతోంది? లోకమంతా శూన్యమయిపోయినట్లు ఈ లోకంలో ఇంక తనది అనేదేమీ మిగలనట్లు తన జీవితానికి ఆధారమే నశించినట్లు.
    రాజుకూ తనకూ మధ్య ఉన్నది పవిత్ర ప్రేమానుబంధమనుకొంది. ప్రేమ గురించి ఎన్నెన్ని తీయని భావాలున్నాయో, ఎంతటి ఉదాత్త భావాలున్నాయో అవన్నీ తమ అనుబంధానికి ఆపాదించుకొని ఆనందించింది.
    అదంతా తన మిధ్యా కల్పన మాత్రమేనా? రాజు తనను ప్రేమించాడా? ప్రేమిస్తే అంత దారుణంగా ఎలా ప్రవర్తించగలడు? తను ప్రేమిస్తోందా రాజును?
    ప్రేమకు అర్థం చెప్పేవాళ్లు, ప్రేమించిన వ్యక్తుల సంతోషమే మన సంతోషమనుకోవటం నిజమైన ప్రేమ అంటారు. దానిని బట్టి రాగిణితో కలిసి ఉన్న రాజు సంతోషమే తన సంతోషమనుకోవాలి. అలా అనుకోగలదా! ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ నిజంగా ఉందా లోకంలో?
    ఈ అశాంతి భరించలేదు, తనను తను మరిచిపోవాలి! వీణ ముందు కూచుంది లలిత.
    మనసు ఆర్తితో తన ఆవేదనను విశ్వంలో ప్రతి ధ్వనింప చేస్తోంటే లలిత చేతులు వీణను పలికించాయి. వాతావరణమంతా మధుర విషాద తరంగాలతో నిండిపోయింది.
    లలిత వీణ ఆపగానే జానకమ్మ కన్నీళ్ళతో "అబ్బ ఏం రాగం లలితా! తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే కన్నీళ్ళు పొంగివస్తున్నాయి" అంది.
    లలిత కళ్ళలోనూ నీళ్ళే. కానీ ఆ కన్నీరు మనసు ముక్కలయిన విషాదానికి చిహ్నం కాదు. మధింపబడిన మనసు పొందే ఉద్వేగానికి చిహ్నం.
    లలిత మనసు వీణానాదంతో పెనవేసుకుని ఏ లోకాలలోనో తిరగసాగింది. తాత్కాలికంగా సర్వమూ మరిచిన ఒక విచిత్రమైన మైమరపు పొందింది.
    ఎదురింటివారి అమ్మాయి వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పింది. లేచి వెళ్ళింది లలిత.
    "హలో!" మత్తుగా ముద్దముద్దగా పలికింది రాజు కంఠం.
    గతుక్కుమంది లలిత _ తనకు తెలిసినంతలో రాజుకు తాగే అలవాటు లేదు.
    అవతలివైపు నుండి నర్వస్ గా నవ్వు...
    "తాగుబోతును కాలేదులే! ఇవాళ ఏదో మనసు చికాగ్గా ఉండి... కాస్త ఉల్లాసం కోసం..."
    లలిత మాట్లాడలేదు.
    "హలో!" అన్నాడు మళ్ళీ రాజు.
    "హలో!"
    "ఎలా ఉన్నావ్? ఇందాక నీ ముఖం చూసి ఎలా ఉన్నావో అని కంగారు పడుతున్నాను! అందుకే ఫోన్ చేసాను. జీవం లేనట్లుగా పాలిపోయావు..."
    రాజు కంఠంలో సానుభూతి ఉంది. కానీ అతడు తన అవస్థను అర్థంచేసుకుని జాలి చూపడం భరించలేక పోతోంది లలిత.
    "బాగానే ఉన్నాను"
    "అయామ్ సారీ లలితా!"
    ".........."
    "రాగిణి బాగుంటుంది 36" 28" 26" చాలా చమత్కారంగా మాట్లాడుతుంది, భలే థ్రిల్..." వినలేకపోతోంది లలిత.
    "బైదిబై, నీకు నామీద కోపం లేదుకదూ"
    "లేదు!"
    "గుడ్! మనం స్నేహంగా విడిపోవాలి!"
    నవ్వింది లలిత.
    "విడిపోయాక స్నేహం కాక మరేమిటి?"
    "అంటే?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS