Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 1


                      అయినవాళ్ళు_పక్కవాళ్ళు

                                            కొమ్మూరి వేణుగోపాలరావు

                           


    ఆ యిల్లు_
    అద్దెల కోసం ఉద్దేశించి కట్టబడింది. ఆ యింట్లో నాలుగు వాటాలున్నాయి. ఒకటి కొంచెం పెద్దది. మిగతా వాటాలకన్నా రెండు గదులు ఎక్కువ వుండేలా కొన్ని ఎక్కువ సౌకర్యాలతో కట్టుకున్నారు. మిగతా మూడు వాటాలూ సమానంగా వుంటాయి. ఒక్కొక్కదాని అద్దె ఆరొందలు.
    వాటిలో మధ్య పోర్షన్ ఈ మధ్యనే ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడల్లా ఓ యాభయి రూపాయలు అద్దె ఎక్కువ చెయ్యబడుతూ వుంటుంది. రోజూ కొంతమంది వచ్చి చూసుకెళుతున్నారు, బేరసారాలు కుదరడంలేదు.
    ఆ ఊళ్ళోకి విజయకుమార్ కొత్తగా ట్రాన్స్ ఫరయి వచ్చాడు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్టుమెంట్ లో ఉద్యోగి, మూడువేలకు పైగా జీతం. భార్య, తల్లీ, తండ్రీ, తమ్ముడూ, చెల్లెలూ అతని కుటుంబం.
    విజయకుమార్ ఆ యిల్లు చూసుకున్నాడు. అదే యింట్లో వున్నప్పుడు చాలా పరిస్థితులతో రాజీపడక తప్పదని అతనికి తెలుసు. ప్రత్యేకమైన ఇళ్ళల్లో వుండి, వెయ్యీ పన్నెండొందలూ అద్దెలు కట్టే ఆర్థికస్తోమత అతనికిలేదు. అతనాయింట్లో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఎడ్వాన్స్ యిచ్చేసి పొరుగూరిలో వున్న కుటుంబాన్ని తీసుకొచ్చి తన వాటాలో చేరిపోయాడు.


                            *    *    *    *


    విజయకుమార్ కి ముప్ఫయి ఏళ్ళుంటాయి. పెళ్ళయి నాలుగయిదేళ్ళయింది. ఇంకా పిల్లలు పుట్టలేదు., ఫ్యామిలీ ఫ్లానింగ్ చేస్కున్నాడో, సహజంగానే అలా జరగలేదో ఎవరికీ తెలీదు.
    ఓరోజు ఉదయం తొమ్మిది దాటుతోంది. విజయ్ ఆఫీసుకెళ్ళే హడావుడిలో వున్నాడు. తనకి కావాల్సిన వస్తువులు వెతుక్కొంటూ కనబడక చిరాకు పడుతున్నాడు.
    "సుజా!" అని పిల్చాడు.
    వంటింట్లో పనిలో వున్న ఆమెనుంచి జవాబు రాలేదు.
    ఈసారి "సుజా!" అని గట్టిగా పిల్చాడు.
    "అబ్బ" అంటూ సుజాత గదిలోకొచ్చి "వినిపిస్తోందండీ అంత గట్టిగా పిలవక్కరలేదు" అంది.
    "నువ్వలా అంటావని నాకు తెలుసు" అన్నాడు.
    "ఎలా?"
    "మెల్లగా మాట్లాడితే...అలా మీలో మీరు గొణుక్కుంటారేమిటండి అంటావు" గట్టిగా పిలిస్తే...అలా అరుస్తారేమిటండీ అని కసురుకుంటావు.
    "అలా చేస్తావని తెలుసి మధ్యరకంగా పిలవచ్చు కదా"
    "చాలామంది కర్థంకాని నిజమదేనోయ్."
    "ఏమిటది?"
    "అయితే అతిగా వుండటం, లేకపోతే మితినా వుండటం. ఇంకో రహస్యం చెప్పమంటావా? నేను మాటల్లో ప్రదర్శిస్తే నువ్వు చేతల్లో చూపిస్తావు. అయితే అతి లేకపోతే మితి"
    "అలా ఏం కాదు. నేను ప్రతి విషయంలోనూ తూచి తూచి మాట్లాడతాను. అదే ప్రవర్తిస్తాను."
    "ఇంకో రహస్యం చెప్పమంటావా?"
    "మీరు చెప్పేవి రహస్యాలు కాదు, మీ దృష్టిలో... జీవిత సత్యాలు. మీరు చాలా గొప్పవాళ్ళని మీ ఉద్దేశ్యం."
    "అది నిజమేననుకో. ప్రతి సామాన్యుడూ తనలో యితరుల కర్థంకాని ఏదో ప్రత్యేకత వుందనుకుంటాడు. అలా అనుకోకపోతే బ్రతకలేడు. అసలు జీవిత సత్యమంతా యీ అందమైన బుల్లి ఫిలాసఫీలోనే వుంది.
    "ఆ విషయం తర్వాత ఆలోచిద్దాంగాని_చెప్పండి."
    "ఏమిటి?"
    "ఇంతకుముందు మీరు చెప్పబోయింది."
    ఆమె ముఖంలోకి చూసి, మౌనంగా వూరుకున్నాడు.
    "చెప్పండీ."
    "వద్దులే. నీకు కోపమొస్తుంది."
    "ఆహా! నా కోపమంటే మీరు భయపడిపోతున్నట్లు... మహా"
    "జీవితంలో నేను మనసారా ఒప్పుకుంటున్న నిజమదే. నువ్వంటే నాకేదో అర్థంకాని భయం వుండటం"
    "నేనో పాయింటు చెప్పనా?"
    "చెప్పండి...అన్నాడు విజయ్ వినమ్రంగా."
    "అలా మధ్య మధ్య మీరు నన్ను అండీ అని సంభోదిస్తూంటే ఆనందంగా వుంటుంది...ఆ నేచెబుతానన్న పాయింటు, నేనంటే మీకు భయమన్నది అబద్ధమే అయినా_వినటానికి హాయిగా వుంటుంది."
    "చెప్పండి!" ఆ పాయింటుకు చిన్న పాయింటు.
    "నీకు హాయిని కలిగించే అబద్ధాస్త్రాలు మధ్య మధ్య సంధిస్తూ వుండడం కోసం పర్మిషన్"
    "ఇచ్చాను" అంటూ వున్నట్లుండి ఆలోచనలో మునిగిపోయింది.
    "ఏమిటలా హఠాత్తుగా మూడ్స్?"
    "చెప్పెయ్యమంటారా?"
    "చెప్పెయ్."
    "లోలోపల వాటి నిజస్వరూపం తెలిసినా, ఆత్మవంచన చేసుకుని మునిగిపోతూ వుంటాను. ఈ యాంత్రికమైన జీవనశైలిలో మధ్య మధ్య కొంచెం థ్రిల్ వుండాలి కదండీ."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS