Next Page 
వ్యూహం పేజి 1


                                   వ్యూహం

                                             __ సూర్యదేవర రామ్ మోహనరావు

 

    సక్సెస్...

 

    విజయం...

 

    విజయం- వ్యక్తి దీక్షకు, సాధించిన లక్ష్యానికి, అధిగమించిన అవరోధానికి సిసలైన నిదర్శనం.

 

    విజయం- ఊపిరిలాంటి పట్టుదలకు, ఊహల్లోని నిజాలకు, మేధస్సు వెనుకదాగిన ప్రచండ శక్తి ఆవిష్కరణకు అసలైన రూపం.

 

    విజయం అంటే ప్రపంచ పరిణామ చరిత్ర-

 

    విజయం అంటే ఒక నిరంతర పరిశోధన-

 

    గ్రేట్ డిస్కవర్... గ్రేట్ ఎచీవ్ మెంట్... గ్రేట్... ఎక్స్ పరిమెంట్... గ్రేట్ యాంబిషన్...

 

    మనిషి మెదడులో ఊపిరి పోసుకునే అనూహ్యమైన సంచనాలకు, హృదయంలో జరిగే అనేక యుద్ధాలకు, నిరంతర మాధనానికి నిలువెత్తు ఆకృతి విజయం.

 

    దానికి కాలంతో సంబంధం లేదు. ఆయా వ్యక్తుల రంగాలతో సంబంధం లేడు. రాజకీయ, కళ, సాహిత్యం, సాంస్కృతిక పారిశ్రామిక రంగాలేవైనా కావచ్చు. నెపోలియన్, అలెగ్జాండర్, అశోకచక్రవర్తి, గోర్బచేవ్, ఇందిరాగాంధీ, హిట్లర్, సద్దాంహుస్సేన్, నెల్సన్ మండేలా. ఆకియో మొరిట, జహంగీర్, రతన్ జీ దాదాభాయ్, టాటా, జి.డి. బిర్లా... ప్రపంచ విజేతల దగ్గర్నుంచి, ప్రారంభ విజేతల వరకు-

 

    సక్సెస్ ఎంత గొప్పదయినా, ఎవరిదయినా, దాని ప్రారంభం ఒక పాయలాంటిదే!

 

    నీటిచుక్కలాంటి నేటి ప్రయత్నమే, రేపటి ఆశయ మహాసముద్రపు ఆకృతి కల్పనకు ఆధారమవుతుంది. మహ సంకల్పం, మహా లక్ష్యం, గొప్ప ఆశయం, గొప్ప నిర్ణయాలకు కావలసింది కేవలం కలల పునాది కాదు ఆచరణ.

 

    మనిషి తలుచుకుంటే సాధించలేనిదిలేదు ఈ విశ్వంలో. కృత్రిమ విలువలు, పెరుగుతున్న పైశాచికత్వం, అడ్డూ అదుపులేని రాజకీయ విధ్వంసం, టెర్రరిజం, ఆధునికత పేరుతో అలుముకుంటున్న వెర్రితనం- హింసే పరమధర్మంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యువత గమ్యంలేని, గమ్యం తెలీని దారిలో నిర్వీర్యమై పోతున్న ఈ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

 

    యువత నిర్వీర్యతతో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమై పోతోంది.

 

    ఈ పరిస్థితులలో స్వశక్తితో, మేధస్సుతో, అపార సంకల్పంతో ప్రతి యువకుడు తనని తాను ఛాలెంజ్ చేసుకొని ఆదర్శంగా నిలవాల్సిన అవసరం వుంది.  

 

    మీ చిరకాలపు కోరిక అద్భుతమైన 'సక్సెస్' అయితే-

 

    "To Belive in the Heroic, MAKES HEROES"

 

                                   *    *    *    *

 

    హైదరాబాద్....

 

    నగరం నడిబొడ్డులో నున్న అలనాటి నిజాం ప్యాలెస్. విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. నిజాం ప్యాలెస్ కు వెళ్ళే దారులన్నీ వి.ఐ.పీ.ల రాక సందర్భంగా పోలీసుల పహరాతో కట్టుదిట్టంగా వున్నాయి.

 

    నిజాం ప్యాలెస్ లో జరుగుతున్న ఫంక్షన్ కు భారత రాష్ట్రపతి ముఖ్య అతిథి.    

 

    విశాలమైన వేదిక మీద అప్పటికే రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖ భారతీయ ఫిల్మ్ స్టార్ అమితాబచ్చన్, క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్.

 

    ప్రత్యేక అతిధిగా రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ విశేష అతిధులుగా పారిశ్రామిక వేత్తలు, రతన్ టాటా, ఆదిత్య బిర్లాలు ఆశీనులై వున్నారు.

 

    కొన్నివేలమంది రాజకీయ నాయకులు, మేధావులు, సినిమా స్టార్ లు, పారిశ్రామికవేత్తలు, ప్రజలతో నిజాం ప్యాలెస్ అంతా నిండిపోయి ఉంది.

 

    స్టేడియంకు నాలుగువైపులా, నిలువెత్తున అమర్చి వున్న పవర్ ఫుల్ హాలోజన్ లైట్లు వెలుగులో స్టేడియం పట్టపగలుగా వుంది.

 

    ఎటు చూస్తే అటు పోలీసుల కాపలా...

 

    రాష్ట్రపతి రాజ్ భవన్ నుంచి బయలుదేరారన్న వార్త అందటంతో పోలీసుల్లో మరింత సంచలనం...

 

    ఎక్కడి వీధులక్కడ గంభీరతతో మునిగిపోయాయి. మరో పదినిమిషాల్లో పూర్తి సెక్యూరిటీ మధ్య భారత రాష్ట్రపతి స్టేడియంలో కొచ్చారు.

 

    గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతికి స్వాగతం పలికి వేదిక మీదకు తీసుకువెళ్ళారు.

 

    అప్పుడు ముఖ్యమంత్రిని అడిగారు రాష్ట్రపతి అటూ ఇటూ చూస్తూ-

 

    "అందరూ వచ్చేసినట్లున్నారు... అసలు వ్యక్తి స్టేజ్ మీద కనపడడే?" అని.

 

    "ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్... ఇంకో పదినిమిషాల్లో ఆయన వచ్చేస్తారు."

 

    "స్పెషల్ ఫ్లయిట్ లో వస్తున్నారా ఆయన?"

 

    "అవున్సార్"

 

    ఎవరా అసలు వ్యక్తి?

 

    ఐదు నిమిషాలు...

 

    పది నిమిషాలు...

 

    సరిగ్గా పదిహేను నిమిషాలయ్యింది.

 

    స్పెషల్ ఐ.జి. పరుగు పరుగున వచ్చాడు సి.ఎమ్. దగ్గరకు-


Next Page 

  • WRITERS
    PUBLICATIONS