Next Page 
కాంతి కిరణాలు పేజి 1

                                    కాంతి కిరణాలు

                                                                           -యర్రంశెట్టి శాయి

 

                          

   
    విడిదింటిలో చాలా హడావుడిగా వుంది. ముందు హాల్లో సురేంద్ర, అతనిస్నేహితులు పేకాట ఆడుకుంటున్నారు. హాలంతా సిగరెట్ పీకలతోను, సిగరెట్ పొగలతోనూ నిండిపోయి ఉంది.
    "ఒరే సురేంద్రా! నువ్వు నా కార్ట్సు చూస్తున్నట్లు అనుమానంగా ఉంది..." అన్నాడు సీతంరాజు.
    "మనిషన్న తరువాత తోటి మనుషుల్ని నమ్మాలోయ్..." నవ్వుతూ అన్నాడు సురేంద్ర.
    "నాకా నమ్మకం పోయింది నీ మూలాన" అన్నాడు సీతంరాజు.
    "అలాగయితే వీడిని 'జు' లో పడెయ్యండ్రా! ఆ జంతువులనే నమ్మి వాటిమధ్య హాయిగా బ్రతుకుతుంటాడు" అన్నాడు వీర్రాజు.
    అంతా ఘొల్లున నవ్వారు.
    "అయితే నేనిప్పుడుంది 'జు'లో కాదన్న మాట!" ఆశ్చర్యంగా చూశాడు సీతంరాజు.
    "వెధవ జోకు, మేం ఛస్తేనవ్వం" అన్నాడు వీర్రాజు.
    "అది సరేగాని ఇంకా సృజన్ గాడు రాలేదేమిటి? తప్పకుండా వస్తాడన్నావుగా!" సురేంద్ర నడిగాడు సీతం రాజు.
    "అలాగనే ఉత్తరం రాశాడు మరి....వాడు రాకుండా నా పెళ్లెలా అవుతుంది?" నవ్వుతూ అన్నాడు సురేంద్ర.
    "అంత 'లవ్' వున్న వాడివి, వాడినే చేసుకోవాల్సింది హాయిగా ఇద్దరూ చిరకాలం కలిసి ఉండేవాళ్ళు..."
    "అంత ఈర్ష్య పనికి రాదోయ్..."
    "అదుగో బయటేదో రిక్షా ఆగింది, వాడేనేమో చూద్దాం" అంటూ బయటకు పరుగెత్తి వెంటనే తిరిగివచ్చేశాడు సీతంరాజు.
    "వాడే....కాని ఓ ముసలామె వేషంలో వచ్చాడు" అన్నాడు నవ్వుతూ.
    "కాసేపు పేకాట ఆపెయ్యండిరా! బోరుగా ఉంది" విసుగ్గా అన్నాడు సురేంద్ర.
    "అవున్లేరా నాయినా! పెళ్ళి ముహూర్తం దగ్గిరపడుతున్న కొద్దీ స్నేహితులూ, పేకాటలూ, అన్నీ పరమబోరుగా కనపడతాయ్" శ్రీధరం అన్నాడు.
    అందరూ మళ్ళీ హేళనగా నవ్వారు.
    "అది సరేగాని మన భవానీ శంకరం గాడికి రెండు వారాలక్రితం పెళ్ళయిపోయింది తెలుసా?" అడిగాడు వీర్రాజు.
    "ఏమిటి? మనవాళ్ళెవర్నీ పిలవకుండానే?"
    "వాళ్ళవాళ్ళనే పిలవలేదు. ఇంక మననెలా పిలుస్తాడు! అర్జంటుగా ఇరవై నాలుగుగంటల్లో తాళికట్టాల్సిన పరిస్థితులొచ్చేసినయ్యట! లవ్ మారేజ్ లే! చాలా గొడవ లయినాయట! ఆ మధ్య కాకినాడలో కనబడి చెప్పాడు."
    "ఎవరా అమ్మాయ్? వాడు అద్దెకున్న రూమ్ ఓనరు కూతురేనా?"
    "ఇంకా అనుమానమెందుకు, మన బాచ్ లో లవ్ మారేజ్ చేసుకొన్నా పక్షి వాడొక్కడే! మిగతా వాళ్ళందరం, అక్కయ్య కూతుళ్ళకో, మామయ్య కూతుళ్ళకో తాళి కట్టేసిన వాళ్ళమేగా..."
    "ఇదిగో ఇప్పుడు ఈ సురేంద్రగాడుతప్ప...." సీతం రాజు అందుకున్నాడు.
    "అంటే? వీడదీ లవ్ మారేజేనా ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధరం.
    "సగం లవ్ మారేజ్..." నవ్వుతూ అన్నారు సీతంరాజు.
    "మళ్ళీ సగం ఏమిటి?"
    "అంటే-ఆ అమ్మాయి సంగతేమో తెలీదుగాని, మనవాడుమాత్రం ఆ అమ్మాయిని చూచి మొదటి చూపులోనే ప్రేమించి, వెంటనే వీడి పెద్దలను వాళ్ళింటిమీదకు తోలి, మరీ ముహూర్తాలు పెట్టించాడు."
    "ఏరా నిజమేనా?" ఆత్రుతగా అడిగాడు శ్రీధరం.
    "చాలావరకూ!" నవ్వుతూ జవాబిచ్చాడు సురేంద్ర.
    "అలాగయితే మనవాడిని అంతగా ఆకర్షించిన ఆ అమ్మాయి చాలా అందగత్తె అయుండాలి."
    ఇంకా అనుమానమెందుకు? ఎంత అందమయిన అమ్మాయి కాకపోతే-ఇంతకాలం నా కిప్పుడేపెళ్ళివద్దు అని తలాయిస్తున్న వాడుకాస్తా ఠకీమని ప్రేమలో పడిపోతాడు?" అన్నాడు వీర్రాజు.
    "మీరనుకున్నంత అసమాన సౌందర్యవతి కాదు లేరాబాబూ! ఊరికే ఊహించేసుకోకండి! తీరా పెళ్ళి పీటలమీద చూసి నిరాశపడిపోగలరు..."
    "వీడి మాటలు నమ్మకండిరోయ్! కాబోయే శ్రీమతికి దిష్టి తగులుతుందని ఇది!"
    "ఇదంతా ఎందుకు కావాలంటే ఇప్పుడే చూసి రారాదూ!" సురేంద్ర అన్నాడు.
    "ఎందుకు చూడం? తప్పకుండా చూస్తాం! పదమరి. వెళదాం."
    "నేనా ఛస్తేరాను. పెళ్ళికూతురు తరపువాళ్ళేమనుకుంటారు. తెల్లవారుజామున పెళ్ళి అవనే అవుతోంది-ఈ ఫేలయిన లోగా పెళ్ళికూతురి మీద మనసయింది కాబోలని నానా సృజన్" అల్లరి పట్టించేస్తారు. కావాలంటే మీరందరూ వెళ్ళి చూసిరండి..."
    "మమ్మల్ని రానిస్తారా అని!" అనుమానంగా అడిగాడు వీర్రాజు.
    "మనల్ని అడ్డుపెట్టే దెవరోయ్! పెళ్ళికొడుకు ఫ్రెండ్సంటే అందరికి 'హడల్'గానే ఉంటుంది-ఈ కాసేపూనూ" లేచి నుంచుంటూ అన్నాడు సీతంరాజు.
    "మరింకేం! పదండి వెళ్దాం." అంటూ మిగతావాళ్ళు కూడా బయల్దేరారు. అందరూ గడప దాటుతూండగానే రిక్షాదిగి సృజన్ బాబు లోపలికొస్తూ ఎదురయ్యాడు.
    "ఒరే సురేంద్రా! సృజన్ గాడొచ్చాడహో...." అంటూ అరిచాడు సీతంరాజు.
    సురేంద్రహడావుడిగా అక్కడికి చేరుకున్నాడు.
    "ఏరోయ్! అప్పుడే పెళ్ళికళ వచ్చేసిందే" నవ్వుతూ అన్నాడు సృజన్ బాబు.
    సురేంద్ర అతన్ని కౌగలించుకున్నాడు సంతోషంగా.
    "ఇంత ఆలస్యం చేశావేమిట్రా! ఇంక రావేమో అని వీడు బెంగపెట్టుకున్నాడు కూడానూ" అన్నాడు వీర్రాజు సురేంద్రిను చూపుతూ.
    "రాకుండా-ఎక్కడకు పోతాన్రా! దార్లో బస్ ఫెలయిపోయింది. ఎక్కడికి బయల్దేరారందరూ." అడిగాడు సృజన్ బాబు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS