TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
Ardharathri Adapaduchulu

       
                           అర్దరాత్రి ఆడపడుచులు
                                                                              -మైనంపాటి భాస్కర్
         

                                 

    
                                                          "ప్రతీకారం గురించి ఎప్పుడూ
                                                           ఆలోచించకు. క్షమను గురించి
                                                            అసలే ఆలోచించకు. అపకారిని
                                                              అలక్ష్యంచేసి ఊరుకోవడమే
                                                                   అసలైన ప్రతీకారం
                                                                అసలైన క్షమాభిక్ష కూడా."

    
    1967:

    ఏప్రిల్: ఫస్టు తారీకు:
    "గుడ్ మార్నింగ్ పప్పీ! హాపీబర్త్ డే టూ యూ!" అన్నారు రమణమూర్తి జానకీ సెకండ్ బెడ్ రూంలో పడుకుని ఉన్న సృజనమీదికి వంగి చూస్తూ.
    "బర్త్ డే" అన్నమాట చెవినపడగానే చటుక్కున లేచికూర్చుంది పదమూడేళ్ళ సృజన. ఆమె మొహంలో నిద్రమత్తు స్పాంజితోతుడిచేసినట్లు ఒక్కసారిగా మాయమైపోయిసంతోషం తొంగి చూసింది.
    "థాంక్స్ నాన్నా! థాంక్యూ అమ్మా!" అక్కడే పడుకుని ఉన్న తొమ్మిదేళ్ళ సంజయ్, ఆరేళ్ళ స్పందనా కూడా ఈ సందడికి లేచి ఆవలిస్తూ "హాపీబర్త్ డే అక్కా!" అన్నారు.
    "థాంక్యూ సంజయ్! థాంక్స్ స్పందనా!"
    "చెప్పు పప్పీ! బర్త్ డే ప్రజెంటేషన్ ఏం కావాలి నీకు?" అన్నాడు రమణమూర్తి. తడుముకోకుండా 'మైనా పిట్ట' అన్నది సృజన.
    అనుకోని ఈ సమాధానానికి ఆశ్చర్యపడుతూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూచుకున్నారు జానకి. రమణమూర్తి.
    "ఏమిటీ?"
    "మైనా!"
    "మైనా!"
    "అవును మైనా!"
    "ఎందుకూ?"
    "మైనా పిట్టలు చాలా బాగుంటాయి. మా క్లాస్ మేట్ కారొలిన్ పెంచుతోంది. మీకు తెలుసా? రాబోయే ఉపద్రవాలు మైనాపిట్టకు ముందే తెలుస్తాయట. తుఫాను రావడానికి ముప్పయ్ ఆరుగంటలు ముందేవాటికి తెలిసిపోయి పికూ పికూ అని అరుస్తాయట!"
    పెద్దగా నవ్వాడు రమణమూర్తి. "అబ్బో అయితే మైనా పిట్టని తెస్తే మనకు చాలా లాభమే నన్నమాట! ఈసారెప్పుడన్నా తుఫానువస్తే మనకు మున్ద్య్హే తెలిసిపోతుంది! అవునా? వండర్ ఫుల్!"
    "అయితే ఇప్పుడు మీరు నిజంగానే మైనా పిట్టనొకదాన్ని కొనబోతున్నారా ఏమిటి?" అంది జానకి ఆదుర్దాగా." అతి గారాబం చేసి అడిగినదల్లా కొనిస్తే పిల్లలు పాడయిపోతారు. పిట్టలనీ, పిల్లులనీ ఇంటినిండా చేర్చడంమొదలెడితే ఇక అయినట్లే"
    తల్లి అలా అనగానే బుంగమూతి పెట్టింది సృజన.
    అప్పుడు ఉన్నట్లుండి పెద్దవాల్యూమ్ లో వినబడడం మొదలెట్టింది పక్కింటి వాళ్ళ రేడియోలో నుంచి భక్తిపాట ఒకటి.
    వెంటనే చిరాకు పడుతూ మంచందిగి గబగబ గ్రామఫోన్ దగ్గరకు వెళ్ళింది సృజన. ఒక ఇంగ్లీషు ఎల్ పిరికార్డు పెట్టి ఫుల్ వాల్యూమ్ లో ఆన్ చేసింది.    
    పరిమితమైన ఆ ప్రదేశంలో ఉత్పన్నమైన అంత పెద్ద శబ్దానికి గది గోడలు ప్రకంపించినట్లయింది.
    "రండి!రండి!రండి!"అని అందరినీ గదిలోనుంచి బయటకులాక్కెళ్ళి తలుపులు బిగించింది సృజన.
    ఇప్పుడు ఆ శబ్ద తరంగాలు ఇంట్లోకిరావడంలేదు. ఎదురు దాడికి వెళుతున్నట్టు పక్కింటి వైపు పయనించడం మొదలెట్టాయి. పక్కింటివాళ్ళు కిటికీలు తెరిచికోపంగా చూడడం కనబడింది.
    అదిగమనించి స్టీరియోఆఫ్ చెయ్యడానికి తలుపులు తెరిచిగదిలోకి వెళ్ళబోయింది జానకి.
    "వద్దు! ఉండనీమ్మా!" అంది సృజనపంతంగా.
    "పప్పీ! ఏమిటీ అల్లరి?"
    "అల్లరికాదమ్మా! చెల్లుకిచెల్లు! టిట్ ఫర్ టాట్! పక్కింటివాళ్ళు చెవులు చిల్లులు పడేటట్లు రేడియో పెడితే నేను గూబ గుయ్ మనేటట్లు గ్రామఫోన్ పెట్టాను తప్పా?"
    "తప్పా! తప్పున్నరా వాళ్ళేదో పాపం భక్తిగీతాలు పెట్టుకుంటే......"
    "భక్తి అనేది మనసుల్లో ఉంటే చాలమ్మా! పదిమందికీ తెలిసేటట్లు ప్రదర్శించనక్కర్లేదు. పక్కింటి వాళ్ళది భక్తికాదు, ఎగ్జిబిషన్ నాకు తెలుసు!" అంది సృజన స్థిరంగా.
    "పప్పీ! నువ్వు ఈడుకి మించిన మాటలు మాట్లాడుతున్నావ్!" అంది జానకి కోపంగా.
    "కాదు! ఈడుకి మించి తెలివిగా ఆలోచించి వాదించడం నేర్చుకుంటుంది. నాబంగారుతల్లి!" అన్నాడు రమణమూర్తి సృజనని వెనకేసుకొస్తూ "చూస్తూఉండు! మన అమ్మాయి బ్రిలియంట్ లాయర్ కాకపోతే నాకు మారుపేరుపెట్టు!"
    "లాయరా? ఛీ! కాదు! నేను లాయర్ నేమీ కాను! యామినీ కృష్ణమూర్తిలాగా గొప్ప డాన్సర్ నీ, శ్రీరంగంలాగా పెద్ద సింగర్ నీ అవుతాను" అంది సృజన వెంటనే.
    ఇదంతా కళ్ళార్పకుండా చూస్తున్న ఆరేళ్ళ స్పందనకు తల్లిదండ్రుల ఆప్యాయతని అంతా అక్క సృజన కొల్లగొట్టేసుకుంటోందేమోనన్న బెంగ కలిగింది. అందుకని వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికిగానూ" డాన్సరూ, సింగరూ అవడంమహాగొప్పా ఏమిటీ? ఎవళ్ళు పడితేవాళ్ళే డాన్సరు కావచ్చు. కీ అని కీచురాయిలా అరిస్తే చాలు సింగరూ అవొచ్చు. నేనేమో పెదనాన్న గారిలా పెద్ద డాక్టర్ నీ, బాబాయ్ లాగా బ్యాంక్ అకౌంట్ ని అవుతాను" అందిగర్వంగా.
    "నీ మొహం!" అన్నాడు సంజయ్.
    "అకౌంట్ కాదు. అకౌంటెంట్! డాక్టర్ అయితే అయ్యావుగానీ అకౌంటెంట్ వి కూడా కావడం ఎందుకూ?"
    "ఎందుకా! మరేమోనూ డాక్టరయ్యాకబోలెడంత డబ్బొస్తుందిగా! అదంతా లెక్క పెట్టుకోవడానికి అకౌంట్.....అకౌంట్ ని కావద్దా ఏమిటీ?" అంది స్పందన.
    "చూసావా? డబ్బంటే నీకు అంత ఆశ కాబట్టే నీ పేరు ఆర్. స్పందన అని తీసేసి ఆర్. షైలాక్ అని పెట్టేశాం" అన్నాడు సంజయ్ ఏడిపిస్తూ.
    "ఎవరేమైనాగానీ, నేను మాత్రం దుబాయ్ మామయ్యలాగా ఫేమస్ ఇంజనీర్ ని అవుతాను" అన్నాడు ఖచ్చితంగా.
    "షైలాక్"అన్న తన నిక్ నేమ్ వినగానే "అమ్మా" అంటూ జానకి వైపు తిరిగింది స్పందన ఉడుకు మోతుతనంతో.
    తెలివితేటలు ఉట్టిపడుతున్న ముత్యాలలాంటి తన ముగ్గురు బిడ్డలనీ చూసుకుంటూ ఉంటే తన దృష్టి తమకే తగులుతుందేమో అని భయమేసింది జానకికి. ముగ్గురి పిల్లలచుట్టూ ఆప్యాయంగా చేతులు వేసి భద్రంగా దగ్గరికి పొదుపుకుంది.
    "అయితే మైనా పిట్ట కొంటారా నాన్నా?" అంది సృజన మళ్ళీ మొదటికొస్తూ.


Related Novels


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.