Next Page 
తదనంతరం పేజి 1


                                  తదనంతరం

                                                                                  కొమ్మూరి వేణుగోపాలరావు

 

                                     


    విజయవాడ సీతారాంపురంలో మొగల్రాజపురం కొండలకు దగ్గరగా యించుమించు వెయ్యి గజాల స్థలంలో ఓ ఇల్లుంది. పాతకాలం నాటి డాబా యిల్లు. ఇల్లు పెద్దదే ఇప్పుడు కట్టే అధునాతన పద్దతితోగాక గదులన్నీ వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటిగా కట్టబడి వున్నాయి. లోపలి గదిలోకి పోవాలంటే మొదటివన్నీ దాటుకుంటూ పోవాలన్న మాట. వరండా వున్నచోట మాత్రం అటూ యిటూ రెండు గదులు విడివిడిగా వచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయాక అటు మార్చి ఇటు మార్చి అతి కష్టంమీద రెండు పోర్షనులుగా విభజించబడింది.


    అదేమిటో ఇరవైఏళ్ల క్రిందటి సంగతి. అప్పుట్నుంచీ ఎలాంటి మార్పులూ చేర్పులూ లేకుండా ఆ ఇల్లలా ఉండిపోయింది.


    ఓ సాయంత్రం అయిదున్నర గంటల వేళ నరసింహంగారు ఆ ఇంటి డాబామీద పిట్టగోడకానుకొని కొయ్య కుర్చీలో కూర్చుని బయట పరిసరాలను తిలకిస్తున్నాడు.


    ఆ కుర్చీ వయసు యాభయి సంవత్సరాలు అయింది. తన చిన్నతనంలో కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు అలాంటివి అయిదారు చేయించాడు. ఇప్పటికి అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి.


    నరసింహంగారికి డబ్బయి అయిదేళ్లుంటాయి. అంత లావుగానీసన్నంగానీ వుండని శరీరం. ధూమాలైన ఎత్తు. పూర్తి బట్టతల. ఇంట్లో వున్నప్పుడు లుంగీ, చొక్కా వేసుకుంటాడు. బయటికెళ్ళినప్పుడు పంచ కట్టుకుంటారు.


    నరసింహంగారు ప్రతిరోజూ బయట ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ వుంటారు.


    విజయవాడ!


    అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది.


    తన చిన్నప్పుడు ఈ స్థలమంతా ఓ అడవిలా ఉండేది. అప్పుడే అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు చెదురుగా పడుతున్నాయి. గజం పావలా చప్పున ఆ స్థలాన్ని కొంటూంటే స్నేహితులూ హితైషులూ ఆ రేటు చాలా ఎక్కువని వారించటానికి ప్రయత్నించారు. తానే మొండికేసి కొన్నాడు.


    ఇప్పుడా ప్రదేశంలో వెయ్యిరూపాయలు పెట్టినా గజం స్థలం దొరకటం లేదు.


    నరసింహంగారు రెండు ప్రపంచ యుద్ధాలు చూశాడు. గాంధీగార్ని చూశాడు. టంగుటూరి ప్రకాశంపంతులుగాని చూశాడు. బియ్యం శేరు బేడా అంటే రూపాయకు ఎనిమిది శేరులు చూశాడు. మొత్తం పావలానో, అంతకన్నా తక్కువో కాఫీ హాలులోకి తీసుకెళ్ళి స్వీటు, హాటు, కాఫీ ఆరగించి బయటకు ఆనందంగా తిరిగొచ్చేరోజులు చూశాడు. నలభయి రూపాయల జీతంతో కుంటుంబాలన్నీ సంతోషంగా, ఏ ఆర్ధిక బాధా లేకుండా తృప్తిగా బ్రతకటం చూశాడు. రిక్షాకు బేడా ఇచ్చి రెండు మైళ్ళు దూరంలో వున్న సినిమాకు వెళ్ళిరావటం చూశాడు.


    ఆ రోజుల్లో సినిమాహాల్సు ఎన్ని వుండేవి. వన్ టవునులో మారుతీ టాకీస్, సరస్వతీ టాకీస్ వుండేవి. టూ టవున్ లో దుర్గా కళామందిరం, రామా టాకీస్, లక్ష్మీ టాకీస్ వుండేవి. తర్వాత ఒక్కొక్కటి, ఆ తర్వాత ఎ.సి. హాల్సూ పుట్టుకువచ్చాయి. ఆ రోజుల్లో ఏడాదికి ఏడెనిమిది తెలుసు సినిమాలు విడుదలయితే గొప్ప. ఇప్పుడు వారానికి నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి.


    నరసింహంగారికి ఆ రోజులు తలుచుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. నెలకి నలభయి రూపాయలు తెచ్చుకునే మనిషి సంతోషంగా, సంతృప్తిగా బ్రతకగలిగేవాడు. ఇప్పుడు రెండువేలరూపాయలు సంపాదించుకుంటున్నా ఒక మూలకి రావటం లేదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS