Next Page 
వెన్నెల వేట  పేజి 1

                                                        వెన్నెలవేట

                                                                                        ----:    శారద అశోకవర్ధన్

    కోర్టు హాలు జనంతో కిటకిటలాడుతోంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోటానికి చోటులేక చాలా మంది నిలబడి వున్నారు. అందరి ముఖాల్లోనూ ఆతృత కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

    దేశంలోనే సంచలనం రేపిన 'డాక్టర్ ఫణికుమార్ కేసు'కి ఆరోజే తీర్పు! కోర్టు బయట ఆడామగా తేడా లేకుండా జనం గుమిగూడి ఉన్నారు.

    "ఫణికుమార్ ని ఉరి తీయాలి!"

    కోర్టులోకి ప్రవేశించటానికి ముందుకి ఉరకబోతుంటే పోలీసులు వారిని ఆటంకపరిచి, వారితో పాటు మిగతా వారిని కూడా దూరంగా నెట్టుకువెళుతున్నారు.

    మహిళా సంఘాల తరపున అక్కడికి వచ్చి నకార్యకర్తలు ఆవేశంగా ముందుకు దూసుకువస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు.

    గౌరవప్రదమైన వైద్య వృత్తిలో వుండి స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించటమే కాక, ఒక స్త్రీని అతి దారుణంగా  హత్య చేసిన ఫణికుమార్ కు మరణ దండన విధించాలనివారంతా డిమాండ్ చేస్తున్నారు.

    ఉన్నట్లుండి కోర్టు ఆవరణలో ఉన్న జనంలో అలజడి చెలరేగింది. వారిలోంచి ఓ పాతికేళ్ళ స్త్రీ ముందుకొచ్చింది. ఆమె చెతిలో కిరోసిన్ డబ్బా ఉంది. ఆమె పోలీసులవైపు, కోర్టు భవనం వైపు చూస్తూ గొంతు చించుకొని అరవసాగింది.

    "ఆడవారి పట్ల అనుచితంగా ప్రవర్తించే డాక్టర్ ఫణికుమార్ కి శిక్షపడాలి. ఒక స్త్రీని అతి కిరాతకంగా హత్య చేసిన ఫణికుమార్ కి ఉరిశిక్ష విధించాలి. లేకపోతే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మాహుతి చేసుకుంటాను" అంటూ తన చేతిలోని కిరోసిన్ డబ్బాని పైకెత్తి మీద ఒంపుకొంది. అక్కడి జనంలో హాహాకారాలు చెలరేగాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

    ఆడ పోలీసులు ఆత్మాహుతికి ప్రయత్నించిన స్త్రీని అదుపులోకి తీసుకున్నారు.

    జనంలో ఆందోళన బయలుదేరింది. బిగ్గరగా నినాదాలు చేయసాగారు.

    ఆవేశంగా అరుస్తూ ముందుకు ఉరుకుతున్నారు.

    అంతే, పోలీసుల లాఠీలు లేచాయి. లాఠీ దెబ్బలకు తాళలేక ఆర్తనాదాలు చేయసాగారు, కోర్టు ఆవరణ అంతా భీభత్సంగా అల్లకల్లోలంగా తయారయింది.

    కోర్టు హాలులో జడ్జిగారి 'ఆర్డర్ ! ఆర్డర్!' అనే హెచ్చరికలతో గుసగుసలు ఆగిపోయి, వాతావరణం నిశ్శబ్ద ఆవరించింది.

    జడ్జి తుది తీర్పు ఇవ్వడానికి ఉద్యుక్తులయ్యారు.

    మరోసారి కోర్టు ఆవరణలోంచి బిగ్గరగా నినాదాలు చుట్టుముట్టాయి.

    జడ్జి ఒక్క క్షణం  ఆగి గొంతు సవరించుకున్నారు. చెప్పటం మొదలెట్టారు.

    "ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం డాక్టర్ ఫణికుమార్ అనే ఈ ముద్దాయి సాక్ష్యాధారాలను బట్టి 'హరిత' అనే తన స్నేహితుడి భార్యను అతి దారుణంగా హత్య చేసినట్టు రుజువైంది. దేశం యావత్తు సంచలనం సృష్టించిన ఈ హత్యకు కారకుడైన ఫణికుమార్ సాధారణ వ్యక్తికాదు. బాధ్యతగల పౌరుడిగా, మహోన్నతమైన వైద్య వృత్తిలో వుండి చేయరాని నేరానికి పాల్పడ్డాడు. ప్రజలలో వ్యతిరేక బావానికి గురయ్యాడు. వృత్తికే కళంకం తెచ్చి, మన స్థిమితం చాటున తప్పించుకోజూసిన డాక్టర్ ఫణికుమార్ ను శిక్షార్హుడిగా నిర్ణయించడమైంది. అతను చేసిన నేరానికి పరిహారంగా......"

    జడ్జిగారు శిక్షను ప్రకటించకుండానే కోర్టు హాలులోని ప్రేక్షకులలో అలజడి బయలుదేరింది.

    అందరూ ఒక్కుమ్మడిగా లేచి నిలబడ్డారు.

    "ఈ పాపాత్ముడికి ఉరిశిక్ష విధించాలి!" అంటూ అరవసాగారు. వారి అరుపులతో కోర్టంతా ప్రతిధ్వనించింది.

    క్షణాల్లో ఈ విషయం కోర్టు బయట ఉన్నవారందరికీ తెలిసిపోయింది. అంతే!

    ఆ జనంలో మళ్లీ ఆవేశం వెల్లుబికింది. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయసాగారు.

    "డాక్టర్ ఫణికుమార్ ని ఉరితీయాలి!"

    "ఉరి తీయండి. లేదా మాకు వదలండి. మేమే తగిన శిక్ష విధిస్తాం"

    "ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో ఉంచటానికి వీలులేదు."

    ఆ గందరగోళ పరిస్థితికి మరికొంతమంది జనం కోర్టు ఆవరణలో పోగయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం.

    జనాన్ని అదుపులో పెట్టటానికి పోలీసులు మళ్ళీ లాఠీ చార్జీ చేశారు. నినాదాలు ఆపకుండానే జనం చెల్లాచెదురుగా అటూ ఇటూ పరుగెడుతున్నారు.

    కోర్టు ఆవరణలోని ఆందోళనకర పరిస్థితిని సమీక్షించి జడ్జిగారి చెవిన వేశారు.

    కోర్టు హాలులో కూడా అలజడి తగ్గలేదు.

    "ఆర్డర్ !ఆర్డర్!!"

    జడ్జిగారు ఆదేశించారు.

    కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది.

    జడ్జిగారు అందరినీ ఓసారి కలియజూశారు. అందరి ముఖాలలోనూ ఆందోళన, ఆతృత తాండవమాడుతున్నాయి.

    జడ్జిగారు మళ్ళీ ఏం ప్రకటన చేస్తారోనని ఉత్సుకతతో చూస్తున్నారు కొందరు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS