Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 1


                                        ప్రేమకు పెట్టుబడి కావాలి
                                                   -సూర్యదేవర రామ్ మోహనరావు

 

                                   

   

      దూరం నుంచి చూస్తే పెద్దమనిషిలా, దగ్గర్నుంచి చూస్తే చిన్నమనిషిలా కనబడే అయిదేళ్ల బుడుగు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తనను తాను అరవై ఆరోసారి చూసుకుంటూ తెగ మురిసిపోతున్నాడు.

 

    "ఏంట్రా.... అలా అద్దానికి అంటుకుపోయావ్?...." అని వాళ్ళ బామ్మ వత్తులు వత్తుతూ అడిగింది.

 

    "గోపాలంగాడి షర్టు వాడికన్నా, నాకే బాగా సరిపోయింది....." అని గట్టిగా వాళ్ళ బామ్మకు విన్పించేటట్టుగా అరిచాడు.

 

    "గోపాలంగాడు ఎవడ్రా?" అని మళ్ళీ వాళ్ళ బామ్మ అంది.

 

    "మా నాన్న....." అని జవాబిచ్చాడు బుడుగు గడుసుగా.

 

    "ఓరేయ్ పిడుగా..... స్వంత నాన్నగారిని అలా అనకూడదమ్మా...." వాళ్ళమ్మ బుగ్గలు నొక్కుకుంటూ అంది.

 

    "అనకూడదా.....? మరి బామ్మ 'గోపాలంగాడు' అని పిలుస్తుంది కదా..... బామ్మంటే రైటూ, నేనంటే తప్పునా..... అలా కుదరదు....." అని పెంకిగా అన్నాడు బుడుగు.

 

    "నీకన్నా పెద్దాయన, నీ స్వంత తండ్రిని అలా అనకూడదని తెల్సుకో-"

 

    "తెల్సుకున్నానులే..... స్వంత తండ్రిని అనకూడదు...... అంటే ఇంకో తండ్రిని అనొచ్చునన్న మాట......" దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు బుడుగు.

 

    ఒక్కక్షణం వాళ్ళకేం అర్థం కాలేదు. అయినా వెంటనే తేరుకుని-

 

    "ఇంకో తండ్రి ఎవర్రా....?" అని అడిగిందామె.

 

    "ఏమో నువ్వే చెప్పాలి....." అన్నాడు బుడుగు.

 

    అప్పటికి కాని ఆమెకి విషయం అర్థంకాలేదు.

 

    "అలాంటి పాడు మాటలు అనకూడదమ్మా...." అని ముద్దుగా బుజ్జగించింది వాళ్ళమ్మ. లోలోపల ఇబ్బందిగా  ఫీలవుతూ.

 

    "ఈ అమ్మకి నన్నెలా బుజ్జగించాలో ఏవీ తెలీదు..... నాన్నకేమో ముద్దుపెట్టి మరీ బుజ్జస్తుంది... నన్నేమో ఉత్తినే బుజ్జగిస్తుంది....." అనుకుంటూ చిరాకు పడిపోయి-

 

    "ఆ పిల్ల వ్యవహారం ఏంటో ఇవాళ తేల్చేయాల....." అని సీరియస్ గా అనుకుని ఇంటిలోంచి బయటకు వచ్చాడు.

 

    పక్కింటివైపు నడిచాడు.

 

    ఆ ఇంటికీ, ఈ ఇంటికీ మధ్య చిన్న నూతిగట్టు. ఆ నూతిగట్టుమీద బాల్చీలో బట్టల్ని పెట్టుకుని, ఒక్కొక్కదాన్ని బయటికి తీసి ఉతుకుతోంది ఆ పిల్ల తల్లి.

 

    బుడుగు పేర్కొన్న సదరు పిల్ల పేరు సీగాన ప్రసూనాంబ.

 

    సీగాన ప్రసూనాంబకు మూడున్నరేళ్ళు.

 

    "అదేదీ...." అదేదో సినిమాలో సాక్షి రంగారావులా కళ్ళూపుకుంటూ అడిగాడు బుడుగు.

 

    సీగాన ప్రసూనాంబ మాతకు 'అదేదీ' అన్నదేవిటో అర్థం కాలేదు కొద్ది క్షణాలు.

 

    "అదేదీ.....అదేదో సినిమాలో సాక్షి రంగారావులా కాళ్ళూపుకుంటూ అడిగాడు బుడుగు.

 

    సీగాన ప్రసూనాంబ మాతకు 'అదేదీ' అన్నదేవిటో అర్థం కాలేదు కొద్ది క్షణాలు.

 

    "అదందుకోరా బుడుగూ....." అందామె దూరంగా వున్న సీగాన ప్రసూనాంబ లాగూని చూపిస్తూ.

 

    "మగవాళ్ళు ఆడవాళ్ళ లాగుల్నీ, చడ్డీల్నీ అందుకుంటారా..... మీ  ఆయన నీ లాగుని అందుకుంటాడా....." చీరాకుపడ్డాడు. బుడుగు అంతలా ఎందుకు చిరాకుపడ్డాడో ఆమెకు అర్థం కాలేదు.

 

    "నీ నోట్లో పంచదార పొయ్యా..... వేలెడెంతలేవు..... ఎన్ని మాటలు నేర్చావురా...." బుడుగు  మాటలకు ఆశ్చర్యపోతూ అంది సీగాన ప్రసూనాంబ తల్లి.

 

    కొంచెం ముందుకెళ్ళి-

 

    "ఒసేవ్..... ఇలా బయటకు రా...." అని సీగాబ ప్రసూనాంబను పిలిచాడు బుడుగు అధికార దర్పంతో.

 

    ప్రసూనాంబ బయటకు వచ్చింది.

 

    "ఏంటిలా వచ్చావ్.... ఏంటా డ్రెస్సు...... మీ పక్కింటోడిదా...."

 

    "కాదు..... నాదే..... నేనీ మధ్య పోడుగైపోతున్నానని, మా నాన్న బట్టలేసుకుంటున్నాను" అని అన్నాడు.

 

    "దేనికి పిలిచావ్.....?" అని అడిగింది సీగాన  ప్రసూనాంబ  బుగ్గని చూపుడు వేలుతో నొక్కుకుంటూ....

 

    "ఆటాడుకుందాం...... వస్తావా......?" అడిగాడు బుడుగు.

 

    "చెయ్యి ఖాళీలేదు....." అంది సీగాన ప్రసూన సీరియస్ గా.

 

    "చెయ్యి ఖాళీ లేదని ఇప్పుడనకూడదు-" అన్నాడు బుడుగు, అసహనానికి లోనవుతూ.

 

    "సాయంత్రం రా....." అంది తిరిగి సీగాన రాసూనంబ.

 

    "ఈ మధ్య నీ వ్యవహారం..... నాకు నచ్చలేదు...."

 

    "నేనేం చేసానూ...." దీర్ఘం తీసింది సీగాన ప్రసునాంబ.

 

    "నువ్వు అడ్డమైన వాళ్ళందర్నీ ప్రేమిస్తున్నావ్..... నన్ను తప్ప...."

 

    "అవును నా యిష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాను..... నిన్ను ప్రేమిస్తే ఏం లాభం? వెర్రి మొర్రి కబుర్లు చెప్తే సరిపోతుందా?"

 

    "మరేం చెయ్యాలి?" అర్థం కాక అడిగాడు బుడుగు.

 

    "మగాడివి కదా.....! ఆ మాత్రం తెల్సుకోలేవా?' అంటూ కొంటెగా నవ్వుతూ లోనికెళ్ళిపోయింది సీగాన ప్రసూనాంబ.

 

    "నీలాంటి వాళ్ళని వందమందిని లొంగదీసుకున్నాను..... నిన్ను లొంగదీసుకోవటం ఎలాగో నాకు తెల్సు....." అంటూ  తనింట్లోకెళ్ళి డబ్బుల కోసం పుస్తకాల్లోనూ, దేవుడి హుండీలోనూ వెతికాడు. నిరాశగా అటు ఇటూ చూసి వాళ్ళ నాన్న చొక్కా తీసి.... అటూ ఇటూ ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకోని, ఆ జేబులోంచి డబ్బులు తీశాడు.

 

    కిరాణా షాపుకెళ్ళి, ఆ డబ్బులిచ్చి "రెండు చాక్లెట్ లివ్వు....." అన్నాడు. వాడిచ్చిన ఆ  చాక్లెట్లు తీసుకుని పరుగెత్తుకుని, సీగాన ప్రసూనాంబ దగ్గరకొచ్చి -

 

    ఆ పిల్ల చేతిలో ఆ చాక్లెట్లు పెట్టాడు.

 

    ఆ చాక్లెట్ లకి, ఆ పిల్ల సంతోషపడిపోయి-

 

    "ఇప్పుడు ప్రేమిస్తాను నిన్ను...... సాయంత్రం ఆడుకుందాంలే....." అంది.

 

    "చూసారా......! ఆడవాళ్ళను ఎలా లొంగదీసుకోవాలో...... నాకు తెల్సినట్టుగా మరెవరికీ తెలీదోచ్...." అని మనసులో అనుకున్నాడు.

 

    'ఈసారి పదిరూపాయలు పెట్టి, చాక్లెట్లు కొంటే ఇంకా ఈ ప్రసూనాంబ చచ్చినట్టు తన మాట  వింటుంది' అని అనుకున్నాడు.

 

    గత ముప్ఫయ్ ఏళ్ళ నుంచి అర్థరూపాయ్ తప్ప, తన పాకెట్ మనీ పెరగలేదు.

 

    అర్జంటుగా తనని పెద్దవాడిని చేసెయ్యమని మద్రాస్ లో వుంటున్న ఆ బాపూ రమణలకు ఓ కార్డు రాశి పడెయ్యాలి. వాళ్ళు కూడా ఈ మధ్య బొత్తిగా తనని పట్టించుకోవటం మానేశారు. ఇది చాలా అన్యాయం.

 

    తను పెరిగితే, పాకెట్ మనీ కూడా పెరగాలి కదా.....? ఆ మాత్రం ఆ బాపూ రమణలకు తెలియాలి గదా.....? పోనీ పాఠకులైనా చెప్పాలి కదా.....? ఏమిటో ఈ మధ్య బొత్తిగా నన్నెవరూ పట్టించుకోవటం లేదు. బొంబాయి ముంబాయ్ అయిపోయింది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదయి పోయింది. మద్రాస్ చెన్నై అయిపోయింది. ఎన్టీయార్ బతికుంటే, పదవిలో వుంటే, హైదరాబాదు భాగ్యనగరమయి పోయేది. దేశంలో ఎన్నెన్నో మార్పులు జరిగిపోతున్నాయి. నా విషయంలో మాత్రం ఏ మార్పు లేదు.

 

    మా  గోపాలంగాడు..... అదే మా నాన్న గోపాలంగాడు మాత్రం అత్తర్లకీ, పౌడర్లకీ బాగానే ఖర్చుపెట్టుకుంటున్నాడు.  రోజులు మారిపోయాయిరా నాన్నా...... నా అవసరాలు కూడా పెరిగిపోయాయిరా నాన్నా అని అన్నా, మొత్తుకున్నా వినడు. ఈరోజుల్లో స్నేహానికి, ప్రేమకి కూడా పెట్టుబడి కావాలి....... అంటే వినడు - అర్థం చేసుకోడు. అతడు మూడుసార్లు నిట్టూర్పు విడిచి, ప్రస్తుతానికి రెండు చాక్లెట్లు పెట్టుబడితో బలప్రేమ - రేపు పదిరూపాయల పెట్టుబడితో బంగారు ప్రేమ పొందాలి. లేదంటే వెనకబడిపోతా- గొప్ప జనరేషన్ గ్యాప్ వచ్చిపడిపోద్ది...... అని హుషారుగా ఫీలయిపోయి-

 


    "హాయ్..... ఐ లవ్ యూ..... సీగాన ప్రసూనాంబ" అని అరిచాడు. పోయాడు బుడుగు. వెంటనే తేరుకుని నేలమీదే పద్మాసనం వేసుకుని, నింపాదిగా ఆలోచించటం మొదలుపెట్టాడు.

 


                                            *    *    *

 

    "ప్రేమంటే ఏమిటి?"

 

    "తుంగభద్రానది, మంజీరా నందుల సంగమం."

 

    "అందరూ కృష్ణా, గోదావరి సంగమం అంటే - నువ్వు శ్రీకృష్ణ  దేవరాయల కాలంనాటి నదుల పేర్లు చెప్తావేం?"

 

    "నాకు ఆ నదుల పేర్లే తెల్సు."

 

    "ప్రేమంటే..... నదులేనా?"

 

    "కాదు."

 

    "మరి?"

 

    "ప్రేమంటే మహబూబ్ నగర్ ఎడారి."

 

    "ఎడారి రాజస్థాన్ లో వుంది. మహబూబ్ నగర్ లో కాదు."

 

    "పోనీ...... ప్రేమ గురించి ఇంతకంటే అందంగా చెప్పలేవా?"

 

    "చెప్పగలను. లవ్ ఈజ్ బ్లాయిండ్. అంటే ప్రేమ గుడ్డిది."

 

    "ప్రేమ గుడ్డిదని అందరికీ తెల్సు...... నువ్వే చెప్పాలా?"

 

    "అయితే చెపుతాను. లవ్ ఈజ్  నాట్  బ్లాయిండ్, లవ్ ఈజ్ హాండిక్యాప్ డ్...... లవ్ ఈజ్ ఎక్స్ పెన్సివ్."

 

    "అర్థమైనట్లే వుంది. కాని ఏం అర్థంకాలేదు నీ ఇంగ్లీషు..... తెలుగులో చెప్పు."

 

    "ప్రేమంటే గుడ్డిదే కాదు...... కుంటిది..... ఖర్చుతో కూడుకున్నది కూడా."

 

    "ప్రేమని అలా నువ్వంటే గాలిబ్ చచ్చిపోతాడు."

 

    "గాలిబ్ ఎవడు?"

 

    "గాలిబ్ కూడా నీకు తెలీదా? మహా ప్రేమకవి. సర్వస్వాన్ని ఇచ్చేసేదే ప్రేమని అన్నాడు గాలిబ్."

 

    "పూర్ ఫెలో..... మగవాడు ఆడదానికి కొంతమాత్రమే యివ్వాలి...... అలా ఇచ్చినప్పుడే ఆడది అర్థాంగి అవుతుంది. పూర్తిగా ఇచ్చేస్తే అర్థాంగి ఎలా అవుతుంది?"

 

    "ప్రేమ గురించి అందంగా చెప్పమంటే...... ఇష్టమొచ్చినవన్నీ చెప్తావేం?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS