Next Page 
మోడల్ పేజి 1


                                                                        మోడల్


                                                               -సూర్యదేవర రామ్ మోహనరావు.



    "కుబుసం విడిచిన ఎలనాగులాంటి అందమైన అమ్మాయి కావాలి - లక్ష రూపాయలు నగదు బహుమతి!!!

    అమ్మాయి ఎత్తు 54" కి  తగ్గకూడదు..... శరీరచ్ఛాయ గులాబీ  రంగులో వుండాలి.....ఆకర్షణీయంగా వుంటే చామనఛాయ అయినా ఫర్వరంగులో వుండాలి......ఆకర్షణీయంగా వుంటే చామనఛాయ అయినా ఫర్వాలేదు....(బ్లాక్ బ్యూటీ)
   
    చూపరులను ఆకట్టుకొనే అంగసౌష్టవం వుండాలి. కురుల నల్లగా, పట్టుకుచ్చులా, పోడవుగా జలపాతంలా వుండాలి. తెలుగు తప్ప మరి ఏ ఇతర భాషయినా రావాలి. ఇంగ్లీషు భాషలో అలవోకగా మాట్లాడగలిగే శక్తి వుండాలి.

    అందాలపోటీల్లో బహుమతి పొందిన అభ్యర్ధినులకు ప్రత్యేక పరిగణన వుంటుంది.

    అభ్యర్థినులు మేం నిర్వహించే పరీక్షల్లో వుత్తీర్ణులైతే మోడలింగ్ లో గొప్ప తెల్సినవారుగాని, ఖచ్చితంగా పది రోజుల లోపల సంప్రదించండి;

                                                                                                                       వివరాలకు:         
                                                                                                                       మనోహర్
                                                                                                                       యాడ్ ఫోటోగ్రాఫర్
                                                                                                                   సముద్ర యాడ్ ఫిల్మ్స్
                                                                                                                       "మాలాసౌద్"
                                                                                                                      36, క్రాస్ రోడ్
                                                                                                                           బొల్లారం
                                                                                                                          సికింద్రాబాద్

    ఆ రోజు అన్ని తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ దినపత్రికల్లోని మొదటి పేజీలో సగభాగం నిండింది ఈ ఆకర్షణీయమైన ప్రకటన. ప్రకటనకు అటూ ఇటూ ఇద్దరమ్మాయిలు అందంగా, షోగ్గా, చిలిపిగా నిలబడ్డారు___మధ్యలో ప్రకటన.

    "మాలా సౌధ" మూడంతస్థుల భవనం, రెండో అంతస్థులో సముద్ర యాడ్ ఫిల్మ్ ఆఫీస్ వుంది. మూడో అంతస్థులో యాడ్ ఫోటో గ్రాఫర్ మనోహర్ రూమ్, దానినానుకుని విశాలమైన వరండా, ఎడమ వైపున వరసగా నాలుగు నగిషీ చేసిన  కేన్ కుర్చీలున్నాయి. వాటిముందు కేన్ టీపాయ్ వుంది. ఆ టీపాయ్ మీద రకరకాల దినపత్రికలు, సినిమా పత్రికలు వున్నాయి. ఎడమవేపు చివర గోడమీద నిలువెత్తుగా ఓ ఆయిల్ పెయింటింగ్ వుంది.

    ఆ పెయింటింగ్ లో చిత్రకారుడు ఒక అమ్మాయి ముఖంలో సగ భాగాన్ని మాత్రమే చిత్రించాడు. ఆ పెయింటింగ్ ని ఎవరు చూసినా దాని ముందు రెండు నిముషాలు నిలబడి చూస్తారు. దానిక్కారణం____ఆ అమ్మాయి కనుగుడ్డు పక్కన లేత నీలిమలో మెరుస్తున్న మెరుపు, ముక్కు మీద వున్న తెల్లటి ముక్కెర తలుకు, ఎర్రటి పెదిమల్లోని గులాబి రంగునునుపు___ఆ చిత్రానికి ఎంతో అందాన్నిచ్చాయి. అందమైన అమ్మాయి కళ్ళు, ముక్కు, పెదిమల్ని తెచ్చి అక్కడ పెట్టినట్టుగా వుంటుందా చిత్రం.

    ఆ పక్కన తలుపు, లోన విశాలమైన గది. ఆ గదిలో ఒక వేపు బూడిద రంగులో రెండు సోఫాలు ఎదురెదురుగా వున్నాయి. మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన గ్రీక్ శిల్పం వుంది.

    ఆ శిల్పం పాలమీగడలా చక్కగా వుంది.

    ఆ గదికి ఒకపక్క లోపలి గదిలోకి వెళ్ళేందుకు చిన్నదారి వుంది.

    ఆ గదిలో బూడిద రంగులో ఓ రివాల్వింగ్  ఛెయిర్, దానిముందు విశాలమైన టేబుల్ వున్నాయి.

    ఆ వరండాకు వెనుక ఒకపక్క విశాలంగా స్టూడియో, దానినానుకొని డార్క్ రూమ్, ఆ గది పక్కవరసగా బాత్ రూం, టాయిలేట్ గదులున్నాయి.

    రివాల్వింగ్ ఛెయిర్ ముందున్న టేబుల్ మీద ఆరోజు దినపత్రికలన్నీ వున్నాయి. వాటి మొదటి పేజీల్లోనే పై ప్రకటన పడింది. ఆ ప్రకటనకు నాలుగు మూలలా రెడ్ ఇంక్ మార్క్స్ పెట్టున్నాయ్. దాని అరక వాటిని కట్ చేసి ఫైల్ చేయమని.

    టేబుల్ ఓ ప్రక్కన పెద్దసైజు గులాబి పువ్వులా ఫోన్ వుంది.

    గణ.....గణ.....గణ.....మని ఆ ఫోను ప్రస్తుతం మోగుతూంది.

    ఆ గదిలో రెండువైపులా ఉన్న గోడలకు రెండు షెల్ప్ లు విశాలంగా వున్నాయి. ఒకదాని నిండా ఆల్భమ్ లు, ఫిలిమ్ బాక్స్ లున్నాయి. రెండో ఫెల్ప్ లో పుస్తకాలు నీట్ గా  సర్ది వున్నాయి.

    ఒకపక్క ఎ.సి. బాక్స్ వుంది. దానిపక్కనే ఓ నీగ్రో అమ్మాయి నిలువెత్తు ఫోటో వుంది. ఆ నీగ్రో అమ్మాయి కళ్ళు మాత్రం ఎర్రగా వున్నాయి. ఆ ఫోటో 'నల్లపులిలా' భయంకరంగా అందంగా వుంది.

    ఫోన్ మోగుతూనే వుంది.

    ఉదయం 9 గంటలు. ఆ అపార్ట్ మెంట్ నిశ్శబ్దంగా వుంది.

    ఫోన్ శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో చల్లగాలిలో తేలుతూ ఆ భవనం గదులనిండా లయగా ప్రతిధ్వనిస్తోంది.

    గణ.....గణ.....గణ.....గణ.....ఫోన్ మోగుతూనే వుంది.

    ___లోపల బాత్ రూం తలుపు తెరుచుకున్న చప్పుడు___ఆ వెంటనే గబగబ అడుగుల చప్పుడు.

    బాత్ రూంలోంచి వచ్చిన యాడ్ ఫోటో గ్రాఫర్ మనోహర్ చేతిలో టర్కీటవలుంది. అతను ముఖం తుడుచుకుంటూ ఆఫీసు గదిలోకి అడుగు పెట్టాడు. రిసీవర్ చేతిలోకి తీసుకుందామని చెయ్యి చాచాడు, కానీ  అంత వరకు మోగిన ఫోన్ అప్పుడే చటుక్కున ఆగిపోయింది.

    ఒక్క నిముషం అక్కడే నిలబడ్డాడతను____మళ్ళీ ఫోన్మోగుతుందేమోనని.

    ఫోన్ మోగలేదు.

    మళ్ళీ అతను లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. మనోహర్ సముద్ర యాడ్ ఫిల్మ్స్ యజమాని.

    పావుగంట గడిచింది. బయటికొచ్చాడు.

    మనోహర్ తెల్లగా పొడవుగా వుంటాడు. సూదిముక్కు, విశామైన కళ్ళు, చక్కటి చెక్కిళ్ళు, నుదురు మీదికి మాటిమాటికి పడే  జుత్తు అతవి ప్రత్యేక లక్షణాలు.

    అతని పెదాలు ఎర్రగా, అమ్మాయి పెదాల్లా అందంగా వుంటాయి.

    ప్రస్తుతం అతను సిమెంటు రంగు సూట్లో వున్నాడు.

    అతను గదిలో అద్దం ముందు నిలబడి అయిదు నిమిషాలు ఆలోచించాడు. అద్దంలో తనని తాను అయిదారుసార్లు చూసుకున్నాడు. తను చక్కగా డ్రస్ చేసుకున్నా ఏదో వెలితి కనబడుతోంది. ఏమిటో అతనికే అర్థంకావడంలేదు. చాలాసేపు తన బట్టలవేపు చూసుకున్నాడు. ఏం బోధపడలేదు. మళ్ళీ......మళ్ళీ......మళ్ళీ.....చూసుకున్నాడు.

    చికాగ్గా ఆ గదిలోంచి ఆఫీసు గదిలోకొచ్చి రివాల్వింగ్  ఛెయిర్ లో కూర్చున్నాడు. ఏదో తను మరిచిపోయాడని అతనికి తెలుసు. కాని ఏమిటి మర్చిపోయాడో తెలీడంలేదు. పది నిమిషాలు గడిచాయి. అతనొక్కసారి తన కుడిచేతివైపు చూసుకున్నాడు. పావుగంట నుంచి తను ఏమిటో మర్చి పోయాడనుకున్నది ఆ చేతిలో వుంది! నెక్ టై- మెడకు కట్టుకోవాల్సిన టైని చేతిలో వుంచుకొని దానికోసమే వెతుకుతున్నాడు. మనోహర్ తనలో తానే నవ్వుకున్నాడు.

    లేచి__

    అద్దం ముందుకెళ్ళి టై కట్టుకొని ఆఫీసు గదిలోకొచ్చాడు.

    అప్పటికే సరిగ్గా 9.45 నిముషాలైంది.

    తొమ్మిదిన్నరకల్లా ఆఫీస్ స్టాప్ వస్తారు. వారుండేది ఫస్ట్ ఫ్లోర్ గనుక అందరూ వచ్చిందీ రాందీ ఇంటర్ కామ్ లో రిసెప్షనిస్ట్ ని అడిగి తెలుసుకుంటాడు మనోహర్.

    అడ్మినిస్ట్రేటివ్ స్టాస్, అసోసియేట్ ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ రూమ్స్, రిసెప్షన్ రూమ్, లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్ లో వున్నాయి.

    "గుడ్ మాణింగ్ సర్......!" అవతలనుంచి రిసెప్షనిస్ట్ మిలి "విష్" చేసింది.

    "మిస్ మిలి! మధుచక్రవర్తి వచ్చాడా?"

    "లేదు సార్....."

    ఒక్క క్షణం ఆగి, "నాకు పది గంటలకు ఒక అపాయింట్ మెంట్ వుంది. వెళ్తాను. మధుచక్రవర్తి రాగానే  నా టేబుల్ మీద ప్రోగ్రాం షీట్ వుంది. ప్రొసీడ్ కమ్మని చెప్పండి. బై.......ది.....బై.....పన్నెండు గంటలకు  నేను.....హొటల్ రిట్జ్ 101లో వుంటాను.......కలవమనండి. నోట్ చేసుకుంటున్నారా?" అడిగాడు మనోహర్.   


Next Page 

  • WRITERS
    PUBLICATIONS