Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 2


    "నిజమే మమ్మీ! సారీ అమ్మా! అలా అలవాటు అయిపోయింది. "మా" అని హిందీలో అన్నా "మదర్ లేక మమ్మీ" అని ఇంగ్లీషులో అన్నా అమ్మని "అమ్మా" అని పిలవటమే కదా! కనుక మమ్మీ పిలుపులో ఏముంది చెప్పు."


    "చాల్లే! పెదవి విప్పితే కామా ఫుల్ స్టాప్ లు ఉండవు. విషయమేమిటో చెప్పు." చదువుతున్న చందమామని మూసేసి అడిగింది శారద.


    "మన బేబి సాహసయాత్ర చేస్తుందిట. హమ్మయ్య! విషయం చెప్పేశాను. ఇంక నీవు, అది చర్చించుకోండి" అని గబుక్కున చెప్పేసి చేతులు దులిపేసుకున్నాడు రాజారావు.


    శారద నిర్ఘాంతపోయింది. "ఏమిటి? సాహసయాత్రా! అదేమిటి?" అంది.


    "సాహసయాత్ర అంటే అడ్వంచర్. అడ్వంచర్ అనగా కూడా సాహసయాత్రే అనుకో మమ్మీ!" చాలా తేలికగా చెప్పింది వందన.

    
    "చాల్లే విషయం ఏమిటో వివరంగా చెప్పు. మీ నాన్నగారు ఏమీ పట్టనట్టు పేపరులో తలదూర్చారు. ఎంతయినా నీవు...ఆయన ఒకటి. ఆయన...నీవు ఒక నిర్ణయానికి రావడం... కానియ్...కానియ్" నిష్టూరంగా అంది శారద.


    తల్లికి కాస్త దగ్గరగా వచ్చి కూర్చుంది వందన.


    "అదికాదు మమ్మీ! డిగ్రీ పూర్తయింది కదా! ఏం చెయ్యాలో తోచడం లేదు. నేను...రాణి... ప్రమద...సుందర సుకుమారి...నలుగురం అటు కాశ్మీర్ దాకానో ఇటు కన్యాకుమారి దాకానో వెళ్ళి వస్తాం." చాలా తేలికగా చెప్పింది వందన.


    "ఏదీ మళ్ళీ చెప్పు." అర్థమయ్యి కానట్టు అయ్యి అడిగింది శారద.


    "మేం నలుగురం ఆడపిల్లలం. అటు పెద్దలు కాని...ఇటు పురుష పుంగవులు కాని తోడు లేకుండా అటు కాశ్మీర్ వరకో ఇటు కన్యాకుమారి దాకానో సాహసయాత్ర చేసి వస్తాం. దాదాపు మూడు నాలుగు వారాల టైము టూర్ కి తీసుకుంటాము. డాడీ డబ్బు ఇస్తామన్నారు. నీవేమో పిండి వంటలు చేసి ఇద్దువుగాని" అరటిపండు వలిచి నోటికి అందించినంత తేలికగా చెప్పింది వందన.


    "దానితోపాటు ఓ గుర్రాన్ని... ఓ గాడిదనో కూడా ఇస్తాను."


    "గాడిదలు...గుర్రాలు దేనికి శారదా?" పేపరులోంచి తలపైకి పెట్టి ఏమీ తెలీనట్టు అడిగాడు రాజారావు.


    "మగరాయుడిలా పెంచారే మీ ముద్దుల కూతురు...కాశ్మీరు యువరాణీవారు సాహసయాత్రకి ముచ్చటగా ముగ్గురు చెలికత్తెలతో కలసి బయలుదేరుతున్నారు కదా!


    "యస్...యస్" తల ఆడించాడు రాజారావు.


    "గుర్రం మీదెక్కి...గాడిద మీద సామాను వేసుకొని మీరొక కత్తిడాలు కొని ఇస్తే కత్తి జళిపిస్తూ వీరనారిలా బయల్దేరితే...ఆపై మీరే ఊహించుకోండి."


    "ఇదేదో బానే వుంది" రాజారావు అన్నాడు.


    "మమ్మీ జోక్ చెయ్యటం లేదు డాడీ! ఇది తుఫాను వచ్చేముందు వాతావరణం బహు ప్రశాంతంగా వుంటుంది చూశారా! అదన్నమాట." వందన మాటలతో క్లూ అందించింది.


    "ఐసీ! నేనింకా మీ అమ్మ దశావతారాల్లో మొదటి అవతారంలోనే వుందనుకుని..."

    
    "చాల్లేండి! మీ తండ్రీ కూతుళ్ళకి నన్ను చూస్తే చాలు వేళాకోళం, వెక్కిరింతానూ. దాన్ని మగ రాయుడిలా పెంచింది కాక 'తాన' అంటే 'తందాన' అనటం. రోజులు ఎలా వున్నాయో మీకు అక్కర్లేదు. ప్రపంచం పోకడ అసలే అక్కర్లేదు. డిగ్రీ పూర్తయింది. లక్షణంగా పెళ్ళిచేసి పంపిద్దామని లేదు" నిష్టూరంగా అంది శారద.


    "దాందేముంది! పెళ్ళిచేసి పంపిద్దాం." బజారుకి వెళ్ళి రూపాయి పెట్టి తోటకూర కొనుక్కొచ్చినంత తేలిగ్గా చెప్పాడు రాజారావు.


    "ఎంత తేలిగ్గా చెప్పారండి! పైగా సాహసయాత్ర అంటూ ఇప్పుడు ఇదొకటి. ఆడపిల్ల ఒంటరిగా తిరిగి వచ్చిందని...ఈ జన్మకి దానికి పెళ్ళవుతుందా?"


    వెంటనే అందుకుంది వందన. "నేను వంటరిగా వెళ్ళటం లేదు మమ్మీ! నాతో కలిసి మరో ముగ్గురమ్మాయిలు వున్నారు..." గుర్తు చేసింది.

    
    "ఉన్నది అమ్మాయిలే కదా!" శారద అంది.


    "అమ్మాయిలయితే ఏమిటమ్మా! మన ఊళ్ళోనే ఈ మధ్యన ఏమి జరిగిందో గుర్తుందా!"


    "గుర్తులవీ నాకు తెలియదు కాని ఏం జరిగిందో నీవే చెప్పు."


    "ఈ మహా పట్నంలో ఓ భార్యా భర్త రెండో ఆట సినిమాకి వెళ్ళి వస్తూంటే నలుగురు రౌడీ వెధవలు ఆ భర్తని పట్టుకొని నాలుగు వుతికి భార్యని లాక్కెళ్ళారా లేదా?"


    "హమ్మయ్య! ఆనాడు జరిగింది గుర్తుంది కదా! ప్రక్కన పురుషుడు వున్నా కూడా..."


    "ఆగు మమ్మీ! నీవు మరో అర్థంతో ఈ మాట అంటున్నావ్. నీవెలా అర్థం చేసుకొన్నావో నాకర్థం అయిందిలే. చెట్టంత మగాడు పక్కనే వున్నా స్త్రీకి రక్షణ లేదు. మీరు చూడబోతే ఆడపిల్లలు ఒంటరిగా అంతంత దూరాలేసి వెళితే ప్రమాదం అనే కదా" వందన అడిగింది.


    "ఆ మాట చిన్నగా అంటావేంటి? ముమ్మాటికి ప్రమాదమే. ఆడదానికి రక్షణలేని ఈ కాలంలో ఆడపిల్లలు అయిన మీరు...?"


    "ప్రమాదమన్నది రాకూడదు మమ్మీ! రావడమంటూ జరిగితే పురుషుల వల్ల పురుషులే ఇక్కట్లయిన పాట్లు కోకొల్లలు."


    "ఉదాహరణకి మన రాజకీయ నాయకులు ముఠా తగాదాలు తీసుకుందాం" అంటూ ఉత్సాహంగా రాజారావు మాట్లాడబోయాడు.


    "మీరేమీ తీసుకోవద్దు మహానుభావా! నాకు కథలు వినిపించనూ వద్దు. ఆడపిల్ల తండ్రిగా నాలుగు సంబంధాలు చూసి వాటిల్లో ఒక మంచి సంబంధం చూసి అమ్మాయి పెళ్ళి చెయ్యండి. దాన్ని కట్టుకున్నవాడు హనీమూన్ పేరుతో అన్ని ఊళ్ళు తిప్పుతాడు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS