Next Page 
అశ్వభారతం పేజి 1


                               అశ్వభారతం

                                         __ సూర్యదేవర రామ్ మోహన్ రావు.

 




    బొంబాయికి ఇరవై కిలో మీటర్ల దూరాన పూనే వెళ్ళే దారిలో పురాతనమైన బంగ్లా ఒకటుంది. ఆ బంగళా వయస్సు 250 సంవత్సరాలు. ప్రభుత్వ పరం కాకుండా ఓ పారిశ్రామిక వేత్త కొనేసి ఎక్స్ టీరియర్ అలాగే వుంచి, ఇంటీరియర్ అంతా అధునాతనంగా రెనోవేషన్ చేయించాడు.

    బయట ప్రపంచానికి మాత్రం అదో పాడుపడ్డ బంగళా. ప్రస్తుతం ఆ బంగళా మధ్య హాల్లో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఒకరు ఆ బంగళా యజమాని__మరొకరు ప్రొఫెషనల్ కిల్లర్ సుదర్శన్.

    అర్దరాత్రి దాటి అరగంటయింది. "పధకం పకడ్బందీగా సిద్ధం చేసుకున్నావా....? యజమాని అడిగాడు.

    "చేసుకున్నాను సార్. ఆపరేషన్ నెంబర్ వన్ మరో గంటలో మొదలవుతుంది...."

    "వెరీగుడ్...."

    "మీరు వింటానంటే పధకం ఓసారి చెబుతాను."

    అందులోనూ సక్సెస్ కి అవకాశాలు ఎక్కువో....తక్కువో మీరు అంచనా వేయగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది" అన్నాడు సుదర్శన్.

    అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే తన పధకాలు ఎప్పుడూ విఫలం కావనే నమ్మకం వున్నా ఒప్పుకున్న వారి దగ్గర ముందు జాగ్రత్తకి చెప్పడం సుదర్శన్ కి అలవాటు.   

    ఆయన మవునంగా తలూపాడు చెప్పమన్నట్లు. ఎంతో ప్రమాదకరమైన పని చేయాలనుకున్నప్పుడు చేయించాలనుకున్నప్పుడు మాత్రమే ఆ బంగ్లాకి వస్తాడు అతను.

    తనకప్పగించిన పని ఎంత ముఖ్యమైందో ప్రమాదకరమైందో తనని పిలిపించినప్పుడే సుదర్శన్ గ్రహించగలిగాడు.

    సుదర్శన్ తన పథకం చెప్పటం ప్రారంభించాడు.

    "ఈ రాత్రి ఒంటిగంటకు ఆ వ్యాన్ బయలుదేరుతుంది. దానికి ముందు పైలట్ గా ఒక జీప్ దానికి వెనుక ఎస్కార్ట్ గా ఒక జీప్ బయలుదేరుతాయి. అవి నేనెంచుకున్న ప్రాంతానికి వచ్చేసరికి కాస్త అటు ఇటుగా 1_25 నిమిషాలవుతుంది.

    ఇప్పుడు ఈ బంగ్లా వెనుక చెట్లచాటున అదే మోడల్. అదే రంగులోవున్న వ్యాన్ అలాంటివే రెండు జీప్స్ రెడీగా వున్నాయి. మరో ఐదు నిముషాల్లో వీటిని తీసుకుని నేనా ప్రాంతానికి వెళ్ళి కాపుకాసి వుంటాను...."

    మధ్యలో అతను అడ్డు తగలడంతో ఆగిపోయాడు సుదర్శన్. "అదే మోడల్ అదే రంగు వ్యాన్ జీప్స్ అని ఎలా చెప్పగలవు...." వాటిని వాళ్ళు ఆఖరి క్షణంలో మార్చివేస్తే....?"

    కాలుక్యులేటెడ్ గా అడుగుతున్న అతనివంక ఓ క్షణం నిశితంగా చూసి అన్నాడు సుదర్శన్. "వాళ్ళు వాటిని రెండు రోజుల క్రితమే సిద్ధం చేశారు. వాటిని రహస్యంగా ఫోటోస్ తీయించాను. ఆ ఫోటోల ఆధారంగా మన వెహికల్స్ సిద్ధం చేయించాను. ఇంతవరకూ తేడా లేదు మీరన్నట్లు. వాళ్ళు ఆఖరి క్షణంలో ప్లాన్, వెహికల్స్ మార్చే ప్రసక్తి రాదు. ఎందుకంటే ముందు జీప్ లో నలుగురు, వెనక జీప్ లో నలుగురు అవసరం అయితే అవతల వారి రక్తం కళ్ళజూసే కిరాతకులు రక్షణగా వస్తున్నారు. కనుక వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుందని అధైర్యపడరు. అలాంటప్పుడు ప్లాన్ ఆఖరుక్షణంలో మార్చుకోరని నా అంచనా. ఒకవేళ అలా జరిగినా అందుకు సిద్ధపడవచ్చు." ధీమాగా అన్నాడు సుదర్శన్.

    "నీకా మాత్రం ఆత్మ విశ్వాసం వుండటం మంచిదే. కాని ప్రతిక్షణం అప్రమత్తంగా వుండాలి. అన్నిటిని మించి ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి. తెలివిగా వారిని దెబ్బకొట్టి పని సాధించాలి. ఆ సందర్భంలో ఎలాంటి ఘర్షణ రక్తపాతం జరగటం నాకిష్టం లేదు.

    మోసానికి మోసం_ దెబ్బకు దెబ్బ_ హత్యకు హత్య_ ఇదే నా పద్ధతి. వారం క్రితం మనల్ని చాలా తెలివిగా కేవలం తెలివి తేటలతో దెబ్బ తీశారు. రక్తపాతంలో ఘర్షణలో ఓడిపోవటం కన్నా అవతలివాడి తెలివి తేటలకు మోసపోవటం గొప్ప అవమానం నా దృష్టిలో.... అర్ధమైందనుకుంటాను....?" ఒక క్రమ పద్ధతిలో మాట్లాడుతున్న అతని వేపు చూస్తూ అలాగేనన్నట్లు తలూపి "నాకు టైమైంది ప్లాన్ పూర్తిగా చెప్పేందుకు ఇప్పుడిక వీలుపడదు. వచ్చాకే వెళ్ళొస్తాను...." అంటూ సెల్యూట్ చేసి గిరుక్కున వెనుతిరిగాడు.

    మాట్లాడేప్పుడు ఎంతో తాపీగా మాట్లాడే సుదర్శన్, చేతలప్పుడు అంత షార్పుగా వుంటాడు.

    రెండు నిమిషాల్లో బంగ్లా వెనక్కు చేరుకున్నాడు. పల్చని వెన్నెల్లో ఎత్తయిన చెట్లు. గుబురుల్లాంటి పొదలు భయం గొల్పేవిగా వున్నాయి.

    కావాలనే ఆ బిల్డింగ్ చుట్టూ పాడుబెట్టారు. బిల్డింగ్ వెనక నుంచే చిట్టడవి ప్రారంభమవుతుంది.

    సుదర్శన్ సైగ చేయడం వెహికల్స్ బయలుదేరటం అడవిలోకి దూసుకుపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

    పదిహేను నిముషాలు ప్రయాణించి ఓ చోట పొదల మాటున ఆగిపోయాయి మూడు వెహికల్స్.

    అంతకుముందురోజే ట్రైనింగ్ ఇచ్చి వుండటం చేత చకచకా పనులు చేసుకు పోతున్నాడు.

    ఒక డ్రైవర్__ "రోడ్డు రిపేరులో వుంది. టెక్ డైవర్షన్ అన్న బోర్డుని వ్యాన్ లోంచి దింపాడు.

    అక్కడికి కేవలం 50 అడుగుల దూరంలో రోడ్ కనిపిస్తోంది. ఆ రోడ్డు పెద్ద మలుపు తిరిగి కొంత దూరం స్ట్రెయిట్ గాసాగి మరలా, మరో మలుపు తిరుగుతుంది. రెండో మలుపు తిరిగే దగ్గర చెట్ల చాటు నుంచి కాపుకాసి వున్న సుదర్శన్ మనుషులు అతని సైగనందుకుని ఒక జీపును రోడెక్కించి రెండో మలుపుకి కొంచెం ముందుగా ఎడం వైపుకి చీలిన మరో రోడ్ లోకి తీసుకెళ్ళి ఇంజన్ లైట్స్ ఆపి రెడీగా వున్నారు.

    ఇప్పుడు వ్యాన్ ముందు ఆ తరువాత రెండో జీప్ ఏ క్షణంలోనయినా రోడెక్కేందుకు సిద్ధంగా వున్నాయి.

    ఒకతను రెండు చేతులతో బోర్డ్ పట్టుకుని సిద్దంగా వున్నాడు.

    కీచురాళ్ళ శబ్దం తప్ప మరేం వినిపించటం లేదు. అడివంతా భయంకరమైన నిశ్శబ్దం....

    రాబోయే ముహూర్తం కొరకు వేటకుక్కల్లా ఎదురు చూస్తున్నారు సుదర్శన్ మనుషులు.

    క్షణాలు....నిమిషాలు....

    సరిగ్గా టైం 1,24 అవుతుండగా వెహికల్స్ వస్తూన్న శబ్దం వినిపించింది.

    బోర్డు పట్టుకున్న వ్యక్తి శివంగిలా రోడ్డు మీదకి దూకి ఒక చెట్టు మొదలు మాటున దాక్కున్నాడు.

    మొదటి మలుపుకు ముందు రోడ్డు వారగా చీకట్లో వున్న మధ్య వ్యక్తి అప్పటి వరకు కట్టి వుంచిన గొర్రెల్ని తోసుకుని రోడ్డు దోవకు వచ్చాడు.

    అవతల గ్రూప్ లోని పైలట్ జీప్ దాటనిచ్చాడు. వెంటనే వ్యాన్ కి అడ్డంగా గొర్రెల్ని ముందుకు తోలాడు. చూసేవారికి వాటంతటవే రోడ్డుకి అడ్డంగా వచ్చాయనుకుంటారుగాని కావాలని ఎవరో ఆ పని చేసినట్లు తెలియదు.

    వ్యాన్ కి దాని వెనుకవస్తున్న ఎస్కార్ట్ జీప్ కీ మధ్య మరికొన్ని గొర్రెల్ని తోలాడు. తమ జీప్ కి, ఫాలో అవుతున్న ఆ వ్యాన్ కి మధ్య గొర్రెలు అడ్డువచ్చి వ్యాన్ ఆగిపోయిందని పైలట్ జీప్ లోని వ్యక్తులు గమనించలేదు.

    ముందు జీప్ మొదటి మలుపు తిరిగి స్ట్రయిట్ రోడ్డులోకి వచ్చింది. రెండో మలుపు సమీపిస్తుండగా జీప్ తనను దాటగానే చెట్టుచాటున దాగిన వ్యక్తి చెంగున మీదకు దూకి రోడ్డు మధ్యలో బోర్డు పెట్టేసి అంతే వేగంతో రోడ్డు ఆ వేపుకి గెంతాడు.

    గొర్రెల్ని దాటుకొని వ్యాన్ మొదటి మలుపు తిరిగి నేరుగా రోడ్ లోకి రాగానే ఎదురుగా టేక్ డైవర్షన్ బోర్డు కనిపించింది. ఎడంవేపువున్న మరో రోడ్ లోకి చూసిన వ్యాన్ డ్రైవర్ కి సుదర్శన్ అక్కడ వుంచిన జీప్ స్టార్ట్ అయి స్లోగా ముందుకు పోవటం కనిపించింది. అదే తమ ఫైలట్ జీప్ అనుకొని వ్యాన్ ని ధారి మళ్ళించాడు డ్రైవర్.

    అంతే, ఆ మరుక్షణం అప్పటివరకూ అవతల దాక్కున్న వ్యక్తి మరలా వెంటనే రోడ్డెక్కి బోర్డు తీసుకొని సుదర్శన్ వున్న వైపు గెంతాడు.

    అప్పటికి గొర్రెలు అడ్డు తొలగటంతో అవతల గ్రూప్ లోని ఎస్కార్ట్ జీప్ మొదటి మలుపు తిరిగింది. అప్పుడే రోడ్డెక్కి ముందుకు వెళ్తూన్న సుదర్శన్ వ్యాన్ ని చూసి తమ వ్యాన్ గానే భావించిన ఎస్కార్ట్ జీప్ దాన్ని ఫాలో అయింది. సుదర్శన్ వున్న స్పాట్ ని ఎస్కార్ట్ జీప్ దాటగానే సుదర్శన్ రెండో జీప్ రోడ్డెక్కి ఎడంవేపు వున్న అడ్డదారిలోకి ప్రవేశించి ముందు వెళ్తూన్న అవతల గ్రూప్ వ్యాన్ ని అనుసరించసాగింది.

    పకడ్బందీగా ఆపరేషన్ నెంబర్ ఒన్ పూర్తయింది. అప్పుడు సుదర్శన్ గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు.

    దారి మళ్ళించిన రోడ్ లో వెళ్తూన్న అసలు వ్యాన్ లోని వ్యక్తులు ముందూ వెనుకా చూసి ఫాలో అవుతున్న జీప్స్ తమవే అని భ్రమించారు. ఏ రోడ్డన్నది ఆ వ్యాన్ లోని వ్యక్తులకు అనవసరం. ఫైలట్ జీప్ ని అనుసరించటమే వాళ్ళు చేయాల్సిన పని.

    పైలట్ గా వెళుతున్న సుదర్శన్ జీప్ తనకు కావాల్సిన రోడ్ గుండా తమ స్థావరానికి పోతుంది వేగంగా.

    అసలు రోడ్ లో ముందు వెళ్తూన్న ఫైలట్ జీప్ లోని వ్యక్తులు అప్పుడప్పుడు వెనక్కు తిరిగి చూసినా, సుదర్శన్ వ్యాన్ ఫాలో కావటం చూసి తమ వ్యానే అనుకొని పూనే వేపు సాగిపోతుంది, అది తమ వ్యానే అనుకుంటున్న వెనుక వున్న ఎస్కార్టు జీప్ సింపుల్ గా దాన్ని ఫాలో అవుతోంది.

    ఎలాంటి గొడవ, ఘర్షణ లేకుండా, రక్తపాతం అసలే లేకుండా లక్షల ఖరీదు చేసే రెండు మేలుజాతి గుర్రంపిల్లలు సుదర్శన్ చేతికి చిక్కాయి.


                                *    *    *

   
    పెద్ద సరస్సు ఆ పక్కనున్న యూకలిప్టస్ చెట్ల ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు సూటిగా సరస్సులోని ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి.

    ఆ ప్రాంతంలో నీరంతా లేతాకు పచ్చరంగులో మెరుస్తోంది. ఆ సరస్సుకి కుడివేపు ఒడ్డున మనిషంత ఎత్తు ఎదిగిన పచ్చిక దుబ్బు చక్కగా ఆకుపచ్చ రంగులో, పదహారేళ్ళ ఆడపిల్లలా ఉంది.

    దాని పక్కనే రెండు బండరాళ్ళు నల్లగా నిగనిగ మెరుస్తున్నాయి. ఆ బండరాళ్ళ ప్రక్కనే నిలువెత్తున ఒక గుర్రం.

    ఆ గుర్రం నల్లగా, నీగ్రో అమ్మాయిలా మిస మిస లాడుతుంది. దాని నల్లటి వంటి మీద అక్కడక్కడా బూడిదరంగు మచ్చలున్నాయి. మెడ మీద పొడవాటి జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతున్నట్లుగా కనిపిస్తోంది.

    ఆ గుర్రం ఎక్కడ నుంచో దూరతీరాల నుంచి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకున్నట్లుగా వుంది.

    అదొక దృశ్యం.

    అది నిజమైన గుర్రం కాదు. అదొక సజీవ చిత్రం అని పోల్చుకోడానికి వీల్లేకుండా వుంది.

    అందమైన గోడకి నిలువెత్తు సైజున ఆన్చి వుంది ఆ చిత్రం. ఆ చిత్రం క్రింద 'రాయల్ కింగ్ కెనడా 15 లక్షలు' అని ఇంగ్లీషులో వుంది.


                               *    *    *


    స్థలం: బొంబాయి.

    సమయం: సాయంత్రం ఆరుగంటలు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS