Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 1


                         నా  జీవితం నీ కౌగిలిలో...

                                                            _ సూర్యదేవర రామ్ మోహనరావు

 


    హుసేన్ సాగర్లోంచి హఠాత్తుగా బుద్ధ విగ్రహం నిటారుగా నిలబడి పోయి బోట్ హౌస్ మెట్లమీదుగా నడుచుకుంటూ, టాంక్ బండ్ రోడ్డు మీద కొచ్చింది.

 

    పైమీదున్న కాషాయ రంగు కండువా బాగా మాసి పోవడంతో, రోడ్డు మీదెళ్తున్న ఓ పెద్ద మనిషి తెల్లటి కండువాను లాక్కుని, పాతకండువాను పక్కనున్న విగ్రహాల మీదకిసిరేసి, తెల్ల కండువాను భుజమ్మీద వేసుకుని ఠీవిగా నడుచుకుంటూ లిబర్టీ వేపొస్తున్నాడు బుద్ధుడు.

 

    అకస్మాత్తుగా గవర్నమెంట్ తో చెప్పాచెయ్యకుండా రోడ్డు మీద కొచ్చేసిన బుద్ధుడ్ని చూడడంతో ఎక్కడ సిటీ బస్సులక్కడ, ఎక్కడ జనం అక్కడ, ఎక్కడ ప్రేమికులక్కడ స్టిల్ ఫోటోల్లో చిత్రాల్లా నిలబడి పోయారు... దాంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది.

 

    "ఏయ్ మిస్టర్... బిర్లామందిర్ స్టాపొచ్చింది దిగు..." కండక్టర్ మూడోసారి తట్టి లేపడంతో శివరాత్రి మర్నాడు పడుకున్నవాడిలా, బద్ధకంగా కళ్ళిప్పి చూశాడు ఆంజనేయులు.

 

    "స్టాపొస్తే చెప్పమన్నావ్ గదా... ఇదే బిర్లామందిర్... దిగు... దిగు..." మళ్ళీ భుజంపట్టి వూపాడు కండక్టర్.


    "బుద్ధుడేడీ... బుద్ధుడి వల్ల ట్రాఫిక్ జామైపోయింది గదా..." కల్లోంచి ఇంకా బయటకు రాలేదు ఆంజనేయులు.

 

    "బుద్ధుడెవడయ్యా బాబూ... వాడు ముందు స్టాపులో దిగిపోయుంటాడు గానీ ముందు నువ్వు దిగు..." విజిల్ వూదడానికి సిద్ధమయ్యాడు కండక్టర్.


        
    "నువ్వు రోజూ సిటీ బస్సెక్కి నిద్రోతావ్... నా ప్రారబ్ధం తగలబడి, ఆ రూట్లోనే నా డూటీ వస్తాది... అరె బాబూ... ఆ నిద్రపోయేదేదో, ఇంటి దగ్గరే ఓ రెండు గంటలు ఎగస్ట్రా నిద్రోయి, రోడ్డు మీదకు తగలడొచ్చు కదా... నా ప్రాణాల్ని చంపడానికి కాకపోతే..." విజిల్ ఊదేశాడు కండక్టర్.

 

    "ఆగవయ్యా... బాబూ..." గబుక్కున లేచి, జనాల్ని తప్పించుకుని, రోడ్డు మీద పడ్డాడు ఆంజనేయులు.

 

    ఆ పడడం, పడడంతోటే రోడ్డు మీద బస్సుకోసం ఎదురు చూస్తున్న ఓ నడివయసావిడను గుద్దుకున్నాడు.


                
    ఆవిడ కోపంగా చూసి, మెళ్ళోంచి మంగళసూత్రాలు తీసి కళ్ళ కద్దుకుని వాటి వేపు చూస్తూ...

 

    "నన్ను క్షమించండి..." అంది భక్తి ప్రపత్తులతో.

 

    "ఫర్వాలేదు... పెద్దవారు... అంత మాటనకండి... నేనే మిమ్మల్ని గుద్దుకున్నాను కదా..." జుత్తును సవరించుకుంటూ అన్నాడు ఆంజనేయులు.

 

    "నిన్ను కాదురా పోకిరీ... మా ఆయనతో మాట్లాడుతున్నాన్నేను" చిరాగ్గా అందావిడ. పర పురుషుడి కాలు తగిలినా, వేలు తగిలినా, భుజం తగిలినా, చేతిలోని బుట్ట తగిలినా, ఆవిడ తన మెడలోని మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుని దుబాయ్ లో వున్న వాళ్ళాయన్ని జ్ఞాపకం తెచ్చుకుని "నన్ను క్షమించండి" అని అనుకోవడం, తన పాతివ్రత్యానికి ఏ మాత్రం భంగం కలగలేదని సంతృప్తి చెందడం ఆవిడకు అలవాటు.

 

    పోకిరీ అని అనడంతో ఆవిడ వేపు కోపంగా చూశాడు ఆంజనేయులు.

 

    "చెట్టంత మనిషిని గుద్దెయ్యడం కాకుండా, అలా గుడ్లప్పగించి చూస్తావేం... సన్నాసి. కళ్ళుగానీ కనబడ్డం మానీశాయా..." మళ్ళీ చిరాకు పడింది ఆవిడ.

 

    సన్నాసి అన్న మాటకు మరీ కోపం వచ్చింది ఆంజనేయులికి. సీరియస్ గా మొహం పెట్టి ఆవిడ వేపు సూటిగా చూస్తూ-

 

    "చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు కనబడ్డంలేదు..." అని తిక్కగా సమాధానం చెప్పేసి, ముందుకెళ్ళిపోయాడు.

 

    అదేమిటో! సిటీ బస్సెక్కిన మరుక్షణమే సీటు దొరికినా, దొరక్క పోయినా తన కళ్ళ మీదకు కుండపోతగా నిద్రొచ్చేస్తుంది. ఆ నిద్ర వల్లే ఈ చిల్లర తగువులన్నీ వస్తున్నాయి. ఇహనుంచీ చచ్చినా నిద్రపోగూడదు అని ఘోరంగా నూట పదోసారి శపథం చేసి బిర్లా మందిర్ మెట్ల దగ్గర నిలబడ్డాడు.

 

    మెట్లని లెక్కపెట్టుకుంటూ ఎక్కడం ప్రారంభించాడు. పైవరకూ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ ఒకటి నుంచి లెక్కపెట్టుకుని కిందకు దిగుతున్నాడు.

 

    ఇంకా అయిదు మెట్లు వున్నాయనా -

 

    కింద నుంచి ఒక వ్యక్తి మెట్లెక్కడం ప్రారంభించాడు. ఆయన వయసు యాభై ఏళ్ళుంటుంది. సూటూ, బూట్లో ఏదో పెద్ద ఆఫీసర్లా వున్నాడు.

 

    ఒకటి....

 

    రెండు.... మూడు....

 

    నాలుగు.... అయిదు....

 

    అయిదో మెట్టు దగ్గర ఆంజనేయులు, సూట్లో వ్యక్తీ ఇద్దరూ ఒకరి మొహం వేపు ఒకరు చూసుకున్నారు. అతను మెట్లను లెక్కపెట్టుకుంటూ పైకెళ్ళిపోయాడు.

 

    ఆంజనేయులు కిందకు దిగిపోయాడు. మెట్లు దిగిపోయిన వెంటనే బాల్ పెన్ను తీసుకుని, జేబులోంచి ఓ నోట్ బుక్కు తీసుకుని-

 

    "బిర్లా మందిర్ కున్న మెట్లు" అని ఆ మెట్ల సంఖ్యని నోట్ చేసుకుని, సంతృప్తిగా ఆ బుక్ ని మళ్ళీ జేబులో పెట్టేసుకుని టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర కొచ్చి బస్టాపులో నిలబడ్డాడు ఆంజనేయులు.


                                                     *    *    *    *


    యూనివర్శిటీ కేంపస్ దగ్గర బస్సుదిగి ఆర్ట్స్ కాలేజీ వేపు నడిచాడు ఆంజనేయులు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS