Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 1


                                         వ్యక్తిత్వం లేని మనిషి 
                                           _ కొమ్మూరి వేణుగోపాలరావు 

 



    "జయా!"
    స్వప్నంలో నదివొడ్డున నిలబడి నీటిలో తననీడని ఆసక్తిగా చూసుకుంటున్న అతనికి ఎవరో "వ్యక్తీ" అని పిలిచినట్లయింది.
    ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది. "వ్యక్తీ!" ఒక సవాలులా, పీడిస్తున్నట్లు, ఏడిపిస్తున్నట్లు, కాల్చుకు తింటున్నట్లు, కాకులు పొడిచినట్లు, తర్జనితో బెదిరించినట్లు, కాల్చిన యినుముతో అదిమినట్లు గిజగిజలాడతాడు.
    "వ్యక్తీ!" అంది ఆ కంఠం మళ్ళీ.

    గిజగిజమని కొట్టుకున్నాడు. గజగజమని వొణికాడు. అట్లా వొణికినందుకు మళ్ళీ కించపడ్డాడు. అతని ఆత్మాభిమానాన్ని ఎవరో కొల్లగొట్టినట్లయింది.
    ఎవరా పిలిచింది? నదిలోని తన నీడా? నీడవంక పరీక్షగా చూశాడు. చలనం కనిపించలేదు. ఒకవేళ నీడని తనే పిలిచాడేమో! అర్ధం కావటంలేదు. పైగా భయంగావుంది. ఇది స్వప్నంగా పరిణమిస్తే ఎంత బాగుండును! కాని కలలోకూడా నీడని చూసి జడుసుకునే తన నైజగుణం! చచ్చే సిగ్గు వేసింది.
    "వ్యక్తీ!" మళ్ళీ పిలుపు.
    మొత్తంమీద స్త్రీకంఠమది. అతను తేలికగా ఊపిరి విడిచాడు. ఒక బరువు తీరిపోయింది. నీడకాదు, చుట్టూ కలయచూశాడు. ప్రకృతి, శూన్యం, గగుర్పాటు కలిగించే ఏకాంతం.
    "జయా! జయా! వ్యక్తీ! వ్యక్తీ! జయా! వ్యక్తీ! వ్యక్తీ! జయా!"
    మత్తు విడుతున్నది. ఈ లోకంలోకి వస్తున్నాడు. అన్ని పిలుపులు కలసిన ఆ పిలుపులో జాలి, భయం, దీనత్వం...
                    *    *    *
    మృత్యుంజయరావు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. గదంతా చీకటిగా వుంది. ఉక్క, దోమలు ఝమ్మని సంగీతం పాడుతున్నాయి. ఈ దోమల్ని తోలుకుంటూనే అతను అర్థరాత్రివరకూ జాగారం చేశాడు. తరువాత గాఢంగా నిద్రపట్టేసింది. నిద్రలో... పోనీ కలలో అనుకుందామా? గుండెల్ని చీల్చే పిలుపులు. ఇంతకూ ఎవరా పిలిచింది?     
    "జయా! జయా!"
    అతను పూర్తిగా తెలివి తెచ్చుకున్నాడు. కలలోకాదు, యదార్థంగానే తన కోసం ఎవరో వచ్చారు. ఆతృతపడుతూ లేచి నిల్చున్నాడు. మంచం కిర్రుమంది. తడుముకుంటూ గోడదగ్గరకు వెళ్ళి లైటు వేశాడు. తెరిచివున్న కిటికీగుండా దీపకాంతి బయటకు పడింది. గేటు అవతల ఎవరో స్త్రీమూర్తి నిలబడి వుండటం అతనికి కనబడింది. అతనికి తెలియకుండానే ఏదో భయం ఆవహించింది. తనని తాను నిలద్రొక్కుకుంటూ గది తలుపులు తెరిచి, వసారా దాటి క్రిందికి దిగి, గేటుదగ్గరకు వెళ్ళి "ఎవరూ?" అన్నాడు తొట్రుపాటు ధ్వనించే గొంతుతో. 
    "నేను జయా! గుర్తుపట్టలేదా?"
    అతను ఉలిక్కిపడ్డాడు. చిరపరిచిత కంఠం. కాని చాలాకాలంగా వినబడనిది. గదిలోని దీపకాంతి పలుచగా ఆమె ముఖంమీదికికూడా పడుతోంది.
    అతనామె ముఖంలోకి పరీక్షగా చూశాడు. "అక్కయ్యా!" అన్నాడు కలవరపాటుతో.
    "త్వరగా తలుపు తియ్యి జయా! నిల్చోలేకుండా వున్నాను" అన్నదామె ఎంతో నీరసంగా.
    మృత్యుంజయరావు కంగారుపడుతూ గొళ్ళెం తీసి, గేటు తెరిచాడు. "లోపలకు రా అక్కయ్యా!" అన్నాడు అభిమానం ఉట్టిపడుతూండగా.
    లోపలికి వస్తూ బలహీనతవల్ల కాబోలు, ఆమె తూలి క్రిందపడబోయింది. అతను మెలకువగా ఆమెని పట్టుకుని, జాగ్రత్తగా నడిపించుకుంటూ లోపలకు తీసుకువెళ్ళాడు. గదిలోవున్న ఒకే ఒక కుర్చీలో ఆమెను ఆసీనురాల్ని చేశాడు.
    "నాకు కాసిని మంచినీళ్ళు కావాలి" అంది ఆ స్త్రీ.
    అతను కూజాలోంచి అక్కడున్న గ్లాసులోకి మంచినీళ్ళు వొంపి, ఆమె కందిచ్చి, తను పోయి మంచంమీద కూర్చుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    ఎంత దాహంగా వుందో... ఆమె ఆత్రంతా త్రాగివేస్తోంది. మాసిన దుస్తులు, చిందరవందరగా వుండి నుదుటిమీదకు పడుతోన్న ముంగురులు, కృశించిన శరీరం, పీక్కుపోయిన ముఖం, మంచినీటికోసం ఆమె ఆర్తి చూసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె ఎక్కడ చూస్తుందోనని తల ప్రక్కకి త్రిప్పుకున్నాడు.
    త్రాగటం ముగిశాక, సేద తీర్చుకున్నట్లు ఒక్కక్షణం వూరుకుని, అతన్ని చూసి కొంచెం నవ్వి, "అయిదేళ్ళ తర్వాత నీ నివాసం కనుక్కుని ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావు కదూ!" అంది మృదుకంఠంతో. ఆమె పేరు జగతి. అతని అక్క.
    "అవును. చాలా ఆశ్చర్యంగా వుంది' అందామనుకున్నాడు జయ. కాని "లేదు" అన్నాడు.
    "బింకానికి అంటున్నావా?" అన్నది జగతి వొదిలిపెట్టకుండా.
    'కాదు' అందామనుకున్నాడు. "ఎందుకు బింకం?" అందామనుకున్నాడు. కాని స్తబ్దుగా చూస్తూ ఊరుకున్నాడు.
    "నీకు ఆశ్చర్యపడటం చేతకాదు."
    అతను కలవరపడ్డాడు. కలవరపడిపోతున్నాడు.
    "నువ్వు సంతోషించలేవు."
    వెలా తెలా పోతున్నాడు.
    జగతి ఫక్కున నవ్వింది. "అలా అయిపోతావేం? నేనేం పెద్దపులిని కాదుగదా! నీ శతృవుని కాదుగదా. నన్ను ఎప్పుడూ ద్వేషించలేదు కదా. మరి ఇన్నాళ్ల తర్వాత నా అంతట నేనువచ్చి కలుసుకుంటే ఆశ్చర్యంకాని, సంతోషంకాని పడవేం?" అని అతన్ని గుచ్చిగుచ్చి చూస్తోంది.
    ఆమె మాటలూ, నిశితపరిశోధనలాంటి చూపులూ అతను భరించలేకపోయాడు. ఇన్నాళ్ళ తర్వాత ఆమెను చూసినప్పుడు కలిగిన అనుభూతి కాస్తా యీ పదునైన ప్రశ్నకు కసాపిసా అయేటట్లు వుంది.
    నిజానికి అప్పుడతని ఆంతర్యంలో యిలా వుంది. "ఓ, నువ్వంటే నాకెంత యిష్టం! నిన్ను చూడాలని యిన్నాళ్ళూ ఎంత తపనపడ్డాను! చిన్నతనంనుంచీ నిన్నెంత ప్రేమించాను. నీముందు అమాయకుడిగా వుండటం, నీచేత ఆడించ బడటం, వెటకారం చెయ్యబడటం నాకెంత యిష్టంగా వుండేది? నన్ను నువ్వు అసహ్యించుకునేదానివి. అయినా నువ్వంటే యిష్టమే. ఒకసారి నీ ప్రక్కన పడుకుని వున్నప్పుడు నాన్న యింటికి ఆలస్యంగా వచ్చి తలుపు తడితే "వెళ్ళి తియ్యరా పందీ" అని అవతలకు తోశావు. ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్లు గుర్తువుంది. మరోసారి చెరో అణా యిచ్చి కొనుక్కోమని అమ్మ మనని బజారుకు పంపిస్తే, నా డబ్బుకూడా నువ్వే లాక్కుని గప్ చిప్ లు కొనుక్కుని నాకు ఒక్కటికూడా పెట్టకుండా అన్నీ నువ్వే తినేశావు. అయినా నువ్వంటే యిష్టమే. నీ చీదరింపులే నాకు అమృతతుల్యంగా వుండేది. ఇంచుమించు మన యిద్దరి జీవితాలలోని ప్రతిరోజూ నాకు స్మృతిపథంలో వుంది. ఇన్నాళ్ళూ నీకోసం ఎలా అలమటించానో చెప్పటం నాకు చేతకాదు."
    "మాట్లాడవేం? ఈ శనిగ్రహం మళ్ళీ దాపరించిందని విచారిస్తున్నావా?"
    "అది సరేగాని, యీ వూరు ఎప్పుడు వచ్చావు?"
    "ఏం, అంత విసుగ్గా వుంది? నా ఉనికి గిట్టటం లేదా?"
    అదే ధోరణి, గుండెను పరపర కోసే అంతే శరపరంపరలు. మళ్ళీ నవ్వుకుంది. మనసుని చిల్లులు పొడిచే ముళ్ళచక్రంలాంటి విచిత్రహాసం.
    "ఆరునెలలయింది" అంది మళ్ళీ తనే.
    "ఆరునెలలు! ఇన్నాళ్ళూ కనపడలేదేం?"
    "అవసరంరాక" అంది నిర్లక్ష్యంగా.
    'అవసరం రాకపోతే ఇప్పుడు కూడా కనిపించేదానివి కాదన్నమాట' అని అడుగుదామనుకున్నాడు. కాని తల ఊపి వూరుకున్నాడు.
    "జయా!" అన్నదామె హఠాత్తుగా, మృదువుగా. "ఎందుకలా తెల్లబోయావు. అవసరం వుండి యిప్పుడు వచ్చానని గ్రహించావా?"
    మౌనంగా వూరుకున్నాడు.
    "నీకంటే నేను ఏడాదిమాత్రమే పెద్దదాన్ని. అయినా నీకంటే ఎంతో పెద్దదానిలా గోచరిస్తున్నాను కదూ."
    'మరే' అనలేదు జయ.
    "కాని కాదు" అన్నది హఠాత్తుగా. పెద్దపెట్టున నవ్వుతూ "ఎందుకంటే ఎంతో పెద్దవాడిలా అయిపోయావు. నిన్ను చూస్తే నాకంటే ఏడాది చిన్న అని ఎవరూ అనుకోరు."
    "అంటే?" అని ప్రశ్నించాడు జయ.
    "నువ్వు కొంచెం అందంగా తయారయివుంటావనుకున్నాను."
    అతని ముఖం మాడిపోయింది. చూపులు ప్రక్కకి మరల్చుకున్నాడు. ఆ చూపులు బూజుపట్టివున్న గోడను తాకాయి. ఆ బూజులోంచి మసగ్గా క్యాలెండరు కనిపిస్తోంది. అందులో దేశనాయకుడిదో, దేముడిదో బొమ్మ కనిపించింది. మృత్యుంజయరావుకు ఆ బొమ్మ 'వ్యక్తి'గా కనిపించింది.
    "చూశావా?" అంది గోడమీది వ్యక్తి.
    తెల్లబోయి తలపంకించాడు మంచంమీది వ్యక్తి.
    "ఇంతకుముందు దీనత్వం ప్రతిధ్వనించిన కంఠం యీ వ్యక్తిదే అంటే నమ్మగలుగుతున్నావా?" అంది గోడమీది వ్యక్తి.
    "ఇది పాతగొడవే" మంచంమీది వ్యక్తి.
    "అయినా నీకామె అంటే యిష్టమేకదూ!" గోడమీది వ్యక్తి.
    జవాబు చెప్పుకోటానికి సిగ్గుపడుతున్నాడు.
    "నాకు తెలుసు. అంతేకాదు. నిన్ను ఏవగించుకునే ప్రతిమనిషీ అంటేకూడా నువ్వు యిష్టపడతావు. కారణం చెప్పనా?"
    మంచంమీద వ్యక్తి గుండె గబగబ కొట్టుకుంది. "వొద్దు, వొద్దు. నాకు వినాలని లేదు' అనుకున్నాడు. అయినా అజ్ఞాతంగా మళ్ళీ ఆసక్తిగా వుంది. 'నాకు వినాలని లేకపోవడం నిజమా? ఆసక్తిగా వుండటం నిజమా?' అని ప్రశ్నించుకుంటున్నాడు.
    "రెండూ నిజం కాదుగానీ, కారణం విను. నిన్ను చూసి యితరులు ఏవగించుకోవటం సబబే అన్న నమ్మిక క్రమంగా నీలో దృఢపడిపోయింది. అందుకు."
    "అయ్యాబాబోయ్" నిజం" "నిజం" - "ఆఁ, ఏం కాదు."
    "అంతేకాదు. నువ్వు వాళ్ళతో మంచిగా వుంటే వాళ్ళు ఏవగింపును మరచిపోతారని నీకు మరో నమ్మిక."
    "ఛీ ఛీ, దారుణం!"
    జగతి నవ్వుతూ, "ఏ మాటా మాట్లాడకుండా వుండిపోయావు. ఈ శనిగ్రహం మళ్ళా దాపరించిందనా?" అంది తాజాగా అంటున్నట్లు. 
    తెప్పరిల్లి ఆమెవంక అయోమయంగా చూచాడు జయ.
    "పోన్లే! ఏమయినా అనుకో" అని నిర్లక్ష్యం ప్రకటించి, "నా గురించి వినాలని నీకు ఆతృతగా వున్నట్లుంది. ఆ కథ చెబుతాను విను" అని జగతి తన పూర్వగాథ చెప్పనారంభించింది.
    ఆరోజు యింట్లోంచిపారిపోయి అలా వెళ్లిపోయానా? అప్పుడు నాకెంత సంతోషంగా, గర్వంగా వుందనుకున్నావు? ఒక మంచిపని చేస్తున్నానాన్న సంతృప్తి పూర్తిగా ఆవహించివేసింది. నేనిందుకోసం పుట్టాను. నా జన్మ సార్థకమౌతోందని ఉర్రూతలూగాను. నేనిలా చెబుతున్నానని నీకసహ్యంగా వుందా?"
    "లేదు" అన్నాడు జయ అప్రయత్నంగా.
    "నిజమే కావచ్చు. కాని నువ్వు నన్ను అసహ్యించుకుని వుంటే నీ ధైర్యాన్ని నేనభినందించేదాన్ని. శ్రీధరం నన్ను కొద్దిరోజుల్లోనే మోసంచేసి వెళ్ళిపోతాడని నాకప్పుడే తెలుసు. అయినా వెళ్ళాను. ఎందుకంటే జీవితాదర్శం సుఖాన్వేషణ. అది యింట్లో కూర్చుని మనల్ని మనం దిద్దుకుంటూ, మనమీద ఒకరికి హక్కునిస్తూ, అది భరిస్తూ, రెక్కలు విరిగిన పక్షిలా గడపటం అన్వేషణాబుద్ధి గల మనిషి చేయతగ్గ పనికాదు. ఈ మోసం ఒక జీవితం నరకం చేయటానికిగా నాందీవచనమూ కాదు. చూచి ఝడుసుకోవలసిన మారణాంశమూ కాదు. శ్రీధరం నన్ను మోసం చేయకపోతే నేనే మోసం చేసివుండేదాన్ని. నిజం చెబితే పట్టుకు పీడిస్తాననుకున్నాడు. ఓ అర్ధరాత్రి పలాయనం చిత్తగించాడు.
    "అదయిపోయింది. అప్పటికి నాదగ్గర యింకా డబ్బు వున్నది. ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నాను. ఒక నలభయిఏళ్ళు దాటిన నడివయస్కుడు నావంక ఎగాదిగా చూస్తున్నాడు. కాసేపు తటపటాయించి పలకరించాడు. అది పరిచయంగా మారి, రైలు మా గమ్యస్థానం చేరకముందే, ఆ పరిచయం ఒక ఒక ఒడంబడికగా తయారయింది. ఆయన బాగా ఆస్తిపాస్తులున్నవాడు. పెళ్ళాంబిడ్డలూ వున్నారు, అయినా నన్ను ప్రేమించానని చెప్పాడు.
    "ఆయనపేరు గంగాధరం అనుకుందాం. గంగాధరంగారితో కొన్నాళ్ళు స్వేచ్చగా గడిచిపోయాయి. ఆయన వ్యాపారస్థుడు. వ్యాపారంమీద నెలకు యిరవై రోజులు ఊళ్ళు తిరుగుతూ వుంటాడు. ఆ యిరవైరోజులూ నన్ను తనవెంట తీసుకువెళ్ళేవాడు. అనేక ఊళ్ళు చూపించాడు. అనేక వింతలు చూపించాడు. డబ్బు పైలాపచ్చీస్ గా ఖర్చుపెట్టాడు. మా విషయం అతని భార్యకి తెలిసింది. ఏడ్చింది. గొడవచేసింది. నానా రభసా చేసింది. పిల్లల్నీ, మాంగల్యాన్నీ చూపించి అతనికాళ్ళు పట్టుకుంది. నాకే జాలేసి యింటికిపోయి పెళ్ళాం పిల్లలతో హాయిగా వుండమని చెప్పాను. అతను వినలేదు. 'నువ్వు లేకుండా నేను బ్రతకలేను' అని వాపోయాడు. రోజూ మా యిద్దరికీ పెద్దగొడవ క్రింద తయారయింది. వెళ్ళమని నేనూ, వెళ్ళనని అతనూ...


Next Page 

  • WRITERS
    PUBLICATIONS