Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 2

    "అబిమాన సంఘాలు లేకపోతే, 'చెమ్చాగిరీ' మరో పేరు దానికి, అంతే తేడా" విమల హాస్యంగా అంది.
    "అబ్బో - గ్రాండ్ మదర్ కూడా ఇంప్రూవ్ అవుతూందేవ్, లేటెస్ట్ ఇన్ ఫర్ మేషన్ గేదర్ చేస్తుందే" నీరజ వేళాకోళంగా అంది. అంతా గొల్లున నవ్వారు.
    విమల ఉడుక్కోలేదు. స్పోర్టివ్ గా నవ్వి "సావాసదోషం. పొందర్రా మీతో నాకేమిటి" సినిమా పిచ్చిగాళ్ళు" అంటూ పుస్తకంలో తలదూర్చుకుంది.
    అమ్మాయిల టాఫిక్ ఈసారి తెలుగు సినిమాలపైకి మళ్ళింది.
    "ఏమే - ఈమధ్య 'గాడు' సీరియల్ లో మరోటి ఏం వచ్చిందే?" షీలా హాస్యంగా అంది.
    "మగాడు, సోగ్గాడు. మొనగాడు.... దండకం చదివింది జ్యోతి.... ఆపవే తల్లీ - ఛీ. ఛీ- మనవాళ్ళు పేర్లన్నా కాస్త నాజుగ్గా పెట్టి ఏడవరేం? సినిమా ఎలా ఏడ్చినా, యింత ఛీఫ్ గా పేరు చూస్తేనే వెళ్ళబుద్ధివేయదు. మన తెలుగు సినిమాలకెళ్ళాలంటేనే సిగ్గేస్తూంది. హిందీ సినిమాలు కొన్ని అయినా మంచివి వస్తాయి. మన తెలుగువాళ్ళు బాగుపడరే. అంతే" విరక్తిగా అంది నీరజ.
    "వాళ్ళనానేం లాభమే? ఆ సినిమాలన్నీ శతదినోత్సవాలు చేస్తున్నాంగా మనమే" రాగిణి కోపంగా అంది.
    "శతదినోత్సవాలకేంలే - మనం చేయక్కరలేదు. వాళ్ళే జరిపిస్తారు. ఎవరికీ తెలీదీ భాగోతం?అయినా మనవాళ్ళూ అలాగే వెళ్ళడం మానరు. ఏదో ఒకటి అని చూసేస్తుంటారు. కిందవాళ్ళ మాట వదిలేయ్ చదువుకున్నవాళ్ళూ వెడ్తారూ. వరేయ్ ఎందుకురా అలాంటి సినిమాలకి వెళ్ళి ఎంకరేజ్ చేస్తారు మీరు? అంటే మా అన్నయ్య సినిమా బాగుందనేమిటి వెళ్ళాం. నవ్వుకోడానికి బాగుంటాయి. చూస్తూ ఎంజాయ్ చేయచ్చు జోక్స్ వేసుకుంటూ" అన్నాడు.
    "నవ్వుకోడానికి వెళ్ళినా, తమాషా చూద్దామని వెళ్ళినా వాళ్ళకి హాలు నిండుతుందిగా. నిజంగా అంతా సక్సెస్ అయిపోతుందనుకుని మరీ 'గాడు' సీరియల్ మొదలు అవుతుంది" జ్యోతి నేటి సినిమా తీరుతెన్నులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు అంది.
    "కరెక్ట్. మా అన్న అంతే. వల్గర్ గా వుందట. ఎంత వల్గర్ గా వుందో చూసి సరదాగా నవ్వుకోడానికి వెళ్ళాం అంటాడే. యీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళే ఆ సినిమాలని ఎంకరేజ్ చేస్తూంటే, మరి తెలుగు సినిమా ఎలా బాగుపడుతుంది?" నీరజ కోపంగా అంది.
    "మనం అంతా బాయ్ కట్ చెయ్యాలోయ్."
    "లాభంలేదు. మనవాళ్ళు ఆ సినిమా సక్సెస్ అయితే మక్కికి మక్కీ డ్రస్సుల దగ్గరనుంచి కాపీకొట్టి చేస్తారు గాని, ఒరిజినాలిటి చూపించరోయ్"
    "ఈ మధ్యవస్తున్న హిందీవి ఎంత బాగుంటున్నాయ్ - చిత్ చోర్, ఛోటీ సీ బాత్, మౌనం, తపస్వీ, ఆంధీ యివన్నీ బ్రహ్మాండమైన కొత్త కథలేం కావు. కాని ప్రజంటేషన్ ఎంత బావుంది? ఇలా మనవాళ్ళు ఎప్పటికన్నా తీస్తారా?" బెంగపెట్టుకున్నట్లంది జ్యోతి.
    కామన్ రూంలో అమ్మాయిల గోలతో హోరెత్తిపోతూంది. చీకూ చింతాలేని విద్యార్థినీ జీవితం. ఇంట్లో వాళ్ళని అల్లరిపెట్టో బతిమలాడో, ఏడిచో, పస్తులుండో రోజుకోరకం డ్రస్సు కుట్టించుకుని ఒకరికంటే ఒకరు అధికంగా కనపడాలన్న కాంపిటేషన్ తో అందాల పందేలకి తయారయి రావడం, చదువుకున్న దేమిటో తెలియకుండానే అల్లరితో ఆట పాటలతో ఏడాది గడిచిపోవడం, పరీక్షలు నెత్తిమీదకి రాగానే రాత్రి అంతా మేల్కొని చదివి ముక్కున పెట్టుకుని ఏదో రాసి ప్యాసయ్యాం అన్పించుకోడానికి తాపత్రయం. హాయి అయిన ఆనిష్పూచీ జీవితం కావాలన్నా మళ్ళీ మళ్ళీ రాదు. అమ్మాయిలకి బతుకంతా టెక్నికలర్ హిందీ సినిమాలా కనిపించే వయసు. బతుకంతా సినిమా కాదని చెప్పినా వినరు. విన్నా అర్థం చేసుకోలేని పసితనం వీడని అమాయకత. నెలకో డ్రస్సు, నాలుగు రోజులకో సినిమా, తెలుగు పత్రికలు, ఇంగ్లీషులో ఛేజ్, మిక్స్ ఎండ్ బూన్ బార్బరా కార్టండ్ లు చదువుకుంటూ ఆ హీరోయిన్ లలో తమని ఊహించుకుంటూ ఆ సినిమాలలో, నవలలో హీరోలాంటివాడు తమ జీవితంలో ఎప్పుడు ఎదురవుతాడో అని కలలుగనే కమ్మని వయసు. బాధ్యతారహితమైన జీవితం. ఆ కలలలోంచి లేచి వాస్తవం చూడటానికి యిష్టపడరు.
    గంట గణగణ మ్రోగింది. క్లాసులున్న అమ్మాయిలంతా బిలబిలలాడుతూ రూంలోంచి బయటికి వెళ్ళసాగారు. అంతలో జ్యోతితమ్ముడు గోపీ చెమటలు కక్కుకుంటూ సైకిల్ దిగాడు  రూంలోంచి బయటికి వస్తున్న అమ్మాయిలని చూస్తూ జ్యోతి కనబడగానే 'అక్కా.... అక్కా - నాన్న నిన్ను వెంటనే ఇంటికి రామ్మన్నారే-' హడావిడిగా అన్నాడు-
    'ఎందుకురా. ఏమయింది?' జ్యోతి గాబరాగా అడిగింది.
    'నీకు పెళ్ళివారు వచ్చారక్కా - వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారు. రిక్షా తెచ్చాను రా -' అన్నాడు.
    అమ్మాయిలంతా గొల్లున నవ్వారు. జ్యోతి మొహం సిగ్గుతో కందింది - 'ఛీ - పో' అంది కోపంగా -
    'నిజం అక్కా - వాళ్ళు వచ్చి కూర్చున్నారు. త్వరగా రా నీవు -' తొందరపెట్టాడు గోపి.
    'మా జ్యోతి పెళ్ళికూతురాయనే' ఒకమ్మాయి సన్నగా రాగం తీసింది. అమ్మాయిలంతా జ్యోతిని చుట్టుముట్టారు.
    'ఏయ్ జ్యోతీ! దొంగా మాకు చెప్పలేదేం' అని ఒకరు, 'అపుడే పెళ్ళేమిటి' అని ఒకరు, ఏమోయ్ మా కాబోయే బావగారు ఎలావుంటాడు - పదండర్రా యీపూటకి క్లాసు ఎగగొట్టి జ్యోతి పెళ్ళికొడుకుని చూసి వద్దాం - హాయ్ జ్యోతీ పద, మేం అలంకరిస్తాం నిన్ను -" ఆ పెళ్ళికొడుకుని ఓ ఆట ఆడించివద్దాం పదండర్రా - అబ్బో అప్పుడే అంత సిగ్గేమిటి అమ్మాయిగార్కి - అంతాకలిసి వేళాకోళంచేస్తుంటే జ్యోతికి సిగ్గు, కోపం, ఉక్రోషం ముంచెత్తాయి, ఇలా వచ్చి అందరిముందు చెప్పిన తమ్ముడిని మింగేసేటట్టు చూసింది. మొహం ఎర్రపరుచుని "నేను రాను పో - అసలు నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? బుద్ధిలేదూ -" అని కసిరింది కోపంగా.
    "బావుంది నేనేం చేస్తాను? వాళ్ళు వచ్చారు. నాన్న తీసుకురమ్మని నన్ను పంపారు" అక్క అందరిలో తిట్టడం అవమానం అన్పించి పౌరుషంగా అన్నాడు గోపి - "నీవు రాకపోతే మానేయ్. నాన్నతో చెప్తాను -" విసురుగా అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS