Next Page 
చిలకలు పేజి 1


                             చిలకలు
                              -వాసిరెడ్డి సీతాదేవి
   

     ప్రియమైనది రాణీ!

    నా ఉత్తరం నిన్ను ఆనందాశ్చార్యాలలో ముంచివేస్తుందని నాకు తెలుసు. నానుంచి ఇలాంటి జాబు వస్తుందని  కలలో కూడా అనుకొని ఉండవు. నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపోయావు సంవత్సరం క్రితం. నువ్వు వెళ్ళిపోయాక నాకు ఈ ఆశ్రమ జీవితం  అంటే విసుగు కలిగింది. ఆ విసుగు క్రమంగా విరక్తిగా రూపుదిద్దుకుంది. నా అన్నవాళ్ళందరి చేతా మోసగించబడి, జీవితం పట్ల నిర్లిప్తత ఏర్పడింది. అందుకే ఆశ్రమంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకొన్నాను. ఆ మాటే నీతో  అన్నాను. నువ్వులేని  ఈ ఆశ్రమంలో ఉండలేకపోతున్నాను. నిష్కల్మషమైన ప్రేమ....
    "ఏమ్మారాణీ! ఇంకా కూర్చున్నావేం?"
    రాధారాణి ఇంతెత్తున ఎగిరిపడింది. గాభరాగా చేతిలోని ఉత్తరం డ్రాయర్ లోకి తోసింది. బలవంతంగా తెచ్చిపెట్టుకొన్న చిరునవ్వుతో "కొంచెం పని ఉండీ?" నసిగింది.
    "పనా? నాతోనేనా? మరి చప్పవేం? ఇక్కడ నీళ్ళు నములుతూ కూర్చోకపోతే వచ్చి చెప్పొచ్చుగా? ఒట్టి అమాయకురాలివి. ఈ ప్రపంచంలో ఎలా బతుకుతావ్ అమ్మాయ్?"
    "అదికా..."
    "ఏం కావాలమ్మా! సందేహం ఎందుకు? చెప్పు?" గారపట్టిన ఎత్తయిన ముందు రెండు పళ్ళూ కన్పించేలా నవ్వుతూ, ఆప్యాయం ఉట్టిపడే స్వరంతో అన్నాడు సోమసుందరం.
    సోమసుందరం "రావ్ అండ్ రావ్ సిమెంట్సు" లో డిప్యూటీ జనరల్ మేనేజర్. రాధారాణి పదినెలల క్రితమే రిసెప్షనిస్టుగా చేరింది.
    ఎందుకలా గాభరా పడ్తావ్? ఏం కావాలో చెప్పమ్మాయ్?" అన్నాడు సోమసుందరం.
    "ఏం వద్దండీ!" అన్నది.
    ఆమె మనసంతా ఏవేవో మధుర స్మృతులతో నిండిపోయి ఉంది. ప్రియుడి  నుంచి అందిన ఉత్తరాన్ని అప్పటికే ఓ పదిసార్లయినా చదివి ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా తృప్తి కలుగడంలేదు. ఆ ఉత్తరం ఆమె కల వాస్తవంగా మారబోతున్న కబురు మోసుకొచ్చింది.
    "మధ్యలో ఈ ముసలినక్క ఒకడు" మనసులోనే విసుక్కుంది.
    "అదేమిటి రాణీ! నాదగ్గిరా నీసందేహం? చెప్పమ్మా" అన్నాడు సోమసుందరం బల్లమీదకు వంగి. రాధ మనసులోని చిరాకు పైకి కన్పించకుండా జాగ్రత్తపడింది.
    "మీ దగ్గర సందేహం ఏమిటి సార! మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది."
    మనసును తీగ చుట్టలా  అల్లుకుపోయిన ప్రియుడు తాలుకు ఆలోచనల నుంచి బయటపడి అన్నది రాధారాణి బాస్ ను చూస్తూ  వినయంగా.
    "అరెరె! ఎంతమాట! రుణం ఏమిటమ్మా! నేనేంచేశాను.?"
    "అదేమిటి సార! నా అనే వాళ్ళు లేక, తల దాచుకోవడానికి నీడ కూడా లేక మీ దగ్గరకు వచ్చాను. ఏదైనా  పని  చూపించమని  ఆర్థంచాను నోరు తెరిచి అడగ్గానే ఉద్యోగం ఇప్పించారు."
    దాని కేముందమ్మా! ఆడ కూతురివి, వయసులో ఉన్నావు. అసహయస్థితిలో వున్నావు. ఆ మాత్రం అదుకోవడం మనిషిగా నా ధర్మం. అయినా నీకు జీతం చాలా తక్కువ ఇస్తున్నామనే బాధ నాకు లేకపోలేదు. త్వరలోనే నీ జీతం పెంచే ఆలోచన కూడా ఉంది. ఈ సారి డైరక్టర్ల నీ జీతం పెంచాలనే ప్రోపోజల్  పెడదామనుకొంటున్నాను" 
    "ఈ మాట ఇప్పటికి వందసార్లయినా చెప్పి  ఉంటావ్" మనసులోనే అనుకుంది రాధ.
    "డబ్బు ఎంతైతేనేం సార్? మీలాంటి అధికారి కింద పని చెయ్యడమే నా అదృష్టంగా భావిస్తున్నా" అన్నది సోమసుందరం కేసి చూస్తూ వినయ విధేయతలు ఉట్టిపడే స్వరంతో.
    సోమసుందరం తనమీద చూపించే రాధారాణికి ఇష్టం లేదు. ఒకోసారి కోపం కూడా వస్తుంది. కాని అతని వల్లే  ఈ ఉదోగ్యం  వచ్చింది. అందుకే అతడు పేరు తుంచేసి రాణీ అని పిల్చినా, "రాధా" అని పిల్చినా సాహిస్తోంది. అతడితో పేచీపడితే తన ఉద్యోగం ఊడేప్రమాదం ఉందని  ఆమెకు తెలుసు.
    "అమ్మామ్మ! అలా అనకు. డబ్బులోనే వుంది ప్రపంచం!" ముక్కు మీద వేలేసుకొని అన్నాడు.
    "మీరెంత మంచివారు సార్!" "ఈ ముసలి  పీనుగ ఓక పట్టాన వదిలేలా లేడు" అని మనసులోనే అనుకుంది.
    "అమ్మాయ్ .నువ్వు అనవసరంగా నాకు లేని మంచితనాన్ని అంటగడ్తున్నావ్" అంటూ భుజం తట్టాడు.
    రాధకు వికారంగా ఉండే  పురుగేదో భుజం మీద పాకుతున్నట్టనిపించింది.
    ఆమె ముఖములోని భావాలను చూసి చెయ్యి తీశాడు. "నాదగ్గర పని చేసే వాళ్లచేత ఎంత నిర్దయగా పని చేయిస్తానో నీకు తెలుసుగా?"
    "ఆ!తెలియకేం?" రాధ నవ్వింది. గులాబి రెక్కలాంటి ఆమె పెదవుల మధ్య ముత్యాల్లా మెరిశాయి తెల్లటి పళ్ళు.
    ఆమె కేసి సోమసుందరం జాలిగా చూశాడు.
    "ఏమిటి సార్! అలా చూస్తున్నారు?"
    "నిన్ను చూస్తుంటే జాలి వేస్తుందమ్మ"
    "ఎందుకుసార్. ఇవ్వాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను."
    "ఏమిటి విశేషం? ఏదో ఉత్తరం వచ్చినట్టుంది?"
    "అవును సార్. నా ప్రాణ స్నేహితురాలు ఉత్తరం రాసింది చాలా కాలానికి."
    "ప్రాణ స్నేహితుడా స్నేహితురాలా?" పకపక నవ్వాడు .
    రాధారాణి తృళ్ళి పడింది.
    "స్నేహితురాలే సార్!"
    "ఏదో సర్దాగా అన్నాను. అవునూ? ఏదోఉత్తరం వచ్చినట్టుంది? నన్ను చూసి ఉలిక్కిపడి టేటుల్ సొరుగులో పడేశావు గదా? అందుకే ఏవరో స్నేహితుడి నుంచి వచ్చిన ఉత్తరం అనుకున్నాలే!"
    "అదా! అది సార్ ....ఉత్తరం చదవడంలో మునిగిపోయి వున్నా నేమో- ఒక్కసారిగా మీ గొంతు విన్పించే సరికి....."
    "అది సరే! ఏది పని  ఉందన్నావ్? ఏమిటి?"
    "పని ఉందని నేను అనలేదు సార్! మీరే...."
    "ఆ....ఆ!మరి ఇంకా కూర్చున్నావే?"
    "ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి సార్"
    ఎయిర్ పోర్టుకా?ఎందుకూ?
    "అదే సార్ ! నా ప్రాణ  స్నేహితురాలు ఉత్తరం రాసిందదన్నాను కదూ? ఆమె ఈ రోజు వస్తోంది."
    "ఏ ప్లైటుకూ?"
    "ఢిల్లీ ప్లైట్!"
    "ఆ! ఆరయిపోయింది! నేను త్వరగా వెళ్ళాలి. రా! నిన్ను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి వెళ్తాను."
    "వద్దండీ! మీ కెందుకు శ్రమ?"
    "నాకు శ్రమేమిటి నేను బేగం పేట మీదగానే వెళ్తున్నాను. నా కార్లో డ్రాప్ చేసి వెళ్తాను."
    "ఇప్పుడే వెళ్ళీ ఏం చెయ్యాలండీ? ప్లైట్ 8.30కి వస్తుందట. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కొన్నాను. అయినా మీకెందుకొచ్చిన శ్రమా! మీరు వెళ్లండి సార్" అతడ్ని వీలయినంత త్వరగా వదిలించుకోవాలని ఉంది.
    "అదుగో! మళ్ళీ అదేమాటా? నాకు శ్రమ ఏమిటి? మీ స్నేహితురాల్ని ఎయిర్ పోర్టునుంచి ఎలా తీసుకెళ్తవ్?"
    "టాక్సీలో తీసుకెడతాను సార్!"
    "అసలే నెల చివరా. నీ దగ్గర అంతడబ్బు ఉందా? కారు పంపిద్దామంటే నాకు అవతల వేరే పని ఉంది."
    "అబ్బే! కారెందుకండీ!"
    "అయితే ఈ డబ్బు ఉంచు" అంటూ జేబులోంచి ఏభయ్ రూపాయన నోటు తీసి అందించబోయాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS