Previous Page Next Page 
ఆలింగనం పేజి 2


    నాన్నకి చిన్నక్కంటే ఇష్టం! నన్నూ బాగా చదివించాలని ఆయన ఉబలాటం. తన గుమాస్తాగిరీతో ముగ్గురు ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలనే ఆశ గగనకుసుమమే అని ఆయనకు తెలుసు.

 

    కనీసం మా కాళ్ళమీద మేము నిలబడాలని ఆయన కోరిక. కానీ అప్పట్లో ఇంత అర్థం అయ్యేది కాదు! పెద్దక్కలా పాటలు పాడుకుంటూ లాంతర్లు తుడుచుకుంటూ ఇంటిపట్టున ఉండాలనిపించేది!

 

    అమ్మ ఒకప్పుడు ఆరోగ్యంగా అందంగా, చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదిట! పెద్దమ్మలు కలిసినప్పుడు చెప్తారు. తెగ సాహిత్యం చదివేదిట. శరత్ చంద్ర ప్రభావంలోపడి పెద్దక్కకి సరయూ, చిన్నక్కకి కాళిందీ, నాకు ఆముక్తా అని పేరు పెట్టిందట.

 

    ఆమెకి ఓ జాజి పిందెల నెక్లెస్ ఉండేది కాబోలు! అది పెట్టుకుని ఎర్రపట్టుచీర కట్టుకుని సినిమాల్లోలా ఎత్తుగా కొప్పువేసుకుని దానిచుట్టూ మల్లె మొగ్గలు పెట్టుకొని తీయించుకున్న ఫోటో ఒకటి ఫ్రేమ్ లో వుంది. అది చూస్తుంటే స్త్రీ జీవితం ఎక్కడ మొదలయి ఎలా అంతం అవుతుందో తెలిసినట్లవుతుంది!

 

    మాసిపోయి, డాగులు పడిన చీరలో వేలి ముడితప్ప వాలుజడ ఎరగని తలతో, బలహీనంగావున్న ఈ స్త్రీ ఆమేనా అని అనుమానం కలగకమానదు!

 

    బాహ్యరూపం మార్పుచెందడం సరే... కానీ శరత్ సాహిత్యం చదివి ఊహల్లో తేలిపోయిన ఆ భావుకత్వం... ఆ ఆశల మాటేమిటి? అవన్నీ కూడా వంటింటి కిటికీలోనుండి చూస్తే కనబడే కొంగల బార్లా ఆమెని వదిలి ఎప్పుడో వలసపోయాయి. వాటి రాకకోసం మినుకు మినుకుమని మెరిసే కళ్ళతో ఆమె కిటికీ వూచలు పట్టుకుని ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

    ఓనాడు శివ స్నేహితులు ఏం చేశారో తెలీదు కానీ డేవిడ్ సార్ సైకిల్ మాయమయింది!

 

    ఆయన ఇంటిముందు పెట్టి నన్ను పిలవడానికి లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేలోగా మాయం అయింది.

 

    గుండెలు బాదుకుని అరిచి పోలీసు కంప్లైంటు ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్ళాడు.

 

    ఈలోగా ఎవరో తెచ్చి "చింతచెట్టు దగ్గర దొరికిందని" మా ఇంటి ఎదురుగా పడేసిపోయారు. కొన్ని పార్టులు పోయి అస్థిపంజరంలా మిగిలింది!

 

    డేవిడ్ సార్ సైకిల్ పార్టులు దొంగిలించిన వాళ్ళని బండబూతులు తిట్టుకుంటూ పోయాడు. సైకిల్ రిపేర్ కి ఇవ్వడం వలన కొన్ని రోజులు ప్రైవేట్ కి రాలేదు.

 

    శివని మర్నాడు "నువ్వేకదా సైకిల్ కి ఆ గతి పట్టించింది?" అని అడిగాను.

 

    గొప్ప విలాసంగా నవ్వాడు.

 

    "ఇప్పుడే ఏవుంది? ఇంకా ముందు ముందు చూస్తావు" అన్నాడు.

 

    "ఇట్లాంటి అల్లరి పనులు ఎందుకు చేస్తున్నావు?" అన్నాను.

 

    "ఇదిగో ఇవిపట్టుకో!" అని తన పుస్తకాలు నాచేతికిచ్చి జేబులోంచి దువ్వెనతీసి తలదువ్వుకుని "స్కూల్లో కూడా ఎవరైనా ఏవైనా అంటే నాతో చెప్పు!" అన్నాడు.

 

    "ఆ మూల బెంచీలో కూర్చునే మీనాక్షి ఎప్పుడూ పిళ్ళికళ్ళపిల్లా మ్యావ్ మ్యావ్ అంటూ నన్ను ఏడిపిస్తుంటుంది!" ఏడుపు గొంతుతో అన్నాను.

 

    "ఛీ... ఆడపిల్లల సంగతి కాదు!" అని నా చేతిలోంచి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు.

 

    ఎనిమిదో క్లాసులోకి రావడం కాదుగానీ అమ్మ ప్రతిరోజూ స్కూల్ నుండి రాగానే నా బట్టలని తనిఖీ చేసేది. ఆమే కళ్ళు నన్ను అనుమానంగా చూస్తుండేవి. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు తువ్వాలు కావాల్సి వచ్చో, నీళ్ళు అవసరం అయ్యో "అమ్మా" అన్నానంటే చాలు. భయంగా "ఏం జరిగిందీ తల్లీ... చెప్పిచావు" అంటూ హడావుడిగా పరిగెత్తుకొచ్చేది.

 

    ఆమె భయపడినంతా జరిగింది ఓనాడు. కానీ అదేవిటో తెలియక స్కూల్ కి వెళ్ళిపోయాను.

 

    ప్రేయర్ జరుగుతుండగా, వెనకాల నిలబడిన సుబ్బలక్ష్మి గమనించి నా చెవిలో గుసగుసగా "ముక్తా... నువ్వు పెద్దమనిషి అయ్యావు!" అంది.

 

    నేను నన్ను చూసుకున్నాను. హైట్ మామూలుగానే వుంది. "నీ మొహం! అంతే ఉన్నాను" అన్నాను.

 

    సుబ్బలక్ష్మి తల కొట్టుకుని "ఉండు... ప్రమీలా టీచర్ తో చెప్తాను" అంది. ఆ తర్వాత క్లాసులోకి నన్ను రానివ్వకుండా టాయ్ లెట్స్ దగ్గర నిలబెట్టి టీచర్ ని పిలుచుకువచ్చింది.

 

    "ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదా?" అంది ఆవిడ.

 

    "నాకు తెలీదు!" అన్నాను.

 

    ఆవిడ హెడ్ మాస్టర్ రూంలోకివెళ్ళి ఏం చెప్పిందోగానీ నన్ను రిక్షాలో సుబ్బలక్ష్మిని తోడిచ్చి ఇంటికి పంపించింది. దారిపొడుగునా సుబ్బలక్ష్మి తన సమర్త పేరంటం గురించి చెప్తూనే వుంది.

 

    "అమ్మమ్మా వాళ్ళు కంచి పట్టులంగా ఓణీ తెస్తారు. మామయ్య గొలుసు చేయించాడు. నాన్నగారు ఫోటోగ్రాఫర్ ని ఇంటికి పిలిపించాడు. పూలజడవేసి అద్దం ముందు నిలబెట్టి ఫోటోలు తీశారు.

 

    ఇంతింత... చిమ్మిరి ఉండలుజేసి పంచిపెడ్తారు. పేరంటాళ్ళు ఎవరూ ఉత్తి చేతులతోరారు... జాకెట్టు బట్టలూ, స్వీటు ప్యాకెట్లూ, స్టీలు సామాన్లూ ఏదో ఒకటి పట్టుకొస్తారు. బంతిరోజు అట్లుపోసి అందరికి భోజనాలు పెడ్తారు!" అంది.

 

    "ఇది ఇంత ఘనకార్యమా! నాకు తెలీకుండానే చేసేశానే!" అని చాలా గొప్పగా ఫీలయ్యాను. ఎక్కువగా మాట్లాడకుండా తలవంచుకుని కూర్చున్నాను.

 

    నేను రిక్షాలో రావడం చూడగానే అరుగుమీద వడియాలు పెడ్తున్న అమ్మ కంగారుగా పరిగెత్తుకొచ్చి "ఏమైందీ? ఒంట్లో బావుంది కదా!" అంది.

 

    సుబ్బలక్ష్మి ఆరిందలా "మరేమో మన ఆముక్త పెద్దమనిషి..." అంటూ వుంటే, అమ్మ దానినోరు తనచేత్తో ఠక్కున మూసి నన్నూ, దాన్నీ ఇంట్లోకి లాక్కుపోయింది.

 

    సుబ్బలక్ష్మి చేతిలో ఓ అరిసెముక్క పెట్టి "నువ్వెళ్ళు" అని దాన్ని పంపించేసింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS