Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 2


    "చెప్పు బాస్! నీ మాట కాదంటే ఈ గుండేరావ్ గుండుని గోడకేసి చితకగొట్టు" అన్నాడు వినయంగా.


    "రామ్ సింగ్ నోట్లోంచి నిజం కక్కించటానికి అన్ని రకాల ప్రయోగాలు వాడి శరీరంమీద నేను చేస్తాను. వాడు హిందీలో కూసేది నీకు నాకు తెలుగులో చెప్పాలి. అలాగే నేను తెలుగులో చెప్పేది హిందీలోకి మార్చి వాడికి నీవు వినిపించాలి. ఒక కోటి యాభైలక్షల విలువగల వజ్రాలను వాడు ఎక్కడ దాచాడో కక్కించి ఆ తర్వాత వాడిని చంపేద్దాము. నాకు కోటి నీకు యాభైలక్షలు సరేనా?" బాస్ నాకు ఆశ పెడుతూ అసలు విషయం చెప్పాడు.


    "యస్ బాస్!" అనేశాను.


    ఆ తర్వాత


    రామ్ సింగ్ ని సరీగా మూడురోజులు అన్ని రకాల శిక్షలకి గురిచేశాడు నా బాస్ గాడు.


    రామ్ సింగ్ చావటానికైనా సిద్ధపడ్డాడుగాని నిజం కక్కలేదు. ఇలాంటి మొండి బండగాళ్ళు కక్కుని కూడా తేలికగా కక్కరు.


    వారం తర్వాత.


    రకరకాల శిక్షలకి మా బాస్ చేతిలో గురయి రామ్ సింగ్ పంచప్రాణాలలో ఓ ప్రాణం పోగా అప్పుడు నోరు తెరిచి నిజం చెప్పాడు.


    అదైనా ఎలా అంటే!


    "ఒరేయ్ తెలివిమాలిన చచ్చు బొక్కు సన్యాసీ! చచ్చి ఏం సాధిస్తావు. ఆ వజ్రాలని ఎక్కడ దాచావో చెప్పు. నీవు నిజం చెపితే నా కుడి భుజంగా నా ముఠాలో చేర్చుకుంటాను. మనం ముగ్గురం మూడు యాభై లక్షలు చొప్పున పంచుకుందాము..." అని బాస్ గట్టిగా నమ్మ బలకటంతో__


    రామ్ సింగ్ ఆ వజ్రాలని ఎక్కడ దాచింది చెప్పేశాడు. వాడు హిందీలో చెప్పిన ఆ మాటలని నేను తెలుగులో అనువాదం చేసి మా బాస్ కి చెప్పాలి.


    కాని నేను చెప్పలేడు. బాస్ కి నేను చెపితే తప్ప తెలియదు. బాస్ ఆ వజ్రాలని మూడు భాగాలు చేశాడు. దీనికన్నా ఆ మొత్తం నేనే కొట్టేస్తే ఎలా వుంటుంది?


    నిక్షేపంగా ఉంటుంది?


    పైగా నేను కోటీశ్వరుడినవుతాను.


    బాస్ చేతిలో రామ్ సింగ్ చచ్చి వూరుకుంటాడు.


    ఆలోచన బాగానే వుంది.


    కాని__


    నాకు మరో ఆలోచన రావటంతో బాస్ చేత వాడిని చంపించలేదు. రామ్ సింగ్ నిజం చెప్పాడో లేదో నాకు తెలియదు. వెళ్ళి వాడు వజ్రాలు దాచానన్నచోట చూడాలి. వజ్రాలు వుంటే అవి నేను తెచ్చి దాచుకుని ఆ తర్వాత రామ్ సింగ్ నిజం చెప్పటంలేదు. వాడు చావనన్నా చస్తాడుటగాని నిజం చెప్పడట... పైగా మిమ్మల్ని హిందీలో బూతులు తిడుతున్నాడు...లాంటి మాటలు చెప్పానంటే_


    నా అంత బుర్రలేని నా బాస్ గాడు రామ్ సింగ్ ని ఆవేశంతో చంపి పారేస్తాడు. పీడా విరగడవుతుంది. "అరెరె ఇంకా నాలుగురోజులు చూడకుండా అప్పుడే వీడిని చంపేశారు" అంటూ నేను మొసలి కన్నీరు కార్చవచ్చు.


    బాస్ "అయ్యో తొందరపడ్డానే" అని ఏడుస్తాడు. అంతటితో పోనీయక నామీద కూడా ఓ కన్నేసి వుంచుతాడు. ఒకవేళ నేను తెలుసుకుని హిందీని తెలుగులోకి మార్చి చెప్పలేదేమో నేను రహస్యంగా వెళ్ళి తెచ్చుకుంటానేమో అని రహస్యంగా నాపై కాపు కాస్తాడు.


    ఇలాంటి వెధవ తెలివి తేటలు బాస్ కి చాలానే ఉన్నాయి.


    నేనేమన్నా పిచ్చి సన్యాసినా! ముందే వజ్రాలు తెచ్చి దాచి వుంచుతాను కనుక మళ్ళీ వజ్రాలకోసం వెళ్ళేపని చేయను. ఓ ఏడాదిదాకా బాస్ కి కలవకుండా అనుమానం రాని విధంగా ఆ వజ్రాలముఖం చూడను. రహస్య స్థలంలో అవి భద్రంగా వుంటాయి.


    ఇలా చకచక ఆలోచించిన నేను బాస్ నమ్మేవిధంగా రామ్ సింగ్ హిందీలో చెప్పిన నిజాన్ని దాచి కల్పిస్తూ వేరే మాటలు తెలుగులో చెప్పాను.


    "రేపటిదాకా టైము ఇవ్వండి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. మీరు చెప్పిన ప్రకారం హాయిగా బతికివుండి మీ కుడిభుజంగా వుండి ముగ్గురం మూడు యాభై లక్షలు పంచుకోటమా! లేక చావటానికైనా సిద్ధపడతానుగాని మీకు మాత్రం వజ్రాల సంగతి చెప్పకుండా వుండటమా! అన్నది ఆలోచించి తేల్చుకుంటాను...రేపు మీకు చెప్పే మాట మీదనే నేను నా ఆఖరిక్షణం వరకూ నిలబడతాను. చావో బతుకో" అని రామ్ సింగ్ హిందీలో చెప్పాడని ...నా బాస్ గాడికి నేను తెలుగులో చెప్పాను.


    బాస్ నేను చెప్పింది ఉత్త వెధవాయిలాగా నమ్మేశాడు.


    "సరే, వాడితో హిందీలో చెప్పు. ఇప్పుడు వాడి పంచప్రాణాలలో ఒక ప్రాణం ఎలాగూ తీసేశాను. రేపు మిగతా నాలుగు ప్రాణాలు వదలటానికి సిద్ధంగా వుండటమో వుండక బతికిపొవటమో తేల్చి చెప్పేయమను. నేను మాట తప్పే మనిషినికాను. వాడి చావో బతుకో రేపే. వజ్రాల సంగతి చెప్పకపోతే వాడి ప్రాణం తీస్తాను. వజ్రాలు దక్కకపోయినా ఫరవాలేదు" అంటూ బాస్ తెలుగులో చెప్పి ఈ మాటలు హిందీలో వాడికి వినిపించమన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS