Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 2


    "ఒరేయ్ విస్సూ! నా చెప్పులుగాని చూశావా?"
    
    "లేదత్తయ్యా! ఒట్టు" అంటూ నెత్తిమీద చెయ్యివేసుకుని వొట్టు వేసేశాడు విశ్వం. వాడి ఎడమచేతిలో జంతికవుంది. కుడిచెయ్యి అంతవరకూ క్రిందకి జారిపోతున్న లాగును పట్టుకుని వుంది. ఆ చెయ్యి నెత్తిమీదకు పోగానే లాగూ జర్రున మోకాళ్ళదాకా జారిపోయింది. వాడు నాలిక కొరుక్కుని తలమీద నుంచి చెయ్యి తీసేసి మళ్ళీ లాగూ పైకి లాగేసుకున్నాడు. అయినా గుండీలు లేకపోవటంవల్ల లాగూ యించుమించు స్థానంలో వున్నా ఉపయోగం లేకుండా వుంది.
    
    గిరిజకు నవ్వొచ్చింది ఆమెకు వాడంటే సానుభూతి వుంది. చికాకు వుంది.
    
    "నిజం చెప్పు, లేకపోతే చెవులు పిండేస్తాను" అంది.
    
    "నిజం అత్తయ్యా, కావాలంటే మళ్ళీ ఒట్టు వేస్తాను."
    
    ఇంతలో అక్కడికి చలపతి అవతరించాడు. వాడు గిరిజ రెండో అక్కయ్య రెండోకొడుకు. ఆ రెండో అక్కయ్య నాలుగో పురిటికాని మూన్నెల్లక్రితం పుట్టింటికి వచ్చింది.
    
    "వాడి మాటలు నమ్మకు పిన్నీ! ఇందాక విస్సిగాడు ఆ చెప్పులు తొడుక్కుని ఇల్లంతా కలయతిరుగుతూంటే చూశా తాతగారొస్తున్నారని గబుక్కున తీసేసి కిటికీలోకి విసిరేశాడు. ఏరా విసరలేదూ?"
    
    "నేనేం విసరలేదు" అన్నాడు విశ్వం ధీమాగా అని మళ్ళీ అంతలో పిచ్చి నవ్వు నవ్వేశాడు.
    
    "అబద్దం పిన్నీ! కావాలంటే అవతల పడిపోయి వుంటుంది. వుండు తీసుకొస్తా" అంటూ చలపతి గబగబా వసారాలో గదిపక్కగా వున్న ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు.
    
    విశ్వం నిర్లక్ష్యంగా ఓ వెర్రినవ్వు నవ్వి జంతిక నోట్లోపెట్టాడు.
    
    చలపతి ఖాళీస్థలంలో వెదికి మట్టి కొట్టుకువున్న చెప్పును విజయగర్వంతో లోపలకు తీసుకొచ్చాడు.
    
    గిరిజకు విశ్వంమీద నిజంగా కోపమొచ్చింది. "అబద్దాలాడతావుట్రా వెధవా" అంటూ దగ్గరకి వెళ్ళి చెయ్యెత్తింది.
    
    బెదిరించటానికే ఎత్తిందో, ఆ దెబ్బ నిజంగానే పడేదో తెలీదుగాని యింతలో లోపల్నుంచి విశ్వం తల్లి సుభద్ర "ఏమిటి! మా పిల్లవాడ్ని అమాయకుడ్ని చేసి చెండుకు తింటున్నావ్? ఆగిపోయావేం తల్లీ... వాడ్ని చిత్రహింస చేసెయ్యి" అంటూ వచ్చేసింది.
    
    గిరిజ సిగ్గుపడిపోయింది. 'రోజూ కాలేజీకి వెళ్ళటం వీడివల్ల ఆలస్యమైపోతోంది వదినా! నీకు తెలీదు ఎంత యిబ్బంది పడిపోతున్నానో" అన్నది.
    
    "నిజమే ఈ దరిద్రగొట్టు వెధవవల్ల అన్నీ అరిష్టాలే, అందరకూ ఇబ్బందులూ అందుకే ఎవరిజోలికి వెళ్ళవద్దంటాను వింటాడుకాదు" అంటూ సుభద్ర కొడుకుని రెక్కపుచ్చుకుని ఇవతలకు లాగి వీపుమీద రెండు చరిచి లోపలకు బరబరా లాక్కుపోయింది. అక్కడుంటే అపనింద తనమీద పడుతుందన్న భయంతో గిరిజ గుడ్లప్పగించి ఎదురుగా కనిపిస్తున్న గొడవకేసి తెల్లబోయి చూస్తూ నిలబడిపోయింది.
    
    "ఏం బేబీ! అలా నిలబడిపోయావు? కాలేజీ టైం కాలేదా?"
    
    గిరిజ ఉలిక్కిపడి గుమ్మంలో నిలబడివున్న సామ్రాజ్యంతో "అయింది వదినా! ఏదో ఓ గొడవ జరగకుండా వెడితే నాకు వెల్తిగా వుంటుందని..." అంటూ బలవంతంగా నవ్వింది.
    
    "ఈవేళ ఏం కనిపించలేదు? చెప్పులా? అరె! ఇది బురద కొట్టుకుపోయి వుందే పాతగుడ్డ తెచ్చి తుడుస్తానుండు" అని సామ్రాజ్యం లోపలకు వెళ్ళబోయింది.
    
    "నువ్వు తిరగకు వదినా! నీకసలే వంట్లో బాగుండలేదు" అని గిరిజ పుస్తకాలు కిటికీలో పెట్టి తనే లోపలకు వెళ్ళింది. పాతగుడ్డతో తిరిగొచ్చేసరికి సామ్రాజ్యం గుమ్మానికానుకుని యింకా నిలబడేవుంది.
    
    "నువ్వెళ్ళి పడుకో వదినా! నీకసలే వంట్లో బాగుండలేదు" అంది గిరిజ నేలమీద కూర్చుని తనచెప్పుని శుభ్రం చేసుకుంటూ.
    
    "ఫర్వాలేదులే బేబీ! నాకే ఆశ్చర్యంగా వుంది. యీవేళ కొంచెం నడవగలుగుతున్నాను. లేవలేనప్పుడు నెలల తరబడి విశ్రాంతి తీసుకుంటూనే వుంటాను. ఎవరు విసుక్కున్నా, అసహ్యించుకున్నా మంచంమీదనుంచి లేవనే లేవనుగా."
    
    గిరిజ తలయెత్తి ఆమె ముఖంలోకి చూసి, అందులో తన కలవాటైన భావాలనే మళ్ళీ మళ్ళీ చదువుతూ" అలా మాట్లాడకు వదినా! నాకు భయంగా వుంటుంది" అన్నది.
    
    "మాటలకే భయపడిపోయేదానివి డాక్టరివెలా అవుదామనుకున్నావు బేబీ?"
    
    పి.యు.సి. చదివేప్పుడు గిరిజ డాక్టరు చదవాలని చాలా ఉబలాటపడింది. కష్టపడి చదివింది. మార్కులుకూడా బాగానేవచ్చాయి. తల్లిదండ్రుల యిష్టానికి వ్యతిరేకంగానే ఎమ్.బి.బి.యస్. కోర్సుకు ఎప్లయి చేసింది. అప్పటికింకా ఎంట్రెన్స్ పరీక్షా పద్దతి మొదలుకాలేదు. ఎందువల్లనో ఆమెకు సీటురాలేదు. మెడిసిన్ చదివేద్దామని గంపెడాశ పెట్టుకు కూర్చున్న గిరిజ హతాశురాలై పోయింది. పది రోజులపాటు ఆమెకు నిద్రపట్టలేదు. చివరకు గత్యంతరం లేక బి.ఏ. లో చేరింది.
    
    "అది వేరు, యిది వేరు వదినా! కాకపోయినా, డాక్టరుకి మాత్రం బాధలూ, భయాలూ వుండవని అనుకోకు" అని గిరిజ లేచి నిలబడి కాళ్ళకి జోళ్ళు తొడిగేసుకుంది.
    
    "టాటా వదినా! బాగానే వుందంటున్నావు కాబట్టి యివేళ అన్నయ్యతో నువ్వు సినిమాకి వెళ్ళాలి" అని గిరిజ సామ్రాజ్యం బుగ్గమీద చిన్నచిటిక వేసి కిటికీలోంచి పుస్తకాలు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది.
    
    ఇంట్లో అందరూ గిరిజను బేబి అని పిలుస్తారు. అందరిలోకి ఆఖరి సంతానం కావటంవల్లనో ఏమో చిన్నప్పటినుంచీ ఆ పేరామెకు స్థిరపడి పోయింది.
    
    గిరిజ వెళ్ళిపోయాక సామ్రాజ్యం గుమ్మానికానుకుని చాలాసేపు అలానే నిలబడిపోయింది. 'ఇవేళ నువ్వు అన్నయ్యతో సినిమాకి వెళ్ళాలి' ఈ మాటలే ఆమెచెవుల్లో మార్మోగుతున్నాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS