Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 2

    "అయితే మనం వండుకుని తింటున్నది బిచ్చగాళ్ళు కూడా తినరన్న మాట!!..."

    "మనం అని నన్ను కూడా నీతో  కలపకు... నా వంట బాగానే ఉంటుంది...."

    "అవునవును... నిన్న నువ్వేగా వంట చేశావ్!.... అది తిని భళ్ళున వాంతి కూడా చేస్కున్నావ్" గుర్తు చేస్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "చాల్లేవోయ్... నాకు భోజనం చెయ్యకముందే వికారంగా అదో మాదిరిగా ఉంది..." అన్నాడు కన్నారావు.

    "అయినా మనకీ బాధలు ఎన్నాళ్లురా? పెళ్ళి చేస్కుంటే ఈ బాధలన్నీ ఉండవ్..." అన్నాడు చిట్టబ్బాయ్.

    "అవునవును... కానీ నాకప్పుడే పెళ్ళి చేస్కోవాలని లేదు. నేను చేసుకోకపోయినా ఫరవాలేదులే, నువ్వు చేస్కుంటే చాలు. వదిన చేతివంట నేను కమ్మ కమ్మగా తినొచ్చు!" లొట్టలు వేస్తూ అన్నాడు కన్నారావు.


    "అయితే అప్పుడు కూడా నువ్వు మాతోనే తగలడ్తావా?...." చిట్టబ్బాయ్ మొహం చిట్లించాడు.

    "మరి?.... నీ క్లోజ్ ఫ్రెండుని. నినెక్కడ వదిలిపెట్టి వెల్తానోయ్.... అయినా అప్పుడు ఈ ఇరుకు పోర్షన్లో ఎందుకుంటాం?.... మంచి ఇల్లు తీస్కుంటాం. నేను ఓ మూల గదిలో పడుంటాను, మిమ్మల్నేమీ డిస్టర్బ్ చెయ్యనులే.."


    కన్నారావు ఇలా అంటుండగా కాలింగ్ బెల్ మోగింది. కన్నారావు తలుపు తియ్యడానికి వెళ్ళబోయాడు కానీ చిట్టబ్బాయ్ అడ్డుకున్నాడు.


    "వద్దురా కన్నా మళ్ళీ... ఏ అడుక్కునేవాడో అయ్యుంటాడు, బెల్ నొక్కీ నొక్కీ వాడే పోతాడు."

    కన్నారావు ఆగిపోయాడు.

    రెండు నిముషాలపాటు కాలింగ్ బెల్ మోగింది.

    "వెధవ... ఇందాకటి ముష్టివాడే అయ్యుంటాడు. ఇందాక భోజనానికి మాత్రమే డబ్బులు ఇచ్చాం కదా... ఇప్పుడు కిళ్ళీకి సిగరెట్టుకి కూడా అడగడానికి వచ్చాడేమో!!..." అన్నాడు చిట్టబ్బాయ్ పళ్ళు నూరుతూ.


    మరి కాస్సేపు కాలింగ్ బెల్ నొక్కిన తరువాత తలుపు చెక్కలూడేలా బాదడం మొదలుబెట్టాడు అవతలి మనిషి.

    "ఓరి వీడి ధైర్యం మంటెట్టా... తలుపెలా బాదుతున్నడో చూడు. తలుపుతీసి నాలుగు టెంకి జల్లలు తినిపంచి పంపెయ్ రా కన్నా..." అన్నాడు చిట్టబ్బాయ్ కోపంగా.


    "నేను తలుపు తీస్తాను... ఆ టెంకి జల్లలేవో నువ్వే తినిపించు" అన్నాడు కన్నారావు.

    ఇద్దరూ విసురుగా తలుపు దగ్గరికి వెళ్ళారు. కన్నారావు తలుపు తీశాడు.

    అవతలి మనిషిని చూసి ఇద్దరూ ఓ వెర్రినవ్వు నవ్వారు.

    "ఏంటోయ్... ఇందాకట్నుండీ తలుపు తడ్తుంటే, కాలింగ్ బెల్ నొక్కుతుంటే తలుపు తియ్యరేం?... ఏం చేస్తున్నారు లోపల?" అన్నాడు అతను. అతని పేరు మోహన్. చిట్టబ్బాయ్, కన్నారావులు పనిచేసే ఆఫీసులోనే వేరే డిపార్టుమెంట్లో పనిచేస్తున్నాడు.


    "అబ్బే, మేమేం చేస్తాం?.... నేనేమో బాత్రూమ్ లో ఉన్నాను. వాడేమో లెట్రిన్లో ఉన్నాడు. అందుకే తలుపు తియ్యడం ఆలశ్యం అయ్యింది." సర్ది చెప్పాడు చిట్టబ్బాయ్.


    "నువ్వెప్పుడూ ఇంతే, ఏ పని చేసినా ఇలానే ఉంటుంది." చిరాకుపడ్తూ అన్నాడు కన్నారావు.

    "బాత్రూములో ఏం చేశావ్?" మోహన్ ఆశ్చర్యంగా చిట్టబ్బాయ్ వంక చూస్తూ అన్నాడు.

    "ఏం చేస్తాను? స్నానం చేశాను!" సమాధానం ఇచ్చాడు చిట్టబ్బాయ్.

    "మరి కన్నారావు అలా అంటాడేం?"

    "ఓ అదా? వాడేమో నన్ను లెట్రిన్లోకి వెళ్ళమన్నాడు. తనేమో బాత్రూమ్ లోకి వెళ్తానన్నాడు. నేను వాడిమాట విన్లేదు. అందుకనే అలా అంటున్నాడు. చెప్పు ఏంటి ఎన్నడూలేంది ఇలా మా రూమ్ కి దయచేశావ్?"


    మోహన్ ఒకసారి ఇద్దరివంకా అయోమయంగా, అనుమానంగా చూసి బ్యాగ్ లోంచి కార్డుతీసి చిట్టబ్బాయ్ చేతికి అందిస్తూ అన్నాడు. " నా పెళ్ళి వచ్చేవారం సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది.... మీరు ఇద్దరూ తప్పకుండా రావాలి."


    చిట్టబ్బాయ్, కన్నారావు ఇద్దరూ మోహన్ ని కంగ్రాచ్యులేట్ చేశారు. పెళ్ళికి తప్పకుండా వస్తామని చెప్పారు.

    "నేను ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి!.... వస్తాను" అని చెప్పి గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూసి "తలుపు గడేస్కోండి, బెస్ట్ ఆఫ్ లక్" అని వెళ్ళిపోయాడు.


    చిట్టబ్బాయ్ కన్నారావు మొహమొహాలు చూస్కున్నారు.

    "అలా అంటాడేం?" అయోమయంగా అడిగాడు చిట్టబ్బాయ్.

    "కొంపదీసి మనగురించి ఏమనుకుంటున్నాడో ఏమిటో?" నువ్వేపని చేసినా ఇలానే ఉంటుంది... అంత చిన్న విషయానికి అబద్ధం ఆడకపోతేనేం బాత్రూమ్ లో ఉన్నాం అంటూ" అన్నాడు కన్నారావు విసుగ్గా మొహం పెడ్తూ.


    "లేకపోతే నువ్వు ఏ బిచ్చగాడివో అంట్లవెధవ్వో అనుకుని తలుపు తియ్యలేదు అని చెప్పమంటానా? సర్లె, సర్లే నీతో ఇలా వాదించుకుంటూ కూర్చుంటే ఇంక ఈ వేళ తిండి తిన్నట్టే, పద కిచెన్ లోకి వెళ్దాం" అంటూ వంటగదిలోకి దారితీశాడు చిట్టబ్బాయ్. కన్నారావు అతన్ని అనుసరించాడు.


    మళ్ళీ స్టౌ అంటించి దానిమీద కాస్త పప్పుపడేశాడు చిట్టబ్బాయ్. కన్నారావు వంటగదిలో కుర్చీ వేస్కుని కూర్చున్నాడు.

    "ఈసారైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పప్పు మాడకుండా వండు..." అన్నాడు కన్నారావు

    మాడ్తే చెప్పడానికి నువ్వెదురుగా ఉన్నావ్ గా!" అన్నాడు చిట్టబ్బాయ్.

    పదిక్షణాలు వాళ్ళ మధ్య నిశ్శబ్దంగా దొర్లాయ్. చిట్టబ్బాయ్ మనసు మోహన్ పెళ్ళి గురించే ఆలోచిస్తూంది.

    "అసలు వాడెందుకలా అన్నాడ్రా..." చిట్టబ్బాయ్ ఆలోచనలకు అంత రాయం కలిగిస్తూ అన్నాడు కన్నారావు.

    "ఏది?" అన్నాడు చిట్టబ్బాయ్ ఈ లోకంలోకి వస్తూ.

    "అదే... బెస్ట్ ఆఫ్ లక్ అనీ, తలుపులేస్కోమని..."

    "ఒళ్ళు కొవ్వెక్కి... వాడే పెద్ద గొప్పగా పెళ్ళి చేస్కుంటున్నాడని గర్వం... ఏం మనం పెళ్ళి చేస్కోలేకనేనా?".... తల్చుకుంటే ఎప్పుడో చేస్కుని ఉండే వాళ్ళం..." అన్నాడు పళ్ళు నూర్తూ చిట్టబ్బాయ్.


    "తల్చుకుంటే చేస్కుని ఉండేవాళ్ళం అంటే ఎవరు వింటారు... మనం చేస్కోలేదు అంతే.... వాడు చేస్కుంటున్నాడు..."
అన్నాడు కన్నారావు.


    "సర్లేవోయ్... వాడిలాగ చేస్కుంటే ఎప్పుడో నా పెళ్ళి అయిపోయి ఉండేది..."

    "అంటే?" ప్రశ్నార్ధకంగా చూశాడు కన్నారావు.

    "అంటే పెద్దవాళ్ళు చూపించిన నలుగురు అమ్మాయిల్ని చూడడం, అందులో ఒక అమ్మాయిని ఎన్నుకుని పెళ్ళి చేస్కోడం.. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అంత చప్పగా జరిగిపోవడం నాకిష్టంలేదు...."


    "మరి ఇంకేం చెయ్యాలంటావ్?"

    "ఒక అడ్వంచర్ చెయ్యాలి!... మనకి కావలసిన అమ్మాయిని మనమే వెతుక్కుని ప్రేమించి పెళ్ళి చేస్కోవాలి!! ఆ థ్రిల్లే వేరు...." పరవశంగా అన్నాడు చిట్టబ్బాయ్.


    "కానీ దానికి సంబంధించిన ప్రయత్నమేమీ నువ్వు చేస్తున్నట్టు లేదుగా?"

    "ఎక్కడా?... మన యింటి ఓనరుకి కూతుళ్ళు ఎవరూలేరు..."

    "ఎందుకులేరు? ఇద్దరు ఉన్నారుగా" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు కన్నారావు.

    "వాళ్ళు ఉన్నా లేనట్టే... ఒకతె నాలుగోక్లాసు చదువుతుంది... ఇంకొకతేమో ఆరోక్లాసు చదువుతోంది! అయినా నీకు బుద్ధుందా అని? నేనేమో ప్రేమించి పెళ్ళి చేస్కోడం గురించి మాట్లాడుతుంటే నువ్వేమో నాలుగో క్లాసమ్మాయి గురించి, అయిదో క్లాసమ్మాయి గురించీ మాట్లాడ్తావేం?.... యల్కేజీ చదివే అమ్మాయి లెవ్వరూ కనపడ్లేదా నీకు?" కోపంతో అరిచాడు చిట్టబ్బాయ్.


    "లేకనేం... ఉన్నారుగా! యల్కేజీ చదివే అమ్మాయిలు మన ఎదురింట్లో ఒకరు.... వెనక లైనులో ఇద్దరు... ఆ పక్క సందులో నలుగురూ..." చెప్పుకుపోతున్నాడు కన్నారావు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS