Previous Page Next Page 
జైలు పేజి 2


    తనని ఏడవకూడదని చెప్పి, ఏడుస్తున్న నాన్నను చూసి వాడు కదిలిపోయాడు. ఇంకా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు.

 

    "దిగులు పడకు! అప్పుడప్పుడూ నేనూ, అక్కయ్యా వస్తుంటాం. నువు మాత్రం ఎప్పుడూ ఇంటికిరాకు. నాన్నను చూడాలని, అక్కయ్యతో ఆడుకోవాలనీ, వూరెళ్ళాలని టీచర్లను అడగవద్దు. నీకు నాన్న, అక్కయ్య వున్నారని తెలిసిన క్షణం నిన్ను ఇక్కడినుంచి పంపించి వేస్తారు. అప్పుడు నువ్వూ నాలాగా పశువులను మేపుకుంటూనే, పెద్దయ్యి ఇంటి దగ్గర గాడిద చాకిరీ చేస్తూ బతకాల్సిందే. కాని నువు అలా కాకూడదు. బాగా చదువుకోవాలి. గొప్పవాడివై ఇంటికి రావాలి. తెలిసిందా? ఇక ఏడవకూడదు కళ్ళు తుడుచుకో."

 

    ఇద్దరూ కళ్ళు తుడుచుకున్నారు.

 

    "అలాగే నాన్నా. బాగా చదువుకున్నాక ఇంటికి రావచ్చా?" సందేహంగా అడిగాడు వాడు.

 

    "రావచ్చు కన్నా! పై చదువులు చదివి నువు ప్రయోజకుడయ్యాక మా దగ్గరకి రావచ్చు. అంతవరకు నేనూ, అక్కయ్యా కళ్ళల్లో దీపాలు పెట్టుకుని ఎదురు చూస్తుంటాం. అంతవరకు నువు ఇక్కడ అనాధ. అది మాత్రం గుర్తుపెట్టుకో బాబూ!"

 

    వాడు బాధతోనే మౌనంగా తల ఆడించాడు. ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర.

 

    "ఇక రారా కన్నా" అని ఆయన ముందుకు నడిచాడు.

 

    బాలమందిర్ ముందున్న చెట్లు అపర దానకర్ణుల్లా పొడవాడి నీడలను పరిచాయి. అదేదో దేవుడు చేసిన పందిరిలా అనిపించింది దశరధరామయ్యకు. తన కొడుకు ఇక నుంచీ ఈ దేవుడి పందిరిలో పెరుగుతాడన్న ఊహ ఆయనకు చల్లటి గాలిలా తగిలింది.

 

    కానీ వాడికి మాత్రం ఆ స్కూలు నాన్ననూ, అక్కయ్యనూ మింగేసిన బ్రహ్మరాక్షసుడిలా అనిపించింది.

 

                        *       *       *       *       *

 

    సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత :

 

    అప్పటివరకు ఆకాశంలో పహరా కాసిన చంద్రుడు పశ్చిమాన కుంగిపోతున్నాడు. నిద్రమత్తు వదలని గాలి తప్పటడుగులు వేస్తున్నట్లు మెల్లగా వీస్తోంది.

 

    గచ్చకాయ రంగు చీకట్లను చీల్చుకుంటూ మచ్చల పులిలా వున్న ఓ పోలీస్ వ్యాన్ ముందుకు దూసుకెళుతోంది.

 

    "సార్! వూరు వచ్చేసింది" మెల్లగా చెప్పాడు డ్రైవర్.

 

    నిద్ర బరువుకి పక్కకి వాలిపోయిన తలను పొజిషన్ లోకి తెచ్చుకున్నాడు సబ్ ఇన్స్ పెక్టర్. కళ్ళను నులుపుకుంటూ ముందుకు చూశాడు.

 

    "అవును సేఫ్ గా చేరిపోయాం. వాడ్ని జెయిల్ కి అప్పగించేస్తే మన పని పూర్తయిపోతుంది. ఇంతకీ వాడున్నాడా?" అని ఆందోళనతో వెనక్కి తిరిగి బాడీలోకి చూశాడు.

 

    ఎల్ కేజీ స్టూడెంట్ పలకతో ఇష్టం వచ్చినట్లు రాసిన గీతల్లాగా నలుగురు కానిస్టేబుళ్ళు అడ్డదిడ్డంగా సీట్లకు జారిగిలబడి తూగుతున్నారు.

 

    "రేయ్" ఘీంకరించాడు సబ్ ఇన్స్ పెక్టర్.

 

    ఉలిక్కిపడి లేచారు కానిస్టేబుల్స్.

 

    "వాడున్నాడా?"

 

    "ఉన్నాడు సార్"

 

    "జాగ్రత్త. జైలుకి మరో పావుగంటలో చేరుకుంటాం."

 

    బట్టలమీదున్న దుమ్మును దులిపేసుకున్నట్టు వాళ్ళు నిద్రను కళ్ళ నుంచి చెరిపేసుకున్నారు. బ్యూరోక్రసీ అంటే అదే. పైవాడి మాటలకు ఆర్గ్యుమెంట్ లేకుండా నిద్రలో కూడా అమలుచేయడమే.

 

    మరో పదినిముషాలకు వ్యాన్ జెయిలు ముందాగింది.

 

    దీనికోసమే వెయిట్ చేస్తున్న జెయిల్ సూపరింటెండెంట్ శ్రీపతి పరుగున అక్కడికి వచ్చాడు. గార్డులు తుపాకులు సరిచేసుకుని భూమిలోకి దిగ్గొట్టిన మేకుల్లా నిలబడ్డారు. వార్డర్లు దూరంగా నిలబడి దిగబోతున్న ఆ ఖైదీని వూహించుకుంటూ భయపడిపోతున్నారు.

 

    సబ్ ఇన్స్ పెక్టర్ వ్యాన్ లోంచి దిగి శ్రీపతిని విష్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

 

    "తిలక్ అనే ఖైదీని తీసుకొచ్చాం. వాడి డీటైల్స్ అన్నీ మీకు ఇదివరకే తెలుసు కాబట్టి కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. స్పెషల్ కేసు, వేయికళ్ళతో కనిపెట్టాలి. జాగ్రత్త సార్."

 

    శ్రీపతికి అప్పుడే వణుకు ప్రారంభమైంది. ఆటంబాంబును జేబులో వేసుకున్నట్టు మనిషంతా కదిలిపోతున్నాడు. అయిదు సంవత్సరాలపాటు ఈ టెన్షన్ ని భరించడం నరకమని ఆయనకు తెలుసు.

 

    సబ్ ఇన్స్ పెక్టర్ ఆయనచేత కొన్ని కాగితాల్లో సంతకాలు తీసుకున్నాడు. ఆ తరువాత వ్యాన్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు.

 

    మరో నిముషానికి తలుపు తెరుచుకుంది.

 

    జెయిలు సూపరింటెండెంట్ కే  దడ పుట్టిస్తున్న ఆ ఖైదీని చూడడానికి వార్డర్లు, గార్డులు వూపిరి బిగబట్టారు.

 

    నిజానికి ఆ ఖైదీ పేరుమోసిన గుండాకాదు. పెద్ద స్మగ్లర్ అంతకంటే కాదు. పచ్చినెత్తురు తాగే ప్రోఫెషనల్ కిల్లర్ కాదు.

 

    అతను సంవత్సరం క్రితమే పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కనీసం అమ్మాయిల్ని అల్లరిచేసి కూడా ఎరగడు. తన చదువు తప్ప మరో ధ్యాస లేనివాడు. మనుషులంతా మచ్చలేని మాణిక్యాలేనన్న నమ్మకం వున్నవాడు.

 

    అతన్ని చూసి కాదు భయపడుతున్నది - అతని ప్రత్యర్థిని చూసి

 

    నలుగురు కానిస్టేబుల్స్ తరువాత అతను నింపాదిగా వ్యాన్ నుంచి దిగాడు.

 

    అతనిని దగ్గరగా చూస్తున్న శ్రీపతి ఓ క్షణంపాటు జడుసుకున్నాడు.

 

    అతని తీక్షణమైన చూపుల్లో నిజాయితీతోపాటు పట్టుదల వుంది. ఆ కళ్ళల్లో తెలివితేటలతోపాటు ఎంతో తెగువ వుంది.

 

    పాతిక సంవత్సరాలు ఆ యువకుడ్ని తన ఆధీనంలో అయిదు సంవత్సరాల పాటు వుంచుకునేందుకు తనకు శక్తి చాలదనుకున్నాడు.

 

    తిలక్ అక్కడున్న ఎవరినీ గమనించడం లేదు.

 

    నాలుగురోజుల క్రితం జడ్జి అయిదు సంవత్సరాల వేసినప్పట్నుంచి అతని బుర్రలో తిరుగుతున్న ఆలోచన ఒక్కటే.

 

    "పారిపోవాలి. ఈ నిర్బంధం నుంచి ఎక్కడికో స్వేచ్ఛాలోకంలోకి ఎగిరిపోవాలి. చేయని నేరానికి శిక్ష అనుభవించడం మూర్ఖత్వం - జెయిలు నుంచి విడుదలై పగ తీర్చుకోవాలి."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS