Next Page 
మౌనవిపంచి పేజి 1

 

                                     మౌనవిపంచి
                                                                    ---యామినీ సరస్వతి
   
                                  

 

    గణ గణ మ్రోగింది అలారం సైరన్ లాగా!
    
    చప్పున కళ్ళు తెరిచింది నంద.
    
    టైంపీస్ సైరిగ్గా నాలుగు చూపిస్తోంది.
    
    వెంటనే లేచి కూర్చుంది. కళ్ళు మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్దించింది. ప్రార్ధన ముగిశాక మంచం దిగుతూ వుండగానే గోడకున్న తాతలనాటి గడియారం నాలుగు గంటలు కొట్టింది. ఆ గంటల శబ్దం కొంచెం కర్ణ కఠోరంగా వుంది. అక్కడికి దగ్గర్లోనే వున్న రీడింగ్ టేబిల్ పై వున్న తన చేతి ఎలక్ట్రానిక్ వాచ్ చూసింది. తన మట్టుకు తనే సరైందన్నట్టుగా నాలుగూ అయిదు నిమిషాలు చూపుతోందది!
    
    సునంద నవ్వుకుంది తనలో.
    
    "ఇంట్లో వున్న మనుష్యుల్లాగా ఇంట్లో వున్నమూడు గడియారాలూ మూడు సమయాలు చూపుతున్నాయి. ఏ రెండు గడియారాలూ, ఇద్దరాడవాళ్ళ అభిప్రాయాల్లా ఏకీభవించవు అనుకుంది. అలా ఏకీభవించకపోవటమే సృష్టి విచిత్రమేమో!
    
    హాల్లో తమ్ముడు శశికాంత్, చెల్లాయి విమల' అన్నయ్య రవికాంత్ చీకూ చింతా, బరువు బాధ్యతలు ఎరగని వాళ్ళలా నిద్దరోతున్నారు.  

 

    ఆ యింట్లోనే కాదు-
    
    ఆ కాంపౌండ్ లోనే ఎవరూ నిద్దర్లేవలేదింకా!
    
    రోజూ అది మామూలే! నందకి, కోడికి ఒక్కసారే మెలుకువ అవుతుంది. అందర్ని ఓ సారలాచూసి హాలునుంచి యివతలకు వచ్చింది! తల్లీ తండ్రీ చెరో మంచంపై నిద్రపోతున్నారు. గాఢమైన నిద్దర్లోవున్న వాళ్ళనుచూసి నిట్టూర్చింది నంద!
    
    అక్కడి నుంచి కదలి బాత్ రూమ్ లోకి వెళ్ళింది. కాలకృత్యాలు తీర్చుకోకముందే నీళ్ళు నింపేయాలని పైప్ తిప్పింది ఇంటిపనుల్లో ముందుగా నీళ్ళ పని పూర్తయితే సహం పని అయినట్టు.
    
    అయితే ఒక్కచుక్క నీరుకూడా రాలేదు. అదిచూసి ముందు తెల్లబోయింది సునంద "హుఁఇంటావిడ చాలా తెలివైంది" అనుకుంది. తర్వాత తనలో తనే తేలిగ్గా నవ్వుకుంది" నిన్నటే నీళ్ళు అన్నీ పట్టేసి టాంక్ ని ఖాళీ చేసింది. మళ్ళీ తెల్లారి ఎనిమిదయితే కానీ టాంక్ నిండదు! అంతదాకా నీళ్ళకి యిబ్బందే!
    
    కాంపౌండులోని వాళ్ళంతా పైపులు విప్పేస్తారు. ఒకేసారి అందరికీ పట్టుకోవాలని ఆత్రం- ఎంత ఆత్రమయితే నేం-నీళ్ళు సరిగ్గా రావు. యిబ్బంది పడాల్సిందే! ఇది వారంలో ఆర్రోజేలు జరిగే తతంగమే! ఇచ్చే బాడుగ సరిగానే ఇస్తున్నా అద్దెయిళ్ళల్లో సౌకర్యాలు యిలాగే తగలడతాయి! ఏం చేస్తారు. "స్వంత కొంప" కట్టుకునే అదృష్టం లేని వాళ్ళు యీ నరకానని అనుభవించాల్సిందే తప్పదు" అనుకుని నీళ్ళు కాగులోకి తోడింది. క్రింద మంట చేసింది.
    
    ముఖం కడుక్కుని బాత్ రూం నుంచి బయటకు వచ్చింది! ఇంకా అందరూ నిద్రపోతున్నారు. ఎవరూ లేవలేదు. గాఢ నిద్రపోతున్నారు. అదృష్టవంతులు.
    
    తనకే నిద్దర్రాదు!
    
    అలారం ఉన్నా ఉండకపోయినా నాల్గు తరువాత తను నిద్రకు నోచుకోలేదు అంతే! ఇది చదువుకునే రోజులనుంచీ అలవాటయి పోయింది.
    
    వంటింట్లోకి వెళ్ళి అంట్లు అన్నీ తెచ్చి దొడ్లో వేసుకుంది తనే! వాటిని అన్నీ చూడగానే భయమేసింది. ప్రతి రోజూ రాత్రే ఇవన్నీ శుభ్రం చేసుకోవాలనుకుంటుంది. కానీ ఎప్పటికప్పుడే అలసిన, ఆగిన యంత్రంలాగా అవుతుంది శరీరం! దాంతో కార్యక్రమం కుంటుపడ్తుంది.
    
    వంటిల్లు శుభ్రం చేసింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS