Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 2


    "కన్నీటి బతుకుల్లో పన్నీటీ బుడగలు! అన్న నవల ఇంకా రిటర్న్ చెయ్యలేదా!"
    "ఇవాళ రిటర్న్ చేసేస్తున్నాం సార్!" అన్నాడు పీయే.
    "ఇతను స్వయంగా వచ్చారు. తనే పట్టుకెళ్ళిపోతాడు. ఇచ్చెయ్యండి."
    ఆ మాట వినగానే ఆ యువ రచయిత మొహం కందగడ్డలా ఎర్రబడింది.
    "అంటే......నా నవల మీకు నచ్చలేదా?" అన్నాడు తీవ్రంగా.
    "ప్రస్తుతం అవకాశం లేదు. సారీ"
    "దాన్లో లోపం ఏమిటో చెప్పండి" అన్నాడు. అతను నిలదీస్తూన్నట్లు.
    పీయే తెచ్చిన మాన్యు స్రిప్ట్ తెరిచి ఒక పీజీ చూపించాడు ఎడిటర్.
    "ఇది చదవండి."
    చూశాడు ఆ రచయిత.
    రొట్టెల దుకణం ముందు ఆగి ఉన్నాడు ప్రణయ్,
    అతని విశాల మనస్సులో ఎన్ని ఆవేదనో!
    సుషమ హ్యధయంలో అతనికి స్తానం ఉండున!
    ఆమె కోషం అతను యెన్ని జన్మల నుండి
    ఎదురు చూచెను? భాగామంతుడు ఎంత నిర్ధముడు!
    ప్రణయ్ కోషం సుషమ్మ కూడా తపించును.
    లిప్ స్టిక్కు రాచుకున్న ఆమె పెదవులు చిగురు
    టాకుల వలె ఘజఘజలాడెను! ఆమె మధిలో అతని
    రూపము ప్రతిరూపము ప్రతిభింభించి ఫ్రతి
    ఫలించేను! కానీ వారి నిశ్చల ప్రేమ ఫలించున?
    ప్రణయ్ అనురామముతో సుషమ్మ పరిసించి దీన
    ముగ ఉండెను.

                                       (సశేషం)


    "ఏం ! బానే ఉందిగా?" అన్నాడు అతను.
    ఎడిటర్ కి నవ్వూ ఏడుపూ రెండూ కలిసి వచ్చాయి.
    రాయాలనే కుతూహలం! ఎలా రాయాలో తెలియని తనం!
    అదీ ఆ కుర్రాడి పరిస్థితి!
    "ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలి! ముందు చిన్న కధలతో మొదలెట్టండి. అల్ ద బెస్ట్. " అన్నాడు అనునయంగా.
    ఆ అబ్బాయి ముక్కుపుటాలు కోపంగా పెద్దవయ్యాయి. శ్వాస బుసలా మారింది.
    "మా ప్రెండ్సందరూ దీన్ని చదివి సూపర్ అన్నారు. తప్పకుండా సీరియల్ గా వస్తుంది, తర్వాత సిన్మా కూడా వస్తుంది అని చెప్పారు. మీరు నానా చెత్తా వేసుకుంటారు గానీ మంచివి రాస్తే వేసుకోరు" అన్నాడు.
    "మమ్మల్ని క్షమించండి! మీ రచనలని వేసుకునే స్థాయికి మా పత్రిక ఇంకా ఎదగలేదు" అన్నాడు ఎడిటర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ.
    "నాకేం! మీ పత్రిక సర్కులేషన్ పెంచుకునే అవకాశం నాశనం చేసుకుంటున్నారు. ఇంక చాలు నా రచనలు మీ పత్రిక్కి ఇవ్వను" అని లేచి, విసవిస నడుస్తూ వెళ్ళిపోయాడు ఆ రచయిత. విసుగ్గా వెనక్కి జారగిలబడ్డాడు ఎడిటర్.
    ఒక్కొక్క రోజు ఇంతే........ఆఫీసుకి వచ్చింది మొదలుకుని.............
    సబ్ ఎడిటర్ ఒకతను లోపలకు వచ్చాడు. ప్రింటయిన కవరు పీజీ అతని చేతిలో వుంది. దాన్ని ఎడిటర్ ఆప్రూవల్ కోసం తీసుకొచ్చాడు అతను.
    దాన్ని చూడగానే ఎడిటరు మొహం అప్రసన్నంగా అయింది. అతను వుహించిన ఎఫెక్టులో యాభైశాతం కూడా ప్రింటింగ్ లో రాలేదు. చాలా నావెల్ అయిడియా అది. కానీ ప్రింటింగు సరిగా రాకపోతే అంత గొప్ప ఐడియా కూడా వేస్టయిపోతుంది.
    "దిసీజ్ నో గుడ్! రెడ్ ఇంకొంచెం ప్రామినేంట్ గా రావాలి. బ్లూ తగ్గాలి" అన్నాడు ఎడిటరు అసంతృప్తిగా. క్వాలిటీ విషయంలో అతను రాజీపడడు.
    మాట్లాడకుండా తలవూపి, కవరు పేజీ పట్టుకుని వెళ్ళిపోయాడు సబ్ ఎడిటరు.
    అశాంతిగా కుర్చీలో అటూ ఇటూ కదిలాడు ఎడిటరు.
    అప్పుడు అతని దృష్టిని ఆకర్షించింది ఒక ప్లెయిన్ ఎన్వెలప్.
    ఆప్రయత్నంగానే దాన్ని ఓపెన్ చేశాడు.
    లోపల నీట్ గా పిన్ చేసిన కాయితాలు.
    వాటిమీద కుదురుగా అక్షరాలు.
    అనుకోకుండానే చదివాడు.
    "నిత్యం హత్యలు చేసేవాళ్ళని కూడా పట్టించుకోరుగానీ, ఓ ప్రియా, నేను నీ కోసం నిట్టూర్చినా నిందవేస్తారీ లోకులు"
    ఒక్కసారిగా, కిటికీలో నుంచి పరిమళ భరితమైన పిల్లతెమ్మరసోకినట్లయింది ఎడిటరుకి.
    ఎంత ఫ్రెష్ థాట్! సమ్మర్ బ్రీజ్ లాగా!
    చాలా పాయెటిక్ రాశాడు అతనెవరో! లేకపోతే అమ్మాయా!
    ఏమో!
    కె. ఎస్ అని రెండు పొడి అక్షరాలు!
    అంతే!
    చక్కని శైలి! చక్కటి శిల్పం! బిగువయిన కధనం!
    ఊహించని మలుపుతో ముగిసింది కధ. "అయ్యో! అప్పుడే అయిపోయిందా" అనిపించేలా వుంది.
    వెంటనే తన పీయేని పిలిచి, ఆ కధని యాక్సెప్ట్ చేస్తున్నట్లు లెటర్ రాయించాడు ఎడిటరు.
    ఆ లేతరులోనే, వీలయితే తనను ఓసారి కలుసుకోమని రచయితని కోరాడు కూడా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS