Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 2


    అవన్నీ వజ్రపురాళ్ళు... ఆ తరువాత కొన్ని ఎకరాల మందం వజ్రాలగని వ్యాపించి వున్నట్లు గమనించాడా ఆసామి.

 

    వెంటనే అతనికో ఆలోచన వచ్చి వడివడిగా హఫీద్ ఇంటికెళ్ళి విచారించగా పొలం, ఇల్లు అమ్మేసి ఎప్పుడో దేశాటనకు వెళ్ళినట్లు, అతని కుటుంబం పేదరికాన్ని, ఆకలిని భరించలేక బ్రతుకు దెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోయిందని తెలిసి బాధపడ్డాడు.

 

    ప్రస్తుతానికి ఆ పొలం తనదే అయినా అందులో దొరికిన వజ్రాల్లో సగం హఫీద్ కివ్వాలని వచ్చాడా ఆసామి. తన కోరిక నెరవేరక పోవడంతో నిరాశగా వెనుదిరిగాడా ఆసామి.

 

    So money can be made by anybody with the will to make it.

 

    హఫీద్ చనిపోయి రెండు శతాబ్ధాలయింది ఇప్పటికి.

 

    కాని మనదేశంలో చాలామంది ఇప్పటికీ హఫీద్ మార్గాన్నే అనుసరిస్తున్నారు.

 

    డబ్బు వేటలో పల్లెల నుంచి నగరాలకి, నగరాల నుండి గల్ఫ్ దేశాలకి, ఐరోపా దేశాలకి వలస వెళుతూనే వున్నారు లక్ష్మీ కటాక్షాన్ని వెతుక్కుంటూ.

 

    దూరపు కొండల మధ్య కనిపించే బంగారు ఇసుకతిన్నెలు ఆకర్షిస్తుంటే చూపులు ఆకాశంలోకి సారించి, దేశాన్ని వదిలి అందనంత దూరం వెళ్ళిపోతూనే వున్నారు.

 

    దూరపుకొండలున్ నునుపని కొంత కాలాన్ని, ధనాన్ని వెచ్చించి తీరా వెళితే ఏ కొద్దిమందికో నునుపు కొండల దొరకగా, ఎక్కువమందికి గరుగ్గా వున్న కర్కశమైన కొండలు తగలుతున్నాయి.

 

    ఆ కాలాన్ని, ధనాన్ని వెచ్చిస్తే ఈలోపు ఇక్కడే, మనదేశంలో మనకు దగ్గరగా కనిపించే గరుకు కొండల్ని సానబట్టి నునుపుగా తీసుకురావచ్చు.


                              *    *    *    *


    నా జీవితం పైస్థాయిలో ప్రారంభమై ఆ స్థాయిలోనే అక్కడే వుండిపోవడం కన్నా, క్రిందిస్థాయిలో ప్రారంభమై క్రమంగా నాకై నేను పేర్చుకున్న మెట్లపైనుంచి పై స్థాయికి వెళ్ళి అక్కడితోనే ఆగిపోక ఆకాశాన్నే నా హద్దు చేసుకొని జీవితాంతం ఎక్కుతూనే వుండాలని కోరుకుంటాను. ఎక్కుతూ ఎదుగుతూ, ఎదుగుతూ ఎక్కడం నా ధ్యేయం కావాలి.

 

    తాత ముత్తాతల, తల్లిదండ్రుల ఇమేజ్ ని, సంపదను ఆసరా చేసుకొని ప్రారంభంలోనే పైస్థాయిలో వుండడంలో లభించే తృప్తికన్నా ఏ ఆశా నా ముందు లేక, ఏ సంపదా నా వెనుకలేక, ఎవరి ఇమేజ్ నాపై లేక క్రమంగా ఎదిగి ఎక్కిన స్థాయిలో లభించే తృప్తి నాకు చాలా గొప్పది.


                              *    *    *    *


    డెట్రాయిట్ నగరం.

 

    మిచిగాన్ రాష్ట్రం.

 

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా...

 

    ఆ రెస్టారెంట్ నిజంగానే ఈడెన్ లా వుంటుంది. ఓ మూలగా వున్న టేబుల్ దగ్గర ముగ్గురు యువతులు కూచుని సరదాగా మాట్లాడుకుంటూ టమాటో సూప్ సేవిస్తున్నారు మెల్లమెల్లగా.

 

    అందులో ఇద్దరు అమెరికన్స్ అయితే... మూడవ యువతీ ఇండియన్.

 

    ముగ్గురూ కంచిపట్టుచీరల్లో వుండటంతో ఆ రెస్టారెంట్ లో వున్న మిగతావాళ్ళంతా వాళ్ళను చూస్తూనే ఆశ్చర్యపోతున్నారు.

 

    నాయకి...

 

    ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ఇప్పుడు ఇండియా తిరిగి వెళ్ళే మూడ్ లో వుంది. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ వుండిపోయిన ఆమె మెల్లగా కళ్ళు తెరిచి కిటికీలోంచి బయటకు చూపులు సారించింది.

 

    నగర దక్షిణవేపు సూర్యాస్తమయం జరుగుతోంది.

 

    మిచిగాన్ ఆ సమయాన రక్తపు వరదలో ముంచినట్టుగా వుంది.

 

    వరుసగా బారులు తీరిన కార్లు...

 

    రహదారుల్ని పట్టపగలే అన్న భ్రమలో ముంచుతున్న పవర్ ఫుల్ హాలోజెన్ లాంప్స్... చటుక్కున తలతిప్పి తన స్నేహితురాళ్ళ వేపు చూసింది.

 

    అందులో ఒకామె క్రిస్టినీ...

 

    ఆమె ఎర్రటి పెదాల మధ్య ఇప్పుడు మార్ల్ బోరో సిగరెట్ వుండుండి తమాషాగా కదులుతోంది.

 

    "యూ..." అంటూ చిరుకోపాన్ని, నవ్వును మిళితం చేసి క్రీస్టినీ వేపు చూసింది.

 

    క్రీస్టినీ "సారీ..." అంటూ సిగరెట్ ని యాష్ ట్రేలో వేసింది.

 

    నాయకి వెంటనే పెప్సీకోలా టిన్ ని ఆ యాష్ ట్రేలోకి వంపింది.

 

    "నా...యకి... తిరిగి ఎప్పుడు కలుస్తాం మనం...?" మాంటే బాధగా అడిగింది.

 

    వారి మధ్య సంభాషణ ఇంగ్లీష్ లోనే నడుస్తోంది.

 

    నాయకి అందంగా నవ్వింది.

 

    "నాలుగు సంవత్సరాలుగా మనం ఫ్రెండ్స్ - ఇంతవరకు నా పేరును విరవకుండా అనటం రాలేదు - నీ నాలికను ఒకింత చెక్కుదామని ఎప్పుడో చెప్పాను మాంటే! కానీ నువ్వు వినటం లేదు"

 

    క్రీస్టినీ తమాషాగా నవ్వింది.

 

    "టిక్కెట్ కన ఫర్మయిందా?" మాంటే తిరిగి ప్రశ్నించింది.

 

    "నువ్వు మన ఎడబాటుకు బాగా ఫీలవుతున్నావని గ్రహించాను మాంటే డార్లింగ్. కాని ఎలా...? నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి గదా?"

 

    "యూ మీన్ మ్యేరేజ్... ఇక్కడే చేసుకుంటేపోలా? నేను చూడనా పెళ్ళికొడుకుని?" క్రీస్టినీ ఉత్సాహంగా అంది.

 

    "నేను నలుపు... మీరు తెలుపు... మీ పెళ్ళి కొడుకులు తెలుపు... చూడు మీ పక్కన నేను ఎలా తేలిపోతున్నానో..."

 

    "అదా నీ బాధ... కాంప్లెక్షన్ ఎవరిక్కావాలి? ఆకర్షణ ముఖ్యం. ఛార్మింగ్ హెల్దీ అండ్ లవ్ లీ బాడీ కావాలి. అంతెందుకు నువ్వు వూ... అను నేను ఒక మంచి అమెరికన్ యువకుడ్ని... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెలర్ ని చూస్తాను" మాంటేకి ఎలాగయినా నాయకిని అమెరికాలోనే వుంచెయ్యాలని ఆశ.

 

    "మీరేం అనుకోనంటే నాకో సెంటి మెంట్ వుంది. చెప్పనా?"

 

    ఇద్దరూ తలలూపారు.

 

    "నా భర్త ఇండియనే కావాలి. దట్ టూ తెలుగువాడు కావాలి... ఇందులో నేను రాజీపడను. ఈ విషయంలో నా అభిరుచులు, నమ్మకాలు నాకున్నాయ్. సారీ... ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దు" నాయకి స్థిరంగా అంది. ఇద్దరూ నాయకి కేసి, ఆమె కళ్ళకేసి చూసారు.

 

    "నీవెంత స్థిరమైన అభిప్రాయాలు...? కాలిక్యులేటెడ్ గా, కొన్ని విషయాల పట్ల ఎంతో పట్టుదలగా వ్యవహరిస్తావు. నీ జీవితాన్ని నీకై చాలా గొప్పగా మలుచుకోగలిగావు. క్రమశిక్షణతో, మనోధైర్యంతో ముందుకు సాగాలనుకుంటున్న నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను, నీలాంటి ఫ్రెండ్ మాకు దొరికినందుకు ఆనందంగాను వుంటుంది.

 

    నిన్ను చూస్తే అనిపిస్తుంటుంది- ఇతరుల మెప్పుకోసం, ఇతరుల ఆశలు తీర్చటం కోసం బ్రతగ్గూడదని- జీవితాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు మలుచుకోవాలని" క్రీస్టినీ కళ్ళవెంట తడి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS