Previous Page Next Page 
నేను పేజి 2


    లోపలకొచ్చి అన్నాలు తింటున్నాం. ఈ గాలివాన.... ఇలాంటి వాతావరణంలో జిహ్వ చాపల్యం భలే చిత్రంగా వేధిస్తూ ఉంటుంది. రకరకాల తినుబండారాల మీద కోరికలన్నీ అప్పుడే పుట్టుకొస్తూ ఉంటాయి.


    ఆ రోజు భోజనానికి క్రొత్త రుచి వచ్చినట్లుంది. ఐటెమ్స్ విషయం ఎందుకు లెండి. నిజంగా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను.       


    బయట గాలివాన జోరు తగ్గలేదు. ఆ విలయ విజృంభణకు ఎంతమంది నిరాశ్రయులుగా రూపొందుతున్నారో తెలీదు.    


    "పాపం ఆ అబ్బాయికి ఆకలేస్తుందేమో" అన్నాను.


    "అతనిక్కూడా అన్నం పెడతాను" అంది అమ్మ.


    అతని కోసం మళ్ళీ వండింది. ఆ అబ్బాయి అన్నం తింటుంటే కొంచెం దూరంలో ఎదురుగా మోకాళ్ళమీద కూర్చుని చోద్యంగా చూస్తున్నాను.


    వేడి వేడి అన్నం.... గోంగూర పచ్చడి.


    అసలతను కలుపుకుంటుంటేనే ముచ్చటేసి నోట్లో లాలాజలం ఊరుతోంది. ఆకలిగా, ఆబగా, మొహమాటం లేకుండా, బాగా ఎర్రగా కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని, ఉల్లిపాయ అడిగి మరీ వేయించుకుని నంజుకుంటూ హాయిగా తినేస్తున్నాడు. అమ్మ వండిన అన్నమంతా అయిపోతోంది. ఎంత ముచ్చటేసిందో. ఎక్కువగా తినటం కూడా ఓ కళే. తింటే అలా తినాలనిపించింది.     


    అబ్బో!  ఆ రాత్రి ఏం వర్షమని! భయంకరమైన శబ్దాలతో గాలి. నిద్రపట్టడం లేదు గాని ఆ వాతావరణాన్ని ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పవచ్చు. అది శాడిజమా? తెలీదు. ఈ గాలి వానలూ, ప్రళయాలూ, ఇంకా ఇలాంటి అపస్వరాలు కొన్ని కొన్ని జీవితానికి సహజత్వాన్ని సిద్ధింపచేస్తాయేమో?      


    ఎంతకూ నిద్రపట్టక అర్థరాత్రి రెండు గంటలప్పుడు అమ్మా, నాన్న ఉన్న గదిలోకెళ్ళాను. బెడ్ లైట్ ఉల్లిపొరలాంటి కాంతిని ప్రసరిస్తోంది. రెండు మూడడుగులు వేసి ఆగిపోయాను. వాళ్ళిద్దరూ ఒకర్నొకరు పెనవేసుకున్నారు. చిన్న కదలిక లాంటిది ఉన్నదేమో తెలీదు. కోపం, బాధ.... ఇలాంటివేమీ కలగలేదు గాని మనసు చివుక్కుమన్నట్లయింది. ఎంకా! ఒక్క క్షణం తర్వాత నవ్వొచ్చింది.     


    తర్వాత వెనక్కి తిరిగి నా గదిలోకి వెళ్ళిపోయాను.


    తల్లిదండ్రుల గురించి..... జీవితంలో ప్రతి మనిషికి ఇలాంటి సన్నివేశాలు చూడక తప్పదేమో. జాయింట్ ఫ్యామిలీస్ లో, పల్లెటూళ్ళల్లో మరి కొంచెం ఎక్కువగా బహిర్గతమవుతూ ఉంటాయి. ఈ ఊళ్ళో అనేక నిరుపేద కుటుంబాలు రోడ్లమీదే ఓ ప్రక్కగా చిన్న చిన్న పాకలు వేసుకుని కాపురముంటూ ఉండటం నాకు తెలుసు. ఒక్క వండుకోవటం మినహాయించి పడుకోవడం వగైరాలన్నీ రోడ్డుమీదే. వాళ్ళకి పిల్లలు పుట్టేయడం ఇత్యాదులన్నీ సులువుగా  జరిగిపోతూ ఉంటాయి. వాళ్లంతా 'కాపురం కార్యక్రమం' ఎలా నిర్వహించేవారో! స్వేచ్చగా కాకుండా, యాంత్రికంగా మొక్కుబడిగా ఉంటుందా! అంత అభిరుచి లేకుండా మనిషి జీవించగలడా?


    కాసేపు నా ఆలోచనలు సెక్స్ మీదకు మళ్ళాయి. వద్దనుకుంటున్నా అర్థం పర్థం లేని ప్రవాహం కొంచెం అపశృతులతోనే ప్రవహిస్తున్నాయి.


    శరీరంలో కూడా ఏవేవో స్పందనలు తెలుస్తున్నాయి.


    ఆ స్పందనలు మధురంగానే ఉన్నాయి.


    ఎందుకిలా జరుగుతోంది. నాలో ఏమైనా మార్పులొస్తున్నాయా ? కొంచెం వయసొస్తోంది. అది అర్థమవుతూనే ఉంది. శరీరంలో చిన్న చిన్న వయ్యారాలు, గట్టితనంతో కూడిన చిరుపొంగులు రూపొందుతున్నాయి. వాటిని చూసుకుని కొంచెం గర్వం, కొంచెం సిగ్గు.....   


    ఈ ఆలోచనలు నాకేమంత సుఖంగా లేవు. బయటి వాతావరణంలాగే మనసులో కూడా చిన్న తుఫాను.


    ఎప్పటికో నిద్రలోకి జారిపోయాను.


                                                                             2


    కొన్ని సంఘటనలకు ప్రత్యేకంగా ఇది అని ప్రాముఖ్యం ఉండకపోవచ్చు. కాని ఆవల హృదయ పీఠం మీద నిలిచిపోయి ఖాళీగా ఉన్నప్పుడు అర్థం లేకుండా గుర్తొస్తూ ఉంటాయి. గాలి వాన తాలూకు సన్నివేశం ఆ కోవకి చెందినవే.


    అప్పట్లో నేనమాయకంగా ఉండేదాన్ని.


    టెన్త్ క్లాస్ లో కొచ్చినా కూడా బెదురు బెదురుగానే ప్రవర్తించేదాన్ని. ఆబ్బాయిలెంత లజ్జావిహీనంగా జుగుప్సాకరంగా బిహేవ్ చేసేవాళ్ళో వాళ్ళ బూతు మాటలు, ఆడపిల్లల్ని చూస్తే అసహ్యంగా రెచ్చిపోయి వాళ్ళు చేసే వెకిలి చేష్టలూ.....


    అబ్బ! ఎంత కంపరం కలిగించేవి!


    జీవితాన్ని ప్రేమించాలని, అందులోని గొప్పతనాన్ని ఆస్వాదించాలని మనసెంత ఉవ్విళ్ళూరుతున్నా చుట్టూ క్రమ్ముకొస్తున్న ఈ సభ్య ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ జీవితం నుంచి దూరంగా పారిపోవాలనిపించేది.     


    ఆడపిల్లల ప్రవర్తన కూడా నాకు చిరాకు కలిగించేది. అబ్బాయి అంటే ఇష్టం లేనట్లు ఫోజులు పెడుతూ, లోలోపల వాళ్ళంటే పడిచస్తూ ఉండటం, అబ్బాయిల గురించి టాపిక్ వస్తే గంగవెర్రులెత్తిపోతూ ఉండటం, కొంతమందికి బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళతో తమ తమ సమర్థతలను బట్టి చాటుగానో బహిరంగంగానో తిరుగుతూ ఉండటం.... ఎవరి మట్టుకు వాళ్ళు తామే ప్రత్యేక వ్యక్తులన్నట్లు భావించుకుంటూ ఉండటం. ఎక్కడో ఎవర్నో చూసి కృత్రిమంగా అలవాటు చేసుకున్న మేనరిజమ్స్. ప్రక్క వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతూ ఉండటం. వాళ్ళ ధోరణులకు విసుగేసేది. కాని ఒక్కటి తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో విసుగు అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అంత విలువ లేదు కూడా. దాన్ని నిస్సహాయంగా భరిస్తూ ఉండాలి.


                                                                     *    *    *


    మా నాన్నగారి సంపాదనెంతో, ఆయన చేసే బిజినెస్ ఏమిటో సరిగ్గా తెలీదు. కాని ఆయన అమ్మనూ, నన్నూ చాలా గారాబంగా చూసేవారు. మమ్మల్ని సంతోషపెట్టటానికి డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆయన చాలా డైనమిక్ గా, దర్పంగా ఉండేవారు. పెదాల మీద ఎప్పుడూ చెరగని స్వచ్చతతో కూడిన చిరునవ్వు. ఎలాంటి కష్టమొచ్చినా  గుండె నిబ్బరంతో ఎదుర్కొనేవారు గాని చలించేవారు కాదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS