Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 1


                                                     ప్రేమ నక్షత్రం
                                                         _ కొమ్మూరి వేణుగోపాలరావు

 

 

    ఊరి శివార్లలో కొండదాపున వున్న ఆ ప్రదేశమంతా ఒకప్పుడు రాళ్ళూ, రప్పలతో, పొదలతో, పిచ్చి మొక్కలతో నిండివుండేది.

 

    తరతరాలుగా ఆ ప్రదేశానికి యజమానులుగా వున్న చౌదరీ కుటుంబీకులు కూడ ఆ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీకా, సరిగ్గా పట్టించుకోకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఫలితంగా కొన్ని ఎకరాలమేర వ్యాపించి వున్న ఆ స్థలం నిరుపయోగంగా, నిరర్ధకంగా వుండిపోయింది.

 

    అక్కడక్కడా కొండరాళ్ళని కొట్టి జీవించే కొంతమంది కూలీజనం మాత్రం పాకలు వేసుకుని జీవిస్తూ వచ్చారు. అయిదేళ్ళక్రితం ఎక్కడ్నుంచో ఆజానుబాహుడైన ఓ వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఊళ్ళో మకాంవేసి, చౌదరీ కుటుంబీకుల్ని కలుసుకుని, తనని రిటైరయిన మిలిటరీ డాక్టర్ కల్నల్ సంజీవరావుగా పరిచయం చేసుకుని, కొన్ని రోజులపాటు బేరసారాలు సాగాక ఆ చౌదరీ కుటుంబీకుల ఆధీనంలో వున్న ఆ ప్రదేశమంతా కొనుగోలు చేశాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే అక్కడ సందడి ప్రారంభమయింది. పునాదులు తవ్వటం, గోడలు లేవటం, వందలాది కూలిజనం ఆ కట్టడం నిర్మాణంలో పాల్గొనటం- చూడముచ్చటగా వుండేది. రెండేళ్ళు తిరిగేసరికల్లా అక్కడ అధునాతన భవనాలు వెలిశాయి. వాటిల్లో ఓరోజు భారీఎత్తున 'జనత ఫార్మాస్యూటికల్స్' ప్రారంభోత్సవం జరిగి, అప్పట్నుంచీ నిర్విరామంగా పనిచెయ్యసాగింది.

 

    ఇప్పుడా కంపెనీలో ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, మేన్యుఫాక్చరింగ్ సెక్షన్ లో వర్కర్స్ అయితేనేమి, అంతా కలిసి అయిదారు వందలమంది పనిచేస్తున్నారు. రకరకాల టానిక్కులు, టాబ్లెట్సు, ఇంజెక్షన్లు అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. వ్యాపారం బాగా అభివృద్ధి పొంది, ఆంధ్రదేశంలోని పెద్ద మందులు తయారీ సంస్థలలో ప్రముఖమైనదిగా చలామణి కాసాగింది.

 

                                       *    *    *

 

    సరిగా పదిగంటలకు కల్నల్ సంజీవరావు ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఆయన ఆఫీసు మెట్లమీదకు మొదటిఅడుగు వెయ్యటం చూసి గడియారాలు సరిచేసుకోవచ్చు. అంతకు అయిదు నిముషాలకు ముందే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చునివుండాలి. అది కంపెనీ నిబంధనలలో ఒకటి. ఆయన స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలకు రావటం, అంతా తలలు త్రిప్పి ఒక్కసారిమాత్రం చూసి మళ్ళీ తమతమ పనుల్లో మునిగిపోవటం. యజమాని వచ్చాడని ఎవరూ సీట్లలోనుండి లేచి నిల్చోనక్కర్లేదు. అది కంపెనీ నిబంధనల్లో రెండవది.

 

    కల్నల్ సంజీవరావు హాలు మధ్యనుంచి హుందాగా నడిచి, తన రూమ్ లోకి వెళ్లి, రివాల్వింగ్ చైర్ లో కూర్చుని కోటులోంచి పైప్ తీసి వెలిగించాడు. ఆయన పైప్ నోట్లో పెట్టుకుని పొగ వదిలే దృశ్యం చాలా నిండుగా వుంటుంది. వయసు యాభై, యాభై అయిదు మధ్య వున్నా ఆయన జుట్టు ఎక్కువగా నెరసిపోనూలేదు, రాలిపోనూ లేదు. రోజూ రేజర్ పడినా కరుగ్గా, చురుకుగా కనిపించే గడ్డం ముఖానికి తీరుగా అమరి, వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంచేసే మీసం చిన్నదైనా, గుండెల్ని చీల్చుకుని వెళ్లగల కళ్ళు అయిదడుగుల పదంగుళాల స్ఫురద్రూపం అతనిది.        

 

    అతను కూర్చున్న గదికి నలువైపులా అద్దాలుబిగించి వున్నాయి. అద్దాలలోంచి హాల్లోని సమస్తం అతనికి కనబడుతుంది. ఎవరు పనిలో నిమగ్నమై వున్నారో, ఎవరు యాంత్రికంగా పనిచేస్తున్నారో, ఎవరు సరిగా పనిచెయ్యకుండా, చేస్తున్నట్లు నటిస్తున్నారో అతని తీక్షణమైన కళ్ళు సులువుగా పసిగట్టెయ్యగలవు.

 

    బజర్ నొక్కాడు.

 

    స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ప్యూన్ పరుశురాం లోపలకు వచ్చాడు.

 

    "రాత్రి ఇంటికి ఎన్నిగంటలకు వెళ్ళావు?"

 

    పరశురాం ముఖంలో తొట్రుపాటు కనిపించింది.

 

    "ఎనిమిది......ఎనిమిది గంటలకల్లా వెళ్ళాను సార్!"

 

    "అబద్ధం. పన్నెండుదాకా నువ్వింటికి చేరలేదు" అతని గొంతు బులెట్ లా తాకింది.

 

    పరశురాం వణికినట్లయి తల వంచుకున్నాడు.

 

    "అంతే కాదు, రాత్రికూడా నువ్వు తాగావు."

 

    పరశురాం తల ఎత్తలేదు.

 

    "కంపెనీ నిబంధనల ప్రకారం నీ నడవడికకు ఏ క్షణాన్నైనా నీ ఉద్యోగం ఊడిపోయే అవకాశముంది తెలుసా?"

 

    పరశురాం ఏమీ మాట్లాడలేదు.

 

    "నీ భార్య ముఖంచూసి ఇన్నాళ్ళు నిన్ను సహిస్తున్నాను. ఇలాగే కొనసాగించావో, ఎన్నాళ్ళో ఉండవు జాగ్రత్త......వెళ్ళు."

 

    బ్రతుకుజీవుడా అన్నట్లు అతనక్కడ్నుంచి జారుకొని "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకున్నాడు.

 

    కల్నల్ కుర్చీలో ఒకసారటునుంచి ఇటు ఊగి తనలో తను నవ్వుకున్నట్లుగా నవ్వుకున్నాడు. అతను ఏ సమయంలో ఎందుకు నవ్వుతాడో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడుతూ, తలవాచేటట్లు చివాట్లు పెడుతూ, మధ్యలో నవ్వుతాడు. ఒక్కొక్కసారి వంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నట్లుండి నవ్వుతాడు. ఒక్కొక్కసారి పరిహాసంగా మాట్లాడుతూ, ఆ పరిహాసమూ అతిక్రమించేటట్లు నవ్వుతాడు. అతని నవ్వులో సహజత్వం వుండదు. కానీ కృత్రిమత్వం అంతకన్నా వుండదు. అతని నవ్వు ఆహ్లాదంగా వుండదు. ఎదుటివాళ్ళను గేలిచేస్తున్నట్లు చాకులతో పొడుస్తున్నట్లు ఉంటుంది.

 

    ఇప్పుడలాంటి నవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వు పరశురాంని ఉద్దేశించి కాదు. అతని మనసులో ఇంకేదో మెదిలి వుంటుంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS