Next Page 
అగాధాల అంచులలో  పేజి 1

   
                                              అగాధాల అంచులలో

                                                                    -కురుమద్దాలి విజయలక్ష్మి
   
    ఆరున్నర అయింది.

    అది పెళ్లివారిల్లు కాబట్టి సందడికేం తక్కువలేదు. అందరూ ఏదో పని వున్నట్లు హడావుడిగా తిరుగుతున్నారు. ఇంటినిండా నౌకర్లు చాకర్లు వున్నారు. ప్రతి పనికీ ఒక హెడ్డు. అతనికి అరడజనుమంది అసిస్టెంట్లు వున్నారు. అయినా చేతినిండా పని వున్నట్లు కంగారుగా అందరూ మేడపైకీ, కిందకీ తిరుగుతున్నారు.

    పెద్ద పెద్ద పుష్పాలుగా ముగ్గులులా డిజైన్ లు, ఆర్చీలు పలురకాలుగా రంగుబల్బులు వెలుగుతూ, ఆరుతూ తమాషాగా వున్నాయి. పెద్దలైట్లు రంగుల ట్యూబ్ లైట్లు దేదీప్యమానంగా వెలుగు విరజిమ్ముతున్నాయి. పూలు పన్నీరు, సుగంధ ద్రవ్యాల వాసన మత్తుగా గాలిలో తేలివస్తున్నది. మృదు మధురంగా వీణారావం వినవస్తున్నది.

    "పెళ్ళివారు తినటం వదిలేయటం ముఖ్యం కాదు. ప్రతి పనిలో మన ప్రత్యేకత వుండాలి, జాంగ్రీ అంటే గులాబీ పువ్వంత కాదు. అరచేతికన్నా వెడల్పుగా చుట్టండి. బాసుందీ తింటే వదిలి పెట్టకూడదు. రెండు కుండల మీగడ వుంది" వంట చేసే చోట నేతి తీపి పిండివంటలు గాక మాటలు ఘుమఘుమ లాడుతూ తియ్యగా వినవస్తున్నాయి.

    "నాలుగు బుట్టల పూలు చాలా! ఇంకా కావాలా?" పందిట్లో మగాయన కేక.

    "పెళ్ళి కారుకి అలంకరణ సలీం జావేదులు చేస్తామని ఏనాడో మాట తీసుకున్నారు. ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చారా?" మరొకాయన కంగారుగా అడుగుతున్నాడు. ఆయన కంగారు చూస్తుంటే వాళ్ళు రాకపోతే తనే అలంకరించేట్లుగా వున్నాడు.

    ఒకరి మాటకీ, వేరొకరి మాటకీ సంబంధంలేదు. తలో మాట మాట్లాడుతున్నారు. తలో పనిమీదున్నట్లు తిరుగుతున్నారు. అడుగడుగునా ఆర్భాటం, హడావిడి కానవస్తున్నాయి.

    ప్రశాంతంగా వున్నదల్లా మేడమీద పెళ్ళికూతురు గదిలో. ఆమె మనసులో మాత్రం అంతులేని అశాంతి. అది పైకి ఎవరికీ కనిపించేది కాదు.

    పెళ్ళికూతురు నందితాదేవిని వంటరిగా గదిలో వదిలిపెట్టి అందరూ బయటికి వెళ్లారు. గది బయట ఇరువురు దాసీలు నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కాని వాళ్ళు పరధ్యానంగా లేరు. వెయ్యికళ్ళతో నందితాదేవిని కనిపెట్టి చూస్తున్నారు.

    అర్ధరాత్రి ముహూర్తం. పన్నెండున్నరకి పెళ్ళి. ఈ లోపలే సమయం సద్వినియోగం చేసుకోవాలని చూస్తూన్నది నందితాదేవి. "రాత్రంతా నిద్ర వుండదు. విశ్రాంతి తీసుకోవాల"నే నెపంమీద మంచానికి జారగిలబడింది.

    ఇదీ పెళ్ళి ముహూర్తం కాదు-- చావు ముహూర్తం ఎనిమిది దాటితే తనీలోకంలో వుండదు. ఒకటి కాదు. రెండు కాదు. వంద నిద్రమాత్రలు పొడుం నూరి పొట్లంగా కట్టి ఆ పొట్లాన్ని జాకెట్ లో భద్రంగా దాచింది. చావుకి పదిమాత్రలు చాలు. చావకపోతే అటు చావూ, బ్రతుకూ గాని స్థితి ఏర్పడుతుంది. అందుకే పది పక్కన సున్నా చేర్చింది.

    పది పక్కన సున్నా చేరిస్తే వంద.

    ఎస్ వంద మాత్రలు!

    వంద నిద్ర మాత్రల పౌడర్ నందితాదేవి ప్రాణం తీయటానికి భద్రంగా వుంది.

    తనిలాంటి పని చేస్తుందేమో అని అహర్నిశలూ అందరూ తనని కనిపెట్టుకుని చూస్తూనే వున్నారు. ఎ పెదనాన్నగారయితే యిన్ని జాగ్రతలు తీసుకున్నారో, యే పెదనాన్నగారి గదిలో తను బంధించబడిందో అదే గదిలో అతి తేలిగ్గా మరణించటానికి కావలసిన మందుందని అందరూ మరిచారు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS