Next Page 
ఆఖరి మజిలి  పేజి 1


                          ఆఖరి మజిలి

                                                   __చందు హర్షవర్ధన్

    అర్దరాత్రి ...

    అందునా అమావాస్య చీకటి...

    పొదల మాటున కీచురాళ్ళ శబ్దం...

    నల్లని తారురోడ్డును గాలికి రాలిన చెట్ల ఆకులు పూర్తిగా కప్పివేశాయి...

    అది రోడ్డు__అటు వెళ్ళవచ్చునన్న  భావనతో ఏకీభవించలేక టాక్సీడ్రయివరు సడన్ బ్రేక్ వేశాడు.

    అప్పటి వరకు సిగార్ దమ్ము లాగుతున్న సూట్ చాలా చిరాకయ్యాడు.

    "వాట్...వాట్ హేపెండ్ ? కారు ఎందుకు ఆపావు?"

    అతని మాటలలో చికాకు. ముఖంలో కోపం కొట్టి వచ్చినట్టు కనిపిస్తున్నాయి.

    "సారీసర్ ... ఇలాంటిదారి అని తెలిస్తే నేను రాకపోదును..."

    డ్రయివరు కేసి చిరాగ్గా చూశాడు సూట్ వాల.

    డ్రయివరు ముఖం చమటతో నిండివుంది. కనిపిస్తున్న తీరునుబట్టి ఇందాకటి అతని మాటలలో వణుకు కూడా వున్నదనిపించింది.

    చుట్టూ కీకారణ్యం...

    కనుచూపు మేరలో లైటు అంటూ ఏదీ కనిపించడం లేదు.

    కొత్తగా ఆ దారివెంట వచ్చే ఏ డ్రయివర్ అయినా భయపడడం సహజమే ననుకున్నాడు సూట్ వాలా! తనలో తను నవ్వుకున్నాడు.

    "చూడు మిస్టర్ ... ఇది శ్రీహరిగారి ఎస్టేట్ కు వెళ్ళేదారి. అసలు ఎప్పుడూ రోడ్డు పొడవునా లైట్లు వెలుగుతూ వుండేవి. ఇవాళ కరెంట్ పోయిందేమో! కరెంటు పోవడం వలన అడవిలా కనిపిస్తున్నది. కానీ ఇవన్నీ పళ్ళతోటలే!...నువ్వేమీ భయపడకు. ఈ రాత్రికి నువ్వు ఒక్కడివే తిరిగి వెళ్ళనక్కరలేదు. రేపు వుదయం వెళుదువుగాని... వెయిటింగ్ ఛార్జీ ఇస్తానులే. నీకు భయంగావుంటే కారు నేను డ్రయివ్ చేస్తాను" అంటూ అతని భుజంమీద అభయం ఇస్తున్నట్టు చేయివేశాడు సూట్ వాలా.

    తెలియని దారిలో అతను చెప్పిందే నయమనిపించి స్టీరింగ్ అతనికి ఇచ్చాడు డ్రయివరు.

    ఒక్కొక్కచోట చెట్ల కొమ్మలు రోడ్డుమీదికంటూ వాలి దారి మూసివేసినా హెడ్ లైట్స్ కాంతిలో అడ్డంకులను తప్పించుకుంటూ మెళకువగా డ్రయివ్ చేస్తున్నాడు సూట్ వాలా.

    హెడ్ లైట్స్ కాంతిలో దూరంగా కనిపిస్తున్న తెల్లని, భవంతిని చూసిన తరువాత డ్రయివరులో భయం పోయింది.
   
    వంద ఎకరాల ప్రాంగణంలో గుబురుగా పెరిగిన చెట్లు భయంకరంగా కనిపిస్తున్నాయి.

    చెట్లుదాటి, బంగళా చేరువకు చేరగానే 'ఇన్' గేటు వేసివుంది.

    డ్రయివరు దిగి చూశాడు.

    గేటు లోపలవైపు నుంచి గెడ వేసివుంది. డ్రయివరు గేటు తెరవగానే,

    ఇద్దరు కాలినడకన గార్డెన్ వైపు బయలుదేరారు. గార్డెన్ వైపు గేటు తెరచివుంది. అక్కడ అంతా చీకటిగా వుంది. డ్రయివరు సిజర్ లైటరును వెలిగించాడు.

    అక్కడ కొంచెం దూరంలో అస్పష్టంగా కనిపిస్తున్న సమాధులను చూసిన డ్రయివరు గజగజ వణుకుతూ సూట్ వాలా చేయి పట్టుకున్నాడు.

    భయం లేదన్నట్టు  డ్రయివరు భుజం తట్టి, సిజర్ లైటర్ ను తను తీసుకుని అతని చేయిపుచ్చుకుని సూట్ వాలా లోపలకు అడుగుపెట్టాడు.

    కొంచెం ముందుకు వెళ్ళగానే నాపరాళ్ళ బాట వుంది.   


Next Page 

  • WRITERS
    PUBLICATIONS