Next Page 
పెట్టితిసిచూడు  పేజి 1

          
                                                     పెట్టెతీసిచూడు

                                                                                           ---- కురుమద్దాలి విజయలక్ష్మి

    ఇష్....

    ఊ....

    ఇష్ అన్నది కోదండరామయ్య ఊ.....అన్నది ఆయన భార్య వెంకుమాంబ.

    వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వయసులో పెద్దవాళ్ళు అయినా ఈ వయసులో కూడా సరసాలు విరసాలు సల్పుతున్నవాళ్ళు. "వాళ్ళగురించి చెప్పేకన్నా నాలుగురోజులపాటు వాళ్ళతోస్నేహం చేసి చూడండి" అంటారు వాళ్ళ ప్రవర్తన గురించి బాగా తెలిసిన వాళ్ళు అంతేగాని ఫలానా అని చెప్పరు.

    కోదండరామయ్య గతంలో రైల్వేలో ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు వెనకవేసిన వాడు. ఆయన గూడ్సుమాస్టరుగా చేసి రిటైర్ అయాడు. ఆయన జీన్సులో వుందో, రైల్వేసొమ్ములో వుందోగానీ గూడ్సులో ఎగుమతి అయేవి దిగుమతి అయేవి ఆఖరికి చీపురు పుల్లయినా సరే ఇంటికి రావాల్సిందే.

    కోదండరామయ్య రైల్వేలో చేసి రిటైర్ అయినా ప్రయాణాలకేమీ ఇబ్బంది లేదు. ఫస్ట్ క్లాస్ పాస్ వుంది.

    ఇప్పుడుద్ ఆ పాస్ తోనే పుణ్యక్షేత్రాలు దర్సించి తిరుగు ప్రయాణంలో వున్నారు.

    ప్రస్తుతం సర్కార్ ఎక్స్ ప్రెస్ లో వున్నారు. వాళ్ళున్న ఫస్ట్ క్లాస్ పెట్టెలో వాళ్ళిరువురే వున్నారు. తోచక కాసేపు గిల్లి కజ్జాలాడుకున్నారు. ఆ తర్వాత అదేమీ బాగుండక గతంలో వారికి తారసపడిన, వాళ్ళకి ఇష్టంలేని వాళ్ళ గురించి అయిష్టంగా మాట్లాడుకున్నారు.

    చివరికి అనుకున్నారు, కొత్తవాళ్ళు ఎవరయినా ఎక్కితే బాగుండును కాలక్షేపంగా వుంటుందని.

    సరీగా అలా అనుకుంటున్నా సమయంలో సర్కార ఎక్స్ ప్రెస్ ఆ స్టేషన్ లో ఆగటం, బయలుదేరటము జరిగింది.

    అక్కడ__

    పాతికపైన, ముప్పై అయిదు లోపల వున్న ఒకతను రైలులో ఎక్కాడు. లైసెన్స్ కూలీలు పెద్ద పెట్టెని మోసుకువచ్చి లోపల పెట్టారు.

    పెట్టె చాలా బరువు వుంది. దానికేసిన రెడ్ కలర్ కొట్టొచ్చినట్లుకానవస్తుంది. అక్కడక్కడ గులాబీపూల డిజైన్ ఇవ్వడంవల్ల అందంగా వుంది. పెట్టె డెలికేట్ గా కాక స్ట్రాంగ్ గా వుంది. పైకి తాళం లేకుండా పెట్టెకి అతికించిన తాళం వుంది. లాక్ సిష్టం.

    లైసెన్స్ కూలీలతో అతను గొడవపడ్డాడు.

    ముందు మాట్లాడుతున్న ప్రకారం అయిదు రూపాయలు ఇస్తాను, అదే ఎక్కువ అంటాడు అతను.

    "పేరుకి ఒక్క పెట్టె మూడు పెట్టెలంత బరువు వుంది. పెట్టెలో ఇనుపసామాన్లు పెట్టారా? ఇటుక బిళ్ళలు పెట్టారా? మా చేతులు పడిపోయాయి. మరో రెండు రూపాయలు ఇవ్వండి" అన్నారు లైసెన్స్ కూలీలు ఇరువురు.

    చివరకి

    ట్రైను బయలుదేరుతున్నా సుమా అని కూతవేయగానే-

    అతను రెండురూపాయలు తీసి ఇచ్చాడు.

    లైసెన్స్ కూలీలు నవ్వుకుంటూ దిగిపోయారు.

    అతను కంపార్ట్ మెంట్ లోకి ఎక్కగానే కోదండరామయ్య "ఇష్" అన్నాడు. 'అర్ధం.... చూడు' అని. "ఊ" అంది వెంకుమాంబ దానర్ధం 'చూశాను' అని.

    "అతను ఎక్కగానే "ఇష్" .... "ఊ" తర్వాత మళ్ళీ మాట్లాడుకోలేదు కోదండరామయ్య, వెంకుమాంబ. ఫార్స్ చూస్తూ కూర్చున్నారు.

    ఆ స్టేషన్ లో అతను తప్పా ఎవరూ ఎక్కలేదు. సర్కార్ ఎక్స్ ప్రెస్ కూతవేసి బయలుదేరింది.

    ట్రైను బయలుదేరిన తరువాత అతను నుడుతనున్న చెమట బిందువులను రూమాలుతో తుడుచుకుంటూ "ఇక్కడ కూర్చోవచ్చుకదా మాష్టారు!" అన్నాడు.

    "నన్నేనా అడిగింది?" అక్కడేదో పదిమంది వున్నట్లు అడిగాడు కోదండరామయ్య.

    కోదండరామయ్య మాట తీరే అంత. మాటల్లో మెలికలు దారులు, గొళ్ళెంగొలుసులు, పుల్ల విరుపులు, వ్యంగ్యము, చతురత సమయాన్ని బట్టి సందర్భానుసారంగానూ మారిపోతుంటాయి.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS