Previous Page Next Page 
మంచివాడు పేజి 2

"మీ పేరు?" రిక్షాలో కూర్చుని అడిగాడు ఆ వ్యక్తి.
"రామం!"
"నా పేరు గోపాలం!" చెప్పాడు అడక్కుండానే.
దొంగలు నిజమైన పేరు చెప్పరు. వీడి పేరు గోపాలం అయి వుండదు. దొంగ వెధవ దొంగ పేరు చెప్పాడు.
"అసలే ఉక్కగా వుంటే ఆ కోటెందుకండి? తీసి పట్టుకోవచ్చుగా?" అన్నాడు గోపాలం.
"అమ్మ రాస్కెల్! జేబు కత్తిరించడానికి కోటు అడ్డంగా వుందా? నాకామాత్రం తెలివితేటలు లేవనుకోకు? నేను చస్తే కోటు విప్పను!" అనుకొని "నాకేం ఉక్కగా లేదు." అన్నాడు రామం.
గోపాలం మెడతిప్పి ప్రక్కన కూర్చుని వున్న రామం ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"ఎట్లా చూస్తున్నాడో వెధవ తన ప్లానులో పడలేదని!"
ఇద్దరూ రిక్షా దిగారు. రామం రిక్షాకు సగం చార్జీ ఇవ్వబోతే "వుంచండి" వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను" అని నవ్వుతూ రిక్షా వాడికి డబ్బు ఇచ్చాడు గోపాలం.
రామం శరీరంలో చలి కుదుపు కలిగింది. "వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడట. జేబు కొట్టేస్తానని ఎంత ధైర్యంగా చెబుతున్నాడూ?" రామం కోటు కిందగా వున్న బనీను జేబు తడిమి చూసుకున్నాడు. చేతికి ఎత్తుగా తగిలి రిలీఫ్ గా నిట్టూర్చాడు.
కౌంటర్ దగ్గిర ఇద్దరూ నిల్చున్నారు. గోపాలం ముందు నిల్చున్నాడు. టికెట్లు కొని "పదండి వెళ్దాం!" అన్నాడు.
"టికెట్?"
"నేను కొన్నాను."
"దొంగ వేషాలు! నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతో కాలంగా పరిచయం వున్నట్టు కలేసుకుంటున్నాడు. వాడి టక్కరి ఎత్తులు తనకు అర్థంకావడం లేదనుకున్నాడు."
కోటు జేబులో వేరుగా పెట్టిన డబ్బులోనుంచి లెక్క చూసి ఇచ్చేశాడు గోపాలం వద్దన్నా వినకుండా.
బండి గంట లేటని తెలిసింది. కనీసం మరో మూడు గంటలయినా స్టేషన్ లో పడి వుండాలి.
"ఇప్పటినుంచే స్టేషన్ లో ఏం చేస్తాం? రండి! టీ తాగుదాం" అంటూ గోపాలం స్టేషన్ కు ఎదురుగా వున్న బార్ లోకి దారితీశాడు. రామం అయిష్టంగానే అతన్ని అనుసరించాడు.
"ఏం సార్! ఈ మధ్య కన్పించడం లేదు?" గోపాలాన్ని బేరర్ నవ్వుతూ పలకరించాడు.
"అవును! చాలా కాలం అయింది. రెండు స్పెషల్!" అన్నాడు నవ్వుతూ.
రామం ఆలోచనలో పడ్డాడు. ఈ బేరర్ గాడు వీడూ కలిసి తనను ఏమైనా చేస్తే- ఇంతమంది మధ్య పబ్లిగ్గా ఎం చేస్తార్లే.
"సిగరెట్ కాలుస్తారా ?"
కాల్చాలని ఉన్నా "వద్దు!" అన్నాడు రామం. వీడ్నెవరు నమ్మేది! ఆ సిగరెట్ లో ఏ మత్తు పదార్థమో వున్నా వుండొచ్చు.
బేరర్ టీ తెచ్చి ఇద్దరి ముందూ పెట్టాడు.
"స్పెషల్!" అన్నాడు. వాడు నవ్వాడు. కోడ్ భాషలా వుంది. తన ముందువున్న కప్పులో తప్పక ఏదో కలిపే వుంటాడు. గోపాలం బేరర్ తో మాట్లాడుతున్నాడు. సమయం చూసి తన కప్పు గోపాలం ముందు పెట్టి రెండోది తను తీసుకున్నాడు.
"తాగండి! స్పెషల్ టీ!" నవ్వుతూ అన్నాడు గోపాలం.
తను కప్పులు మార్చింది గమనించినట్టున్నాడు. కాలాంతకుడు.
గోపాలం తన ముందు వున్న కప్పు తీసుకొని, తాగుతూ వుంటే రామం ఆశ్చర్యంగా చూశాడు.
"పెళ్ళయిందా?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS