Next Page 
ఆనందం పరమానందం పేజి 1


                      ఆనందం పరమానందం


                                                    -ఆదివిష్ణు

                                        

 

ఆ ఊరు మీది కావచ్చు. ఊరి పేరు మనకెల? ఆ ఊర్లో- అన్ని ఊళ్ల మాదిరి వసతులన్నీ వున్నాయి. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి.  అదే  మాదిరి ఆస్పత్రులున్నాయి. బ్యాంకులున్నాయి. సినిమా థియేటర్లున్నాయి. పచారీ దుకాణాలున్నాయి. పార్కులున్నాయి. కథకి అవసరమయ్యే హంగులన్నీ వున్నాయి. ఆ ఊళ్లో కొందరు ధన వంతులున్నారు. కామన్ మనుషులున్నారు. బరువు బాధ్యతలు మోసే బుద్ది మంతులతో పాటు పరమ బెవర్సుగా తిరిగే బద్దకస్తులు కూడా వున్నారు. వాళ్లందరి కథా చెప్పేందుకు ఈ కథ రాయడం లేదు. ఏ ఊళ్లో ఎక్కడా లేని ఒకానొక వింత గొడవ పెట్టుబడి చిత్తగించండి.
                                                  *        *        *
రైల్వేస్టేషన్ కోలాహలంగా వుంది. ప్లాట్ ఫారంమ్మీద రైలుంది. రైలు దిగుతున్న ప్రయాణీకులతో ప్లాట్ ఫారం రద్దీగా వుంది. స్టేషన్ బయట కూడా హడావిడిగానే వుంది. వడియాలు ఆర బెట్టి నట్టు ఆటోలు, రిక్షాలు నేల మీద నిలబడి వున్నాయి. ఒక పాసింజరు బ్రీపుకేసుతో బయటకు వస్తున్నాడు. అతను చాలా విసుగ్గా వున్నాడు. కొంచెం చిరాకుతో పాటు కోపంగా కూడా వున్నాడు
అతడు తప్పి పోయిన పిల్లవాడి మాదిరి అక్కడ  వాతావరణాన్ని బెంగగా పరిశీలిస్తూ నడుస్తున్నాడు. ఎంత విసుగు, చిరాకు కోపంగా వున్నా కించిత్తు ఆనందం కూడా అతన్ని అప్పుడప్పుడు కుదుపుతోంది.
ఆ పాసింజర్ని చూడగానే ఆటోవాళ్లు, రిక్షావాళ్లు అతన్ని చుట్టుముట్టేరు.
"ఆటో బాబూ!"
"రిక్షాండీ!"
"ఎక్కడికి వెళ్లాలో చెప్పండి సార్?"
ఆ పాసింజరు వాళ్లని విసుగ్గా చూశాడు. అయినా వాళ్ళు చలించలేదు. అంతలో ఎవడో పాసింజరు చేతిలోంచి బ్రీపుకేసుని చొరవగా తీసుకునే ప్రయత్నం చేస్తూ-
"ఈ బేరం నాది!" అన్నాడు.
పాసింజరు అతని ప్రయత్నాన్ని విదిలించి 'ఆగు' అన్నాడు.
సైరన్ లాగ వినిపించిన ఆ యొక్క పోలికేకకి ఆటోవాళ్లు, రిక్షావాళ్లు బెదిరిపోయారు. అంచేత వాళ్లంతా అతనికి కొంచెం దూరంగా జరిగారు.
పాసింజరు ఉపన్యాసం మొదలెట్టేడు.
"ఆటో ఎక్కాలో రిక్షాతో సరిపెట్టుకోవాలో తేల్చుకో వలసింది నేను! అర్ధమైందా? నేనేం చేసినా - నాకు నచ్చిన, నా కిష్టమైన పని మాత్రమే చేస్తాను. మీ ఒత్తిళ్లకు, రిక్వెస్టులకు చచ్చినా లొంగను. అంతెందుకు? నా వైపు బస్సులో వెడదామంది. నేను రైలన్నా ఎంచేత? రైలంటే నా కిష్టం! అంచేత నా వైపు బస్సెక్కింది. నేను రైలేక్కేను."
అతను చెప్పిదంతా మీటింగు టైపులో వున్నందుకు ముచ్చట పడిపోతూ ఆటో రిక్షా కార్మికులు కరతాళ ధ్వనులు చేసేరు.
పాసింజరు కోప్పడుతూ అన్నాడు-
"ఆపండి! నాకు చప్పట్లు నచ్చవు. దేనికా చప్పట్లు? అచ్చెప్పండి నాకు! రైల్లో కూడా ఎవడో టీ.సీ నన్ను  టిక్కెట్లు అడిగినప్పుడు -నేను రైలు ప్రయాణం గురించి అతి క్లుప్తంగా చెప్పేను. నే చెప్పేది వింటూ అతను కూడా ఇట్లాగే చప్పట్లు కొట్టేడు. ఏడుస్తూ ఈల వేసుకుంటో మా కంపార్టుమెంటు నుండి వెళ్లిపోయేడు. వదిలేయండి. మీరంతా క్యూని పాటించి నా ముందర నించోండి"
"ఎందుకుసార్?"
"అదంతే! నేను కళ్లు మూసుకుని మీలో ఒక వ్యక్తిని ముట్టుకుంటాను."
"అప్పుడే మవుద్ది?"
"అతనే నన్ను ఊళ్లోకి తీసుకేడతాడు. అతన్ది బండైనా సరే - ఆ బండినే ప్రిఫర్ చేస్తాను!"
"ఆడి దగ్గర ఏ బండి లేకపోతే?"
"అతని భుజాలెక్కి వెడతాను."
"వామ్మో!"
"బెంగపడొద్దు! చార్జీ ఎంత్తెనా  సరే! బేరమాడకుండా ఇచ్చుకుంటాను."
ఆ పాసింజరు చెప్పిన ఫిలాసఫీ ఎంతమందిని ఆకర్షించిందో గాని ఒకడు మాత్రం ఉత్సాహంతో రెచ్చిపోతూ అన్నాడు.
"ఇన్నారుగా! అదీ ఇషయం. ఎట్టాగూ బేరాల్లేకుండా కాళీగా వున్నాంగదరా! పులీ మేక బదులు ఈ పంతులు గార్తో ఆడుకుంటే ఎరైటీగా వుంటది క్యూ కట్టండి!"
అందరూ వరసగా నిలబడ్డారు. ఆ పాసింజరు ఆనందించేడు. కళ్లు మూసుకున్నాడు. గుడ్డివాడి మాదిరి అడుగులు వేస్తున్నాడు. రైలు దిగిన పాసింజర్లు - ఆ చోద్యం చూసేందుకు అక్కడాగి పోయేరు.
పాసింజరు చెయ్యి ఒక మనిషి భుజమ్మీద పడింది. అప్పుడు కళ్ళు విప్పి అడుగుతున్నాడు.
"ఆటోనా? రిక్షానా?"
"నాది జట్కా బండి బాబు!"
"ఎద్దు బండయినా ఫర్లేదన్నాను"
"చిత్తం!"
"తీసుకురా జట్కాని! చార్జీ నీ  ఇష్టం"
"చిత్తం!" అని అతడు వెళ్లబోతూ అడిగేడు.
"ఇంతకీ తమరెక్కడ కెల్లాలండి?"
"చెప్పలేదు గదూ?"
"చిత్తం!"
"శివరావు గారింటికి!"
"చిత్తం! ఆరెవరు బాబూ!"
"ఈ ఊరి కాలేజీలో హిస్టరీ లెక్చరరు!"
"చిత్తం! ఈ ఊళ్లో ఆరిలెక్కడండి?"
"నందివాడ వారి వీథి"
ఆ వీథి పేరు వినగానే జట్కా మనిషి 'ఆ' అని ఆర్తనాదం చేసేడు ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమై పోయాడు!
"ఏమిటీ విడ్డూరం?" అని సాగదీస్తూ షాకు తింటున్నాడు పాసింజరు.

                                        2
అదే ఊళ్లో ఆర్టీసీ బస్టాండది!
అక్కడికి ఒక బస్సు వచ్చి ఆగింది. ప్రయాణీకులు  బస్సు దిగుతున్నారు. వాళ్లని చూడగానే ఆటో వాళ్లు, రిక్షావాళ్లు బేరాల కోసం  బోలెడు ఆశతో ఆ బస్సుని చుట్టు ముట్టేరు.
ఆ బస్సులోంచి ఒక ఇల్లాలు ఒక చేత్తో పెట్టెను, మరో చేత్తోచిట్టిగాడ్ని పట్టుకుని దిగుతోంది. ఆటో మనిషి ఆమెను అడిగేడు-
"ఆటో కావాలా అమ్మా?"
"కావాలి!"
"మీరు ముగ్గురేగా?"
ఆ మాటకి ఆ ఇల్లాలు బోలెడు ఆశ్చర్యపోయింది.
"ముగ్గురంటా వేమిటి? నేనూ, మా చిట్టిగాడు. ఇద్దరమేగా?"
"అవునండి, ఇద్దరే నండి!"
"మరి - ముగ్గురన్నా వెందుకు?"
"తమర్ని ఇద్దరిగా లెక్కగట్టెనేమోనండి! తప్పయిపోయింది. ఎక్కడికి కెళ్లాలో చెప్పండి."
"ఒరే చిట్టీ! చీటీ చదువు నాయనా!"
చిట్టి తన జేబులోంచి చీటీ తీసి చదువుతున్నాడు.
"శివరావు చరిత్ర టీచరు."
"అట్టా చెబితే కష్టం బాబూ? అడ్రసు చదువు."
"ఇంటినెంబరు రెండు - నిలువుగీత - ముప్పైమూడు - అడ్డుగీత- ఆరు."
"అంకెల్తో ఇళ్లు కనుక్కోడం ఈ ఊర్లో కుదరదు బాబు. గుర్తులు ఏమైనా వుంటే చదువు."
"ఇంటి ముందు బాదం చెట్టు వుండును."
"ఈ ఊళ్లో బాదం చెట్లు ప్రతి ఇంటి ముందు వుంటాయి బాబు! పేట పేరు రాసుందేయో చూడు."
"ఆ సంగతి ముందే అడగోచ్చుగా?" కోప్పడింది ఇల్లాలు.
"తమరుండండమ్మా అబ్బాయిగారు ముద్దుముద్దుగా చదూతుంటే ఇనబుద్దేస్తుంది. చదువు బాబు! పేట పేరేంటి?"
"ఇంగ్లీషు పాలెము."
"ఓర్నీ ఇక్కడికి దగ్గరే"
"వీథి పేరు కూడా కలదు."
" అయితే ఇంకే? అది కూడా చదవెయ్ బాబు. ఒక పనై పోద్ది!"
"నంది వాడ వారి వీథి!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS