Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 2


    చంద్రానికి అన్న కూతురు రజని అంటే ప్రాణం. బాబాయి ఉంటే ఆ పసిదానికి ఇంకెవరూ అక్కరలేదు.

 

    చంద్రం పదునాలుగేళ్ళు దాటి పదిహేనో ఏడులో అడుగుపెట్టాడు. బక్కపలచగా ఉండే చంద్రం ఉన్న వయసుకంటే ఓ సంవత్సరం చిన్నగానే కనిపిస్తాడు. చామనఛాయ, నొక్కులజుట్టు, దట్టమైన కనుబొమ్మలకింద ఎప్పుడూ ఏదో ఆలోచనలను నింపుకొని ఉండే చిన్నవైనా చురుకైన కళ్ళూ, విశాలమైన ఫాలభాగము, పొడవుగా కొంచెం వంగివుండే ముక్కు, కొంచెం లావుగా కనిపించే పెదవులు - చంద్రం మొత్తంమీద స్ఫురద్రూపి అనే చెప్పాలి.

 

    ఏం చేస్తే వదినచేత తిట్లు తినాల్సివస్తుందో ననే భయంలో పెరిగిన చంద్రం కొత్తవారి ముందు మాట్లాడటానికి జంకుతాడు. హేమ ప్రోత్సాహం లేకుండా ఏ పనీ ధైర్యంగా చెయ్యలేడు.

 

    ఆనాడు స్కూల్లో పేరెంట్సు డే, అన్నా - వదినా వచ్చి తను స్కూల్లో ఎలా ప్రయోజకుడనిపించుకుంటున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు. చీటికీ మాటికీ చీదరించుకునే వదినకు తనేమిటో తెలుస్తుందని ఆశించాడు. అన్న కృష్ణారావు తన ప్రయోజకత్వం చూసి మురిసిపోతాడని చిత్రించుకున్నాడు మనస్సులోనే చంద్రం. కాని కనీసం అన్నకూడా రాకపోవటం ఎంతో కష్టమనిపించింది అతనికి. అదే అమ్మా - నాన్నా బ్రతికుంటే అలా చేసేవారా? అన్నయ్యకు తనంటే ప్రేమే. వదినకు భయపడి వచ్చి ఉండడు. అయినా అన్నయ్య వదినకు అంతగా ఎందుకు భయపడాలో! అదే తనయితేనా?    

 

    చంద్రానికి ఏడుపు పొర్లుకొచ్చింది. దిండులో తలదూర్చి ఏడ్చాడు.

 

    వరండాలో పరధ్యాన్నంగా కూర్చొనివున్న కృష్ణారావు, భార్య కాంతమ్మ అన్నానికి లేవమని కేకపెట్టడంతో ఈ ప్రపంచంలోకి వచ్చాడు.   

 

    "చంద్రం భోజనం చేశాడా?" భార్య ముఖంలోకి చూడకుండానే ప్రశ్నించాడు కృష్ణారావు. ఈనాడు తమ్ముడిమీద అనురాగం, జాలీ కట్టలు తెంచుకున్నాయి కృష్ణారావు హృదయంలో. మరోవైపు మొదటిసారిగా భార్యంటే ఓ విధమైన అసహ్యం కలుగుతూంది. ఆమె గొంతు వినిపిస్తే కోపం ఉబికివస్తుంది.   

 

    "దొరగారు గదినుంచి బయటకొస్తేనా? ఆయనగార్ని సాగతీసే ఓపికా, తీరికా ఇక్కడ ఎవరికీ లేవు" అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది కాంతమ్మ వంటింట్లోకి. అలా వెళుతున్న భార్యను చూస్తుంటే కృష్ణారావుకు పుట్టలోకి వెళుతున్న జర్రుగొడ్డును చూసినట్లనిపించింది.

 

    గబగబా తమ్ముడి గదిలోకి వెళ్ళాడు. చంద్రం వెల్లికిలా పడుకొని నిద్రపోతున్నాడు. అలా నిద్రపోతున్న చంద్రం ముఖంమీద కట్టిన కన్నీటి చారలు చూడగానే కృష్ణారావుకు దుఃఖం పొర్లుకొచ్చింది. వళ్ళుమరచి నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాలనిపించలేదు.

 

    కృష్ణారావు వంటగది గుమ్మంలో నిలబడ్డాడు. కాంతమ్మ రెండు కంచాలలో అన్నం పెడుతున్నది.

 

    "ఆకలిలేదు, అన్నం తినను" అన్నాడు కృష్ణారావు.   

 

    "ఊఁ!" హుంకరిస్తూ రెండు కంచాలలోని అన్నంతీసి విసురుగా గిన్నెలో వేయసాగింది కాంతమ్మ.

 

    కృష్ణారావు వరండాలో ఈజీచైర్ లో కళ్ళుమూసుకొని కూర్చున్నాడు. మనస్సంతా కలత కలతగా ఉంది.

 

    "ఏవండీ కృష్ణారావుగారూ, భోజనాలయ్యాయా?"

 

    "ఎవరూ? ప్రసాదరావుగారా! రండి రండి!" అంటూ ఆహ్వానించాడు కృష్ణారావు, తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో.

 

    "చంద్రం ఏం చేస్తున్నాడు?" అన్నాడు ప్రసాదరావు పైపుపొగను గుప్పుగుప్పున వదులుతూ.

 

    కృష్ణారావు గతుక్కుమన్నాడు. "నిద్రపోతున్నాడు-" అన్నాడు ఎలాగో.

 

    "చూడండి! మన రెండు కుటుంబాలమధ్య ఉన్న చనువుకొద్దీ చెబుతున్నాను, ఏమీ అనుకోకండీ! పసి హృదయాలను నొప్పించకూడదు. తల్లి అయినా తండ్రి అయినా మీరేకదా!"

 

    కృష్ణారావు రాయిలా బిగుసుకుపోయాడు. అది గమనించిన ప్రసాదరావు ప్రసంగం మారుస్తూ "చంద్రం మంచి కవి అవుతాడండీ!" అన్నాడు.

 

    ఇంతసేపూ ముకుళించి ఉన్న కృష్ణారావు వదనం వికసించింది.

 

    "వయస్సుకు మించిన ఊహలు కలవాడు చంద్రం. అతి తెలివైన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. తెలివైన పిల్లలు అతిత్వరగా మార్గం తప్పే అవకాశాలున్నాయి."

 

    కృష్ణారావు ఉలకలేదు పలకలేదు. కాని అతని బాధ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

    "ఆఁ, అసలు సంగతి - చంద్రాన్ని కాలేజీకి పంపించనంటున్నారట?"

 

    "అవునండీ! వ్యాపారంలో పెడదామనుకుంటున్నాను."

 

    "ఇంత చిన్న వయస్సులో బాధ్యతలు నెత్తినవేయటం భావ్యంకాదు."

 

    "నా ఉద్దేశం అదికాదండీ! ఈ వ్యాపారానికి వాడూ సమభాగస్తుడు. ఇప్పటినుంచే వ్యాపారంలో మెలకువలు తెలిస్తే వాడి భవిష్యత్తుకే మంచిదని అలా అనుకున్నాను" అన్నాడు కృష్ణారావు పట్టుపడిన అపరాధిలా.

 

    "చంద్రం తెలివైనవాడు. రేపు తనకు చదువు లేదని బాధపడవచ్చు. చంద్రం బాగా చదివి పైకిరావాలని దీవిస్తున్నానని ఇవ్వాళ స్కూలు ఫంక్షన్ లో హెడ్ మాస్టరు కూడా అన్నారు."

 

    "అలాగేనండీ! మీ అందరి సలహాప్రకారమే , వాడికి ఇష్టం వచ్చినంతకాలం చదువు చెప్పిస్తాను." అన్నాడు కృష్ణారావు, చంద్రాన్ని ఇప్పటినుంచే వ్యాపారంలో పెడితేనే మంచిదని మనస్సులో ఉన్నప్పటికీ.

 

    "సరే వస్తానండీ! ప్రొద్దుపోయింది" శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ప్రసాదరావు.

 

    "ఈయనగారి పని ఊళ్ళోవాళ్ళకు సలహాలు ఇవ్వటమేలాగుంది. అయినా మన బంగారం మంచిదయితే...."

 

    "ఏంటే నీ వాగుడు?" అన్నాడు కృష్ణారావు, మధ్యలోనే భార్య మాటలకు అడ్డువచ్చి.

 

    "మరేఁవిఁటి! అతడొచ్చి చెప్పటం. మీరు వాణ్ణి చదివిస్తానని ఒప్పుకోవటం."

 

    "అతను, వాణ్ణి చదివించదలచుకున్నాను,!" ఖచ్చితంగా అన్నాడు కృష్ణారావు.

 

    "ఉన్నదంతా తమ్ముడి చదువుకు దోచిపెట్టి, నా బిడ్డనోట్లో దుమ్ముకొట్టండి."

 

    "వాడు ఈ ఆస్తికి సమభాగస్తుడనిమర్చిపోకు," అంటూ కృష్ణారావు అక్కడనుంచి లేచి లోపలకు వెళ్ళాడు విసురుగా.   

 

                                                      2

 

    "నాన్నా! నాన్నోయ్! చంద్రం రాసిన కథకు మొదటి బహుమతి వచ్చింది నాన్నా!" అంటూ దీపావళి సంచిక చేతిలోపట్టుకుని హేమమాలిని తండ్రి గదిలోకి దూసుకొచ్చింది. ప్రసాదరావు చదువుతున్న పుస్తకం మడిచి బల్లమీద పెట్టాడు. కళ్ళద్దాలు తీసి హేమవైపు చూశాడు. హేమ వదనంలో ఆనందపు ఆర్ణవం అలుముకుని ఉంది.

 

    "ఏఁవిటమ్మా, చాలా హుషారుగా ఉన్నావు?" అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా కూతురివైపు చూస్తూ.

 

    "చంద్రానికి మొదటి బహుమతి వచ్చింది నాన్నా!" సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది హేమ.

 

    "ఎందులోనమ్మా?" ప్రసాదరావు చిరునవ్వుతో అడిగాడు.

 

    "బాలల కథలపోటీకి చంద్రం కథ రాశాడు - నేనప్పుడే చెప్పాను మొదటి బహుమతి నీదేనని."

 

    "పిచ్చిపిల్ల!" అనుకున్నాడు తండ్రి మనస్సులోనే.

 

    "పెద్దవాడైతే చంద్రం చాలా పెద్దరచయిత అవుతాడుగదు నాన్నా?"

 

    "అవునమ్మా! చంద్రం చాలా గొప్పవాడు అవుతాడు," అన్నాడు. పక్కనే సోఫాలో కూర్చొనివున్న హేమ తలను నిమురుతూ.

 

    "ఇప్పుడే వస్తా నాన్నా!" అంటూ హేమ బయటకు పరుగెత్తింది.

 

    హేమ చంద్రానికి ఈ వార్త అందించటానికే పరిగెత్తిందని తెలుసుకున్న ప్రసాదరావు తనలో తనే నవ్వుకున్నాడు. అన్నీ సవ్యంగానే జరిగితే, దైవం అనుకూలిస్తే, ఆ ఇద్దరూ ఒక ఇంటివాళ్ళయితే - ఇక తనకే కొరతా ఉండదు. కూతురి భవిష్యత్తుని గురించిన తీయని తలపుల్లో తేలిపోయాడు ప్రసాదరావు.

 

    హేమ కృష్ణారావు ఇంటికి వచ్చేప్పటికి హాల్లోవున్న రెండు పడక కుర్చీల్లో కాంతమ్మా - కృష్ణారావు కూర్చొని చంద్రం చదువుగురించి తర్కించుకుంటున్నారు. భార్య పోరుతోపాటు కృష్ణారావులో తమ్ముణ్ణి చదివించాలనే పట్టుదల పెరిగింది. కాంతమ్మ కాపరానికి వచ్చిన ఇంతకాలానికి భర్త ముందు మొదటిసారి ఓడిపోయింది. కోపంతో, రోషంతో ముఖం కందగడ్డలా అయింది.       


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS